గనులను మింగిన ఆత్మలు! | Illegal mining at guntur district dachepalli | Sakshi
Sakshi News home page

గనులను మింగిన ఆత్మలు!

Published Sat, Aug 4 2018 2:50 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Illegal mining at guntur district dachepalli - Sakshi

మైనింగ్‌ అధికారులు నోటీసులు జారీచేసిన స్వామి రామకోటయ్య 1998లో మృతి చెందినట్లు గ్రామ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం

సాక్షి, గుంటూరు: దశాబ్దాల క్రితమే చనిపోయిన వారి ఆత్మలు తెల్లరాయి గనులను అక్రమంగా తవ్వేస్తూ కోట్లాది రూపాయలు దోచుకున్నాయట! ఆత్మలు అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన స్వామి రామకోటయ్య అనే వ్యక్తి 2013లో అక్రమంగా గనులు తవ్వేశాడని, జరిమానా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్‌ అధికారులు ఆయన పేరుతో నోటీసు ఇచ్చారు.

నిజానికి రామకోటయ్య 1998లోనే కన్ను మూశాడు. తన 20 ఏళ్ల కిందటే తండ్రి చనిపోయాడని, 2013లో అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావు నెత్తీనోరూ బాదుకున్నా అధికారులు లెక్కచేయలేదు. ఆయనకు నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో అసలు దోషులను క్షేమంగా పక్కకు తప్పించి, అమాయకులను బలిపశువులను చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పకడ్బందీగా ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే కేసానుపల్లిలో పలువురికి మైనింగ్, విజిలెన్స్‌ అధికారులు నోటీసులిచ్చారు. రూ.1.55 కోట్ల జరిమానా చెల్లించాలని ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చారు. దాచేపల్లికి చెందిన మరో ఐదుగురికి నోటీసులు అందాయి. విలువైన గనులను పట్టపగలే అడ్డంగా దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, దాంతో ఎలాంటి సంబంధంలేని తమకు నోటీసులు జారీ చేయడం ఏమిటని బాధితులు మండిపడుతున్నారు.

సర్వే పేరిట అధికారుల హడావుడి
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి గ్రామాల పరిధిలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియాపై హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రూ.వందల కోట్ల విలువైన ఖనిజ సంపదను అక్రమంగా దోచేస్తూ, ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టడంపై న్యాయస్థానం మండిపడింది. దీంతో హైకోర్టుకు సమాధానం చెప్పుకోవడానికి ఆయా ప్రాంతాల్లో అధికారులు మూడు రోజులపాటు సర్వే పేరిట హడావుడి చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి, అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని అమాయకుల మెడకు చుట్టేందుకే నోటీసులు జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించడానికేనా?
దాచేపల్లి పట్టణంతోపాటు కేసానుపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు 2013 నుంచి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, పెనాల్టీ చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మైనింగ్‌ అంటే ఏమిటో కూడా తెలియని తమకు నోటీసులు అందడంతో భయాందోళనకు గురయ్యారు. నోటీసుల్లో పేర్కొన్న సర్వే నంబర్లలో తమ పేర్లు ఏమైనా ఉన్నాయా అనే దానిపై మీ–సేవా కేంద్రాల్లో ఆరా తీశారు. ఎక్కడా తమ పేర్లు లేనట్లుగా గుర్తించి ఈసీలు తీసుకున్నారు.

కేసానుపల్లికి చెందిన స్వామి రామకోటయ్య సర్వే నంబరు 336/6లో 16 సెంట్ల విస్తీర్ణంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడి, మొజాయిక్‌ చిప్స్‌ 5,834 మెట్రిక్‌ టన్నులు దోచుకున్నాడని, దాని విలువకు పది రెట్లు పెనాల్టీ వేసి మొత్తం రూ.28.23 లక్షలు చెల్లించాలంటూ 2013 ఆగస్టు 16 తేదీతో ఉన్న నోటీసును అధికారులు జారీ చేశారు. ఈ నోటీసును రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావుకు అందించారు. 1998లో తన తండ్రి రామకోటయ్య చనిపోయినట్లుగా పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రామలింగేశ్వరరావు చూపినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. నోటీసు తీసుకోకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు.

అదే గ్రామానికి చెందిన గుదె పేరయ్య సర్వే నంబరు 244లో 66 సెంట్ల విస్తీర్ణంలో 2015లో అక్రమ మైనింగ్‌కు పాల్పడి 32 వేల మెట్రిక్‌ టన్నుల మొజాయిక్‌ చిప్స్‌ను అక్రమంగా దోచేశాడని, పెనాల్టీ రూ.1.56 కోట్లు చెల్లించాలని 2017 మే 19 తేదీతో నోటీసు ఇచ్చారు. వ్యవసాయం చేసుకునే తాను అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని పేరయ్య ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అలాగే మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చారు.

సదరు సర్వే నంబర్లలో మైనింగ్‌ జరిగిన దాఖలాలు లేవని, ఆ ప్రాంతంలో ఎస్టీ కాలనీ ఉందని చెబుతున్నారు. సర్వే నంబరు 244 సమీపంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న అక్రమ క్వారీ ఉంది. మైనింగ్‌ మాఫియాను వదిలిపెట్టి, అమాయకులకు నోటీసులు జారీ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులపాటు సర్వే నిర్వహించిన మైనింగ్‌ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించేందుకే అమాయకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


చనిపోయిన తర్వాత గనులు తవ్వుతారా? 
‘‘మా నాన్న స్వామి రామకోటయ్య 1998లో మరణించారు. సర్వేనంబర్‌ 336/6లో ఉన్న 16 సెంట్లలో మా నాన్న అక్రమంగా గనులు తవ్వారని, రూ.28,23,843 జరిమానా చెల్లించాలని అధికారులు నోటిసు ఇచ్చారు. ఈ నోటీసు 2013 ఆగస్టు 16న జారీ అయినట్లు ఉంది. మా నాన్న చనిపోయిన 20 ఏళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారో అర్థం కావట్లేదు.     
– స్వామి రామలింగేశ్వరరావు, కేసానుపల్లి

అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు
‘‘అధికారులు 3 రోజుల క్రితం ఇంటికి వచ్చి మా నాన్న పేరయ్య పేరిట నోటీసులిచ్చారు. సర్వే నంబర్‌ 244లో ఉన్న 66 సెంట్ల స్థలంలో అక్రమంగా మైనింగ్‌ చేసినందుకు రూ.1.55 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. ఆ సర్వే నంబర్‌లో మాకు సెంటు స్థలం కూడా లేదు. గనుల కేసులో అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు’’
– గుదె అనంతరామయ్య, కేసానుపల్లి

చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం
‘‘కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల ఆధారంగా పెనాల్టీలు చెల్లించాలని నోటీసులు పంపాం. 2013, 2017లో కేసులు నమోదు కావడంతో ఆ తేదీలతోనే నోటీసులు ఇచ్చాం.  ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్‌ కేసు విచారణకు, ఈ నోటీసులకు సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం’’  
– పాపారావు, మైనింగ్‌ డీడీ, ఇన్‌చార్జి విజిలెన్స్‌ ఏడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement