బ్రిటన్‌లో ఓ మహిళ నిర్వాకం
లండన్: అనగనగా ఒక పాత హార్డ్‌డ్రైవ్. బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల జేమ్స్ హావెల్స్ అనే వ్యక్తి క్రిప్టోకరెన్సీ తొలినాళ్లలో అంటే 2009 ఏడాదిలో 8,000 బిట్‌కాయిన్లను మైనింగ్ చేశాడు. వాటికి సంబంధించిన డిజిటల్ కీని ఆ పాత హార్డ్‌డ్రైవ్‌లో దాచి ఉంచాడు. అయితే అది తర్వాత కనిపించకుండా పోయింది. తన ప్రియురాలు హఫీనా ఎడీ ఎవాన్స్‌తో కలిసి ఈ హార్డ్‌డ్రైవ్ కోసం వేట మొదలెట్టాడు.
అది కనిపించట్లేదని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది 2013 ఏడాదిదాకా ఇంట్లోనే ఒక గదిలో సొరుగులో ఉండిపోయింది. అయితే 2013లో ఇంటిని ప్రియురాలు హఫీనా శుభ్రంచేస్తుండగా పాత కంప్యూటర్ విడిభాగాలున్న ఒక పాత నల్ల సంచి కనిపించింది. దీనిని పడేయాలా? అని జేమ్స్‌ను హఫీనా అడగ్గా అవసరం లేదు పడేసెయ్ అని చెప్పాడు. దీంతో బయటికెళ్తూ దారిలో ఉన్న చెత్తకుప్పలో దానిని పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరూ దాని కోసం వేట కొనసాగించారు. అయితే తాజా దర్యాప్తులో.. ఆమె గతంలో పడేసిన సంచిలోనే హార్డ్‌వేర్ ఉందని తాజాగా వెల్లడైంది.
హార్డ్‌వేర్‌లోని డిజిటల్ కీ సాయంతో అందుబాటులోకి వచ్చే 8,000 బిట్‌కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ.5,900 కోట్లు కావడం గమనార్హం. విషయం తెల్సి హఫీనా హుతాశురాలైంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడిపోయారు. ‘‘జేమ్స్ సంపదను తెలీకుండా చెత్తపాలు చేశాను. దాని కోసం అతను పడుతున్న వేదనను చూడలేకపోతున్నా’’అని తాజాగా హఫీనా వాపోయారు. హఫీనా పడేసిన చెత్తకుప్పలోని వ్యర్థ్యాలు సాధారణంగా వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో ఉన్న డాక్స్‌వే భారీ డంపింగ్ యార్డ్‌కు చేరుకుంటాయి. అక్కడ ఏకంగా 14,00,000 టన్నుల చెత్తకుప్ప కొండ ఉంది.
అందులో ఎలాగైనా తన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి సంపాదిస్తానని జేమ్స్ బయల్దేరారు. అయితే అంత చెత్తను కింది నుంచి మొత్తం తిరగతోడితే కాలుష్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ససేమిరా అంటోంది. యార్డ్‌లోకి అతనికి అనుమతి నిరాకరించింది. దీంతో జేమ్స్ కోర్టును ఆశ్రయించాడు. మొత్తం గాలించి హార్డ్‌డ్రైవ్ దొరికితే కుబేరుడినయ్యాక సంపదలో 10 శాతాన్ని న్యూపోర్ట్ అభివృద్ధికి కేటాయిస్తానని, నగరాన్ని దుబాయ్, లాస్ వెగాస్ సిటీలా తీర్చిదిద్దుతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశాన్ని డిసెంబర్‌లో విచారిస్తామంటూ ఈ కేసును కోర్టు వాయిదావేసింది.
Comments
Please login to add a commentAdd a comment