madhu nandan
-
కొత్త కథలైతే విజయం ఖాయం
‘‘తాగితే తందానా’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రనిర్మాతలు చాలా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. కొత్త కాన్సెప్టులతో వస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదిత్, మధు, సప్తగిరి లుక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆదిత్, సప్తగిరి, మధునందన్, సిమ్రాన్ గుప్తా, రియా ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘తాగితే తందానా’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. రైట్ టర్న్ ఫిలిమ్స్ పతాకంపై వి.మహేష్, వినోద్ జంగపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి లుక్‌ని మారుతి, బ్యానర్ లోగోని నిర్మాత దామోదరప్రసాద్ విడుదల చేశారు. దామోదరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లు సరైన ప్లానింగ్‌తో వస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ నిర్మాతలు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి చేయడంలో సక్సెస్ అయినట్టు తెలుస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను 16 చిత్రాలు చేశాను. వాటిలో 13 చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశాను’’ అన్నారు ఆదిత్. ‘‘కమెడియన్‌గా మంచి చిత్రాలు వస్తే చేద్దామనుకుంటున్న తరుణంలో శ్రీనాథ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా’’ అన్నారు సప్తగిరి. ‘‘ముగ్గురు కుర్రాళ్లు తాగిన మత్తులో ఒక సమస్యలో ఇరుక్కుంటారు.. దాని నుంచి వారు ఎలా బయటపడ్డారనేది చిత్రకథ’’ అన్నారు శ్రీనాథ్ బాదినేని. ‘‘అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు వినోద్ జంగపల్లి. చిత్రనిర్మాత వి.మహేష్, లైన్ ప్రొడ్యూసర్ అనిల్, మధునందన్, సిమ్రాన్ గుప్తా, రియా, సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్ బి.నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి. -
హీరోగా చేసినా నవ్వించాలి
‘‘ఊర్లో జులాయిగా తిరిగే పాత్రలు మావి. ఆ ఊరికి టీచర్‌గా వచ్చిన లక్ష్మీ రాయ్‌ని వెంటపడి ఆనందిస్తాం. ఆ తర్వాత మమ్మల్ని ఊరికి ఉపయోగపడేలా ఆమె ఎలా మారుస్తుంది? అన్నది కథ. హారర్ టచ్ ఉండే ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. సినిమాలో మా ఇద్దరి సీన్స్ ఎంత నవ్విస్తాయో లక్ష్మీరాయ్‌తో ఉన్న సీన్స్ ఇంకా బాగా నవ్విస్తాయి’’ అని ప్రవీణ్, మధు నందన్ అన్నారు. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరో, హీరోయిన్లుగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. ప్రవీణ్, మధు నందన్ వినోదాత్మక పాత్రల్లో నటించారు. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించారు. ఈ నెల 15న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రవీణ్, మధునందన్ మాట్లాడుతూ – ‘‘మేం సినిమాను అంగీకరించినప్పుడు లక్ష్మీరాయ్ లేరు. కథే ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. లక్ష్మీ రాయ్ ఆ ఊరికి ఎందుకు వచ్చింది? ఏం చేసింది అన్నది కథాంశం. మేం ఈ సినిమాను అంగీకరించడానికి కారణం కథ. మా పాత్రల ముగింపు. బయట మేం చాలా క్లోజ్‌ఫ్రెండ్స్. ఆ కెమిస్ట్రీ సినిమాలో మేం చేసే కామెడీలో కనిపిస్తుంటుంది. ఎమోషన్స్ చుట్టూ అల్లుకున్న కామెడీ కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ఓ కమెడియన్ హీరోగా చేస్తే.. సినిమాలో 90 శాతం నవ్వులే ఉండాలి. అప్పుడే సోలో హీరోగా నటించాలి. ఫైట్లు, డ్యాన్స్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే.. వాటికి పెద్ద హీరోలు ఎలాగూ ఉన్నారు కదా?’’ అన్నారు. -
పిల్లా నీకేదంటే ఇష్టం
లక్ష్మీ రాయ్, రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ, ప్రవీణ్, మధు నందన్ ముఖ్య తారలుగా కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై ఎమ్. శ్రీధర్‌రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను దర్శక–నిర్మాతలు లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘పిల్లా నీకేదంటే ఇష్టం.. యాపిల్ పిల్లా నీకేదంటే ఇష్టం’ అనే మాసీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు హరి గౌర సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్‌కు శేఖర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొంతకాలం క్రితం ఈ సినిమా ప్రయాణం మొదలైంది. అమలాపురంలో దాదాపు 40 రోజులు షూటింగ్ జరిపాం. ఇంకో పదిరోజులు అక్కడే షూటింగ్ జరిపితే ఈ సినిమా దాదాపు పూర్తి అవుతుంది. కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. లక్ష్మీరాయ్ బహుభాషా నటి. అద్భుతంగా నటిస్తున్నారు. డైరెక్టర్ కిశోర్ చక్కగా తెరకెక్కిస్తున్నారు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ బాగా నటిస్తున్నారు. హరి మంచి సంగీతం అందిస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రస్తుతం చిత్రీకరిస్తున్న మాస్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుంది. సినిమాపై పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు ఆనంద్‌రెడ్డి. ‘‘కామెడీ చిత్రమిది. మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాలో భాగం కావడం హ్యాపీ. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు లక్ష్మీ రాయ్. ‘‘నన్ను నమ్మిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. ప్రేక్షకులను నవ్వించడానికి చేసే ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు కిశోర్. ఈ కార్యక్రమంలో రామ్‌కార్తీక్, ప్రవీణ్, మధు నందన్, డీఓపీ వెంకట్, కిశోర్, పూజిత, పంకజ్ తదితరులు పాల్గొన్నారు. -
కనబడుట లేదు!
ఎవరో తెలుసా? వెంకటలక్ష్మి. కుటుంబ సభ్యులు కంగారుపడి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి.. వెంకటలక్ష్మిని ఎవరైనా దాచారా? లేక ఏదైనా సమస్య నుంచి తప్పించుకోవాలని పారిపోయి తనే దాక్కుందా? అనే ప్రశ్నలకు కొన్ని రోజుల తర్వాత వెండితెరపై సమాధానం దొరకుతుంది. వెంకటలక్ష్మిగా థియేటర్లోకి రాబోతున్నది రాయ్‌లక్ష్మీ. గతేడాది ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో ‘రత్తాలు రత్తాలు..’ స్పెషల్ సాంగ్‌లో నర్తించి యూత్‌ను ఉర్రూతలూగించారామె. ఇప్పుడు రాయ్‌లక్ష్మీ తెలుగులో హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. కిశోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీక్, ప్రవీణ్, మధునందన్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎమ్. శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మిస్తున్నారు. హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
లవ్.. యాక్షన్
అర్జున్ మహి హీరోగా, ‘శరణం గచ్ఛామి’ ఫేమ్ తనిష్క్ రాజన్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇష్టంగా’. సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ సినిమా ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అడ్డూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథ వైవిధ్యంగా ఉంటుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ సినిమాలో ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దువ్వాసి మోహన్, ‘తాగుబోతు’ రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేస్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహీరా. -
మగజాతి స్వాతంత్య్రం పోయింది
‘‘యువరానర్.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 1947 ఆగస్టు 15. కానీ, అదే స్వాతంత్య్రం మగజాతి కోల్పోయింది 1983 డిసెంబర్ 25.. నాలాంటి భార్యా బాధితులను రక్షించడానికి పైనుంచి వచ్చిన పరమాత్ముడిలా కనిపిస్తున్నావు రా’’ వంటి డైలాగులు ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. శరత్చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా ఆమని, మధునందన్ ముఖ్య పాత్రల్లో రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించిన చిత్రం ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’.‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’ అన్నది ఉపశీర్షిక. నిర్మాత రాజ్ కందుకూరి, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ట్రైలర్స్ విడుదల చేశారు. రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ వినూత్న కుటుంబ కథా చిత్రమిది. విజయ్ కురాకుల సంగీతం, మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం హైలైట్’’ అన్నారు.‘‘సిని మా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. శరత్చంద్ర, విజయ్ కురాకుల, మౌనశ్రీ మల్లిక్ పాల్గొన్నారు. -
తన నమ్మకమే నన్ను నిలబెట్టింది!
సంభాషణం: ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో హీరోకి ఫ్రెండ్‌గా నటించిన వ్యక్తి గుర్తున్నాడా? ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ఆరాటపడే అమాయకమైన అబ్బాయిగా అందరినీ ఆకట్టుకున్న ఆ అబ్బాయి పేరు... మధునందన్. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలతో చాలా బిజీ అయిపోయిన నందన్... తను ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన తపన గురించి ఇలా చెప్పుకొచ్చాడు... నట ప్రయాణం ఎలా మొదలైంది? నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. చిన్నప్పట్నుంచీ నటనంటే పిచ్చి. కానీ మా కుటుంబంలో అప్పటివరకూ ఎవరూ ఈ రంగంలోకి రాలేదు. దాంతో ఇంట్లోవాళ్లు ప్రోత్సహించేవారు కాదు. కానీ నేను పట్టువదల్లేదు. ఇంటర్ పరీక్షలు అయ్యాక తేజగారు కొత్తవాళ్లతో సినిమా తీయబోతున్నారని తెలిసి ఆడిషన్‌కి పరుగెత్తాను. లక్కీగా సెలెక్ట్ అయ్యాను. అదే... ‘నువ్వు-నేను’. ఆ సినిమా వచ్చి చాలా యేళ్లయ్యింది. కానీ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాతేగా మీరు అందరికీ తెలిసింది? అవును. నేనెవరో అందరికీ తెలియడానికి పదమూడేళ్లు పట్టింది. ఇన్నేళ్లలో పది, పదిహేను సినిమాలు చేసి ఉంటానంతే. అవకాశాలు ఎందుకు రాలేదు? మొదట నాకూ తెలియలేదు కానీ తర్వాత అర్థమైంది. నేనప్పటికి చిన్నవాణ్ని. ఆ వయసు పాత్రలు సినిమాల్లో పెద్దగా ఉండవు. యూత్ సినిమాలు తేజగారు తప్ప ఎవరూ తీసేవారు కాదు. కాబట్టి మిగతా వాళ్లెవరికీ నాతో పని లేదు. మరో కారణం... నేను చదువుకుంటున్నాను. సగం సమయం దానికే కేటాయించేవాడిని. మిగతా సమయంలో ప్రయత్నాలు చేసేవాడిని. పైగా నాకు ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలిసేది కాదు. ఈ కారణాలన్నింటి వల్లా నాకు అవకాశాలు రాలేదు. అందుకే ఎంబీయే పూర్తయ్యాక యూఎస్ వెళ్లిపోయాను. మళ్లీ ఇండియాకి ఎందుకొచ్చేశారు? ఏవో ప్రాబ్లెమ్స్ వల్ల సెటిలైపోదామనే ఉద్దేశంతో వెళ్లానే కానీ, మనసంతా నటన చుట్టూనే తిరిగేది. ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి ఆరా తీసేవాడిని. అక్కడ నాతోవున్నవాళ్లు కూడా అనేవారు... నీకెందుకురా ఈ ఉద్యోగం, వెళ్లి నీకిష్టమైన నటననే కెరీర్‌గా ఎంచుకో అని. నా అదృష్టంకొద్దీ సాఫ్ట్వేర్ కూడా కుదేలైపోయింది. (నవ్వుతూ) దాంతో చక్కగా వెనక్కి వచ్చేశాను. మళ్లీ అవకాశాలు ఎలా వచ్చాయి? వచ్చీ రాగానే ‘ఇష్క్’ సినిమాలో చాన్స్ వచ్చింది. అయితే అది కేవలం నితిన్వల్లేలెండి. ‘నువ్వు-నేను’కి నితిన్ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్. అప్పటికి నితిన్ హీరో కాలేదు. తను వాళ్ల నాన్నగారితో పాటు షూటింగ్ స్పాట్‌కి వచ్చేవాడు. అప్పుడే తనతో పరిచయం ఏర్పడింది. నాటి స్నేహం నేటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే తను ‘ఇష్క్’ చాన్స్ ఇప్పించాడు. అంటే ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో కూడా..? అవును... అదీ నితినే ఇప్పించాడు. తనకి మొదట్నుంచీ నా మీద నమ్మకం. ఆ నమ్మకమే నన్ను నిలబెట్టింది. నన్ను రికమెండ్ చేస్తే ఏదో మంచి పాత్ర అయివుంటుంది అనుకున్నానే కానీ, అంత ప్రాముఖ్యత ఉన్న రోల్ అని అనుకోలేదు. సినిమా చూసిన తర్వాత చాలామంది డెరైక్టర్స్ ఫోన్ చేసి మెచ్చుకున్నారు. త్రివిక్రమ్‌గారయితే బన్నీతో చేస్తున్న సినిమాలో కావాలని నాకో పాత్ర ఇచ్చారు. నితిన్ దయో, ధైర్యమో... అంత మంచి పాత్రకు నన్ను తీసుకోవడం వల్లే నా కెరీర్, నా జీవితం మలుపు తిరిగాయి. కొత్తజంట, ప్యార్‌మే పడిపోయానే, గీతాంజలి, ఒక లైలా కోసం... వరుసగా చేస్తూనే ఉన్నాను. ఎలాంటి రోల్స్ కోరుకుంటున్నారు? ఏదో ఒక జానర్‌కి ఫిక్స్ అయిపోవడం ఇష్టం లేదు. కోట శ్రీనివాసరావుగారు, ప్రకాశ్‌రాజ్, బోమన్ ఇరానీల మాదిరిగా అన్ని రకాల పాత్రలూ చేయాలి. అందుకే డిఫరెంట్ పాత్రల్ని ఎంచుకుంటున్నాను. ‘పటాస్’లో హిజ్రా, ‘చిన్నదానా నీకోసం’లో ‘గే’ పాత్రల్లో నటిస్తున్నాను. హిజ్రా, గే పాత్రలు చేయడానికి గట్స్ కావాలి. వెంటనే ఒప్పుకున్నారా, తటపటాయించారా? హిజ్రా గురించి భయపడలేదు. సినిమాకి ఉపయోగపడే పాత్ర కావడంతో వెంటనే ఓకే అన్నాను. కానీ గే అనగానే కాస్త జంకాను. ఎంత నటనే అయినా ఆ ముద్ర పడుతుందేమోనని తటపటాయించాను. కానీ అది నితిన్ సినిమా. తను ఏం చేయమన్నా కళ్లు మూసుకుని చేసేస్తాను తప్ప ఏంటి, ఎందుకు అని జీవితంలో ఎప్పటికీ అడిగే ప్రసక్తే లేదు. అందుకే సరే అన్నాను. (నవ్వుతూ) అయినా పెళ్లి కాకపోతే భయపడాలి, నాకు పెళ్లై పాప కూడా ఉంది కాబట్టి ధైర్యంగా సరే అనేశాను. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి? నా భార్య హసిత నాకు కొలీగ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ‘ఇష్క్’ చేశాక మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’తో నా లైఫే మారిపోయింది. అందుకే తను నన్ను ఆటపట్టిస్తూ ఉంటుంది... నేను వచ్చేవరకూ అదృష్టం నీ దగ్గరకు రాలేదు అని. నేను కూడా అది నిజమేనని ఒప్పేసుకుంటా. డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? ‘అరుంధతి’లో సోనూ సూద్ చేసిన అఘోరా పాత్ర. ‘గీతాంజలి’లో కాస్త నెగిటివ్ టచ్ ఉన్నది చేశాను కానీ... అఘోరా మాదిరిగా పూర్తిస్థాయిలో చేయాలి. భవిష్యత్ ప్రణాళికలు...? నటన... నటన... నటన. నా ప్రణాళికలన్నీ దీని చుట్టూనే తిరుగుతాయి. కనీసం ఇంకో పది, పదిహేనేళ్ల వరకూ చేతినిండా పనితో ఉక్కిరిబిక్కిరైపోవాలి. మంచి నటుడిగా ముద్ర వేసుకోవాలి! - సమీర నేలపూడి