నేనేం పాపం చేశాను? | She alert | Sakshi
Sakshi News home page

నేనేం పాపం చేశాను?

Published Tue, Apr 7 2015 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

నేనేం పాపం చేశాను?

నేనేం పాపం చేశాను?

షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!
 
సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  
 సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...
 
‘ఆకలిగా ఉందమ్మా... కాస్త తినడానికి ఏమైనా పెడతావా?’... అలా అడుగుతున్నప్పుడు నా అణు వణువూ సిగ్గుతో చితికిపోయింది. నా గుండె బాధగా మూలిగింది. అడగకూడదని నా గొంతును చాలా సేపు నొక్కిపెట్టాను. కానీ ఆకలితో మెలికలు పడుతోన్న పేగుల ఆర్తనాదాల్ని భరించలేక పెదవి విప్పాను.

రెండు క్షణాల్లో నా చేతుల్లో ఒక గిన్నె ఉంది. దాన్నిండా అన్నం ఉంది. పప్పు, ఏదో కూర, పచ్చడి... అదేమీ విందు కాదు. కానీ నా పాలిట అమృతంలా తోచింది. ఆబగా ముద్ద కలిపాను. ఆతృతగా నోటిలో పెట్టుకోబోయాను. కానీ నావల్ల కాలేదు. దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది. ముద్ద మింగే శక్తి లేదనిపిస్తోంది. చేతిలోని గిన్నెను కింద పెట్టేశాను. చీరచెంగును చేతిలోకి తీసుకుని కళ్లొత్తుకున్నాను. కానీ ఆ తడి ఆరుతుందా? గుండెల్లోంచి పొంగుకొచ్చిన దుఃఖమది. చీరకొంగుతో తుడిపేస్తే తొలగిపోతుందా?

‘ఏమైందమ్మా... తినండి’ అందా అమ్మాయి. తల ఎత్తి తన కళ్లలోకి చూశాను. ఎవరో తెలియదు. ఎప్పుడూ చూసింది కూడా లేదు. తన ఇంటి అరుగు మీద కూర్చుంటే పలకరించింది. ఆకలి అనగానే అన్నం పెట్టింది. తినమని బతిమాలుతోంది. ముక్కూ ముఖం తెలియని నా మీద ఎందుకంత జాలి? జాలి, దయ, మంచితనం అన్న మాటలు ఈ లోకం నుంచి ఎప్పుడో వెళ్లిపోయాయి అనుకున్నాను. కానీ నా ఆలోచన తప్పు అని నిరూపించడానికే వచ్చినట్టుంది తను. ‘తినండి’ అంది మళ్లీ ఎంతో అనునయంగా. వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాను. తినలేను. ఒక్క ముద్ద కూడా తినలేను. కడుపు ఆకలితో కాలిపో తున్నా.. మనసులోని మంట ముద్ద ముట్ట నివ్వదు నన్ను.  
 లేచి నడకందుకున్నాను. వార్ధక్యం తరు ముకొస్తుంటే, ఒంట్లో సత్తువ పారిపో తుంది కదా! అందుకే కాళ్లు వణుకుతున్నాయి. అడుగులు తడబడుతున్నాయి. శక్తిని కూడదీసుకుని పాదాలను కదుపు తున్నాను.

ప్రాణమున్న బొమ్మలా, గమ్యం తెలియని నావలా ముందుకు సాగుతున్నాను. పగలు తన ఉనికిని కోల్పోతోంది. రాత్రి తనను తాను పరిచయం చేసుకోవడానికి తొందరపడుతోంది. ఆ దృశ్యం చూస్తుంటే ముగింపు దశకు చేరుకున్న నా జీవితానికి ఓ ఉదాహరణలా అనిపిస్తోంది. నా అస్తమయం ఆసన్నమైందని నాకు గుర్తు చేస్తున్నట్టుగా తోస్తోంది. నేను ఇలా అస్తమించబోతున్నానా? నా బతుకును ఇలా ముగించబోతున్నానా? దీనంగా, హీనంగా, దిక్కు లేకుండా, కాటికి మోసుకెళ్లేందుకు, చితికి నిప్పు పెట్టేందుకు నా అన్న మనిషే లేకుండా... నడి రోడ్డుమీద, నడి నిశీధిలోన నేను కన్నుమూస్తానా?!

ఆ ఆలోచనే నన్ను వణికిస్తోంది. నేనేం పాపం చేశాను? నాకెందుకిలాంటి ముగింపు? పేద ఇంట్లో ఆడపిల్లగా పుట్టాను. చదువుకు నోచుకోలేదు. నిండా పదహారేళ్లు కూడా నిండకుండానే తాళికి తల వంచకా తప్పలేదు. పెళ్లికి అర్థం పూర్తిగా తెలియకుండానే ఒక మనిషికి అర్ధాంగినయ్యాను. మధ్య తరగతి మనిషికి భార్యగా బాధ్యతల బరువులు మోశాను. తాగి వచ్చి కొడితే తట్టుకున్నాను. వాగి మనసును ముల్లులా పొడుస్తుంటే ఓర్చుకున్నాను. భార్యాభర్తల బంధమంటే తనువుల్ని పెనవేసేదే తప్ప మనసుల్ని ముడివేసేది కాదని అనుకునే ఓ కర్కశుడైన భర్తతో గుట్టుగా కాపురం చేశాను. ఆనందం లేకపోయినా సౌభాగ్యం ఉంటే చాలని సర్దుకుపోయాను. కానీ అది కూడా అత్యాశ అనుకున్నాడో ఏమో... ఆ దేవుడు ఆయన్ని రోడ్డు ప్రమాదంలో తీసుకుపోయాడు. అక్కడితో నా జీవితం ముగిసిపోయినట్టే అనుకున్నాను. కానీ అది ముగింపు కాదు, మొదలు అని కడుపులో పేగు కదిలినప్పుడుగానీ నాకు తెలియలేదు.

నా భర్త చనిపోయేనాటికి నాకు మూడో నెల. ఓ బంధం తెగిపోయినందుకు పడిన బాధ, కొత్తగా ఏర్పడిన బంధం కలిగించిన సంతోషం ముందు తేలిపోయింది. నా బిడ్డ ఈ లోకంలో అడుగుపెట్టిన క్షణం.. నేను మళ్లీ కొత్తగా జన్మించాను. వాడి బుడి బుడి అడుగులతో పాటు నేనూ ముందుకు సాగడం నేర్చుకున్నాడు. వాడిని పెంచడంలో నా వయసును, బతుకును కొవ్వొత్తిలా కరిగించాను. కావలసినన్ని కాసులు కూడ గట్టుకోగల ఉద్యోగస్తుణ్ని చేశాను. కోరుకున్న అమ్మాయినిచ్చి కళ్యాణం జరిపించాను. వాడి ఆనందంలో నా జీవితానికి అర్థాన్ని వెతుక్కున్నాను. కానీ వాడు మాత్రం తన దారి తాను వెతుక్కున్నాడు. భార్య ప్రేమ కోసం అమ్మ ప్రేమను అలుసు చేశాడు. పెళ్లాం మాటలను నెగ్గించడం కోసం అమ్మను అన్ని విషయాల్లోనూ తగ్గించడం నేర్చుకున్నాడు. తమ జీవితాలకు నన్ను భారం అనుకున్నాడు. ఆ భారాన్ని దించేసుకోవడానికి నీఛమైన పని చేశాడు. ఓరోజు నన్ను దూరపు బంధువుల ఇంట్లో శుభకార్యానికి పంపించాడు. తిరిగి వచ్చేసరికి ఇల్లు ఖాళీ చేసి భార్యతో సహా ఎక్కడికో వెళ్లిపోయాడు. తన సెల్‌కి ఫోన్ చేశాను. ‘నీ కోడలిని కాదని నేనేం చేయలేనమ్మా’ అన్నాడు. కన్న పేగును కత్తితో కోస్తున్నట్టుగా అనిపిం చింది. సమాధానం చెప్పలేక మౌనం దాల్చాను. ఆ మౌనానికి అర్థం తెలియక ‘అర్థమైందా నేను చెప్పేది’ అన్నాడు. వాడిని కన్నదాన్ని, అడగకుండానే వాడికేం కావాలో అర్థం చేసుకున్నదాన్ని... ఇప్పుడు వాడు అడుగుతున్నదేంటో ఆమాత్రం అర్థం చేసుకోలేనా? నన్ను తనవైపు చూడవద్దంటున్నాడు. తన జ్ఞాపకా లను తుడిచేయమంటున్నాడు. తనను తలపులలోకి సైతం ఆహ్వానించవద్దంటున్నాడు. అని కాల్ కట్ చేసేశాడు. కాల్‌తో పాటు మా బంధాన్ని కూడా.

నిలువ నీడలేక పిచ్చిదానిలా తిరిగాను. ఎండకి ఎండాను. చలికి వణికాను. ఆకలితో అల్లాడాను. చేయి చాచి అన్నం అడుక్కున్నాను. కానీ అభిమానాన్ని చంపుకుని ఆ అన్నాన్ని మాత్రం తినలేకపో యాను. చివరికి నీరసించి రోడ్డు పక్కన పడిపోయాను. ఒక ఎన్జీవో వాళ్లు నన్ను తీసుకెళ్లారు. నీడ కల్పిం చారు. వేళకి అన్నం పెడుతున్నారు. వారి ఆదరణ నా అస్తమయాన్ని వాయిదా వేసింది. కానీ నా కొడుకు చేసిన ద్రోహం నాకు బతుకు మీదే విరక్తి కలిగిస్తోంది. వాడిని పెంచడం కోసం నేను ఎన్నో భారా లను మోస్తే.. వాడు నన్నే భారమనుకున్నాడు. వాడి సంతోషం కోసం నేనెన్నో వదులుకుంటే... వాడు నన్నే వదిలించుకుపోయాడు. అమ్మ ప్రేమకు విలువ ఇంతేనా? ఈ లోకంలో నాలాంటి తల్లి స్థానం ఇదేనా?!
 - సుభద్ర (గోప్యత కోసం పేరు మార్చాం)
 ప్రెజెంటేషన్: సమీర నేలపూడి
 
 
 కడుపున మోసి, కని, పెంచి పెద్ద చేసిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంతా కాదు. వయసు అయిపోతుంది. శక్తి ఉండదు. తమను తాము పోషించుకునే ఓపిక ఉండదు. దాంతో చాలా దీనమైన పరిస్థితికి చేరుకుంటారు. కొందరు పిల్లలు కనీసం పెయిడ్ హోమ్స్‌లో చేరుస్తుంటారు. కానీ అది కూడా చేయకుండా ఇలా గాలికి వదిలేయడం మాత్రం అన్యాయం. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు 125 సీఆర్‌పీసీ కింద పిల్లల మీద కేసు నమోదు చేయవచ్చు. కోర్టు ఇటువంటి కేసుల్ని సీరియస్‌గా తీసుకుంటుంది. వీలైనంత త్వరగానే తీర్పు ఇస్తుంది. తల్లిదండ్రులకు నివాస వసతి కల్పించడంతో పాటు, వారి పోషణకు అవసరమైన డబ్బు ఇవ్వమని చెబుతుంది. ఎక్కువమంది పిల్లలు ఉంటే... అందరినీ ఆ బాధ్యత పంచుకొమ్మని ఆదేశిస్తుంది. కాబట్టి సుభద్రగారు కూడా కావాలంటే తన కొడుకు మీద కేసు వేయవచ్చు. తన హక్కును సంపాదించుకోవచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement