తన నమ్మకమే నన్ను నిలబెట్టింది! | His belief saved me life, Madhu Nadan chit chat with Funday | Sakshi
Sakshi News home page

తన నమ్మకమే నన్ను నిలబెట్టింది!

Published Sun, Nov 2 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

తన నమ్మకమే నన్ను నిలబెట్టింది!

తన నమ్మకమే నన్ను నిలబెట్టింది!

సంభాషణం: ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో హీరోకి ఫ్రెండ్‌గా నటించిన వ్యక్తి గుర్తున్నాడా? ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ఆరాటపడే అమాయకమైన అబ్బాయిగా అందరినీ ఆకట్టుకున్న ఆ అబ్బాయి పేరు... మధునందన్. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలతో చాలా బిజీ అయిపోయిన నందన్... తను ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన తపన గురించి ఇలా చెప్పుకొచ్చాడు...
 
నట ప్రయాణం ఎలా మొదలైంది?
 నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. చిన్నప్పట్నుంచీ నటనంటే పిచ్చి. కానీ మా కుటుంబంలో అప్పటివరకూ ఎవరూ ఈ రంగంలోకి రాలేదు. దాంతో ఇంట్లోవాళ్లు ప్రోత్సహించేవారు కాదు. కానీ నేను పట్టువదల్లేదు. ఇంటర్ పరీక్షలు అయ్యాక తేజగారు కొత్తవాళ్లతో సినిమా తీయబోతున్నారని తెలిసి ఆడిషన్‌కి పరుగెత్తాను. లక్కీగా సెలెక్ట్ అయ్యాను. అదే... ‘నువ్వు-నేను’.
ఆ సినిమా వచ్చి చాలా యేళ్లయ్యింది. కానీ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాతేగా మీరు అందరికీ తెలిసింది?
 అవును. నేనెవరో అందరికీ తెలియడానికి పదమూడేళ్లు పట్టింది. ఇన్నేళ్లలో పది, పదిహేను సినిమాలు చేసి ఉంటానంతే.   
అవకాశాలు ఎందుకు రాలేదు?
 మొదట నాకూ తెలియలేదు కానీ తర్వాత అర్థమైంది. నేనప్పటికి చిన్నవాణ్ని. ఆ వయసు పాత్రలు సినిమాల్లో పెద్దగా ఉండవు. యూత్ సినిమాలు తేజగారు తప్ప ఎవరూ తీసేవారు కాదు. కాబట్టి మిగతా వాళ్లెవరికీ నాతో పని లేదు. మరో కారణం... నేను చదువుకుంటున్నాను. సగం సమయం దానికే కేటాయించేవాడిని. మిగతా సమయంలో ప్రయత్నాలు చేసేవాడిని. పైగా నాకు ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలిసేది కాదు. ఈ కారణాలన్నింటి వల్లా నాకు అవకాశాలు రాలేదు. అందుకే ఎంబీయే పూర్తయ్యాక యూఎస్ వెళ్లిపోయాను.
మళ్లీ ఇండియాకి ఎందుకొచ్చేశారు?
ఏవో ప్రాబ్లెమ్స్ వల్ల సెటిలైపోదామనే ఉద్దేశంతో వెళ్లానే కానీ, మనసంతా నటన చుట్టూనే తిరిగేది. ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి ఆరా తీసేవాడిని. అక్కడ నాతోవున్నవాళ్లు కూడా అనేవారు... నీకెందుకురా ఈ ఉద్యోగం, వెళ్లి నీకిష్టమైన నటననే కెరీర్‌గా ఎంచుకో అని. నా అదృష్టంకొద్దీ సాఫ్ట్‌వేర్ కూడా కుదేలైపోయింది. (నవ్వుతూ) దాంతో చక్కగా వెనక్కి వచ్చేశాను.
మళ్లీ అవకాశాలు ఎలా వచ్చాయి?
 వచ్చీ రాగానే ‘ఇష్క్’ సినిమాలో చాన్స్ వచ్చింది. అయితే అది కేవలం నితిన్‌వల్లేలెండి. ‘నువ్వు-నేను’కి నితిన్ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్. అప్పటికి నితిన్ హీరో కాలేదు. తను వాళ్ల నాన్నగారితో పాటు షూటింగ్ స్పాట్‌కి వచ్చేవాడు. అప్పుడే తనతో పరిచయం ఏర్పడింది. నాటి స్నేహం నేటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే తను ‘ఇష్క్’ చాన్స్ ఇప్పించాడు.
అంటే ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో కూడా..?
 అవును... అదీ నితినే ఇప్పించాడు. తనకి మొదట్నుంచీ నా మీద నమ్మకం. ఆ నమ్మకమే నన్ను నిలబెట్టింది. నన్ను రికమెండ్ చేస్తే ఏదో మంచి పాత్ర అయివుంటుంది అనుకున్నానే కానీ, అంత ప్రాముఖ్యత ఉన్న రోల్ అని అనుకోలేదు. సినిమా చూసిన తర్వాత చాలామంది డెరైక్టర్స్ ఫోన్ చేసి మెచ్చుకున్నారు. త్రివిక్రమ్‌గారయితే బన్నీతో చేస్తున్న సినిమాలో కావాలని నాకో పాత్ర ఇచ్చారు. నితిన్ దయో, ధైర్యమో... అంత మంచి పాత్రకు నన్ను తీసుకోవడం వల్లే నా కెరీర్, నా జీవితం మలుపు తిరిగాయి. కొత్తజంట, ప్యార్‌మే పడిపోయానే, గీతాంజలి, ఒక లైలా కోసం... వరుసగా చేస్తూనే ఉన్నాను.
ఎలాంటి రోల్స్ కోరుకుంటున్నారు?
 ఏదో ఒక జానర్‌కి ఫిక్స్ అయిపోవడం ఇష్టం లేదు. కోట శ్రీనివాసరావుగారు, ప్రకాశ్‌రాజ్, బోమన్ ఇరానీల మాదిరిగా అన్ని రకాల పాత్రలూ చేయాలి. అందుకే డిఫరెంట్ పాత్రల్ని ఎంచుకుంటున్నాను. ‘పటాస్’లో హిజ్రా, ‘చిన్నదానా నీకోసం’లో ‘గే’ పాత్రల్లో నటిస్తున్నాను.
హిజ్రా, గే పాత్రలు చేయడానికి గట్స్ కావాలి. వెంటనే ఒప్పుకున్నారా, తటపటాయించారా?
 హిజ్రా గురించి భయపడలేదు. సినిమాకి ఉపయోగపడే పాత్ర కావడంతో వెంటనే ఓకే అన్నాను. కానీ గే అనగానే కాస్త జంకాను. ఎంత నటనే అయినా ఆ ముద్ర పడుతుందేమోనని తటపటాయించాను. కానీ అది నితిన్ సినిమా. తను ఏం చేయమన్నా కళ్లు మూసుకుని చేసేస్తాను తప్ప ఏంటి, ఎందుకు అని జీవితంలో ఎప్పటికీ అడిగే ప్రసక్తే లేదు. అందుకే సరే అన్నాను. (నవ్వుతూ) అయినా పెళ్లి కాకపోతే భయపడాలి, నాకు పెళ్లై పాప కూడా ఉంది కాబట్టి ధైర్యంగా సరే అనేశాను.
మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?
 నా భార్య హసిత నాకు కొలీగ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ‘ఇష్క్’ చేశాక మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’తో నా లైఫే మారిపోయింది. అందుకే తను నన్ను ఆటపట్టిస్తూ ఉంటుంది... నేను వచ్చేవరకూ అదృష్టం నీ దగ్గరకు రాలేదు అని. నేను కూడా అది నిజమేనని ఒప్పేసుకుంటా.
     డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా?
 ‘అరుంధతి’లో సోనూ సూద్ చేసిన అఘోరా పాత్ర. ‘గీతాంజలి’లో కాస్త నెగిటివ్ టచ్ ఉన్నది చేశాను కానీ... అఘోరా మాదిరిగా పూర్తిస్థాయిలో చేయాలి.
     భవిష్యత్ ప్రణాళికలు...?
 నటన... నటన... నటన. నా ప్రణాళికలన్నీ దీని చుట్టూనే తిరుగుతాయి. కనీసం ఇంకో పది, పదిహేనేళ్ల వరకూ చేతినిండా పనితో ఉక్కిరిబిక్కిరైపోవాలి. మంచి నటుడిగా ముద్ర వేసుకోవాలి!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement