chief justice of high court
-
సుప్రీం జడ్జిగా కర్ణాటక సీజే
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జజ్టిస్ ప్రసన్న బి.వరాలే పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ పి.ఎస్.దినేశ్‌కుమార్‌ను కర్ణాటక హైకోర్టు సీజేగా నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం సమావేశమై ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ అనంతరం సుప్రీంకోర్టులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మూ డో న్యాయమూర్తిగా జస్టిస్ వరాలే నిలవనున్నారు. ‘‘జస్టిస్ ఎస్.కె.కౌల్ రిటైర్మెంట్తో గత డిసెంబర్ 25 నుంచి సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉంది. న్యాయమూర్తులపై పనిభారం ఎక్కువగా ఉన్నందున ఖాళీలుండరాదు. అందుకే జస్టిస్ వరాలే పేరును సిఫార్సు చేస్తున్నాం’’ అని కొలీజియం పేర్కొంది. 56 మంది సుప్రీం న్యాయవాదులకు సీనియర్ హోదా 11 మంది మహిళలతో సహా 56 మంది న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా సుప్రీంకోర్టు నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో తెలుగు న్యాయవాది శ్రీధర్ పోతరాజు కూడా ఉన్నారు. -
భారత 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను మంగళవారం సమావేశపరిచి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పేరును ప్రకటించారు సీజేఐ జస్టిస్ యుయు లలిత్. సిఫారసు లేఖను జడ్జీల సమక్షంలో జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు అందించారు. తర్వాత ఆ సిఫారసు లేఖ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు.దీంతో 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐ పదవిలో కొనసాగినట్లవుతుంది. సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తిని వారసుడిగా పేర్కొంటారు. ప్రస్తుతం ఉన్న వారిలో జస్టిస్ యుయు లలిత్ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున ఆయన పేరును ప్రతిపాదించారు. ఇదీ చదవండి: టీఎంసీకి షాక్.. స్కూల్ జాబ్ స్కాం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్ -
పిల్లల భద్రత చట్టం అమలుపై వర్క్‌షాపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జువనైల్ జస్టిస్ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వర్క్ షాపులో జూమ్ యాప్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెబినార్ ద్వారా పాల్గొని పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి కారణాలు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనే అంశాలపై చర్చించేందుకే ఈ వర్క్ షాపు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒంటరి, సంరక్షణ లేని బాలురు, బాలికలు తారసపడితే ముందుగా పోలీసులకు తెలపాలని డీజీపీ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒంటరి బాలురు, బాలికల వివరాలను పోలీసులకు తెలియపరచాలని సూచించారు. ఇందుకోసం www.trackthemissingchild.gov.in వెబ్సైట్ ద్వారా వారి వివరాలు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ వెబ్సైట్ ద్వారా వచ్చిన వివరాలు తప్పి పోయినప్పటికి.. వారి వివరాలతో సరిపోలితే సదరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని చెప్పారు. ఒంటరి బాలురు, బాలికలను కొట్టడం దుర్బాషలాడటం చేయకూడదని.. పిల్లలు నేరం చేస్తే వారిని స్టేషన్లోనే నేరస్థులతో కూర్చోబెట్టకుండా మృదువుగా వ్యవహరించాలని డీజీపీ పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి మాట్లాడుతూ.. పిల్లలు దేశ భవిష్యత్తుకు ముఖ్యమైన మూలధనం అన్నారు. వారి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఏపీజె అబ్దుల్ కలామ్ కూడా అనాధ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడారని గుర్తు చేశారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ అనాథ పిల్లల భవితవ్యంపై దృష్టి సారించాలని, జువనైల్ జస్టిస్ ప్రకారం నేరం ఆరోపించబడిన పిల్లలు, పట్టించుకొనే వారు లేని పిల్లలుగా వర్గీకరించారని తెలిపారు. అందరూ కూడా పిల్లల భవిష్యత్తు విషయంలో ఒక బాధ్యత కలిగి ఉండాలని, నేరం ఆరోపించబడిన పిల్లలు నేరస్ధులు కాదని ఆయన అన్నారు. వాళ్లు బాధితులని, నేరం ఆరోపించబడిన పిల్లలతో మృదువుగా ప్రవర్తించాలని చెప్పారు. అనాథ పిల్లల మానసిక స్ధితిగతులను అర్ధం చేసుకుని వారితో మెలగాలని, వారి దత్తత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనాథ పిల్లలకు పునరావాస కల్పన చాలా జాగ్రత్తగా చేయాలని, ప్రభుత్వాలు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. వారికి కుటుంబ వాతావరణం కల్పించాలని, ఓల్డేజ్ హోమ్‌ల దగ్గరలో జువనైల్ హోంలు కూడా ఉండాలని చెప్పారు. లీగల్ క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీల విధానాలలో ఇంకా మార్పులు రావాలని, సీడబ్ల్యూసీ, ఆరాలలో ఉన్న ఇబ్బందులతో దత్తత చేయడం ఆలస్యం అవుతోందన్నారు. బాధ్యులందరూ కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. -
కడప పీడీజేకు ఫోన్ చేసి.. దొరికిపోయాడు!
సాక్షి, అమరావతి : కడప జిల్లా ప్రధాన జడ్జిని బురిడీ కొట్టించేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీనంటూ ఓ నిందితుడి సోదరుడు పీడీజేకి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పీడీజే వాస్తవాలు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. కడప జిల్లాలోని రాజంపేట కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన సుమిత్రా నాయక్ ఇటీవల ఓ మహిళ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుని బద్వేలు కోర్టు జడ్జి రాజశేఖర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమెకు ఓ అఫిడవిట్ ఇచ్చాడు. ఈ సంతకం ఫోర్జరీ అని తేలడంతో రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమిత్రా నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఇటీవల వైఎస్సార్ జిల్లా ప్రధాన జడ్జికి ఓ నెంబర్(9642118188) నుంచి ఫోన్ చేసి.. తాను హైకోర్టు ఏసీజే జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ పీఎస్ పి.రవీంద్రన్‌ను మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయిన సుమిత్రా నాయక్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏసీజే చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు నడుచుకోవాలని చెప్పాడు. దీంతో పీడీజే స్వయంగా ఏసీజే పేషీకి ఫోన్ చేసి, పేషీలో రవీంద్రన్ పేరుతో ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. ఆ పేరుతో ఎవరూ లేరన్న విషయం తెలుసుకున్న పీడీజే ఈ విషయాన్ని నేరుగా ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని పీడీజేను ఏసీజే ఆదేశించారు. దీంతో పీడీజే ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సుమిత్రా నాయక్ సోదరుడే రవీంద్రన్ పేరుతో ఫోన్ చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బోసలే
హైదరాబాద్:ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసలే నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో బోసలేను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి తాజాగా రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించడంతో బోసలే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బార్ కౌన్సిల్ సభ్యుల్లో పిన్న వయస్కుడు జస్టిస్ బోసలే 1956, అక్టోబర్ 24న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి బాబాసాహెబ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బోసలే విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. 1979 అక్టోబర్ 11న న్యాయవాద వృత్తి చేపట్టారు. క్రిమినల్, ఆస్తి చట్టాల కేసుల్లో అపార అనుభవం సాధించారు. 1986 నుంచి 1991 వరకు బాంబే హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, అసిస్టెంట్ పీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు ఆయన బాంబే హైకోర్టులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. దేశంలోని బార్ కౌన్సిళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటి వరకు అత్యంత పిన్నవయస్కుడు ఈయనే. వరుసగా మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన న్యాయవాదులకు సంబంధించిన వ్యవహారాల్లో పలు సంస్కరణలు తెచ్చారు. తరువాత వాటిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అమలు చేయడం ప్రారంభించింది. పలు అంతర్జాతీయ సదస్సుల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2001, జనవరి 22న బాంబే హైకోర్టు అదనపు న్యాయవాదిగా, 2003లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, జనవరి 7న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది డిసెంబర్ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ బోసలే
- నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం - మే 7న బాధ్యతల స్వీకరణ హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోసలే నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మే ఏడున ఆయన బాధ్యతలు చేపడతారు. గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా 6న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ బోసలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండు నెలలపాటు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి తరువాత జస్టిస్ బోసలేను పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశాలున్నట్లు న్యాయవర్గాలు తెలిపాయి. ప్రస్తుత సీజే గుప్తా ఆరునపదవీ విరమణ చేయాల్సి ఉండగా రెండో తేదీ నుంచి నెలరోజుల పాటు హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో ఒకటో తేదీనే ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలకనుంది. ఆ తరువాత ప్రభుత్వం... కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర లా కమిషన్‌కు చైర్మన్‌గా గుప్తాను ప్రభుత్వం నియమించే అవకాశముంది. దీనిపై ప్రాథమికంగా ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. బార్ కౌన్సిల్ సభ్యుల్లో పిన్న వయస్కుడు జస్టిస్ బోసలే 1956, అక్టోబర్ 24న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి బాబాసాహెబ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బోసలే విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. 1979 అక్టోబర్ 11న న్యాయవాద వృత్తి చేపట్టారు. క్రిమినల్, ఆస్తి చట్టాల కేసుల్లో అపార అనుభవం సాధించారు. 1986 నుంచి 1991 వరకు బాంబే హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, అసిస్టెంట్ పీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు ఆయన బాంబే హైకోర్టులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. దేశంలోని బార్ కౌన్సిళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటి వరకు అత్యంత పిన్నవయస్కుడు ఈయనే. వరుసగా మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన న్యాయవాదులకు సంబంధించిన వ్యవహారాల్లో పలు సంస్కరణలు తెచ్చారు. తరువాత వాటిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అమలు చేయడం ప్రారంభించింది. పలు అంతర్జాతీయ సదస్సుల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2001, జనవరి 22న బాంబే హైకోర్టు అదనపు న్యాయవాదిగా, 2003లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, జనవరి 7న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది డిసెంబర్ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.