
న్యూఢిల్లీ: పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ గల్లంతు అయిన వ్యవహారం గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)ను కుదిపేస్తోంది. మరోవైపు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్‌ను బదిలీ చేయాల్సిందేనంటూ తోటి జడ్జిలు, అడ్వొకేట్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమర్శల నేపథ్యంలో ఆమెను సెలవులపై వెళ్లగా.. జస్టిస్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.
గుజరాత్ హైకోర్టు పరిధి నుంచి పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ మాయం(Files Missing) కావడంపై జడ్జి సందీప్ భట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థలోని పారదర్శకతను, నమ్మకాన్ని దెబ్బ తీసే అంశమని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో న్యాయ ప్రక్రియలకు సత్వర సంస్కరణలకు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఫైళ్ల మాయంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి పాత్రపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఊహించని పరిణామానికి దారి తీసింది.
జస్టిస్ సందీప్ భట్ రోస్టర్‌ను మార్చేస్తూ చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్(Chief Justice Sunitha Agarwal) ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర అభ్యంతరాలకు కారణం కావడం మాత్రమే కాదు పలు అనుమానాలకూ దారి తీసింది. గుజరాత్ హైకోర్టు అడ్వొకేట్ అసోషియేషన్స్ సోమవారం అత్యవసరంగా సమావేశమై చీఫ్ జస్టిస్ నిర్ణయంపై చర్చించాయి. మరోవైపు.. హైకోర్టు జడ్జిలు, లాయర్లు జస్టిస్ సందీప్ భట్‌కు సంఘీభావం ప్రకటించారు. అయితే.. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ ఇలా జడ్జిల విధులకు అడ్డుపడడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు.. నలుగురు జడ్జిల విషయంలోనూ ఆమె ఇలాగే ప్రవర్తించారు. అలాగే.. న్యాయవాదులతోనూ ఆమె వ్యవహరించే తీరుపైనా తీవ్ర విమర్శలు ఉన్నాయి
తాజాగా.. మొన్న శుక్రవారం(ఫిబ్రవరి 14)న అక్రమ కట్టడాలకు సంబంధించిన దాఖలైన పిల్‌పై వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిల్‌ను విచారించింది. ఆ టైంలో జీహెచ్‌సీఏఏ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ బ్రిజేష్ త్రివేదికి చీఫ్ జస్టిస్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనలు పూర్తిగా వినాలంటూ తీవ్ర స్వరంతో ఆయన చీఫ్ జస్టిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఆమె అవేం పట్టనట్లు గాల్లో చూస్తూ ఉండిపోయారు. దీంతో ఆయన మరోసారి వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె మందలించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా.
ఈ పరిణామాలన్నింటిని దృష్ట్యా దీంతో ఆమెను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ జడ్జిలు, లాయర్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ అంశంపై మంగళవారం మరోసారి జీహెచ్‌సీఏఏ జనరల్ బాడీ అత్యవసర సమావేశం నిర్వహించాలనుకుంది. కానీ ఈలోపు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ సెలవులపై వెళ్లగా.. ఆమె స్థానంలో జస్టిస్ బీరెన్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా నియమించింది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 2వ తేదీదాకా ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు న్యాయ విభాగం(నియామకాల) కేంద్ర సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.
ఆ పెద్దావిడ పిటిషన్‌తో..
జయశ్రీ జోషి(71) 2020లో రాధాన్‌పూర్ కోర్టులో ఓ కేసు నమోదు చేసింది. అయితే అందుకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిందని హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ సందీప్ భట్ బెంచ్ విచారణ జరిపి.. కనిపించకుండా పోయిన ఆ ఫైల్స్ ఆచూకీ కనిపెట్టాలంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో..
2024 డిసెంబర్‌లో ఈ పిటిషన్‌కు సంబంధించి సమగ్రమైన నివేదిక అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పుడే.. సూరత్ కోర్టుకు సంబంధించిన 15 కేసుల ఫైల్స్ కనిపించకుండా పోయాయనే విషయం వెలుగు చూసింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ టైంలో సంబంధిత అధికారిగా, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి ఉండడం గమనార్హం. సూరత్ కోర్టులో ఆరేళ్లపాటు పని చేసి.. బదిలీ మీద కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఫైల్స్ మాయం అయిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.
ఎవరీ సునీతా అగర్వాల్
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సునీతా అగర్వాల్.. గతంలో అలహాబాద్ కోర్టులో జడ్జిగా పని చేశారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో మానవ హక్కుల గురించి చర్చ ద్వారా ఆమె వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆహారం పంచుతున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వాళ్లందరినీ విడుదల చేయాలని ఆమె ఆదేశించారు. అంతేకాదు.. యూపీలో పని చేసే చోట్ల లైంగిక వేధింపుల కట్టడికి ఏర్పాటు చేసిన కీలక కమిటీలోనూ ఆమె సభ్యురాలిగా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment