రాత్రంతా కన్నీళ్లతో...
నిద్రలేని రాత్రులు
ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలూ, రాత్రంతా కునుకుపట్టనివ్వని విషాదాలూ ఉంటాయి. అవి మనిషిని జీవితంలో రాటుదేల్చవచ్చునూ వచ్చు, ఆత్మీయతను పెంచనూ వచ్చు. ఆ జ్ఞాపకాలను సున్నితంగా తడిమే ప్రయత్నమే ఈ శీర్షిక. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ అవకాశాలు ఉండి కానీ, లేక కానీ, విజయాల వల్ల కానీ, పరాజయాల వల్ల కానీ... నిద్రలేని రాత్రులు నేనెప్పుడూ గడపలేదు. వ్యక్తిగతంగా మాత్రం చాలానే గడిపాను. ఆ రోజులు గుర్తొస్తే... ఇప్పటికీ నా కంటిమీది కునుకు ఎగిరిపోతుంది.
ఆరోజు... ‘ఆగడు’ షూటింగ్‌లో ఉన్నాను. నాకు, మహేశ్‌బాబుకీ మధ్య కామెడీ సీన్ షూట్ చేస్తున్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ఇన్‌వాల్వ్ అయి చేస్తున్నాం. చుట్టూ ఉన్నవాళ్లు, సహ నటీనటులు కూడా పడీ పడీ నవ్వుతున్నారు. అంతలో నా అసిస్టెంట్ కంగారుగా వచ్చి ఫోన్ నా చేతిలో పెట్టాడు. అక్క చేసింది. తను చెప్పింది వినగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పటిప్పుడు బయలుదేరి స్టార్ హాస్పిటల్‌కి వెళ్లిపోయాను.
ప్రాణానికి ప్రాణమైన నా భార్య... ఐసీయూలో ఉంది. వెంటిలేటర్ పెట్టారు. సెలైన్లు ఎక్కిస్తున్నారు. తనని బతికించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు అంతా బ్లాంక్ అయిపోయింది. అంతవరకూ బాగానే ఉన్న మనిషి ఒక్కసారిగా ఊపిరందక కుప్పకూలిపోయిందట. మాట పడిపోయిందట. ఎందుకలా జరిగిందని అడిగితే... పాదాల నుంచి ఊపిరితిత్తుల వరకూ రక్తం గడ్డ కట్టేసిందన్నారు డాక్టర్లు. కాపాడటం కష్టమంటూ పెదవి విరిచేశారు. అప్పటికి సమయం సాయంత్రం ఆరయ్యింది. ‘మీరు ఇంటికి వెళ్లిపోండి. మీ భార్యకి ఏదైనా అయితే మీకు ఉదయం ఆరు గంటల లోపు ఫోన్ వస్తుంది. ఫోన్ రాలేదంటే అప్పుడు హోప్స్ పెట్టుకోవచ్చు’ అని చెప్పారు.
సినిమా వాళ్లు తమ ఫోన్ ఎప్పుడూ మోగుతూ ఉండాలని కోరుకుంటారు. ఏ దర్శకుడో ఫోన్ చేసి అవకాశం ఇస్తున్నాను అని చెప్తాడేమోనని. కానీ ఆ రాత్రి నేను నా ఫోన్ మోగకూడదని కోరుకున్నాను.
ఆ రాత్రి ఒక్కొక్క నిమిషం ఒక్కో సంవత్సరంలాగా గడిచింది. సాధారణంగా సినిమా వాళ్లంతా తమ ఫోన్ ఎప్పుడూ మోగుతూ ఉండాలని కోరుకుంటారు. ఏ దర్శకుడో ఫోన్ చేసి అవకాశం ఇస్తున్నానని చెబుతాడేమోనని. కానీ ఆ రోజు మాత్రం నేను ఫోన్ రాకూడదని కోరుకున్నాను. దేవుళ్లందరికీ మొక్కాను. రాత్రంతా కన్నీళ్లతో గడిపాను. తెల్లారింది. ఆరు దాటినా ఫోన్ రాకపోవడంతో హాస్పిటల్‌కి పరుగెత్తాను. అప్పటికి ఫరవాలేదు, కానీ ప్రమాదం పొంచే ఉందన్నారు. తనకొక ఇంజెక్షన్ ఇవ్వాలి.
ఎక్కువ డోస్ ఇస్తే ప్రాణం పోతుంది. తక్కువ ఇస్తే క్లాట్స్ కరగకపోవచ్చు. కానీ రిస్క్ తీసుకోలే రు కాబట్టి తక్కువ డోసే ఇచ్చారు. డాక్టర్ల చలవ, దేవుడి దయ... నా లత బతికింది. కానీ తనకిక ఏం కాదు అన్న శుభవార్త నా చెవిన పడటానికి పది రోజులు పట్టింది.
తర్వాత కూడా ఆరు నెలలు నరకమే. లత పొట్టని ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ కోసి సర్జరీ చేశారు. నూట యాభైకి పైగా కుట్లు పడ్డాయి. కదలటానికి వీల్లేదు. ఏమాత్రం కదిలినా కుట్లు విడిపోతాయని భయం. పడుకునే ఉంటే వీపంతా పుండ్లు పడతాయని భయం. ఆరు నెలల పాటు తను, తననలా చూస్తూ నేను చిత్రవధ అనుభవించాం. ఏదేమైతేనేం... చివరకు నా భార్య కోలుకుంది. నేను పోతానని తెలిసినా అంత టెన్షన్ పడేవాణ్ని కాదు. నేనే ప్రపంచంగా బతికే అమాయకురాలు నా భార్య. తననా పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. నా బెస్ట్ ఫ్రెండ్‌ని కోల్పోతానేమోనని అల్లాడిపోయాను. అదృష్టంకొద్దీ ఆ పరిస్థితి రాలేదు. కానీ ఆ రాత్రిని మాత్రం నేనింతవరకూ మర్చిపోలేదు.
- సమీర నేలపూడి