
సాక్షి, గుంటూరు : దాచేపల్లిలో టీడీపీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శనివారం పార్టీ ఆఫీసు ఎదుట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దిష్టి బొమ్మను దహనం చేశారు. సీఎస్ కేంద్రానికి ఏజెంట్‌గా పని చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేత, రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనకు దిగారు.
కాగా తిరుమల శ్రీవారి బంగారం విషయంలో జరిగిన అవకతవకలు, కోడ్ అమల్లో ఉండగానే సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించడం తదితర విషయాలు ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఇక అప్పటి నుంచి సీఎస్ లక్ష్యంగా టీడీపీ నేతలు, మంత్రులు విమర్శలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలోని రూ. లక్షల కోట్ల అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.