చచ్చినోళ్లతో మాట్లాడడం.. అమ్మో! వింటేనే భయంగా ఉంది, అలాంటిది నిజంగా జరిగితే? అసలు అలా మాట్లాడాలంటే ముందు చనిపోయినవాళ్లను చూసి బతికి ఉన్నవాడి గుండె ఆగకుండా ఉండాలి! కొంతమంది మాత్రం తమకు ఆ ధైర్యం ఉందని, చనిపోయిన వారితో నేరుగా మాట్లాడతామని చెబుతుంటారు. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు దుర్హాం యూనివర్సిటీ ఒక పరిశోధన నిర్వహించింది.
మానవ నాగరికత తొలినాళ్ల నుంచి మనిషికి అర్థం కాని సమస్యల్లో చావు ఒకటి. మనిషి విజ్ఞానం పెరిగే కొద్దీ అసలు మనమెందుకు పడుతున్నాం? ఎక్కడ నుంచి వస్తున్నాం? ఎందుకు చస్తున్నాం? ఎక్కడకు పోతాం? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డాడు. అయితే వీటికి సవ్యమైన సమాధానాలు దొరక్కపోవడంతో మతం ఆధారంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు రూపొందించుకున్నాడు. ప్రపంచంలో కీలక మతాలన్నీ మనిషి శరీరంలో ఆత్మ లేదా స్పిరిట్ లేదా సోల్ ఉంటుందని, మరణానంతరం అది ఇంకో జన్మనెత్తుతుందని భావిస్తాయి.
ఇంతవరకు ఓకే కానీ, మత విశ్వాసాలు మరింత ముదిరేకొద్దీ మనిషిలో ఈ భావన చుట్టూ అనంతమైన ఊహలు రూపొందాయి. ఇలాంటి ఊహల్లో అతి ముఖ్యమైనది చనిపోయిన వాళ్లతో మాట్లాడడం. ప్రపంచంలో దాదాపు అన్ని సమాజాల్లో ఈ భావన కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం? చనిపోయిన వారితో కాంటాక్ట్ చేయడం కుదిరేపనేనా? కేవలం చనిపోయిన మనుషులతో మాత్రమే మాట్లాడగలమా లేక చనిపోయిన ఇతర జీవజాలం ఆత్మలతో కూడా మాట్లాడవచ్చా? అనే అనుమానాలకు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం...
మానవాత్మలు భూమిపైనే పరిభ్రమిస్తుంటాయా? వాటితో ఏ భాషలో సంభాషించాలి? అనేవాటిపై దుర్హాం యూనివర్సిటీలో తాజాగా ఒక పరిశోధన సాగింది. సాధారణంగా ఆత్మలతో మాట్లాడేవాళ్లను ’’మీడియం’’ అంటారు. ఇలాంటి 65 మంది మీడియంలను స్పిరిట్యువలిస్టు నేషనల్ యూనియన్ నుంచి, 143 మందిని మామూలు ప్రజల నుంచి పరిశోధన కోసం తీసుకున్నారు. వీరందరికీ ఆన్‌లైన్‌లో ప్రశ్నావళిని అందించారు. ఆత్మలతో ఎప్పుడు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఎలా మాట్లాడారు లాంటి ప్రశ్నలతో పాటు వారి వారి పారానార్మల్ నమ్మకాలు, ఊహలు, మానసిక స్థితి తదితర అంశాలను కూడా ప్రశ్నించారు.
అనంతరం మీడియంలు ఇచ్చిన సమాధానాలను, మామూలు ప్రజల సమాధానాలతో పోల్చి పరిశోధించారు. ఆత్మలతో సంభాషణ ప్రతిరోజూ జరుగుతుందని మీడియమ్స్‌లో 79 శాతం చెప్పారు. ఈ సంభాషణ బహిరంగంగా జరగదని, తమ మెదడులోపలే జరుగుతుందని 65 శాతం మంది పేర్కొన్నారు. తమ గురించి బయటవారు ఏమనుకుంటారనేది పట్టించుకోమని ఎక్కువమంది తెలిపారు. ఇదే ప్రశ్నలకు మామూలు ప్రజలు తామెప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కోలేదని చెప్పారు. దీనిని బట్టి సాధారణ ప్రజలతో పోలిస్తే ఇలాంటి మీడియమ్స్ అంతా మానవాతీత ఊహాగానాల పట్ల, మానసిక చేతనలో అలౌకిక స్థితి పట్ల అతి నమ్మకం పెంచుకున్నవారని పరిశోధనలో తేలింది.
అలాగే వారివారి జీవితానుభవాలు, బాల్యం, నమ్మకాలు, చుట్టూ వ్యక్తులు వారిని అతిగా ప్రభావం చేసినట్లు తేటతెల్లమైంది. ముఖ్యంగా బాల్యంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల ప్రభావం వల్ల వీరంతా ఇలా ఆత్మలతో మాట్లాడినట్లు భావిస్తున్నారని, అంతకుమించి వీరెవరూ నిజంగా ఎలాంటి మృతాత్మలతో సంభాషించలేదని పరిశోధన స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment