![Hardik Patel wife Kinjal Says Her Husband Missing Since Last Twenty Days - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/14/patell.jpg.webp?itok=EaeILRFN)
అహ్మదాబాద్ : పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ గత 20 రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ అధికార యంత్రాంగం తన భర్తను వేధిస్తోందని, తన ఆచూకీ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె ఇంటర్‌నెట్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. 2017లో పటేళ్లపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరిస్తామని 2017లో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, మరి అలాంటప్పుడు హార్ధిక్ పటేల్ ఒక్కడినే ఎందుకు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. బీజేపీలో చేరిన మరో ఇద్దరు పటేల్ నేతల పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. హార్థిక్ పటేల్ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను ప్రస్తావించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు.
హార్థిక్ ఎక్కడ ఉన్నారనేది వెల్లడికాకున్నా చివరిసారిగా ఆయన ఈనెల 11న తన ట్విటర్ ఖాతా నుంచి ఢిల్లీ ఎన్నికల్లో నెగ్గిన అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తనను బయటకు రాకుండా నిరోధించేందుకు జైలులో ఉంచాలని గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా ఈనెల 10న పటేల్ ఆరోపించారు. నాలుగేళ్ల కిందట గుజరాత్ పోలీసులు తనపై తప్పుడు కేసును నమోదు చేశారని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తనపై నమోదైన కేసుల గురించి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించగా ఆ సమయంలో తనపై ఈ కేసు లేదని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి తనను కస్టడీలోకి తీసుకునేందుకు తన ఇంటికి పోలీసులు వచ్చారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని ఆ ట్వీట్‌లో పటేల్ పేర్కొన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే తనపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తనను నిర్బంధించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయినా తాను ప్రజల తరపున బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతానని, త్వరలోనే ప్రజలను కలుస్తానమంటూ ఆయన మరో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment