souls
-
సోల్స్ మూవీ టీజర్ విడుదల
మనకు కలిగే ఏ పరిచయమూ కారణం లేకుండా జరగదనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సోల్స్’. తినాథ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లుగా శ్రావణ్ దర్శకత్వంలో విజయలక్ష్మి వేలూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు వెంకటేష్ మహా రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘రెండు సోల్స్ ప్రయాణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి ప్రతీక్ అబ్యంకర్ అండ్ ఆనంద్ నంబియార్ సంగీతం అందించారు. -
అమ్మో.. ఆత్మలతో కూడా మాట్లాడతారా?
చచ్చినోళ్లతో మాట్లాడడం.. అమ్మో! వింటేనే భయంగా ఉంది, అలాంటిది నిజంగా జరిగితే? అసలు అలా మాట్లాడాలంటే ముందు చనిపోయినవాళ్లను చూసి బతికి ఉన్నవాడి గుండె ఆగకుండా ఉండాలి! కొంతమంది మాత్రం తమకు ఆ ధైర్యం ఉందని, చనిపోయిన వారితో నేరుగా మాట్లాడతామని చెబుతుంటారు. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు దుర్హాం యూనివర్సిటీ ఒక పరిశోధన నిర్వహించింది. మానవ నాగరికత తొలినాళ్ల నుంచి మనిషికి అర్థం కాని సమస్యల్లో చావు ఒకటి. మనిషి విజ్ఞానం పెరిగే కొద్దీ అసలు మనమెందుకు పడుతున్నాం? ఎక్కడ నుంచి వస్తున్నాం? ఎందుకు చస్తున్నాం? ఎక్కడకు పోతాం? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డాడు. అయితే వీటికి సవ్యమైన సమాధానాలు దొరక్కపోవడంతో మతం ఆధారంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు రూపొందించుకున్నాడు. ప్రపంచంలో కీలక మతాలన్నీ మనిషి శరీరంలో ఆత్మ లేదా స్పిరిట్ లేదా సోల్ ఉంటుందని, మరణానంతరం అది ఇంకో జన్మనెత్తుతుందని భావిస్తాయి. ఇంతవరకు ఓకే కానీ, మత విశ్వాసాలు మరింత ముదిరేకొద్దీ మనిషిలో ఈ భావన చుట్టూ అనంతమైన ఊహలు రూపొందాయి. ఇలాంటి ఊహల్లో అతి ముఖ్యమైనది చనిపోయిన వాళ్లతో మాట్లాడడం. ప్రపంచంలో దాదాపు అన్ని సమాజాల్లో ఈ భావన కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం? చనిపోయిన వారితో కాంటాక్ట్ చేయడం కుదిరేపనేనా? కేవలం చనిపోయిన మనుషులతో మాత్రమే మాట్లాడగలమా లేక చనిపోయిన ఇతర జీవజాలం ఆత్మలతో కూడా మాట్లాడవచ్చా? అనే అనుమానాలకు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం... మానవాత్మలు భూమిపైనే పరిభ్రమిస్తుంటాయా? వాటితో ఏ భాషలో సంభాషించాలి? అనేవాటిపై దుర్హాం యూనివర్సిటీలో తాజాగా ఒక పరిశోధన సాగింది. సాధారణంగా ఆత్మలతో మాట్లాడేవాళ్లను ’’మీడియం’’ అంటారు. ఇలాంటి 65 మంది మీడియంలను స్పిరిట్యువలిస్టు నేషనల్ యూనియన్ నుంచి, 143 మందిని మామూలు ప్రజల నుంచి పరిశోధన కోసం తీసుకున్నారు. వీరందరికీ ఆన్లైన్లో ప్రశ్నావళిని అందించారు. ఆత్మలతో ఎప్పుడు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఎలా మాట్లాడారు లాంటి ప్రశ్నలతో పాటు వారి వారి పారానార్మల్ నమ్మకాలు, ఊహలు, మానసిక స్థితి తదితర అంశాలను కూడా ప్రశ్నించారు. అనంతరం మీడియంలు ఇచ్చిన సమాధానాలను, మామూలు ప్రజల సమాధానాలతో పోల్చి పరిశోధించారు. ఆత్మలతో సంభాషణ ప్రతిరోజూ జరుగుతుందని మీడియమ్స్‌లో 79 శాతం చెప్పారు. ఈ సంభాషణ బహిరంగంగా జరగదని, తమ మెదడులోపలే జరుగుతుందని 65 శాతం మంది పేర్కొన్నారు. తమ గురించి బయటవారు ఏమనుకుంటారనేది పట్టించుకోమని ఎక్కువమంది తెలిపారు. ఇదే ప్రశ్నలకు మామూలు ప్రజలు తామెప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కోలేదని చెప్పారు. దీనిని బట్టి సాధారణ ప్రజలతో పోలిస్తే ఇలాంటి మీడియమ్స్ అంతా మానవాతీత ఊహాగానాల పట్ల, మానసిక చేతనలో అలౌకిక స్థితి పట్ల అతి నమ్మకం పెంచుకున్నవారని పరిశోధనలో తేలింది. అలాగే వారివారి జీవితానుభవాలు, బాల్యం, నమ్మకాలు, చుట్టూ వ్యక్తులు వారిని అతిగా ప్రభావం చేసినట్లు తేటతెల్లమైంది. ముఖ్యంగా బాల్యంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల ప్రభావం వల్ల వీరంతా ఇలా ఆత్మలతో మాట్లాడినట్లు భావిస్తున్నారని, అంతకుమించి వీరెవరూ నిజంగా ఎలాంటి మృతాత్మలతో సంభాషించలేదని పరిశోధన స్పష్టం చేసింది. -
గనులను మింగిన ఆత్మలు!
సాక్షి, గుంటూరు: దశాబ్దాల క్రితమే చనిపోయిన వారి ఆత్మలు తెల్లరాయి గనులను అక్రమంగా తవ్వేస్తూ కోట్లాది రూపాయలు దోచుకున్నాయట! ఆత్మలు అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన స్వామి రామకోటయ్య అనే వ్యక్తి 2013లో అక్రమంగా గనులు తవ్వేశాడని, జరిమానా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు ఆయన పేరుతో నోటీసు ఇచ్చారు. నిజానికి రామకోటయ్య 1998లోనే కన్ను మూశాడు. తన 20 ఏళ్ల కిందటే తండ్రి చనిపోయాడని, 2013లో అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావు నెత్తీనోరూ బాదుకున్నా అధికారులు లెక్కచేయలేదు. ఆయనకు నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అసలు దోషులను క్షేమంగా పక్కకు తప్పించి, అమాయకులను బలిపశువులను చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పకడ్బందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసానుపల్లిలో పలువురికి మైనింగ్, విజిలెన్స్ అధికారులు నోటీసులిచ్చారు. రూ.1.55 కోట్ల జరిమానా చెల్లించాలని ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చారు. దాచేపల్లికి చెందిన మరో ఐదుగురికి నోటీసులు అందాయి. విలువైన గనులను పట్టపగలే అడ్డంగా దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, దాంతో ఎలాంటి సంబంధంలేని తమకు నోటీసులు జారీ చేయడం ఏమిటని బాధితులు మండిపడుతున్నారు. సర్వే పేరిట అధికారుల హడావుడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి గ్రామాల పరిధిలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రూ.వందల కోట్ల విలువైన ఖనిజ సంపదను అక్రమంగా దోచేస్తూ, ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టడంపై న్యాయస్థానం మండిపడింది. దీంతో హైకోర్టుకు సమాధానం చెప్పుకోవడానికి ఆయా ప్రాంతాల్లో అధికారులు మూడు రోజులపాటు సర్వే పేరిట హడావుడి చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి, అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని అమాయకుల మెడకు చుట్టేందుకే నోటీసులు జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించడానికేనా? దాచేపల్లి పట్టణంతోపాటు కేసానుపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు 2013 నుంచి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, పెనాల్టీ చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మైనింగ్ అంటే ఏమిటో కూడా తెలియని తమకు నోటీసులు అందడంతో భయాందోళనకు గురయ్యారు. నోటీసుల్లో పేర్కొన్న సర్వే నంబర్లలో తమ పేర్లు ఏమైనా ఉన్నాయా అనే దానిపై మీ–సేవా కేంద్రాల్లో ఆరా తీశారు. ఎక్కడా తమ పేర్లు లేనట్లుగా గుర్తించి ఈసీలు తీసుకున్నారు. కేసానుపల్లికి చెందిన స్వామి రామకోటయ్య సర్వే నంబరు 336/6లో 16 సెంట్ల విస్తీర్ణంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడి, మొజాయిక్ చిప్స్ 5,834 మెట్రిక్ టన్నులు దోచుకున్నాడని, దాని విలువకు పది రెట్లు పెనాల్టీ వేసి మొత్తం రూ.28.23 లక్షలు చెల్లించాలంటూ 2013 ఆగస్టు 16 తేదీతో ఉన్న నోటీసును అధికారులు జారీ చేశారు. ఈ నోటీసును రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావుకు అందించారు. 1998లో తన తండ్రి రామకోటయ్య చనిపోయినట్లుగా పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రామలింగేశ్వరరావు చూపినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. నోటీసు తీసుకోకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. అదే గ్రామానికి చెందిన గుదె పేరయ్య సర్వే నంబరు 244లో 66 సెంట్ల విస్తీర్ణంలో 2015లో అక్రమ మైనింగ్‌కు పాల్పడి 32 వేల మెట్రిక్ టన్నుల మొజాయిక్ చిప్స్‌ను అక్రమంగా దోచేశాడని, పెనాల్టీ రూ.1.56 కోట్లు చెల్లించాలని 2017 మే 19 తేదీతో నోటీసు ఇచ్చారు. వ్యవసాయం చేసుకునే తాను అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని పేరయ్య ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అలాగే మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. సదరు సర్వే నంబర్లలో మైనింగ్ జరిగిన దాఖలాలు లేవని, ఆ ప్రాంతంలో ఎస్టీ కాలనీ ఉందని చెబుతున్నారు. సర్వే నంబరు 244 సమీపంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న అక్రమ క్వారీ ఉంది. మైనింగ్ మాఫియాను వదిలిపెట్టి, అమాయకులకు నోటీసులు జారీ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులపాటు సర్వే నిర్వహించిన మైనింగ్ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించేందుకే అమాయకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చనిపోయిన తర్వాత గనులు తవ్వుతారా? ‘‘మా నాన్న స్వామి రామకోటయ్య 1998లో మరణించారు. సర్వేనంబర్ 336/6లో ఉన్న 16 సెంట్లలో మా నాన్న అక్రమంగా గనులు తవ్వారని, రూ.28,23,843 జరిమానా చెల్లించాలని అధికారులు నోటిసు ఇచ్చారు. ఈ నోటీసు 2013 ఆగస్టు 16న జారీ అయినట్లు ఉంది. మా నాన్న చనిపోయిన 20 ఏళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారో అర్థం కావట్లేదు. – స్వామి రామలింగేశ్వరరావు, కేసానుపల్లి అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు ‘‘అధికారులు 3 రోజుల క్రితం ఇంటికి వచ్చి మా నాన్న పేరయ్య పేరిట నోటీసులిచ్చారు. సర్వే నంబర్ 244లో ఉన్న 66 సెంట్ల స్థలంలో అక్రమంగా మైనింగ్ చేసినందుకు రూ.1.55 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. ఆ సర్వే నంబర్లో మాకు సెంటు స్థలం కూడా లేదు. గనుల కేసులో అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు’’ – గుదె అనంతరామయ్య, కేసానుపల్లి చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం ‘‘కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల ఆధారంగా పెనాల్టీలు చెల్లించాలని నోటీసులు పంపాం. 2013, 2017లో కేసులు నమోదు కావడంతో ఆ తేదీలతోనే నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ కేసు విచారణకు, ఈ నోటీసులకు సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం’’ – పాపారావు, మైనింగ్ డీడీ, ఇన్చార్జి విజిలెన్స్ ఏడీ -
సైన్స్... రొమాన్స్!
ఆత్మలు ఉన్నాయా... లేవా! మనిషి బరువు ఎంతున్నా మరణానంతరం 21 గ్రాముల తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. ఈ అంశాలతో దర్శకుడు వీఐ ఆనంద్ తీసిన సైంటిఫిక్, రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి హిట్టయ్యింది. మళ్లీ అలాంటి ఓ వినూత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వీఐ ఆనంద్. అల్లు శిరీష్ హీరోగా లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించనున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ‘‘సైంటిఫిక్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు అల్లు శిరీష్. చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని వీఐ ఆనంద్ తెలిపారు. సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: సతీశ్ వేగేశ్న, రాజేశ్ దండ. -
ఉరి
