ప్రతీకాత్మక చిత్రం
అహ్మదాబాద్: కరోనా సోకి చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని కోర్టుకెక్కిన భార్య వార్త గుర్తుందా? అయితే, కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే అతను ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని మృతుడి భార్య తరపు న్యాయవాది తెలిపారు. ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కంటానని ఆ మహిళ తెలపగా, ఆ విధానానికి అనుమతి ఇవ్వడంపై తదుపరి విచారణను శుక్రవారం జరగాల్సి ఉంది.
వివరాల ప్రకారం.. కోర్టు అనుమతి పొందాక ఆస్పత్రి సిబ్బంది తన క్లయింట్ భర్త వీర్యాన్ని సేకరించారని, అనంతరం అతడు గురువారం కన్నుమూశారని మహిళ తరఫు న్యాయవాది చెప్పారు. కాగా గుజరాత్‌కు చెందిన దంపతులకు సంతానం లేదు. ఇటీవల సదరు మహిళ భర్త కరోనా కారణంగా పలు అవయవాలు దెబ్బతిని స్టిర్లింగ్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు తెలపడంతో, తన భర్త ప్రతిరూపాన్నైనా చూసుకునేందుకు వీలుగా బిడ్డను కంటానని, అందుకు భర్త వీర్యం కావాలని ఆమె కోరింది.
అయితే ఐవీఎఫ్ కోసం అతని స్పెర్మ్ సేకరించాలని, అందుకు కోర్టు అనుమతి ఉండాలని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేసింది. ఈ క్రమంలో సదరు మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, తన భర్త బతికే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని పిటిషన్‌లో విన్నవించింది. ఈ నేపథ్యంలో.. సదరు కరోనా రోగి ఆరోగ్య పరిస్థితిని, మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని వీర్య సేకరణకు కోర్టు అత్యవసర అనుమతులు జారీ చేసింది. కానీ, వీర్యం సేకరించిన కొన్ని గంటల్లోనే అతడు మృతిచెందడం విషాదకరం.
Comments
Please login to add a commentAdd a comment