
'అమృతం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు హర్షవర్ధన్. (Harsha Vardhan) నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తాజాగా ఇతడు హీరో నితిన్‌పై అలిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 'గుండెజారి గల్లంతయ్యిందే సినిమా (Gunde Jaari Gallanthayyinde) ఈవెంట్‌లో స్టేజీపైకి వెళ్లి మాట్లాడదామనుకున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. యాంకర్ అందరి పేర్లు చదువుతోంది. హర్షవర్ధన్ అని పిలిచింది.
నన్ను పిలవలేదు
నేనే అనుకుని లేచా.. ఇంతలో బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె టకటకా స్టేజీపైకి వెళ్లి మాట్లాడాడు. ఓర్నీ.. పిలిచింది మనల్ని కాదా అనుకుని ఎవరూ చూడలేదుగా అని కూర్చున్నాను. రైటర్ అయి ఉండి నిన్ను పిలవలేదేంటి? అని పక్కనవాళ్లు అన్నారు. అంతే.. నేను హర్టయ్యాను. నన్ను పిలుస్తారేమోనని చివరిదాకా చూశాను. కానీ పిలవలేదు. బార్‌కు వెళ్లిపోదామనుకున్నాను. సినిమాలో ఒకే ఒక్క సీన్ మిగిలిపోయి ఉంది. దాన్ని ఈవెంట్ అయ్యాక షూట్ చేద్దామన్నారు. ఈ షూటింగ్‌కు కాస్త లేట్‌గా వస్తానని నితిన్ ఫోన్ చేశాడు.
సారీ చెప్తాడని వెళ్లా..
అప్పటికే బాధలో ఉన్న నేను నాకేం సంబంధం లేదు, నేనే రావట్లేదు అని చెప్పా. నితిన్ ఆశ్చర్యపోతూ.. ఏమైంది? నువ్వెళ్లకపోతే ఎలా? అని ఆరా తీశాడు. వద్దులే.. ఇప్పటికే అయింది చాలు అని దిగులుగా మాట్లాడాను. అప్పుడు నితిన్‌కు నేను స్టేజీపైకి రాలేదన్న విషయం గుర్తొచ్చి రమ్మని పిలిచాడు. నాకు సారీ చెప్తాడేమో అన్న ఆశతో వెళ్లాను. ప్రాబ్లమేంటి? అన్నాడు. నన్ను పిలవకపోవడం బాధగా అనిపించిందన్నాను. నీ పేరు పిలిచారు కదా.. అంటే హర్షవర్దన్ రాణె స్టేజీ ఎక్కాడు. దానికి నాకు ఏంటి సంబంధం? అన్నాను.
చదవండి: రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే డ్యాన్స్ చేస్తావా?: రెచ్చిపోయిన నటుడు
నీకు బాధ్యత లేదా? క్లాసు పీకిన నితిన్
యాంకర్ హర్షవర్ధన్ రాణె అని పిలవలేదు.. హర్షవర్ధన్ అని పిలిచింది. నువ్వెందుకు రాలేదు? పైగా అక్కడున్న 30 మందిలో నువ్వు రాలేదన్న విషయం గుర్తించి యాంకర్‌కు చెప్పలేదనా నీ బాధ. దీనికే షూటింగ్‌కు రాను, నాతో మాట్లాడను అంటున్నావా? పేరు పిలిచింది నేను కాదు, యాంకర్. పోనీ పిలవలేదే అనుకో.. ఇది నీ సినిమా కాదా? నీ బాధ్యత కాదా? నీ అంతటగా నువ్వు స్టేజీపైకి రావాలిగా!
నేను కదా నితిన్‌కు సారీ చెప్పాలి!
స్టేజీపై ఉన్నవాళ్లందరినీ గుర్తుపెట్టుకుని మాట్లాడటం ఎంత కష్టమో రేపు పొద్దున నువ్వు మైక్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అక్కడంతా యాంత్రికంగా ఉంటుంది అని చెప్పుకుంటూ పోయాడు. విషయం అర్థమైంది. నేను కదా నితిన్‌కు సారీ చెప్పాలి అనిపించింది. ఇంత తప్పు చేశానేంటనుకున్నాను. ఈ విషయంలో నన్ను నేను ఈ రోజుకూ క్షమించుకోలేను. నితిన్ ఇదంతా ఎప్పుడో మర్చిపోయి ఉండొచ్చు' అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు. ఈయన చివరగా కోర్ట్ సినిమాలో న్యాయవాదిగా నటించాడు.