క్లాసిక్ కథ నాకు మీరు ఉరిశిక్ష వేశారు. నన్ను చెప్పుకునేది చెప్పుకోమన్నారు శిక్ష వేయకముందు చెప్పుకోమంటే అర్థం ఉండేది. ఇప్పుడు చెప్పుకొన్నా ఒకటే చెప్పుకొనకపోయినా ఒకటే. కాని మీరిప్పుడు చెప్పుకోమనటంలో ఒక విశేషం ఉంది. ఎట్లాగూ చస్తున్నాడు కదా! చచ్చింతర్వాత మాట్లాడేది లేదు, పెట్టేది లేదు, ఆ మాట్లాడేది కాస్తా యిప్పుడే మాట్లాడమని. మనుష్యుడై జన్మ యెత్తిన తర్వాత మాట్లాడటంలో కొంత లౌకికమైన సంతోషం ఉంటుంది. అది మాయాపి హితులైన మానవులకు సహజ లక్షణం. మీకు నా శరీరం మీద ప్రేమలేదు. నా ఆత్మ మీద ప్రేమ. నా ఆత్మ మీ ఆత్మలు అందరివి ఒకటే గనుక, అయినా కాకపోయినా మీరనుకొంటున్నారు గనుక యిది ఒక మామూలు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే నష్టం లేదు, మాట్లాడితే వచ్చే లాభం లేదు. కాని నేను మాట్లాడితే లాభం ఉంటుందని కొందరనుకొంటారు. వాళ్ల ఉద్దేశంలో మాట్లాడవలసిందే. ఏమైనా సరే మాట్లాడవలసిందే. బ్రతికియున్నంత వరకు ప్రయత్నం చేయవలసిందే. బ్రతికి ఉన్నంత మంది ప్రయత్నం చేయవలసిందే. వాళ్లు మీ కన్న మాయాపిహితులు. నేను మనిషిని చంపానని మీరు నాకు ఉరిశిక్ష వేశారు. ఆ చంపానన్నది నాకు తెలియదు. మీకూ తెలియదు. చంపానని సాక్ష్యం యిచ్చినవాళ్లకీ తెలియదు, నాకు తల్లీ పెళ్లాం బిడ్డలు ఉన్నారు. వాళ్లను పోషించలేక నేను చాలా బాధపడ్డా. వాళ్లకు తిండిలేదు, నాకూ తిండిలేదు. మీ దయవల్ల రెండు నెలల నుండి ఖైదులో కూర్చొని అన్నం మాత్రం తిన్నాను. ఈ రెండు నెలలు వాళ్లేమైనారో నాకు తెలియదు. ఈపాటికి వాళ్లూ చచ్చే ఉంటారు. వాళ్లకన్న నేనే అదృష్టవంతుణ్ని. వాళ్లు చావకముందు మాడిమాడి చచ్చి ఉంటారు, నేను చచ్చేముందు ఏదో యింత అన్నం తినే చస్తున్నా. నేను ఉద్యోగం చేయలేదు. కూలీ నాలీ కుదురలేదు, మోసం చేయలేను. ఎక్కడో నాల్గురాళ్లు సంపాదిస్తే దాంతో బియ్యం కొనుక్కుందామంటే బియ్యం దొరకలేదు. అదివరకు నాల్గురోజులు ఇంటిల్లి పాదీ పస్తున్నాం. నేను నా భార్య ఎల్లాగో అల్లాగా తమాయించుకొన్నాం. పిల్లలు బక్కనరాలై కూర్చున్న చోటునించి లేవలేక యేడ్చేశక్తిగూడా లేక బ్రతికి ఉన్న శవాలల్లే పడి ఉంటే చూడటం యెలాగా? బియ్యం అమ్మే దుకాణం పెద్దపులల్లే ఇరవై గజాలతోక పెంచుకొని ఆ తోకచివ్వర నేను. నాలుగు రోజులు ఈ తోక చివరితనం పొందలేక పొందలేక విసిగి చివరికి యింటికి వచ్చాను. ఒక ముసలిది నామీద దయపుట్టి తనకు వచ్చిన బియ్యంలో సగం నాకు రెట్టింపు ధరకు అమ్మింది. ఆ బియ్యం తీసుకొని వచ్చి వండి పిల్లలకు పెడ్దామంటే అవి గొడ్లు తినాలిగాని మనుష్యులు తినరు. నాలుగు పోట్లు వేసి చెరిగేతేనే గాని వండటానికి పనికిరావు. దంచాలి అంటే నాలుగురోజులు తిండిలేని మా యింటిదానికీ ఓపికలేదు, నాకూ లేదు. అయినా పిల్లల స్థితి చూడలేక మా యింటిది ఆ బియ్యం చిరిగిన చీర కొంగున కట్టుకొని పది కొంపలు తిరిగింది. ఒకళ్లు విసిరికొట్టారు, మరి ఒకళ్లు - వాళ్ల యింట్లో నోమట. అట్లకోసం పిండి దంచుకొంటున్నారు. అన్ని యిళ్లూ ఇట్లాగే అయినవి. చివరికా బియ్యమే పొయ్యి రాళ్లమీద పెట్టింది మా యింటిది, పొయ్యి క్రింద మంట లేదు. ఒకాయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెను గాడిదలూ, కుక్కలూ, పందులూ విరగ తొక్కినవి. కంచెపుల్లలు ఇటు అటు పడి ఉన్నవి, అవి యెవరికీ పనికిరావు. అవి నేను ఏరితెస్తూంటే ఒకాయన ‘‘ఎవడి అమ్మా మొగుడి సొమ్మనుకొన్నావు’’ అనివచ్చి నన్ను కర్రతో విరగకొట్టాడు. ఇంటికి వచ్చాను, ఇల్లంటే నవ్వు వస్తోంది. ఎవరిదో పడిపోయిన గోడ ఉంటే ఆ స్థలంలో యెవళ్లూ కాపురానికి లేరు. ఆ గోడక్రింద ఉంటున్నాం, అదేయిల్లు, పైన పుల్లాపుడకా పెట్టి తలలు మాత్రం దానిక్రింద పెట్టి నిద్రపోయేటట్లుగా మా యింటికి ఆధారం చేసింది. నేను వెళ్లేటప్పటికి ఆ ఆధారం తీసి దానితో మంట వేస్తోంది. ఈ ఆధారం ఎక్కువా? పిల్లల కడుపు మంట యెక్కువా? మరునాడు మా పిల్లల స్థితి చూడ కడుపులో నొప్పితో మెలి తిరిగిపోయినారు. నాలుగు వాము పరకలు తెద్దామంటే చేతిలో ఉన్న నాలుగణాలు నిన్నటి ముసలమ్మే కాజేసింది. మళ్లీ తర్వాత నాలుగురోజుల వరకు బియ్యం లేవు, పిల్లల కడుపునొప్పులూ తగ్గలేదు. మా యింటిది లేవనే లేకపోయింది. నేనట్టాగే తిరుగుతున్నాను. ఆ రోజున మధ్యాహ్నం జనం గుంపులుగా వెళుతున్నారు. నేను వాళ్లెక్కడికి వెళుతున్నారని అడిగాను. అందరికీ బియ్యం ఇస్తారట అని చెప్పారు. నేను వాళ్ల వెంట వెళ్లాను, వాళ్లు వందా రెండువందలమంది ఉన్నారు. జనం ఒకచోటికి వెళ్లారు. జనం కేకలూ బొబ్బలూ నానా హంగామా ఉంది. ఒక యింటి దగ్గర ఆగారు. ముందర యేమి జరుగుతోందో నాకు తెలియదు. నేను వెనక ఉన్నాను. బియ్యం కోసం త్రొక్కిళ్లాడుతున్నారనుకొన్నాను. చుట్టుప్రక్కల యిళ్లవాళ్లందరూ కొందరు, తలుపులు వేసికొన్న వాళ్లు కొందరు తొంగిచూచేవాళ్లుగా కన్పించారు. కొంతసేపటికి రక్షకభటులు వచ్చారు. నేననుకొన్నాగదా ‘అమ్మయ్యా వీళ్లువచ్చారుగదా అందరికీ సరిగ్గా పంచిపెట్టిస్తారు’ అని. క్రమక్రమంగా నాకు తెలిసింది ఈ గుంపుకీ ఆ రక్షకభటులకీ దెబ్బలాట జరుగుతోందని. ఇంతలో రక్షకభటులు తుపాకులు కాల్చారు. ఈ గుంపులోంచి రక్షకభటుల మీద రాళ్లు విసురుతున్నారు. వ్యవహారం యెప్పుడైతే ముదిరిందో నాకెందుకురా బాబూ ఇది పోదామనుకొన్నాను. కాని పోవటమెట్లా? ఆట వరకు నెల్లాళ్లబట్టి తిండి లేదు. వారానికొకసారి యేదో తినీతిననట్టు తిన్నా నా ఒంట్లో ఓపిక లేదు. మనిషిని మరీ అబ్బనా కొరివి రాదు గనుక మనుష్యాకృతిలో లోపం లేదు. రక్షకభటులలో కొందరికి దెబ్బలు తగిలినవి. ఒకడు రాయి కణతకు తగిలి చచ్చాడు, ఆ రాయి ఆ చుట్టుప్రక్కలవాడెవడు విసిరాడో నాకు తెలియదు. పైగా చంపడంలో యిన్ని భేదాలేమిటి? రాయి తగిలితే చచ్చి, తుపాకీ గుండు తగిలితే బ్రతుకుతాడా? తుపాకీ గుండు తగిలిస్తే శిక్ష లేదూ! రాయి తగిలి చస్తే శిక్ష? ఆ కళ్లులేని దేవుడు ఆ రాయి నేనే విసిరానన్నాడు. రాయి విసరటం మాట అట్లా ఉంచండి. నేను చేయి యెత్తగలిగితే చాలు! ఆ స్థితిలో ఉన్నాను. రక్షకభటులు తరిమారు. అందరూ పారిపోతున్నారు. నేనూ పారిపోతున్నాను. పరిగెత్తేందుకు నాకు ఓపిక యేది? వెనక నుంచి నా నెత్తిమీద పెద్ద దెబ్బపడ్డట్టుగా మాత్రమే నాకు తెలుసు. ఒక రాత్రివేళ నాకు మెలకువ వచ్చింది. గాఢాంధకారంలో కూర్చొని ఉన్నా, మరునాటి ప్రొద్దుటికి తెలిసింది నాకు అది ఖైదని. ఒకటి రెండు పూటలైన తర్వాత నాకన్నం పెట్టారు. అన్నం చూస్తే నా ప్రాణాలు లేచి వచ్చినవి. వెంటనే పిల్లలు జ్ఞాపకం వచ్చారు. వాళ్లకు పెడదామని అన్నం అట్టే పెట్టాను. మరునాటికి తెలిసింది యింక వాళ్లు నా దగ్గరకు రారని. వాళ్లేమైనారో! ఏమైనారో యెవడికి కావాలి? పూటపూటా అన్నం తినటం నాకూ అలవాటైంది. నా పని రాజభోగంగా ఉంది. రెండు పూటలా తిండి. ఎక్కడికైనా తీసుకొనివెళితే మోటారు కారులో తీసుకొనివెళ్లారు. పెద్దకోర్టుల్లో కూడ నా కోసం ఒక ప్రత్యేక స్థానం చివరి రోజుల్లో నాకు దశయెత్తుకొంది. ఆ పాడుదేవుడు ఈ మాత్రంగా ఆ వెనుక కూడా సాగిస్తే యెంతబాగుండేది. ఇంతకన్న యేమిచెప్పను? నాకు ఇంత ఉపకారం చేసిన మీరు వెయ్యేళ్లు బ్రతకండి. బ్రతుకంతా తిండిలేక చచ్చిన నాకు రెండు నెలలు సుఖంగా తిండిపెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. కాని నా యింటిదీ, పిల్లలు ఏమైనారో తెలియలేదు, నాకు ఒక్కటే చింతగా ఉంది - నా పిల్లలు కొంచెం పెద్దవాళ్లు అయితే, ఎలాగోలాగా పెద్దవాళ్లు అయితే చివరిరోజుల్లో వాళ్లకుగూడా నాకు పట్టిన యోగం పడుతుందా అని. అదంతా మీ దయ, వాళ్లని వెదికించి యీ ఉపకారం చేయిస్తే మీ కడుపున పుడ్తాను. చివరికా బియ్యమే రాళ్ల పొయ్యి మీద పెట్టింది మా యింటిది, పొయ్యి కింద మంట లేదు. ఒకాయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెను గాడిదలూ, కుక్కలూ, పందులూ విరగ తొక్కినవి. కంచె పుల్లలు ఇటు అటు పడి ఉన్నవి, అవి యెవరికీ పనికిరావు. అవి నేను ఏరి తెస్తూంటే ఒకాయన ‘‘ఎవడి అమ్మ మొగుడి సొమ్మనుకొన్నావు’’ అని వచ్చి నన్ను కర్రతో విరగకొట్టాడు. - కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ -
కిటికీలోంచి టేకాఫ్!
కేవలం రాబర్ట్, రెపోలే కాదు... ఆ రోజు ప్రమాదంలో చనిపోయినవారిలో మరికొందరి ఆత్మలు కూడా ఆ విమానంలో సంచరించేవట. ముఖ్యంగా ఓ మధ్య వయస్కుడు, ఓ యువతి ఎక్కువగా కనిపించేవారట. తెల్లని గౌను వేసుకుని, జుట్టు విరబోసుకుని ఉన్న ఆ యువతిని చూసి కొందరు జడుసుకోవడం కూడా జరిగిందని చెబుతారు. ఆమె ఎప్పుడూ ఒకే సీట్లో కూర్చుని మౌనంగా ఏడుస్తూ ఉండేదట. మధ్య వయస్కుడు అయితే దేని కోసమో వెతుకుతూ ఉండేవాడట. ఇవన్నీ భ్రమలు అని కొందరు కొట్టి పారేశారు కానీ... అవన్నీ నిజమేనని కొందరు విమాన సిబ్బంది కూడా చెప్పడంతో నమ్మక తప్పలేదు! ఫ్లారిడా (అమెరికా)లోని మయామీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లండన్ వెళ్లాల్సిన విమానం రన్‌వే మీద ఆగివుంది. ప్రయాణికులంతా ఒక్కొక్కరుగా వచ్చి తమ సీట్లలో కూర్చుంటున్నారు. వారికి సహాయపడుతూ ఎయిర్ హోస్టెస్ అటూ ఇటూ తిరుగుతోంది. అంతలో... ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ... ఓసారి ఇలా వస్తారా?’’... అరిచినట్టే వినిపించిందో స్వరం. అటువైపు చూసింది Air Hostes. ఓ లావుపాటి స్త్రీ, చేతిలో హ్యాండ్బాగ్తో నిలబడి ఉంది. ముఖంలో విసుగు, కళ్లలో కాస్త కోపం. ఏమయ్యిందోననుకుంటూ కంగారుగా అటు వెళ్లింది హోస్టెస్. ‘‘చెప్పండి మేడమ్... ఏం కావాలి?’’ అంది అనునయంగా.‘‘నా సీటు కావాలి. ఆ విండో సీట్ నాది. వెళ్లి కూచుందామంటే ఇతడు అడ్డుగా ఉన్నాడు. లేవమంటే లేవడు. ఎన్నిసార్లు అడిగినా కదలడం లేదు’’... చెప్పలేనంత చిరాకు కనిపించిందామె మాటల్లో. ‘‘సారీ మేడమ్. నేను చెప్తానులెండి’’ అంటూ అటువైపు చూసింది హోస్టెస్. క్షణాల్లో ఆమె ముఖంలో రంగులు మారాయి. ‘‘ఎవరి గురించి చెప్తున్నారు మేడమ్?’’ అంది అయోమయంగా. ‘‘అరె... తమాషాగా ఉందా? ఎదురుగా ఉన్నాడుగా... కనిపించనట్టు అలా అడుగుతావేం’’ అందామె మరింత కోపంగా. బిక్కమొహం వేసింది హోస్టెస్. ‘‘సారీ మేడమ్. నాకెవరూ కనిపించడం లేదు’’ అంటూ గొణిగింది. ‘‘ఎందుకందరూ ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? వాడేమో లేవడు. నువ్వేమో ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. ఇప్పుడే నేను ఎయిర్పోర్ట్ అథారిటీస్‌కి కంప్లయింట్ చేస్తాను’’ అంటూ విసవిసా పైలట్ క్యాబిన్‌వైపు నడిచిందామె. ‘‘కెప్టెన్... కెప్టెన్’’ అంటూ కేకపెట్టింది. వెంటనే కెప్టెన్ వచ్చాడు. ‘‘ఏంటి మేడమ్... ఏం జరిగింది?’’ అన్నాడు కంగారుగా.సీట్లో కూర్చున్న వ్యక్తితో పాటు ఎయిర్ హోస్టెస్‌ని కూడా కలిపి తిట్టడం మొదలుపెట్టిందామె. ఏమిటన్నట్లు హోస్టెస్ వైపు చూశాడు కెప్టెన్. ‘‘నా తప్పేమీ లేదు సర్. ఎవరో కూర్చున్నారని అంటున్నారు. నాకక్కడ ఎవరూ కనిపించలేదు. అలా అంటే ఆవిడకి కోపమొచ్చేస్తోంది.’’ హోస్టెస్ మాట వినగానే కెప్టెన్ కనుబొమలు పైకి లేచాయి. భృకుటి ముడిపడింది. క్షణం తర్వాత అన్నాడు. ‘‘సారీ మేడమ్. మీరు వెళ్లి కూచోండి. ఈపాటికి అతడు వెళ్లిపోయి ఉంటాడు’’ అన్నాడు కూల్‌గా. ‘‘వెళ్లిపోయాడా... చూడకుండా ఎలా చెప్పేస్తున్నారు?’’ ‘‘చూడక్కర్లేదు. నాకు తెలుసు. కచ్చితంగా వెళ్లిపోయి ఉంటాడు. మీరు వెళ్లి కూచోండి’’ అని హోస్టెస్ వైపు తిరిగి తీసుకెళ్లమన్నట్టుగా సైగ చేశాడు. సరేనని హోస్టెస్ కదిలింది. సదరు ప్రయాణికురాలు కూడా వెంటే నడిచింది. సీటు దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడెవరూ లేరు. ఆమె తన సీట్లో కూచుంది. హోస్టెస్ తిరిగి కెప్టెన్ దగ్గరకు వచ్చింది. ‘‘నా మాట నిజం సర్. అక్కడెవరూ లేరు’’ అంది సంజాయిషీ ఇస్తున్నట్టుగా. ‘‘లేదు షీబా. ఉన్నారు. నీకు కనిపించలేదు, ఆమెకు కనిపించారు... అంతే తేడా.’’ ఉలిక్కిపడిందామె. ‘‘ఏమంటున్నారు సర్? తనకు కనిపించి నాకెందుకు కనిపించరు?’’ ‘‘ఆత్మలు అంతే... అందరికీ కనిపించవు. వెళ్లి పని చూసుకో’’ అనేసి వెళ్లిపోతున్న కెప్టెన్ వైపు కొయ్యబారిపోయి చూస్తూండిపోయింది హోస్టెస్. ఆత్మా? విమానంలో ఆత్మ ఉందా? ఎవరి ఆత్మ? ఇక్కడెందుకుంది? అంత కూల్‌గా మాట్లాడుతున్నారంటే ఈ విషయం కెప్టెన్‌కి తెలుసా? ఆయన కూడా దాన్ని చూశారా? చూసి కూడా ఏమీ చేయకుండా అలా ఎలా వదిలేశారు? ఆ ఆత్మ వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే? ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోయింది హోస్టెస్. భయంతో చెమటలు పోశాయి. ఓసారి విమానమంతా పరికించింది. అందరూ ఎవరి సీట్లలో వారు కూర్చు న్నారు. ప్రశాంతంగా ఉన్నారు. కానీ తను మాత్రమే ఇలా భయంతో వణుకుతోంది. షీబా ఆ రోజే తొలిసారి విధుల్ని నిర్వహిస్తోంది. అందుకే ఆమెను ఆ విషయం భయపెడుతోంది. కానీ రెగ్యులర్‌గా ఆ విమానంలో వెళ్లేవారికి ఇలాంటి అనుభవాలు మామూలే. ఆ సంగతి ముందే తెలిసివుంటే పాపం అంత కంగారు పడేది కాదేమో. ఇంతకీ ఎవరిదా ఆత్మ? 1972, డిసెంబర్ 29... న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం. సమయం తొమ్మిదీ ఇరవై అయ్యింది.‘ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్ - 401’ మెల్లగా గాల్లోకి లేచింది. 163 మంది ప్రయాణీకులు, పదమూడు మంది సిబ్బందితో బయలుదేరింది. కెప్టెన్ రాబర్ట్ లోఫ్ (55) ఓసారి విమానమంతా పరిశీలించి చూసుకున్నాడు. ప్రయాణికులంతా సౌకర్యంగా, ప్రశాంతంగా ఉండటంతో క్యాబిన్లోకి వెళ్లిపోయాడు. రాత్రి 11.32 అవుతుండగా విమానం ఫ్లారిడాలోని మయామీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువయ్యింది. అక్కడ దిగాల్సినవాళ్లు సమాయత్తమవుతున్నారు. మరికొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ అయ్యేదే. కానీ అంతలోనే ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. విమానాన్ని కిందికి దించేందుకు తోడ్పడే ల్యాండింగ్ గేర్ సిస్టమ్ పని చేయడం మానేసింది. పెలైట్ కంగారు పడ్డాడు. ఇంజినీర్ డోనాల్డ్ రెపోని పిలిచాడు. ‘‘ఏం జరిగింది?’’ అన్నాడు రెపో కంగారుగా. ‘‘ల్యాండింగ్ గేర్ సిస్టమ్ పని చేయడం లేదు’’ రెపోతో పాటు కెప్టెన్ రాబర్ట్ లోఫ్ కూడా ఉలిక్కిపడ్డాడు. ఏదో ఒకటి చెయ్యమన్నట్టుగా రెపో వైపు చూశాడు రాబర్ట్. రెపో వేగంగా కదిలాడు. చకచకా ల్యాండింగ్ గేర్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. కానీ ఫలితం లేకపోయింది. అతడా పని చేసేలోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. విమానం క్రాష్ అయ్యింది. 99 మంది ప్రాణాలు అక్కడికక్కడే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. రాబర్ట్, రెపోలు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాబర్ట్ మరణించాడు. మరునాడు రెపో కన్నుమూశాడు. అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటిగా ఈ సంఘటన నిలిచిపోయింది. దాన్ని మర్చిపోవడానికి అందరికీ కొన్ని నెలలు పట్టింది. విమాన ప్రమాదానికి కారణాలను అన్వేషించారు అధికారులు. బ్లాక్‌బాక్స్ రికార్డింగులను బట్టి ల్యాండింగ్ గేర్ సిస్టమ్ పనిచేయకపోవడమే అసలు కారణమని తెలిసింది. విమానం బాగా ధ్వంసమైనా... కొన్ని పరికరాలకు మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు. దాంతో వాటిని తీసి మరో విమాన తయారీలో వాడారు. అలా చేయడం వల్ల ముందు ముందు ఏం జరుగుతుందో అప్పుడు వారు ఊహించలేకపోయారు. కూలిపోయిన విమాన పరికరాలను అమర్చిన ‘ఎల్-1011’ విమానంలో ఊహించని సంఘటనలు జరగడం మొదలైంది. చాలాసార్లు పెలైట్ క్యాబిన్లో కెప్టెన్ రాబర్ట్ కనిపించేవాడు. చాలామంది పెలైట్లు ఆయన్ని చూసి భయపడ్డారు. విచిత్రమేమిటంటే ఆయన వాళ్లు చూస్తుండగానే మాయమయ్యేవాడు. రెపో కూడా విమానంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. వీళ్లిద్దరూ ఒక్కోసారి ప్రయాణికుల సీట్లలో కూర్చుని ఉండేవారు. వాళ్లు మనుషులని అంతా అనుకునేవారు. కానీ అంతలోనే మాయమైపోతుంటే కంగారు పడేవారు. ఓసారైతే విమానంలో చిన్న సమస్య తలెత్తింది. అసిస్టెంట్ ఇంజినీర్ దాన్ని బాగు చేసేందుకు తంటాలు పడుతున్నాడు. అంతలో ఓ వ్యక్తి వచ్చాడు. తాను చీఫ్ ఇంజినీర్‌నని చెప్పాడు. ఎలా బాగు చేయాలో తెలియడం లేదంటూ బిక్కమొహం వేసిన అసిస్టెంట్ ఇంజినీర్కి ధైర్యం చెప్పి, దాన్ని అతడే బాగు చేశాడు. తర్వాత కనిపించకుండా పోయాడు. అసిస్టెంట్ ఇంజినీర్ ఎంత వెతికినా అతడు కనిపించలేదు. దాంతో అధికారులకు ఆ విషయాన్ని తెలియజేశాడు. అతడెలా ఉన్నాడని వాళ్లు అడిగితే గుర్తులు చెప్పాడు. అప్పటికే జరుగుతున్న సంఘటనల్ని పరిశీలిస్తున్న అధికారులు ఆ ఇంజినీర్కి రెపో ఫొటోని చూపించారు. తాను చూసింది అతడినే అన్నాడతడు. దాంతో రెపోనే వచ్చి రిపేర్ చేశాడని అర్థమైంది అధికారులకి. వచ్చింది మనిషి కాదు, ఆత్మ అని తెలిసిన అసిస్టెంట్ ఇంజినీర్ హడలి పోయాడు. ఇలాంటి విచిత్రమైన సంఘటనలు చాలానే జరిగాయి. కొందరు ఆ విమానం ఎక్కడానికి కూడా భయపడే పరిస్థితి తలెత్తింది. అయితే... రాబర్ట్, రెపోలు ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. వచ్చి ఎక్కడో చోట కూర్చునేవారు. తర్వాత మాయమైపోయేవారు. అయితే అప్పుడప్పుడూ కొందరితో మాట్లాడేవారు. ‘‘మీరు కంగారుపడవద్దు. విమానానికి ఏమీ కాదు. మేము ఇక ఏ విమానాన్నీ కూలనివ్వం’’ అంటూ రాబర్ట్ కొందరితో చెప్పేవాడు. రెపో అయితే విమానంలో సమస్య తలెత్తినప్పుడు తప్పక వచ్చేసేవాడు. ఓసారయితే... ఇండికేటర్లో చిన్న సమస్య తలెత్తడాన్ని పైలట్ గమనించాడు. ఇంజినీర్‌తో ఆ విషయం చెప్పాడు. అతడు దాన్ని బాగుచేసేలోపే అది దానంతటదే బాగైపోయింది. దాంతో ఇంజినీర్ ఆశ్చర్యపోయాడు. కానీ అప్పటికే కొన్నేళ్లుగా పనిచేస్తోన్న పైలట్... అది రెపో పనేనని అర్థం చేసుకున్నాడు. రాబర్ట్, రెపోల వల్ల ఏ చెడూ జరగకపోయినా... ఆత్మలు కనిపించడమనేది జనాన్ని భయపెట్టే విషయమే కాబట్టి అధికారులు దాని గురించి తీవ్రంగా ఆలోచించారు. కూలిన విమాన భాగాలను అమర్చడం వల్లే ఇదంతా జరుగుతోందని అర్థం చేసుకుని వాటిని తొలగించి, కొత్త భాగాలను వేశారు. ఆ తరువాత రాబర్ట్, రెపోలు మళ్లీ కనిపించలేదు! - సమీర నేలపూడి