ఓటమి అవమానంతో.. ఏడుగురి ప్రాణాలు తీశాడు | Brazil Man Shoot Few After Being Laughed At For Losing At Pool | Sakshi
Sakshi News home page

ఆటలో ఓడిపోయాడు.. అంతా నవ్వారు.. ఏడుగురి ప్రాణాలు తీశాడు!

Published Thu, Feb 23 2023 2:21 PM | Last Updated on Thu, Feb 23 2023 2:22 PM

Brazil Man Shoot Few After Being Laughed At For Losing At Pool - Sakshi

సీసీటీవీ ఫుటేజీలో నమోదైన దృశ్యం..

క్రైమ్‌: ఆటలో ఓడిపోయాడు. అందరూ బిగ్గరగా నవ్వారు. ఆవేశంలో మళ్లీ ఆడాడు. ఈసారి చిత్తుగా ఓడాడు. దీంతో అక్కడున్నవాళ్లు హేళన చేస్తూ నవ్వారు. అది అతనికి పట్టరాని పిచ్చికోపం తెప్పించింది. ఆ క్షణికావేశంలో ఉన్మాదిగా మారిపోయి ఏడుగురి బలిగొన్నాడు. 

బ్రెజిల్‌లో దారుణం జరిగింది. పూల్‌ గేమ్‌ ఓడిన వ్యక్తి.. అందరూ నవ్వారనే కోపంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతనికి మరో వ్యక్తి సాయం చేశాడు. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది.  బ్రెజిల్‌ రాష్ట్రం మాటో గ్రోస్సోలోని సినోప్‌ నగరంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

కాల్పులకు తెగబడిన వ్యక్తి పేరు ఎడ్గర్‌ రికార్డో డె ఒలివెయిరా. సహనిందితుడి పేరు ఇజెక్వియాస్‌ సౌజ రిబెయిరోలు. ఇద్దరూ ఘటన తర్వాత ఓ కుగ్రామంలో తలదాచుకుని.. అక్కడి నుంచి మరో చోటుకి పరారైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్‌లో వైరల్‌ అవుతోంది.

ఒలివెయిరా తొలుత ఓ వ్యక్తి చేతిలో పూల్‌ గేమ్‌ ఓడిపోయి 4,000 రియస్(776 డాలర్లు) పోగొట్టుకున్నాడు. ఆ కోపంలో అక్కడి నుంచి వెళ్లి.. ఇజెక్వియాస్‌ను వెంట తెచ్చుకున్నాడు. మళ్లీ ఆడదామంటూ.. గెలిచిన వ్యక్తికి సవాల్‌ విసిరాడు. అయితే ఈసారి కూడా గేమ్‌ ఓడిపోయాడు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లంతా బిగ్గరగా నవ్వడంతో కోపం ఆపుకోలేకపోయాడు. ట్రక్కులోకి వెళ్లి షాట్‌ గన్‌ తీసుకొచ్చి పూల్‌ ఓనర్‌తో సహా అక్కడున్న ఏడుగురిని కాల్చి చంపాడు. డబ్బులతో పాటు అక్కడే ఉన్న ఓ మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. పూల్‌ హాల్‌లోని సీసీటీవీలో కాల్పుల దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement