మానని గాయం | Crime file story | Sakshi
Sakshi News home page

మానని గాయం

Published Sun, Oct 18 2015 12:35 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

మానని గాయం - Sakshi

మానని గాయం

క్రైమ్ ఫైల్
జూన్ 22, 2004... బ్రెజిల్...
మంచమ్మీద కూర్చుని డైరీ తెరిచింది ఇరవయ్యేళ్ల సబీన్. పెన్నును చేతిలోకి తీసుకుంది. కానీ ఏం రాయాలో అర్థం కావడం లేదు. కలం నుంచి అక్షరాలు జారి పడటం లేదు. కళ్ల నుంచి కన్నీళ్లు మాత్రం రాలిపడుతున్నాయి. ‘‘ఎందుకురా ఏడుస్తున్నావ్? ఇకనైనా ఈ కన్నీటికి ఫుల్‌స్టాప్ పెట్టు’’... ఎప్పుడు వచ్చిందో ఆమె తల్లి, బాధగా అంది.
 
కళ్లు తుడుచుకుంది సబీన్. ‘‘కన్నీళ్లకే కాదమ్మా, ఈ జీవితానికే ఫుల్‌స్టాప్ పెట్టాలని ఉంది’’ అంటూ బావురుమంది.
 అల్లాడిపోయింది తల్లి. గబగబా వెళ్లి కూతుర్ని గుండెకు హత్తుకుంది. ‘‘ఊరుకో తల్లీ. అయిపోయిందేదో అయిపోయింది. ఇక అన్నిటినీ మర్చిపో. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు’’ అంటూ అనునయించే ప్రయత్నం చేసింది.
 
‘‘లేదమ్మా. పాత గాయాలు సలుపు తుంటే కొత్త జీవితాన్ని ఎలా మొదలు పెట్టమంటావ్. ఒకవేళ నేను మర్చిపోవా లని అనుకున్నా ఈ సమాజం నన్ను మర్చి పోనివ్వద్దు. పొద్దుట్నుంచీ మీడియా మళ్లీ నా వెంట పడుతోంది. ఇంకెలాగమ్మా నేను మర్చిపోయేది?’’
 ఆమె అలా అంటూ ఉండగానే ఫోన్ మోగింది. తల్లి లిఫ్ట్ చేసింది.
 ‘‘నేనొక టీవీ రిపోర్టర్‌ని మేడమ్. మార్క్ కేసులో ఇవాళ తీర్పు వెలువడింది కదా! దాని గురించి మీ అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను.

ఒకసారి తనని పిలుస్తారా?’’
 సబీన్ తల్లి ముఖం కోపంతో ఎర్ర బడింది. ‘‘ఇంటర్వ్యూ కావాలా? అసలు జాలనేదే లేదా మీకు? ఎందుకు దాన్నిలా  హింసిస్తున్నారు?’’... అరిచింది.
 అయినా అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేయలేదు. సబీన్ తల్లి ఎంత చెప్తున్నా ఆమె వదలడం లేదు. దాంతో సబీన్ ఫోన్ లాక్కుని ‘‘నేను సబీన్‌ని మాట్లాడు తున్నాను’’ అంది.
 ‘‘సబీన్ మీరా? మీకోసమే ఫోన్ చేశాను. మీరోసారి...’’

 ‘‘మీ స్టూడియోకి రావాలి అంతే కదా’’... ఆమె మాట పూర్తి కాకుండానే అంది సబీన్. ‘‘నేను వస్తాను. ఇంటర్వ్యూ ఇస్తాను. ఏర్పాట్లు చేసుకోండి’’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
 ‘‘సబీన్... నువ్వు ఇంటర్వ్యూ ఇస్తావా? వద్దురా’’ అంది తల్లి.
 ‘‘లేదమ్మా. నేను వెళ్తేనే ఈ కథకు ముగింపు దొరుకుతుంది’’ అంటూ లేచి బాత్రూమ్‌లోకి వెళ్లింది సబీన్.
     
గంట తర్వాత... చానెల్ స్టూడియోలో ఉంది సబీన్. మొదలుపెడదామా అన్నట్టు సైగ చేసింది యాంకర్. సరేనన్నట్టు తలూపింది సబీన్.
 ‘‘అందరికీ నమస్కారం. ఈరోజు మార్క్ డ్యూట్రాక్స్ అనే సీరియల్ కిల్లర్‌కి ముప్ఫయ్యేళ్ల కఠిన కారాగారశిక్ష పడింది. ఆ కిరాతకుడి చేతి నుంచి తప్పించుకున్న ఏకైక వ్యక్తి సబీన్ డార్డెన్. ఆమె ఈ రోజు మన ముందు ఉన్నారు. ఆవిడ కథ ఏమిటో, అసలు ఆమె జీవితంలో ఏం జరి గిందో ఆవిడ ద్వారానే తెలుసుకుందాం’’ అని సబీన్ వైపు తిరిగింది యాంకర్. మరుక్షణం సబీన్ టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్షమయ్యింది.

 ‘‘చెప్పండి మిస్ సబీన్? ఎనిమిదేళ్ల క్రితం ఏం జరిగింది? పోలీసులు సీరియల్ కిల్లర్ మార్క్ ఇంటి మీద దాడి చేసి నప్పుడు మీరు అక్కడ దొరికారు. కానీ మీ పట్ల ఏం జరిగిందనేది ఇంతవరకూ మీరు చెప్పలేదు. అసలు మీరు ఆ సీరియల్ కిల్లర్ చేతికి ఎలా చిక్కారు?’’
 గొంతు సవరించుకుంది సబీన్. మెల్లగా పెదవి మెదిపింది. ‘‘నా కథ తెలుసుకోవాలని అందరికీ ఆతృతగా ఉంది. నాపట్ల ఏం జరిగిందో తెలుసు కోవాలని ఉత్సుకతగా ఉంది.

అందుకే ఎనిమిదేళ్లుగా మీడియా నా వెంట పడుతూనే ఉంది. కానీ నేనేరోజూ నోరు విప్పలేదు. ఎందుకంటే... పీడకలని పదే పదే తలచుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఈరోజు నా కథ చెప్పాలని అనుకుంటున్నాను. దానికి కారణం ఉంది. ఆ కారణం చివర్లో చెప్తాను. ముందు నా కథ వినండి’’ అంటూ చెప్పడం మొదలు పెట్టింది సబీన్.
     
ఆగస్ట్ 13, 1996... స్కూలు నుంచి సైకిల్ మీద ఇంటికి బయలుదేరింది సబీన్. ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చేసరికి ఒక కారు దూసుకొచ్చి ఆమె ముందు ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి దిగాడు. సబీన్ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె నోటిలో గుడ్డలు కుక్కి కారులోకి నెట్టాడు. తప్పించుకోవా లని ప్రయత్నించింది సబీన్.  ఆ అవకాశం ఇవ్వలేదతను. సబీన్ చెంపల మీద పిడి గుద్దులు గుద్దాడు. పన్నెండేళ్ల చిన్నపిల్ల... తట్టుకోలేకపోయింది. అతడి బలం ముందు ఓడిపోయి సొమ్మసిల్లింది.
 
కళ్లు తెరిచేసరికి ఒకచోట బందీగా ఉంది సబీన్. ఆ చోటు ఏమిటో, ఎక్క డుందో అర్థం కాలేదు. కాళ్లూ చేతులూ కట్టేసి ఉన్నాయి. నోటిలో గుడ్డలున్నాయి. కదలడానికి లేదు. కనీసం అరవడానికి కూడా లేదు. దుఃఖం పొంగుకొచ్చింది. మౌనంగా ఏడుస్తూ చుట్టూ చూసింది. అదేదో ఇంటి బేస్‌మెంట్‌లా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా చెత్త, పాత సామాన్లు, విరిగిన ఫర్నిచర్ లాంటివి ఉన్నాయి. అంతా మురికి మురికిగా ఉంది.
 
కడుపులో దేవినట్లయ్యింది సబీన్‌కి. తన ఇల్లు గుర్తుకొచ్చింది. ఇంట్లో కాస్త దుమ్ము ఉన్నా ఇష్టం ఉండదు అమ్మకి. వెంటనే శుభ్రం చేస్తుంది. తన పక్క దుప్పటి కాస్త మురికిగా అనిపిస్తే వెంటనే తీసేసి తెల్లని దుప్పటి పరుస్తుంది. ‘‘ఆ మురికి అంటి నీ కూతురేం మాసిపోదులే’’ అని నాన్న సెటైర్లు వేస్తుంటారు. అలాంటిది తాను ఇలాంటి మురికి కూపంలో ఉన్నానని తెలిస్తే అమ్మకెలా ఉంటుంది!
 అమ్మానాన్నలు గుర్తురాగానే దుఃఖం మరింత ఎక్కువయ్యింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. అంతలో తలుపు తీసిన చప్పుడయ్యింది. సబీన్ గుండె జారిపో యింది. భయంగా తలుపు వైపు చూసింది.
 లోపలికి వచ్చి తలుపు గడియ పెడుతున్నాడతను. తనను ఎత్తుకొచ్చింది అతనే. ఇప్పుడు తనని ఏం చేస్తాడు?
 
మెల్లగా సబీన్ దగ్గరకు వచ్చాడా వ్యక్తి. కట్లు విప్పాడు. నోటిలో ఉన్న గుడ్డలు లాగేశాడు. సబీన్ ఏదో మాట్లాడ బోయింది. కానీ అతడు అవకాశమివ్వ లేదు. పశువులా మీదపడ్డాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా మృగంలా విరుచుకుపడ్డాడు. పన్నెండేళ్ల ఆ లేత కుసుమాన్ని క్రూరంగా నలిపేశాడు. అలా ఒక్కసారి కాదు... ఎన్నోసార్లు చేశాడు. ఎనిమిది రోజుల పాటు తన పశువాంఛకు ఆ పసిదాన్ని బలి తీసుకున్నాడు.
     
చెప్పడం ఆపి వెక్కి వెక్కి ఏడుస్తోంది సబీన్. టీవీల ముందు కూర్చుని చూస్తున్న వాళ్లందరి కళ్లూ కూడా చెమరుస్తున్నాయి.
 ‘‘కంట్రోల్ యువర్‌సెల్ఫ్ సబీన్... తర్వాత ఏమైంది?’’ అడిగింది యాంకర్.
 నిభాయించుకుంది సబీన్. ‘‘ప్రతి మగాడూ నాన్నలాంటివాడే అనుకునే వయసు అది. కానీ అందరూ నాన్నలా ఉండరని వాణ్ని చూశాక అర్థమయ్యింది. వాడెవడో నాకు తెలీదు. ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలీదు. ఎందుకు నా శరీరంతో అలా ఆడుకుంటున్నాడో అర్థం కాదు.

వాడు చేసే పనుల వల్ల నా శరీరం బాధకు గురవుతుంటే, వాడికి ఆనందం ఎందుకు కలుగుతోందో తెలిసేది కాదు. ఎనిమిది రోజులు నరకయాతన పడ్డాను. తర్వాత పోలీసులు వచ్చారు. నా తర్వాత మరో అమ్మాయిని కిడ్నాప్ చేశాడ ని, అది ఎవరో చూసి తమకు ఫోన్ చేసి చెబితే వాణ్ని అరెస్ట్ చేశామనీ చెప్పారు. నన్ను ఆ నరక కూపం నుంచి బయటకు తీసుకొచ్చారు. అదీ నా కథ.’’
 ‘‘ఓహ్... సారీ సబీన్. మీ పట్ల ఇంత ఘోరం జరగడం నిజంగా బాధాకరం’’ అంది యాంకర్.
 వెంటనే పెద్దగా నవ్వింది సబీన్. ఒక క్షణం.. రెండు క్షణాలు... ఐదు క్షణాలు... అలా పగలబడి నవ్వుతూనే ఉంది. యాంకర్ విస్తుపోయింది. టీవీ చూస్తోన్న ప్రేక్షకులదీ అదీ పరిస్థితి. ఎందుకు నవ్వుతోందామె?
 
నవ్వి నవ్వి ఆగింది సబీన్. ‘‘నిజంగా మీకు అంత బాధగా ఉందా?’’ అంది యాంకర్‌వైపు చూసి.
 తత్తరపడిందామె. ఏం మాట్లాడాలో అర్థం కాక గుటకలు మింగింది.
 ‘‘మీరు నిజంగా అంత బాధపడేవాళ్లే అయితే... ఈరోజు నేను ఇక్కడికి రావలసిన అవసరం ఉండేది కాదు. అప్పుడు... ఆ సమయంలో... ఆ రాక్షసుడు నాకు ఎనిమిది రోజుల పాటే నరకం చూపించాడు. కానీ మీరు... మీరు నన్ను ఎనిమిదేళ్ల పాటు నరకయాతన పెట్టారు’’... అరిచినట్టే అంది సబీన్. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు.
 ‘
‘ఒక ఆడపిల్లని. తెలిసీ తెలియని వయసులో ఓ రాబందు రెక్కల మాటున బందీని అయ్యాను. వాడి క్రూరచర్యలకు బలయ్యాను. అదృష్టంకొద్దీ తప్పించుకుని బయటపడ్డాను. నా భవిష్యత్తు పాడు కాకూడదని, పోలీసులు నా పట్ల జరిగినదాన్ని దాచిపెట్టారు. కోర్టు కూడా నన్ను ప్రత్యక్షంగా ఇన్‌వాల్వ్ చేయకుండా జాగ్రత్తగా డీల్ చేసింది. కానీ ఏం లాభం? మీరంతా కలిసి నాకసలు భవిష్యత్తే లేకుండా చేశారు. ఈ కేసు గురించి చర్చ వచ్చినప్పుడల్లా నన్ను మీడియా వాళ్లు బయటకు లాగాలని చూశారు. నన్ను వెంటాడారు, వేధించారు.

బయటకు వెళ్తే ప్రతి ఒక్కరూ గుచ్చి గుచ్చి చూశారు. ఆ చూపులు గుండెల్లోకి గునపాల్లా దూసుకెళ్లా యని, ఆ చూపుల్లో ఉన్న వంద సందే హాలు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని ఛిద్రం చేసి పారేశాయని మీకెవ్వరికీ తెలియదు. నా మీద జాలి చూపమని నేనెవ్వరినీ అడగ లేదు. నా గాయాన్ని రేపకుండా ఉంటే చాలనుకున్నాను. కానీ ఆ ఆశ అడియాసే అయ్యింది. నాపట్ల ఏదో జరిగిందని మీ అనుమానం. అదేంటో తెలిసేవరకూ మీరు నన్ను వదలరని నాకు తెలుసు. అందుకే ఈరోజు మీ అందరి ముందుకూ వచ్చాను.
 
మార్క్ డ్యూట్రాక్స్ నా జీవితాన్ని నాశనం చేశాడు కానీ నన్ను చంపలేదు. కానీ మీరు మీ చూపులతో, ప్రశ్నలతో ప్రతి క్షణం నన్ను చంపుతున్నారు. వాడు చేసిన గాయాన్ని పదే పదే రేపుతూ, వాడి కంటే ఎక్కువగానే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇంతకంటే ఆ రోజు నేను వాడి చేతుల్లోనే చచ్చిపోయి ఉంటే ఎంతో బాగుండేది’’ అనేసి ఆవేశంగా లేచి వెళ్లిపోతోన్న సబీన్ వైపు నివ్వెరపోయి చూస్తూండిపోయింది యాంకర్.
 ఆ క్షణంలో టీవీ ముందు కూర్చున్న ఎంతోమంది మనసులు సిగ్గుతో చితికిపోయాయి.
 
మానవ మృగం: మార్‌‌క డ్యూట్రాక్స్
మార్క్ డ్యూట్రాక్స్ ఓ సీరియల్ కిల్లర్. పదిహేనేళ్ల లోపు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి బంధించేవాడు. వాళ్లను రాక్షసంగా అనుభవించేవాడు. అదంతా వీడియో తీసి బ్లూఫిల్ముల వ్యాపారం చేసేవాడు. కొత్త అమ్మాయిని తీసుకు రాగానే పాత అమ్మాయిని తిండి పెట్టకుండా మాడ్చి చంపేసేవాడు. అలా పదమూడుమంది అమ్మాయిల్ని పొట్టనబెట్టుకున్నాడు. సబీన్‌ని బందీగా ఉంచిన సమయంలోనే మరో అమ్మాయిని కిడ్నాప్ చేశాడు.

అది చూసిన ఓ వ్యక్తి మార్క్ కారు నంబరును పోలీసులకు తెలియజేశాడు. దాంతో పోలీసులు మార్క్‌ని, అతనికి సహకరించిన అతడి భార్య మిషెల్‌ని అరెస్ట్ చేశారు. సబీన్‌ని కాపాడారు. మార్క్‌కి న్యాయస్థానం ముప్ఫయ్యేళ్ల కఠిన కారాగారశిక్షను, మిషెల్‌కి పాతికేళ్ల శిక్షనూ విధించింది. ఇద్దరూ బ్రెజిల్ జైల్లో మగ్గుతున్నారు.
- సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement