చెరిపేయండి... శాశ్వతంగా! | Happened ... permanently! | Sakshi
Sakshi News home page

చెరిపేయండి... శాశ్వతంగా!

Published Wed, Jul 16 2014 11:51 PM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM

చెరిపేయండి... శాశ్వతంగా! - Sakshi

చెరిపేయండి... శాశ్వతంగా!

పీసీలోంచి ఫైళ్లు తొలగించాలంటే మీరు ఏం చేస్తారు?
 ఆ... ఏముంది.. ట్రాష్‌లో పడేస్తేసరి అంటున్నారా?
 బాగానే ఉంటుంది కానీ దీనిద్వారా
 ఫైల్ పూర్తిగా తొలగిపోదు!!
 హార్డ్‌డ్రై వ్‌లో ఎక్కడో ఓ మూలన అలాగే పడి ఉంటుంది.
 కాలం గడిచేకొద్దీ ఇలాంటి చెత్త అంతా పేరుకుపోయి...
 పీసీ నత్తనడకన నడవడం మొదలవుతుంది.
 ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే
 ఎంచక్కా ఈ పద్ధతులు పాటించండి!

 
ట్రాష్‌లో పడేసి, క్లీన్ చేసిన ప్రతిసారి హమ్మయ్యా.. కొంత చెత్త వదిలించుకున్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మన పని సగమే అయినట్లు లెక్క. ఎందుకంటే ట్రాష్‌ను క్లీన్ చేసినప్పుడు ఫైల్ తాలూకూ వర్చువల్ పాథ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఫైల్ అలాగే స్టోర్ అవుతుంది. కొంచెం కష్టమైనప్పటికీ వీటిని మళ్లీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. మామూలు ఫైళ్ల విషయంలో ఫర్వాలేదేమోగానీ.... సున్నితమైన వివరాలున్న ఫైళ్ల విషయంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరం. ఈ సమస్యను అధిగమించేందుకు అదే ఫైల్‌పై మళ్లీ సమాచారాన్ని స్టోర్ చేయడం ఒక్కటే మార్గం. కానీ ఇది చేతులతో చేసే పని కాదు. మార్కెట్‌లో ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటివి ఏమేమి ఉన్నాయో, అవెలా పనిచేస్తాయో చూడండి...
 
 ఇరేజర్...
 
ఈ సాఫ్ట్‌వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే కంప్యూటర్ల కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత డిలీట్ చేయాల్సిన ఫైల్‌పై రైట్ క్లిక్ చేస్తే చాలు... కనిపించే ఆప్షన్లలో ఇరేజర్ ఐకాన్‌ను ఎంచుకోవడం ద్వారా ఫైల్‌ను శాశ్వతంగా చెరిపేయవచ్చు. ఒక్కో ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయవచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా ట్రాష్‌లో పడేసే ప్రతిఫైల్‌ను ఇలా ఓవర్‌రైట్ చేసి డిలీట్ చేసేలా ఇరేజర్‌ను ప్రోగ్రామ్ చేసుకోవచ్చు.
 
 సీసీ క్లీనర్...
 
దీని గురించి మీరు వినే ఉంటారు. హార్డ్‌డిస్క్‌లో స్పేస్‌ను ఆదా చేసేందుకు తరచూ వాడే సాఫ్ట్‌వేర్ ఇది. సాధారణ పద్ధతుల్లో ఫైళ్లను డిలీట్ చేసిన తరువాత వాటిని గుర్తులను చెరిపేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్‌వేర్. పీసీలో నిర్దిష్టంగా ఫలానా ప్రాంతాల్లోని అనవసరమైన ఫైళ్లను ఓవర్‌రైట్ చేయమని సూచించే అవకాశం ఉంటుంది సీసీక్లీనర్ సాఫ్ట్‌వేర్‌తో. దీంట్లోనూ ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు.
 
 సోర్స్ ఎమ్టీ ట్రాష్..

 
ఈ సాఫ్ట్‌వేర్ ఆపిల్ కంప్యూటర్ల కోసం ఉద్దేశించింది. కొనుక్కున్నప్పుడే ట్రాష్ బిన్‌కు అనుసంధానంగా ఏర్పాటై వస్తుంది. కాకపోతే ఫైల్స్ ట్రాష్‌లో పడేసిన తరువాత ఫైండర్ ఆప్షన్‌లోకి వెళ్లి సెక్యూర్ ఎమ్టీ ట్రాష్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. హార్డ్‌డ్రైవ్ మొత్తాన్ని ఓవర్‌రైట్ చేయాలనుకుంటే డిస్క్ యుటిలిటీ ఆప్‌లోకి వెళ్లి ఇరేజ్ అప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత ‘సెక్యూరిటీ ఆప్షన్’ను సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేస్తే సరి.
 
విండోస్, ఆపిల్ పీసీలు రెండింటిలోనూ ట్రాష్‌బిన్‌ను పూర్తిగా పక్కనబెట్టి ఫైళ్లను డిలీట్ చేయాలంటే ఫైల్ ష్రెడ్డర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఫైళ్లను ఓవర్‌రైట్ చేసి శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. ఒక ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది సాఫ్ట్‌వేరే నిర్ణయించుకుంటుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement