sleepless nights
-
రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ డివైస్ ఉంటే చాలు
ఈ హైటెక్ హెడ్‌బ్యాండ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అర్గో’ దీనిని ‘అర్గోనైట్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. తొలిసారిగా దీనిని 2019 సీఈఎస్ ప్రదర్శనలో ప్రదర్శించినప్పుడు ఇది విశేషంగా ఆకట్టుకుంది. నిద్రపోయేటప్పుడల్లా దీనిని తలకు తొడుక్కోనక్కర్లేదు. ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కుంటే చాలు. ఇలా వారానికి కనీసం మూడుసార్లు– ప్రతిసారి ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కున్నట్లయితే, ఇది ఈఈజీ మాదిరిగా పనిచేస్తుంది. మెదడును స్కాన్ చేసి, ఆ చిత్రాలను యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. ఒత్తిడిని, ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. కొద్దినెలలు దీన్ని వాడితే నిద్రలేమి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిని వినియోగించిన వారు కూడా దీని పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ధర 499 డాలర్లు (రూ.40,940). -
ట్విట్టర్ పేరు మార్పు నా చావుకొచ్చింది.. ఆ రోజు నుండి నిద్ర లేదు..
వాషింగ్టన్: ట్విట్టర్ పేరు మార్చడమేమో గానీ అది నా చావుకొచ్చిందంటున్నాడు ఒక యూజార్. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా నివాసముండే క్రిస్టోఫర్.J .బీలే కొత్తగా ఏర్పాటు చేసిన 'X' లోగో నుండి వచ్చే లైటింగ్ నాకు నిద్ర లేకుండా చేస్తోందని అదే X (ఒకప్పటి ట్విట్టర్) వేదికగా వీడియోతో సహా విషయాన్ని పోస్ట్ చేసి ఆవేదన వెళ్లగక్కాడు. Imagine no more. This is my life now. https://t.co/k5QfAm8yuG pic.twitter.com/e7ECCM2NUD — Christopher J. Beale (@realchrisjbeale) July 29, 2023 ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే పాపులర్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ హస్తగతం చేసుకున్న తర్వాత పిట్ట బొమ్మను తొలగించి ఆ స్థానంలో 'X' అనే లోగోను పరిచయం చేశారు. ట్విట్టర్ పేరు మార్పు గురించి ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించిన నాటి నుండి సోషల్ మీడియా మాధ్యమంలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అత్యధికులు దీన్ని ఎగతాళి చేస్తూనే కామెంట్లు చేస్తుండగా అతి తక్కువ మంది మాత్రమే ఇది చాలా బాగుందని కితాబిచ్చారు. అయితే కాలిఫోర్నియాలోని ట్విట్టర్ హెడ్ క్వార్ట్రర్స్ ఎదురుగా నివాసముంటున్న క్రిస్టోఫర్.J .బీలే మాత్రం ఈ లోగో మార్పు వలన నాకు నిద్ర ఉండటం లేదని ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పైన అమర్చిన రేడియంట్ లైట్ గడియగడియకు వెలుగుతూ ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్ పైన దాని ప్రతిబింబం పడటంతో అసలు నిద్ర పట్టడంలేదు. నా బెడ్రూమ్ నుంచి చూస్తే ఇదిగో ఇలా ఉండి.. ఇది నా పరిస్థితి అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. Here’s another angle I forgot I had that shows the X strobing. Also, my apartment building needs a bath. pic.twitter.com/t66erPuDlL — Christopher J. Beale (@realchrisjbeale) July 29, 2023 దీనికి జత చేస్తూ ప్రతిరోజూ తన అనుభవాలను కూడా పంచుకున్నాడు. పగలంతా ఆ లైట్ల పనితీరును టెస్ట్ చేస్తారు. రాత్రయ్యే సరికి కళ్ళు జిగేల్ మనే లైటింగ్ నేరుగా నా బెడ్రూమ్లోకి వస్తుంది చూడండి అంటూ రాశాడు. అనేక మంది X యూజర్లు ఈ వీడియోల సమాహారంపై స్పందిస్తూ ఎలాన్ మస్క్ పై కామెంట్ల రూపంలో విమర్శల్ని కురిపిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాపులారిటీ కోసం పాకులాడింది.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంది.. -
అతిగా 'టీ' తాగుతున్నారా! ఈ సమస్యలు ఎదుర్కొనక తప్పదు
'టీ' అంటే ఇష్టపడని వారుండరు. చల్లటి ఈ వర్షాకాలంలో ఓ కప్పు చాయ్ ఎంత హాయిగా ఉంటుంది. ఏం తినకపోయిన పర్వాలేదు కానీ.. ఆకలేసినప్పుడల్లా వేడివేడి 'టీ' సిప్ చేస్తుంటూ కొందరికి చాలా హాయి అనిపిస్తుంది. ఆ టీ గొంతులో పడగానే శరీరంలో కాస్త ఉత్సాహం వచ్చి మళ్లీ తమ పనులు యథావిధిగా చేసుకోగలుగుతారు. కప్పు టీ పడితే చాలు అబ్బా} ప్రాణం హాయిగా ఉంది అంటారు చాలామంది. ఇలా భావించే కొందరూ..రోజుకు రెండు మూడు కప్పుల చాయ్ తాగేస్తుంటారు. ఇది చాలా దుష్ప్రభావాలకు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ఉండే కెఫిన్, టానిన్ కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనక తప్పదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. టీ తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.. ఐరన్ లోపం.. టీలో కెఫిన్, టానిన్లు అధికంగా ఉంటాయి.అందువల్ల దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఐరన్ శోషించుకోనీకుండా చేస్తుంది. దీని వల్ల నిద్రలేమి ఏర్పడి తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుందంటున్నారు నిపుణలు. టానిన్లు కొన్ని ఆహారాలలో ఉండే ఇనుమును బంధిస్తాయి. దీంతో మీ జీర్ణవ్యవస్థ శోషించుకునే సమయంలో ఐరన్‌ని అందుబాటులో లేకుండా చేస్తుంది. దీంతో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత సాధారణ పోషకాహార లోపాల్లో ఒకటని చెబుతున్నారు నిపుణులు. అలాగే మీరు గనుక శాఖహారులైతే మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే 'టీ' టానిన్లు జంతు ఆధారిత ఆహారాల కంటే మొక్కల మూలాల నుంచి ఇనుమును ఎక్కువగా గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి ఏర్పడుట టీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్ర చక్రానికి అంతరాయ ఏర్పడుతుంది. మెదుడును నిద్రకు ఉపక్రమించేలా చేసే మెలటోనిన్ అనే హార్మోన్‌ని నిరోధిస్తుంది. ఫలితంగా మంచి నిద్ర పట్టదు. సరిపోని నిద్ర కారణంగా అలసటగా అనిపిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గి..అనేక రకాల మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమి కారణంగా ఊబకాయం వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా ఉండదు. ఈ కెఫిన్ గుండెల్లో మంటకు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. చాలామంది వ్యక్తులలో యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని అంటున్నారు. ఈ కెఫిన్ మీ అన్నవాహికను, మీ కడుపును వేరు చేసే స్పింక్టర్‌ను నెమ్మదించేలా చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. తద్వారా కడుపులో ఉత్ఫన్నమయ్యే ఆమ్లాలు అన్నవాహికలోకి సులభంగా వెళ్తాయి. రోజంతా టీ సిప్ చేస్తూ ఉన్నవారు దీర్ఘకాలిక తీవ్రమైన తలనొప్పితో బాధపడతారట. సోడా లేదా కాఫీ వంటి ఇతర కెఫిన్ పానీయాల కంటే టీలో కెఫిన్ తక్కువే అయినా కొన్ని రకాల టీలు ఒక కప్పు టీకి సుమారు 60 మిల్లీ గ్రాముల కెఫిన్ అందిస్తుందని, ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..) -
నిద్రలేమి సమస్య.. కోవిడ్‌తో పాటు అది కూడా కారణమే!
మన దేశ నగర జనాభాలో సగం మంది సరైన నిద్రపోవడం లేదు. నిద్రలేమి తెచ్చే ఆరోగ్య సమస్యలపై నగర వాసుల్లో అవగాహన ఉన్నా... అప్రమత్తత మాత్రం కొరవడింది. రెస్‌మెడ్ సంస్థ తాజా సర్వే కోసం మన నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో వేలాది మందిని ప్రశ్నించిన ఈ సర్వేలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కరోనా నేపధ్యంలో గత రెండేళ్లలో నిద్రలేమి స్థాయిలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. మన దేశంలో నిద్ర నాణ్యత లేమి అనుభవిస్తున్న వ్యక్తులలో 57% పెరుగుదల నమోదైంది. ఈ పరిస్థితికి మహమ్మారితో పాటు వచ్చిపడిన వృత్తిపరమైన ఆందోళన ప్రధాన కారణం. మన నిద్ర వీక్...మాన‘సిక్’... సర్వేలో పాల్గొన్న వారిలో 81 శాతం మంది నిద్రిందచే శైలి తమ జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అంగీకరించారు.. అలాగే 72 శాతం మంది సరిగా నిద్ర వేళలు పాటించకపోవడమే తమ పేలవమైన మానసిక పరిస్థితికి కారణమని చెప్పారు. నిద్రకు ఉపక్రమించిన తర్వాత నిద్రపోవడానికి సగటున సుమారు 90 నిమిషాలు తీసుకుంటున్నామన్నారు. పడుకునే ముందు ఒత్తిడి, నిద్రపోయే ముందు స్క్రీన్ వీక్షించిన సమయం వంటి ఇతర కారణాల బట్టి ఈ వ్యవధి ఆధారపడి ఉంటోంది. కేవలం 53 శాతం మంది మాత్రమే వారికి సహాయపడే పరికరాలను ఉపయోగించి వారి నిద్ర సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. విశేషం ఏమిటంటే... గురకను మంచి రాత్రి నిద్రకు చిహ్నంగా భావించారు. నిద్రలేమి సమస్యలపై అవగాహన లేమి... సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం మంది గురకను మంచి నిద్రకు చిహ్నంగా భావించడం అంటే.. నిద్రలేమి సమస్యలపై అవగాహనకు అది అద్దం పడుతుంది. నిద్రలేమి నుంచి పుట్టే ప్రధాన సమస్య స్లీప్ అప్నియా. గొంతు కండరాలు సడలించడం, ఊపిరి పీల్చుకున్నప్పుడు వాయుమార్గం ఇరుకైన లేదా మూసుకుపోయే స్థితిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. దీని సాధారణ లక్షణాలు బిగ్గరగా గురక, నిద్రలో గాలి పీల్చడం, ఉదయం తలనొప్పి, ఇది సాధారణ శ్వాసను తాత్కాలికంగా నిరోధిస్తుంది. నిస్సారమైన శ్వాస, బిగ్గరగా గురకను పుట్టిస్తుంది. అంతేకాక ఆకస్మిక పగటి నిద్రపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ నిద్ర లేమితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల టైప్2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది... అయితే ఈ అన్ని సమస్యలపైనా నగరవాసుల్లో అవగాహన కొరవడిందని సర్వే తేల్చింది. ఈ నేపధ్యంలో నిద్రలేమి తద్వారా తలెత్తే సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చదవండి: పిల్లలు ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? టైమ్ లేదని తప్పించుకోకుండా ఇలా చేయండి! -
నిదురపోరా.. తమ్ముడా..!
సాక్షి,సిటీబ్యూరో: మహానగరాల వాసులకు నిద్రలేమి శాపంగా పరిణమించింది. ల్యాప్‌టాప్.. ట్యాబ్.. స్మార్ట్‌ఫోన్..ఐపాడ్.. తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకప్పుడు నట్టింట్లో మాత్రమే ఉండేవి..ఇప్పుడు పడకసమయంలోనూ ఇవి బెడ్‌మీదకు చేరడంతో సిటీజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. సెంచురీ మాట్రెసెస్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిటీజన్ల ’స్లీపింగ్ ట్రెండ్స్(నిద్ర అలవాట్లు)’పై జరిపిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. మన నగరంలో సుమారు 54 శాతం మంది నిత్యం సుమారు 5–6 గంటల నిద్రకు సైతం దూరమౌతున్నట్లు తేలింది. చాలా మంది అర్ధరాత్రి పన్నెండు దాటినా..తమకు నచ్చిన షోలను టీవీల్లో వీక్షించడంతోపాటు..స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా కనిపిస్తున్న తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో 75 శాతం, దేశ రాజధాని ఢిల్లీలో 73 శాతం మంది నిద్రసమయంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో కుస్తీ పడుతుండటం. బెంగళూరులో 50..పూణేలో 49 శాతం మందిదీ ఇదే వరసని ఈ సర్వే పేర్కొంది. 12 తరువాతేనిద్రలోకి.. దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో సెంచురీ మాట్రెసెస్ ప్రజల స్లీపింగ్ ట్రెండ్స్‌పై జరిపిన సర్వేలో సుమారు పదివేల మంది నుంచి ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్,సహా ..స్మార్ట్ఫోన్లలో ఫేస్బుక్,వాట్సప్,ట్విట్టర్,ఇన్‌స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్డేట్ అవుతోన్న ఫీడ్‌ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా ఐదు నగరాల్లో సరాసరిన 50 శాతం మంది రాత్రి సమయాలలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో కుస్తీపడుతూ..కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం రాత్రి 12 గంటల తరవాతే నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారట. అధికంగా వీక్షిస్తే కళ్లకు అనర్థమే రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ...ఉదయం 5–6 గంటల మధ్యన నిద్రలేవాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు ఈ సర్వేలో తేలింది. ఇక అధిక పనిఒత్తిడి..ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజులపాటు పనిప్రదేశాలు..జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వేలో తేలింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అవసరాన్ని బట్టి ఉపయోగించడమే మేలు. గంటలతరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే వాటి నుంచి వెలువడే రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లు, వాటిల్లో ఉండే సూక్ష్మమైన నరాలు అధిక ఒత్తిడికిగురవుతాయి. దీంతో మెడ,మెదడు, నరాలపైనే దుష్ప్రభావం పడుతుంది. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు దూరంగా ఉంటే మంచింది.– డాక్టర్ రవిశంకర్‌గౌడ్, సూపరింటెండెంట్, సరోజిని దేవి కంటి ఆస్పత్రి వివిధ నగరాల్లో నిద్రలేమి శాతం ఇలా.. -
గుడ్... నైట్
రాత్రి నిద్ర లేకపోతే మబ్బుగా ఉంటుంది. మంచి నిద్ర గొప్ప వేకువకు వేకప్ కాల్. నిద్రలేమి జీవితానికి ఒక శాపంలా మారింది. లైఫ్‌లో స్పీడ్ ఎక్కువై నిద్రను మింగేస్తోంది. ఇక కొందరు పిల్లలకు రాత్రి అనేది నిజంగా కాళరాత్రి. ఈ చిన్నారుల సమస్యలు వేరు. పీడకలలతో నైట్ అంటేనే వాళ్లకు టెర్రర్. ఇటు పెద్దలు... అటు పిల్లలు వీళ్లందరిపైనా ప్రభావం చూపే అనేక రాత్రి సమస్యలూ, వాటి పరిష్కారాల సమాహారమే ఈ కథనం. రాక్సీలో నార్మాషేరర్... బ్రాడ్వేలో కాంచనమాలా అని సంధ్యాసమస్యల మీద కవిత రాశాడు శ్రీశ్రీ. అందులో మలిసందె వేళ రకరకాల వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావిస్తాడు. అచ్చం అలాగే రాత్రి డ్యూటీలు చేసేవారికి కొన్ని సమస్యలుంటాయి. చీకట్లో చిన్నపిల్లలకు మరికొన్ని ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం కోసం ఎన్ఐజీహెచ్టీ ‘నైట్’ తీసుకోవాల్సిన జాగ్రత్తలు... రాత్రిళ్లు చిన్నపిల్లలు ఎదుర్కొనే సమస్యలూ వంటివాటిని అధిగమిస్తే హెల్త్ పరంగానూ వాళ్లు ‘కెఎన్ఐజీహెచ్టీ’ నైట్స్ అంటే ఆరోగ్యవీరులవుతారు. అలాంటి కొన్ని ‘నైట్’ అంశాలపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం. మీది నైట్ డ్యూటీయా... ఇటీవల నైట్ డ్యూటీలు చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ. అమెరికా లాంటి దేశాల పనివేళలు మనకు రాత్రివేళల్లో నడుస్తుంటాయి. మన రాత్రి వాళ్లకు పగలు కావడమే దీనికి కారణం. అందుకే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాత్రంతా పనిచేయాల్సి వస్తుంటుంది. వాళ్లు మాత్రమే కాదు... మన దేశంలోనూ నైట్‌షిఫ్ట్‌ల్లో హాస్పిటల్స్‌లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతరత్రా సిబ్బంది మొదలుకొని సెక్యూరిటీ గార్డుల వరకు రాత్రంతా పనిచేయాలి. పనికి సంబంధించి రాత్రిపగలు వంటి తేడాలు క్రమంగా చెరిగిపోతుండటంతో నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారికి వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు ఇలా ఉంటాయి. సర్కాడియన్ రిథమ్‌లో మార్పులు : మెదడులో నిద్రకు కారణమయ్యే ప్రత్యేకమైన కణసముదాయాలను ఒక స్విచ్లాంటి దానితో పోల్చవచ్చు. రాత్రి నిద్ర వచ్చేందుకు ‘స్లీప్ స్విచ్’ ఆన్ కావడం, మళ్లీ నిద్ర పూర్తయ్యాక మెలకువ వచ్చే స్విచ్ ఆన్ కావడం ఒక సైకిల్లా జరుగుతుంది. దీనికి మెదడులోపల హైపోథెలామస్లో ఉండే ‘సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్’ అనే భాగం తోడ్పడుతుంది. ఇది రాత్రికాగానే నిద్ర వచ్చేలా, మళ్లీ ఉదయం మెలకువ వచ్చేలా చేస్తుంది. ఇలా ఈ రెండు కార్యకలాపాలు వరసగా, క్రమబద్ధంగా జరగడాన్ని ‘సర్కాడియన్ రిథమ్’ అంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో బయలాజికల్ క్లాక్ అనీ, తెలుగులో జీవగడియారం అంటారు. ఈ గడియారం కారణంగానే మనకు నిర్ణీత వేళల్లో నిద్రరావడం, మెలకువ రావడం జరుగుతుంది. నైట్‌షిఫ్ట్ కారణంగా ఈ రిథమ్ దెబ్బతిని అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్ర నాణ్యతా లోపిస్తుంది. ఫలితంగా తీవ్రమైన అలసట (ఫెటీగ్) కలుగుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. ఇది తాము పనిచేసే ప్రదేశాల్లో ప్రమాదాలకూ కారణం కావచ్చు. గుండెజబ్బుల ప్రమాదం : రాత్రివేళల్లో పనిచేసేవారిలో గుండెజబ్బులు వచ్చే ముప్పు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కరొనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే ముప్పూ ఉంటుంది. ఛాతీ నొప్పి (యాంజైనా) రావచ్చు. హైబీపీ (హైపర్‌టెన్షన్) కూడా రావచ్చు. డయాబెటిస్ ముప్పు: నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50% ఎక్కువ. మహిళల్లో: నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళల్లో కాస్త అరుదుగానే అయినా కొన్ని గర్భధారణ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పిల్లలు చాలా తక్కువ బరువుతో పుట్టడం, గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరగడం వంటి ముప్పులు ఉంటాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు: నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారు పగలు మేల్కొని ఉండేవారికి భిన్నంగా తింటూ ఉంటారు. ఉద్యోగాల్లో చేరిన తొలిరోజుల్లో ఇలా తినాల్సి రావడంతో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. తిన్నది జీర్ణం కాదు. కడుపులో మంట రావచ్చు. తినే వేళలు మారడంతో శానిటరీ అలవాట్లు అంటే మలవిసర్జనకు వెళ్లే వేళలూ మారే అవకాశం ఉంది. దాంతో కొందరికి మలబద్దకం వంటి సమస్యలు రావచ్చు. రాత్రివేళ పనిచేసే ఉద్యోగుల్లో సాధారణంగా శారీరక శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఆహారం తీసుకోవడంలో మార్పుల వల్ల స్థూలకాయం వస్తుంది. అందుకే నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లను కాస్తంత మార్చుకోవడం మంచిది. దాంతో చాలా సమస్యలు తగ్గుతాయి. అలాగే పైన పేర్కొన్న గుండెజబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి ముప్పులూ చాలావరకు తొలగుతాయి. వారి ఆహార నియమాలు ఇలా ఉంటే మంచిది. వీలైనంత తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. దాంతో ఆహారం జీర్ణమవ్వడం తేలికవుతుంది. ∙సాధారణంగా నైట్‌షిఫ్ట్ వాళ్లు ఆఫీస్ కేఫటేరియాలోనే ఎక్కువగా తింటుంటారు. దీనికి బదులు ఇంట్లో నుంచే ఆహారాన్ని తీసుకెళ్లడం మంచిది. ఇంటి భోజనంలోనూ కొవ్వులు ఎక్కువగా లేకుండా, పీచుపదార్థాలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ∙ఒకవేళ తప్పనిసరిగా కాఫెటేరియాలోనే తినాల్సివస్తే... పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే... సలాడ్స్, పళ్లు, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (అంటే... పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్ శాండ్విచ్లు) వంటివి తీసుకోండి. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లకు (ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్ వంటివి) దూరంగా ఉండండి. తీపి పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్స్ (అంటే... క్యాండీలు, చాక్లెట్లు, వైట్ బ్రెడ్స్, బన్స్, పాస్తాస్, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్) వంటిని చాలా తక్కువగా తీసుకోవాలి. నైట్‌డ్యూటీలు చేసే చాలామంది రాత్రిళ్లు కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటుంటారు. కాఫీ, టీ కంటే నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండటమే మేలు. రోజూ 30–40 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరి. నైట్‌షిఫ్టుల్లో ఉండేవారి డ్యూటీల్లో వారి శారీరక కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వారికి వ్యాయామం చాలా అవసరం. దాంతో బరువు పెరగదు. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి. ఆ మందుల వేళలు నిర్ణయించడంలో డాక్టర్ సూచనలు తప్పక తీసుకోవాలి. ఇటీవల మామూలుగానే ప్రజల్లో విటమిన్–డి పాళ్లు చాలా ఎక్కువగా తగ్గిపోతున్నాయి. అలాంటిది ఇక నైట్–డ్యూటీలు చేసేవారి విషయంలో సూర్యరశ్మికి అస్సలు ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల విటమిన్–డి మోతాదులు తగ్గే అవకాశం తప్పక ఉంటుంది. అందుకే నైట్–డ్యూటీలు చేసేవారు ఒకసారి తమ విటమిన్–డి మోతాదులు పరీక్ష చేయించుకొని, అవసరమైతే డాక్టర్ సలహా మీద సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. నైట్‌డ్యూటీల వల్ల కుటుంబసభ్యులతో గడిపే క్వాలిటీ సమయం తగ్గడంతో కుటుంబ బంధాలు ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి. నైట్డ్యూటీల్లో పనిచేసేవారిలో చిరాకు, పరాకు కూడా పెరగవచ్చు. ఫలితంగా కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలూ పెరుగుతాయి. కుటుంబ సంబంధాల్లో విఘాతం కూడా ఒత్తిడికి మరో కారణమయ్యేందుకు అవకాశం ఉంది. అందుకే నైట్‌డ్యూటీల వారు ఈ ఒత్తిడిని అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. ధ్యానం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటిస్తే... రాత్రిళ్లు డ్యూటీ చేసేవారికి అవి మరింతగా ఉపయోగపడతాయి. ఇక్కడ పేర్కొన్న సూచనలు/జాగ్రత్తలు పాటించాక కూడా సమస్యలు తగ్గకపోతే సంబంధిత నిపుణులను కలవాలి. మహిళలైనా, పురుషులైనా నైట్‌షిఫ్టుల్లో పనిచేసేవారు ప్రతి ఆర్నెల్లకో లేదా ఏడాదికోసారో వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నిద్రలేమి సమస్యను అధిగమించడం ఇలా... నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచి నిద్రపట్టేందుకు అవకాశాలెక్కువ. రాత్రి ఒకే వేళకు నిద్రపోవాలి, ఉదయం మళ్లీ వేళకు నిద్రలేవాలి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా కాకుండా ఉండాలి. నిద్రపోతున్న సమయంలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. ఈ మసక చీకట్లోనే నిద్ర వచ్చేందుకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతుంది. పొగతాగడం, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. సాయంత్రం ఏడు దాటాక కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు. రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. పెందళాడే రాత్రి భోజనం పూర్తి చేయండి. కడుపు నిండుగా తినకండి. నిద్రకు వుుందు టీవీలో ఉద్విగ్నత, ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు చూడొద్దు. బెడ్రూమ్లో టీవీ లేకుండా చూసుకోండి. బెడ్రూమ్ను వర్క్‌ప్లేస్‌గా మార్చవద్దు. రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పూర్తిస్థాయి పగటి వెలుగులో గడపాలి. నిద్రకు వుుందు ఆహ్లాదకరమైన మ్యూజిక్‌ను వినండి. నిద్రకు వుుందు పుస్తకాలు చదివితే నిద్ర వస్తుంది కానీ... అందులో ఉత్కంఠకు గురిచేసే ఆసక్తికరమైన విషయాలున్న పుస్తకాలు చదవద్దు. కేవలం నిద్రపట్టడానికి ఉపకరించేలా మాత్రమే మీ పుస్తకపఠనం ఉండాలి. ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులుండి వాటికోసం మందులు ఉపయోగించేవాళ్లు డాక్టర్ సలహామేరకు వాటిని పగటి పూట వాడేలాగా మార్పు చేసుకోవచ్చు. ఇక నొప్పుల సమస్యలు (పెయిన్ డిజార్డర్స్) ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి వాటికి సంబంధించిన మందులు వాడాలి. వాకింగ్ వంటి వ్యాయమాలు చేయాలి. అయితే వాటిని ఉదయం వేళ చేయడం మంచిది. ఒకవేళ ఉదయం వీలుకాకపోతే రాత్రి నిద్రపోయే ముందర మాత్రం కఠినమైన వ్యాయామాలు చేయవద్దు. నిద్రకు ముందు చేసే కఠిన వ్యాయామాలు ఒక్కోసారి నిద్రపట్టకుండా చేయవచ్చు. మంచి నిద్ర పట్టడానికి చేసే పైన పేర్కొన్న మంచి అలవాట్లను ‘స్లీప్ హైజీన్’ నిర్వహణగా పేర్కొంటారు. ఈ ‘స్లీప్ హైజీన్’ను నిత్యం ఆచరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పిల్లల్లో పక్క తడిపే అలవాటు పిల్లల్లో రాత్రి ఇబ్బందుల్లో ముఖ్యమైనది పక్క తడిపే అలవాటు. దీంతో వారు చాలా ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఇతర పిల్లలతో కలిసి బంధువుల ఇంటికీ, ఫంక్షన్లకూ వెళ్లలేరు. కనీసం కంబైన్డ్ స్టడీస్ కూడా చేయలేరు. పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో నాక్టర్నల్ అన్యురిసిస్ అంటారు. సాధారణంగా 95 శాతం మంది పిల్లల్లో ఐదారేళ్లు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్ కంట్రోల్) సాధిస్తారు. కానీ 4 శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే 1 శాతం మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం చూస్తుంటాం. అయితే ఇది అబ్బాయిల్లో ఎక్కువ. ఇలాంటి సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో సాధారణంగా యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్ దీనికి కారణం కావచ్చు. ఇంకా నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్ ఎస్సే చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసుకోవచ్చు. ఈ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం. పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించాలి. చికిత్స: ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమె ప్రమిన్ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి. అలాంటి పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. అలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మసై్థర్యం పెరుగుతుంది. ఈ సమస్యకు హార్మోన్ లోపాలు కారణం అయితే 3–6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. సమస్య అదుపులోకి రాకపోతే పిల్లల డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స చేయించాలి. ఒకింత పెద్ద పిల్లల్లో రాత్రి సమస్యలు... ఇక కాస్తంత పెద్ద పిల్లల అంటే టీనేజ్‌లో ఉండే కౌమార బాలబాలికల్లో నైట్స్లీప్ సమస్యలు మరోలా ఉంటాయి. వాళ్లలో చాలామంది పిల్లలు రాత్రివేళ అకస్మాత్తుగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంటారు. లేచాక చాలా భయపడుతుంటారు. ఈ సమస్యను నైట్ టెర్రర్స్ అంటారు. నైట్ టెర్రర్స్కు కారణాలు: సాధారణంగా మనకు కనుపాపలు వేగంగా కదలని (ఎన్‌ఆర్‌ఈఎమ్) దశలోని స్టేజ్ 3, స్టేజ్ 4 లలో మనసులో కలిగే కలల వంటి భావనలు గుర్తుండవు. కానీ ఆ సమయంలో అత్యంత భయంకరమైన కలలు వచ్చి, వాటికి భయపడి మెలకువ వచ్చినందున అవి గుర్తొచ్చి మరింత భయం వేస్తుంది. దీన్ని నైట్ టెర్రర్‌గా పేర్కొనవచ్చు. ఇది ఎన్‌ఆర్‌ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4 లలో వచ్చే సమస్య. భయంకరమైన కలలు రావడం (నైట్మేర్) : ఇది కూడా ఎన్‌ఆర్‌ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4లో వచ్చే సమస్య. గుర్తుకు రాని భయంకరమైన కలలు రావడం ఈ జబ్బు ప్రత్యేకత. నైట్ టెర్రర్స్ లేదా నైట్‌మేర్స్ సమస్యతో బాధపడే పిల్లల్లో చాలామందిలో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారిని అటు సైకియాట్రిస్ట్‌లతో పాటు ఇటు స్లీప్ స్పెషలిస్ట్‌లకు చూపించి, తగిన చికిత్స తీసుకోవాలి. నైట్ స్లీప్ డిప్రవేషన్ (రాత్రివేళల్లో నిద్రలేమి) నైట్‌డ్యూటీలు చేసేవారిలో నిద్రలేమి సమస్య అంతకంతకూ పెరుగుతోంది. తగినంత నిద్రలేకపోవడంతో అనేక శారీరక, మానసిక సమస్యలొస్తాయి. నిద్రలేమి వల్ల కలిగే తక్షణ నష్టాలు ఏకాగ్రత లోపించడం అలసట / నిస్సత్తువ గుండె వేగం / గతిలో మార్పు తక్షణం స్పందించలేకపోవడం హుషారు తగ్గడం lమబ్బుగా / దిగులుగా ఉండటం చిరాకు, కోపం మానవ సంబంధాలు దెబ్బతినడం, కుటుంబ కలహాలు పెరగడం ఒళ్లునొప్పులు... ఇలాంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక నష్టాలు మతిమరపు మెదడు ఎదుగుదలలో లోపం పిల్లల ఎదుగుదలలో లోపం అధిక రక్తపోటు గుండెజబ్బులు స్థూలకాయం డయాబెటిస్ జీర్ణకోశ సమస్యలు రోగనిరోధక శక్తి తగ్గడం గాయాలు మానే ప్రక్రియ ఆలస్యం కావడం జీవన వ్యవధి (లైఫ్ స్పాన్) తగ్గడం. నిద్రలేమి వల్ల కలిగే / పెరిగే మానసిక సమస్యల్లో కొన్ని... నిద్రలేమి వల్ల మానసిక సమస్యలు పెరుగతాయి. చాలా మానసిక సమస్యల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం నిద్రలేమి. ముఖ్యంగా మూడ్ డిజార్డర్స్, యాంగై్జటీ డిజార్డర్స్, సైకోసిస్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) సమస్యల్లో నిద్రలేమి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లల్లో... అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి లక్షణాలు ∙మెదడు ఎదుగుదలలో లోపం, ∙జ్ఞాపకశక్తి లోపించడం పెద్దల్లో... ∙యాంక్సైటీ డిజార్డర్స్ ∙ డిప్రెషన్ ∙సైకోసిస్ ∙మాదక ద్రవ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం. నిద్రలేమి సమస్య తగ్గడానికి తగినంత నిద్రపట్టేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతో తగ్గకపోతే వైద్యనిపుణులను సంప్రదించాలి. -
నిద్రలేమితో కోట్ల రూపాయల నష్టం!
సరిపడా నిద్రలేకపోతే ఏమవుతుంది? ఆరోగ్య సమస్యలు వస్తాయంటారా! అయితే నిద్రలేమి కేవలం వ్యక్తుల ఆరోగ్యాలకే కాదు.. ఆర్థిక నష్టాలకూ కారణమవుతోందట! నిద్రలేమికి, ఆర్థిక నష్టానికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా... అయితే ఈ స్టోరీ చదవండి... సరైన నిద్రలేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. ఆరోగ్యంగా లేకపోతే సరిగా పనిచేయలేడు. ఇప్పుడిదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ కంపెనీలకు నష్టంగా మారుతోంది. నిద్రలేమి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నట్లు తాజా సర్వేలో తేలింది. రాండ్ అనే ఓ సంస్థ 34 ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) దేశాల్లో సర్వే నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. ఉద్యోగులు తమ పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్తున్నారు. అక్కడా పని చేస్తున్నారు. దీనివల్ల రాత్రి సరిగా నిద్రపోవడం లేదు. సరిపడా విశ్రాంతి లేకుండానే మళ్లీ ఆఫీసులకు వస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. ఇలా భారీ నష్టాలు కంపెనీల కొంప ముంచుతున్నాయి. మొదటి స్థానంలో అమెరికా... అభివృద్ధి విషయంలో ప్రపంచంలో ముందుండే అమెరికా నిద్రలేమి కారణంగా ఎక్కువగా నష్టపోతున్న దేశాల్లోనూ ముందువరుసలో ఉండడం గమనార్హం. నిద్రలేమి కారణంగా ఈ దేశం ఏటా 41,100 కోట్ల డాలర్లు నష్టపోతున్నట్లు తేలింది. ఇక 13,800 కోట్ల డాలర్ల నష్టంతో జపాన్ రెండో స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో జర్మనీ, యూకే, కెనడా ఉన్నాయి. ఇక ఎక్కువ ఉద్యోగులుండే భారత్, చైనాలో నిద్రలేమితో జరుగుతోన్న నష్టాన్ని ఇప్పటి వరకు ఎవరూ లెక్కించలేదు. నిద్రలేమితో కలుగుతోన్న నష్టాన్ని పూడ్చుకోవడానికి జపాన్‌లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఉద్యోగులు కాసేపు కునుకు తీయడానికి ఆఫీసుల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి. -
నాజూకు దేహానికి నిద్ర
కంటినిండా నిద్రపోయే పిల్లలు యుక్తవయసులో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. నాజూకుగానూ ఉంటారని అంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. దాదాపు 20 నగరాల్లోని 2200 మంది పిల్లలపై తాము ఒక అధ్యయనం జరిపామని.. వేళకు నిద్రపోవడం.. నిద్ర తగినంత ఉండటం వారికి ఏళ్ల తరువాత కూడా మేలు చేస్తుందని ఇందులో తెలిసిందని పెన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్త బక్స్టన్ అంటున్నారు. ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయస్కులపై జరిగిన ఈ అధ్యయనంలో తాము వారి బాడీ మాస్ ఇండెక్స్‌ను (బీఎంఐ) పరిశీలించామని.. అవసరమైన సమయం కంటే తక్కువ నిద్రపోయే వారి బీఎంఐ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. నిద్రలేమి అటు శారీరక, ఇటు మానసిక ఆరోగ్యం రెండింటిపై దుష్ప్రభావం చూపుతుందనేందుకు ఈ అధ్యయనం తాజా తార్కాణమని బక్స్టన్ అన్నారు. రాత్రివేళల్లో టీవీలకు అతుక్కుపోతున్న తల్లిదండ్రులు కనీసం పిల్లలను సరైన సమయంలో నిద్రపోయేలా చేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని వివరించారు. పరిశోధన వివరాలు స్లీప్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైంది. -
గురక సమస్యలకు చెక్ పెట్టే హైటెక్ రింగ్
లండన్ : నిద్రలేమి, గురక సమస్యలను నియంత్రించేలా పరిశోధకులు హైటెక్ ఉంగరాన్ని రూపొందించారు. సిలికాన్‌తో తయారుచేసిన ఈ రింగ్‌లో రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్‌ను గుర్తించే సెన్సర్లను అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధించే స్లీప్ అప్నియాకు రాత్రి వేళల్లో బ్లడ్ ఆక్సిజన్ రీడింగ్స్ పడిపోవడం ప్రధాన సంకేతంగా భావిస్తారు. అత్యాధునికంగా రూపొందిన ఈ ఉంగరం ద్వారా ఆక్సిజన్ రీడింగ్‌ను పసిగట్టి వైద్యులకు కీలక సమాచారం అందించే వెసులుబాటు ఉంది. తీవ్ర గురక సమస్యలు గుండె పోటు, స్ర్టోక్లకు దారితీసే క్రమంలో ఈ సమస్యను నివారించేందుకు హైటెక్ రింగ్ ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి మూడు రోజులకు ఓసారి ఈ ఉంగరానికి చార్జింగ్ చేస్తే సరిపోతుందని, ముఖ్యంగా ఒంటరిగా నిద్రించే వారికి ఈ హైటెక్ రింగ్ మేలు చేస్తుందని స్లీప్ ఎక్స్పర్ట్ డాక్టర్ నీల్ స్టాన్లీ చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి రానున్న ఈ హైటెక్ రింగ్ ధర దాదాపు రూ 7500 ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
నిద్రలేమితో అల్జీమర్స్ ముప్పు
లండన్ : నిద్రలేమితో కునుకుపాట్లు పడేవారికి అల్జీమర్స్ బారిన పడే ముప్పు మూడు రెట్లు అధికమని జాన్స్ హాకిన్స్, యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ పరిశోధకులు వెల్లడించారు. పగటిపూట నిద్ర పాట్లతో సతమతమయ్యేవారిలో అల్జీమర్స్ రిస్క్ అధికంగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.మన ఆరోగ్యంపై నిద్ర ప్రభావం మనం ఊహించిన దాని కంటే అధికంగా ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడైందని వారు చెప్పారు. 123 మంది వాలంటీర్లపై 16 ఏళ్ల పాటు పరిశీలించిన మీదట ఈ వివరాలు రాబట్టామని తెలిపారు. నిద్రలేమి, ఒత్తిడి ఇతరత్రా కార ణాలతో పగటిపూట కునికిపాట్లు పడితే అల్జీమర్స్ వ్యాధి బారినపడే అవకాశం అధికమని గుర్తించామన్నారు. అల్జీమర్స్ నియంత్రణకు వ్యాయామం, పోషకాహారం, మానసిక ఉత్తేజం వంటివి ఉపకరిస్తాయని వెల్లడైనా నిద్రతో ఈ వ్యాధికి నేరుగా ఉన్న సంబంధం తమ అథ్యయనంలో తేలిందని జాన్స్ హాకిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఆడమ్ పీ స్పైరా చెప్పారు. సరైన నిద్రకు ఉపక్రమించడం ద్వారానే అల్జీమర్స్‌కు చెక్ పెట్టవచ్చని అన్నారు. -
నిద్రలేని రాత్రులు గడిపా: మెగాస్టార్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు నటుడిగా 40 ఏళ్లకుపైగా అనుభవముంది. ఆయన ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 73 ఏళ్ల వయసులోనూ సత్తాచాటుతున్నారు. కోట్లాది అభిమానులకు ఆరాధ్యుడైన అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతి సినిమా ఓ పరీక్షని, తనకు ఓ పరీక్ష (ఎగ్జామ్) వంటిదని, పింక్ షూటింగ్ సమయంలో ప్రతిషాట్లో నటించే ముందు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. ఓ షాట్లో నటించే ముందు 40 ఏళ్ల క్రితంలాగే ఇప్పుడూ ఆత్రుతతో ఎదురుచూస్తానని అన్నారు. జీవితంలో సులభంగా ఏదీ రాదని చెప్పారు. పింక్ సినిమాలో అమితాబ్ లాయర్ పాత్రలో నటించారు. షూజిత్ సిర్కర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అగ్రహీరోగా వెలుగొంది, క్యారెక్టర్ స్టార్‌గా మారడం ఇబ్బందిగా అనిపించిందా అన్న మీడియా ప్రశ్నకు.. ఆ దిశగా ఆలోచించలేదని అమితాబ్ చెప్పారు. నటించడం తనకు ఇష్టమని, అదృష్టవశాత్తూ ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయని, క్యారెక్టర్ పాత్రలోనైనా లేదా ఇతర పాత్రలోనైనా నటిస్తానని అన్నారు. పింక్ సినిమాలో అమితాబ్‌తో పాటు తాప్సీ, కృతీ కుల్హరి, ఆండ్రియా, అంగాద్ బేడీ తదితరులు నటించారు. -
అవే లేకుంటే... తీపి గుర్తులు ఎక్కడివి..?
నిద్రలేని రాత్రులు ఆ నిద్రలేని రాత్రులే లేకుంటే, చెప్పుకోవడానికి తీపి గుర్తులెక్కడివి..? బహు భాషా నటిగా వరుస షూటింగ్‌లతో నిద్రలేని రాత్రులు చాలానే ఉన్నాయి. అలాంటి నిద్రలేని రాత్రులలో ముఖ్యంగా చెప్పుకోదగినవి ముచ్చటగా మూడున్నాయి. హీరోయిన్గా నాకు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ఒకటైన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో నేనే చేయాలని దర్శక నిర్మాతలు పట్టుబట్టారు. అప్పటికే వాణిశ్రీ రంగస్థలంపై 150 సార్లు విజయవంతంగా ప్రదర్శించిన క్యారక్టర్ అది. ఆ నాటకం ఆధారంగా తయారవు తున్న చిత్రం కావడంతో ఆసక్తి కలిగింది. అప్పటికే ‘ప్రయాణంలో పదనిసలు’ చిత్రానికి కేటాయించిన కాల్షీట్స్ నుంచి పదహారు రోజులు మాత్రమే సర్దగలనని చెప్పాను. సరేనన్నారు. యానాం తీరంలో గోదావరి ఒడ్డున గుడిసె సెట్లో షెడ్యూల్ మొదలైంది. అదే సమయంలో గోదావరి మరో ఒడ్డున జరుగుతున్న ‘ప్రయాణంలో పదనిసలు’ షూటింగ్లో పాల్గొనాల్సిన పరిస్థితి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు లాంచీలో తిరుగుతూ రెండు చిత్రాలకూ రాత్రింబవళ్లు పనిచేశాను. చెన్నై మహా లింగపురంలో ఇంటి నిర్మాణం పనుల్లో అమ్మ జయశ్రీ బిజీగా ఉండటంతో అమ్మమ్మ సుబ్బలక్ష్మిని తోడుగా పెట్టుకొని గడిపాను. ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో మాస్... ‘ప్రయాణంలో పదనిసలు’లో క్లాస్ వేషధారణ. గోదావరి రెండు తీరాల మధ్య లాంచీలో ప్రయాణించే సమయాన్నే మేకప్‌కు కేటాయించాను. లాంచీలో ఇటూ అటూ తిరుగుతూ మేకప్ మార్చుకుంటున్న సమయంలోనే నా చేతికి ఉన్న ఒక బంగారు గాజు గోదావరిలో పడి పోయింది. గోదావరి తల్లికి సమర్పించు కున్నానని సంతోషించాను. షూటింగ్ స్పాట్లో ఒక పెంకుటింట్లో బస. రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ జరిగేది. మళ్లీ ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ కోసం వేకువన నాలుగు గంటలకే నిద్ర లేవాల్సి వచ్చేది. దాదాపు ఆ పదహారు రోజులూ నాకు నిద్రలేని రాత్రులే! ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ ఘనవిజయం ఆ కష్టాన్ని మరిపించింది. కర్ణాటకలో రామానంద్‌సాగర్ హిల్స్‌లో ‘హుళి హాలిన మేపు’ చిత్రం కోసం నాకు, ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్‌కు మధ్య డ్యూయెట్ చిత్రీకరిస్తున్నారు. ఆ షూటింగ్ పూర్తయ్యాక, మర్నాడే హైదరాబాద్‌లో హీరో కృష్ణతో ‘ముత్తైవ’ చిత్రం షూటింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. అదే సమయంలో జోరున వర్షం మొదలైంది. రాత్రివేళ ఆ వర్షంలోనే ఊటీకి, ఊటీ నుంచి కోయంబత్తూరు, కోయంబత్తూరు నుంచి చెన్నై, అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నాను. చెన్నైలో విమానం తలుపులు మూసేస్తున్న సమయంలో మైకులో అనౌన్స్ చేయించి, విమానంలోకి చేరుకోగలిగాను. హైదరాబాద్ చేరేలోగా విమానంలోనే రెడీ అయి, సకాలంలో షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నాను. మళ్లీ తెల్లారితే చెన్నై చేరుకోవాలి. నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన కె.ఎస్.గోపాలకృష్ణన్ ‘నాయకరిన్ మగళి’ ప్రారంభోత్సవం... అందులో నేనే హీరోయిన్. పైగా నాకది నూరో చిత్రం. హైదరాబాద్‌లో షూటింగ్ ముగించుకుని, తెల్లారేసరికి చెన్నై చేరుకుని, తమిళచిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్లలో పాల్గొనేందుకు నిద్రలేని రాత్రులు గడిపాను. రష్యాలో 1976లో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌కు ‘సోగ్గాడు’ చిత్ర బృందమంతా హాజరయ్యాం. మొత్తం పదిరోజులకు వారం రోజులే ఉండగలనని యూనిట్ పెద్దలకు చెప్పాను. ఎన్టీఆర్ హీరోగా ‘మాదైవం’ షూటింగ్‌కు రష్యా నుంచి బయలుదేరాను. ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా రష్యా నుంచి కాబూల్, ఢిల్లీ, చెన్నైల మీదుగా హైదరాబాద్‌కు సకాలానికి చేరుకున్నాను. అలాంటి నిద్రలేని రాత్రులే ఆ రోజుల్లో నాకు క్రమశిక్షణ గల నటిగా పేరుతెచ్చాయి. - కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
ఆ రాతిరంతా జాతరే...
నిద్రలేని రాత్రులు కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యమే కాదు, మనసూ అల్లకల్లోలమవుతుందని అందరూ అంటారు. అది ఎంతవరకూ నిజమో నాకు తెలీదు. ఎందుకంటే నేను నిద్రలేని రాత్రులు గడిపినా ఏనాడూ నా మనసు గతి తప్పలేదు. నిద్రలేని రాత్రి అనగానే నాకు మొదటగా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను. ఎవరైనా బాగా చదువుతున్నావా అంటే చాలు... సూపర్‌గా చదివేస్తున్నాను, తప్పకుండా మంచి మార్కులతో పాసవుతాను అని గొప్పగా చెప్పేవాడిని. మా ఇంట్లో వాళ్లకే కాదు, ఊరందరికీ కూడా అదే చెప్పాను. నేనిచ్చిన బిల్డప్‌కి అందరూ నేను నిజంగానే మంచి మార్కులతో పాసైపోతాను అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నేను ఫెయిలయ్యాను. రిజల్ట్ చూసుకోగానే గుండె గుభేల్మంది. అందరూ కలిసి ఉతికేస్తారేమోనని భయమేసింది. దాంతో అప్పటికప్పుడు ఓ ప్లాన్ వేశాను. మా ఇంటి ముందున్న మామిడి చెట్టెక్కి కూచున్నాను. గంటో రెండు గంటలో కాదు. రాత్రంతా చెట్టు మీదే ఉన్నాను. మన సంగతి బాగా తెలుసు కాబట్టి... మావాళ్లు ఎక్కడెక్కడో వెతికి, వాడే వస్తాడ్లే అని వదిలేశారు. దాంతో నాకు ఆ రాతిరంతా జాతరే. తెల్లారే వరకూ చెట్టుమీదే జపం చేశాను. తర్వాత ఇక తప్పదని దిగి ఇంటికెళ్లా. పాపం పిల్లాడు రాత్రంతా నిద్ర లేకుండా అవస్థ పడ్డాడే అని మావాళ్లేమీ జాలి పడలేదు నా మీద. ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి, వాళ్ల ఎమోషన్ చల్లార్చుకున్నాకే వదిలారు. ఆ సంఘటన, ఆ రాత్రి చెట్టుమీద నేను పడిన పాట్లు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. కెరీర్లో ఎదిగే క్రమంలో ఎవరికైనా పోరాటం ఉంటుంది. దాని కారణంగా కొన్ని నిద్ర లేని రాత్రులూ ఉంటాయి. కానీ వాటిలో బాధ ఉండదు. సంతోషమే ఉంటుంది. అవన్నీ మన బతుకు పుస్తకంలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నాకు ఆ సమయంలో గడిపిన రాత్రుల కంటే కృష్ణవంశీతో పని చేసినప్పుడు గడిపిన నిద్రలేని రాత్రులే ఎక్కువ గుర్తు. కృష్ణవంశీతో పని చేయడమంటే మాటలు కాదు. ఆయన సృష్టించే క్యారెక్టర్స్‌ని పండించడం అంత తేలికైన విషయం కాదు. ఆ క్యారెక్టరయి జేషన్ మామూలుగా ఉండదు. వాటిలో లీనమై చేసేసరికి ఒళ్లు హూనమైపోతుంది. ‘సముద్రం’ సినిమాలో నేను చేసింది చాలా క్లిష్టమైన పాత్ర. చాలా డిఫరెంట్ పాత్ర కూడా. అది చేసేటప్పుడు నేను పడిన కష్టం నాకు మాత్రమే తెలుసు. నిద్రపట్టేది కాదు. ఇరవై నాలుగ్గంటలూ ఆ పాత్ర మీదే ధ్యాస. ఎలా చేయాలి, ఎంత బాగా పండించాలి అన్నదే ఆలోచన. షూటింగ్ పూర్తయ్యాక మాత్రం ఆదమరిచి నిద్రపోయాను. అలసిపోయినందుకు కాదు. అంత గొప్ప పాత్ర చేశానే అన్న తృప్తితో. కృష్ణవంశీతో ఎప్పుడు పని చేసినా ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇక వ్యక్తిగత జీవితంలో అయితే... నేను స్వతహాగా అనవసర విషయాల జోలికి వెళ్లను. నా పనేంటో నేను చేసుకు పోతాను తప్ప, ఏవీ పట్టించుకోను. కానీ మొదటిసారి పట్టించుకున్నాను. అవే మొన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్. ఎంత పెద్ద విషయానికైనా చలించని నన్ను ఈ ఎన్నికలు చాలా కలవరపెట్టాయి. చాలా డిస్టర్బ్ చేశాయి. ఎందుకు ఇలాంటి మనుషుల మధ్యకి వచ్చానా, ఎందుకు ఇలాంటి వాళ్లతో పోటీకి నిలబడ్డానా అని నాలో నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఎప్పుడూ నన్ను ఏ విషయంలోనూ ఏమీ అనని, అడ్డుకోని మా ఇంట్లో వాళ్లు కూడా... ‘మీకు అవసరమా ఇవన్నీ’ అన్నారంటే నేనెంతగా మథనపడ్డానో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఎలక్షన్లు చూశాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే పోటీ బాధపెట్టినా, ఫలితాలు సంతోషాన్నే మిగిల్చాయి. ఇక మిగతా సమస్యలంటారా? అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా పక్కవాళ్ల సమస్యల్ని మన సమస్యల్లా ఫీలైపోయి, వాటిని మీద వేసుకుని, ఎలా పరిష్కరించాలా అని మల్లగుల్లాలు పడిపోయే నాలాంటి వాళ్లకు నిద్రలేని రాత్రులు లేకుండా ఉంటాయా! ఆలోచనలతో కొన్ని... ఆవేదనతో కొన్ని... ఎదురు దెబ్బలు తిన్న బాధతో కొన్ని... ఇలా కొన్ని కొన్ని కలిసి ఎన్నో ఉంటాయి. కానీ వాటి గురించి ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే మరొకరి బాధను పంచుకోవడంలో ఆనందం ఉంటుంది. ఆ సంతోషం ముందు నాకు మరేదీ ఎక్కువ కాదనిపిస్తుంది. అందుకే ఒకరి కోసం నిద్ర లేకుండా గడిపిన ఏ రాత్రీ నన్ను బాధపెట్టదు. బాధను మిగల్చదు. - సమీర నేలపూడి -
ఆ రాత్రులే నన్ను మలిచాయి!
నిద్రలేని రాత్రులు జె.కె.భారవి సినీ రచయిత మా రోల్ మోడల్ ఆచార్య ఆత్రేయగారే అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ‘టాప్’ డైలాగ్ రైటర్లు, చంద్రబోస్ లాంటి ‘ఏస్’ లిరిక్ రైటర్లు స్టేట్మెంట్లివ్వడం మనకు తెలుసు. అలాంటి మహారచయిత దగ్గర దశాబ్దంపైగా శిష్యరికం చేసిన అదృష్టవంతుణ్ని నేను. ఆత్రేయగారికి ‘రాత్రేయ’ అనే నిక్‌నేమ్ ఉండేది. పాడుతా తీయగా చల్లగా... పసిపాపలా నిదురపో తల్లిగా, నిదురించవె తల్లి... ఈ వయసు దాటితే నిదురేది మళ్లీ, నిదుర రాని నాకు కలలు కూడా రావె... లాంటి పాటల కావ్యాలన్నీ తను నిదరపోకుండా రాసినవే. తపస్సు అంటే ఏమిటో మా గురువుగారు పాట కోసమో, మాట కోసమో ఆలోచించడం చూస్తే తెలుస్తుంది. రాత్రి తొమ్మిది గంటలకి పద్మాసనం వేసుకొని బెడ్‌మీద కూర్చునేవారాయన. కింద నేను రకరకాల ఆసనాలు మార్చుతూ ఉండేవాడిని. కట్ చేస్తే... కోడి కూసేది. ‘తెల్లారింది పడుకుందామా సార్’ అనేవాణ్ని నేను. ఓ చిరునవ్వు పువ్వు పూసేది ఆయన పెదాలపై. ఆయన దగ్గర పనిచేసినన్నినాళ్లు దాదాపు నిద్ర అనేది లేకుండా అలాగే గడిచిపోయింది. అసలన్ని రోజులు నిద్రపోకుండా ఎలా ఉండగలిగేవాళ్లమో తెల్సా? ఆ రోజుల్లో ‘డెక్సిడ్రిన్’ అనే టాబ్లెట్స్ దొరికేవి. అవి మా గురువుగారి దగ్గర బోలెడన్ని స్టాక్ ఉండేవి. ఒక్క మాత్ర వేసుకుంటే కళ్లకి క్లిప్పులు పెట్టినట్టు అయిపోయేది. ఇక నిద్ర అనే మాట వస్తే ఒట్టు (ఆ మాత్రలు ఇప్పుడు లేవు, నిషేధించారు). మా గురువుగారి దయవల్ల ఆ వివరాలన్నీ ఒక్కొక్కటే వంట పడుతూ... క్రమక్రమంగా ‘డెక్సిడ్రిన్’ లేకపోయినా సంకల్ప బలంతో కంటి కునుకు దూరమవుతూ వచ్చింది - అందువల్ల నాకు ఎంత లాభం వచ్చిందంటే... కొన్ని వేల పుస్తకాలు చదివే భాగ్యం. లెక్కలేనన్ని సినిమాలు చూసే అదృష్టం. ఫుల్ ఫ్లెడ్జెడ్గా రాసుకున్న బోలెడన్ని స్క్రిప్టులు. ఎల్ఐసీ శ్రీనివాస్, వసంత్ కుమార్ లాంటి నా సాహితీ మిత్రులతో మహారచయిత, మా బ్రదర్ శ్రీ వేదవ్యాసగారితో రోజుల తరబడి కొనసాగించిన చర్చలు. కూడబెట్టుకున్న జ్ఞానం. ఎలా వెలకట్టను వీటికి? నా జీవితంలో ‘ఇన్ని’ నిద్రలేని రాత్రులున్నా... ‘కొన్ని’ మాత్రం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. మా ఊరు... వరంగల్ జిల్లాలో కోమటిపల్లి అనే చిన్న అందమైన అగ్రహారం. నా రచనా జీవితం అక్కడే ప్రారంభమైంది. వందకు పైగా నాటకాలు రాశాను అక్కడే. అన్నమయ్య స్క్రిప్ట్ కూడా అక్కడే పురుడు పోసుకుంది. అప్పటికి ఎలక్ట్రిసిటీ రాలేదు మా ఊళ్లోకి. లాంతర్ దీపం పెట్టుకుని చకచకా రాసేస్తుండేవాణ్ని. మా అమ్మ గంటకోసారి లేచి ‘ఎంతవరకు అయింది బిడ్డా’ అని అడుగుతూండేది. అయినంతవరకూ చదివి వినిపిస్తుండేవాణ్ని. అన్నమయ్య కథనం విని తను పులకించిపోయేది. అన్నమయ్య స్క్రిప్ట్‌కి తొలి శ్రోత అయిన మా అమ్మతో పాటు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పెద్దలూ చాలామంది ఉన్నారు మా ఊళ్లో. ఐతే అది సినిమాగా రావడానికి చాలా ఏళ్లు పట్టింది. ఎందరెందరో ప్రముఖులు అన్నమయ్య తీయడానికి నడుం బిగించారు. ప్రముఖ హాస్యనటులు పద్మనాభం నిర్మించాలని ప్రయత్నించారు, కుదర్లేదు. సి.ఎస్.రావు దర్శకత్వంలో సముద్రాల కంబైన్స్‌వారు మొదలుపెట్టారు. బాలమురళీకృష్ణగారి సంగీత దర్శకత్వంలో 18 పాటలు రికార్డ్ చేశాక ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఆచార్య ఆత్రేయగారు దర్శకత్వం చేయడానికి సంకల్పించారు. శ్రీకాంత్‌గారు నిర్మాతగా, కె.వి.మహదేవన్‌గారి నేతృత్వంలో 20 పాటలు కంపోజింగ్ అయ్యాయి. కొన్ని రికార్డ్ కూడా చేశారు. అదీ ఆగిపోయింది. చివరాఖరికి నా మిత్రుడు జొన్నవిత్తుల ద్వారా దర్శకేంద్రుడికి అన్నమయ్య కబురు అందింది. ఆయనకు నచ్చింది. నిర్మించడానికి దొరస్వామిరాజుగారు ముందుకు వచ్చారు. నాగార్జున కథ విన్న వెంటనే ఓకే అన్నారు. కీరవాణి సంగీత దర్శకత్వం, విన్సెంట్‌గారి ఛాయాగ్రహణం, వేంకటేశ్వరుడిగా సుమన్ హుందాతనం... అన్నమయ్యకు వన్నెలు దిద్దాయి. చిత్రం విడుదలైంది. అఖండ విజయం చేకూరింది. కానీ ఆ సినిమాను చూడకుండానే మా అమ్మ వెళ్లిపోయింది! ఆ వెలితి తెలీకుండా ఆదుకుంది నా మరో తల్లి ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి. అన్నమయ్య రచయిత నా కొడుకు అంటూ ఆమె గర్వంగా చూస్తుంటే... ఆ కళ్లల్లో నన్ను కన్న అమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ కంటిలో ఒక అమ్మ... ఈ కంటిలో ఒక అమ్మ... హృదయంలో సరస్వతమ్మ... ఇక నిద్రతో ఏం పని చెప్పండి! - సమీర నేలపూడి -
నాలో ఎన్నో... ప్రశ్నలు రేపిన రాత్రి!
నిద్రలేని రాత్రులు అది 1971వ సంవత్సరం. నేను అప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నాను. అప్పటికి మూడేళ్ల క్రితమే నేనా ఉద్యోగంలో చేరాను. కానీ ఆ ఉద్యోగం నాకు ఎన్నో నిద్ర లేని రాత్రుల్ని మిగులుస్తుందని నేనప్పుడు ఊహించలేదు. ఇండియా, పాకిస్తాన్ల మధ్య పద్నాలుగు రోజుల పాటు హోరాహోరీగా యుద్ధం జరిగింది. దేశం తరఫున అందరం శాయశక్తులా పోరాడాం. చివరికి సంధి కుదిరింది. యుద్ధం ఆగిపోయింది. ఆ రోజు రాత్రి నేను బిల్లెట్లో (బిల్లెట్ అంటే విపత్కర సమయాల్లో సైనికులు ఉండే తాత్కాలిక నివాసం) పడుకుని ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. నిద్రించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ బిల్లెట్లోని ఓ మూలకి చూశాను. ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. అక్కడ నా స్నేహితుడు నారాయణన్ ఉండాలి. కానీ లేడు. ఏదో దిగులు కమ్మేసింది నన్ను. నారాయణన్ తమిళనాడుకు చెందినవాడు. మరో ఐదు రోజుల్లో అతని పెళ్లి. దానికి రమ్మని మమ్మల్ని రోజూ పోరేవాడు. ‘మా ఊరు చాలా అందంగా ఉంటుంది, బోలెడన్ని పక్షులు వలస వస్తాయి, అవన్నీ చూడాలంటే మా ఊరు రావాలి, అందుకు నా పెళ్లే తగిన సందర్భం, మీరంతా రావాల్సిందే’ అంటూ రోజూ పోరేవాడు. కానీ ఇప్పుడు తను లేడు. నారాయణన్ మాత్రమే కాదు... గురు మీత్సింగ్ కూడా లేడు. పంజాబ్ నుంచి వచ్చి ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు గురుమీత్. తన ముసలి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని కలలు కనేవాడు. వచ్చే భార్య వాళ్లని ఆదరిస్తుందో లేదోనని పెళ్లి కూడా చేసుకోననేవాడు. అతను ఏడి? ఎక్కడున్నాడు? ఎవరి కోసమైతే బతికాడో ఆ తల్లిదండ్రుల్ని వదిలేసి ఎలా వెళ్లిపోగలిగాడు? మా స్వామి కూడా లేడు. నేను ఎయిర్‌ఫోర్స్‌కి వెళ్లినప్పుడు ఆయనే నా తొలి గురువు. ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో... అన్నీ నేర్పాడు. నువ్వు ఇంకా బాగా చదువుకుని ఎయిర్‌ఫోర్స్‌లోనే మంచి పొజిషన్‌కి చేరుకోవాలి అంటుండేవాడు. ఇకమీదట అలా చెప్పడానికి తను లేడు. కదన రక్కసి పాదాల కింద పడి నలిగిపోయాడు. అందరినీ వదిలి వెళ్లిపోయాడు. సరిగ్గా అంతకు కొన్ని రోజుల ముందే స్వామికి కూతురు పుట్టింది. తనని ఇంకా చూసుకోనే లేదు. ‘యుద్ధం అయిపోగానే నా పాపను చూడ్డానికి వెళ్తాను, తనని బాగా పెంచుతాను, డాక్టర్ని చేసి ఎయిర్ ఫోర్సులోనే చేర్పిస్తాను’ అంటూ తన కూతురి భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. ఆ కలల గురించి ప్రతిక్షణం కలవరించేవాడు. కానీ అతని కలలు నిజం కాలేదు. అతని కూతురి కోసమైనా మృత్యువు స్వామి మీద జాలి పడలేదు. బిల్లెట్లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. అక్కడే తిరుగుతున్నారు. నవ్వుతున్నారు. నన్ను పలకరిస్తున్నారు. కబుర్లు చెబుతున్నారు. కన్నుమూసి తెరిచేలోగా మాయమవుతున్నారు. వారిని గూర్చిన తలపుల భారాన్ని మోయలేకపోయాను. వాళ్లు లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఆ రాత్రి క్షణమొక యుగంలా గడిచింది. అది మాత్రమే కాదు... క్షణమైనా కన్నంటుకోనీయకుండా నన్ను చిత్రవధ చేసిన ఆ రాత్రి... నాలో చాలా ప్రశ్నల్ని కూడా రేపింది. ఎవరి మధ్య జరిగింది యుద్ధం! దేశాల మధ్య జరిగిందా? లేదు. పాకిస్తాన్ అక్కడే ఉంది. ఇండియా ఇక్కడే ఉంది. అవి నేరుగా తలపడలేదు. నాయకుల మధ్య జరిగిందా? లేదు. వాళ్లు కూడా ఎక్కడివాళ్లక్కడ బాగానే ఉన్నారు. సుఖంగా ఉన్నారు. మరి ఎవరి మధ్య జరిగింది? అహంకారాల మధ్య జరిగింది. తమ అహాలను ప్రదర్శించడానికి జరిగింది. దానివల్ల ఏం జరిగింది? నాలాంటి కొందరి గుండెల్లో శూన్యం మిగిలింది. కొందరు తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలింది. కొందరు పిల్లలకు తండ్రి ప్రేమ దూరమయ్యింది. కొన్ని కుటుంబాల్లో చీకటి పరచుకుంది. పాకిస్తాన్‌తో సంధి కుదుర్చుకున్న మన ప్రభుత్వం వేలమంది సైనిక బలగాన్ని తీసుకెళ్లి సగర్వంగా పాకిస్తాన్ చేతుల్లో పెట్టింది. కానీ పోయిన సైనికుల ప్రాణాల్ని వెనక్కి తీసుకు రాలేకపోయింది. నా స్నేహితులను నాకు మళ్లీ చూపించలేకపోయింది. నాటి జ్ఞాపకాలను మర్చిపోలేక ఇప్పటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్న నా కంటి మీదికి కునుకును తీసుకు రాలేకపోయింది. - ఫన్డే టీమ్ -
రాత్రంతా కన్నీళ్లతో...
నిద్రలేని రాత్రులు ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలూ, రాత్రంతా కునుకుపట్టనివ్వని విషాదాలూ ఉంటాయి. అవి మనిషిని జీవితంలో రాటుదేల్చవచ్చునూ వచ్చు, ఆత్మీయతను పెంచనూ వచ్చు. ఆ జ్ఞాపకాలను సున్నితంగా తడిమే ప్రయత్నమే ఈ శీర్షిక. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ అవకాశాలు ఉండి కానీ, లేక కానీ, విజయాల వల్ల కానీ, పరాజయాల వల్ల కానీ... నిద్రలేని రాత్రులు నేనెప్పుడూ గడపలేదు. వ్యక్తిగతంగా మాత్రం చాలానే గడిపాను. ఆ రోజులు గుర్తొస్తే... ఇప్పటికీ నా కంటిమీది కునుకు ఎగిరిపోతుంది. ఆరోజు... ‘ఆగడు’ షూటింగ్లో ఉన్నాను. నాకు, మహేశ్బాబుకీ మధ్య కామెడీ సీన్ షూట్ చేస్తున్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం. చుట్టూ ఉన్నవాళ్లు, సహ నటీనటులు కూడా పడీ పడీ నవ్వుతున్నారు. అంతలో నా అసిస్టెంట్ కంగారుగా వచ్చి ఫోన్ నా చేతిలో పెట్టాడు. అక్క చేసింది. తను చెప్పింది వినగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పటిప్పుడు బయలుదేరి స్టార్ హాస్పిటల్‌కి వెళ్లిపోయాను. ప్రాణానికి ప్రాణమైన నా భార్య... ఐసీయూలో ఉంది. వెంటిలేటర్ పెట్టారు. సెలైన్లు ఎక్కిస్తున్నారు. తనని బతికించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు అంతా బ్లాంక్ అయిపోయింది. అంతవరకూ బాగానే ఉన్న మనిషి ఒక్కసారిగా ఊపిరందక కుప్పకూలిపోయిందట. మాట పడిపోయిందట. ఎందుకలా జరిగిందని అడిగితే... పాదాల నుంచి ఊపిరితిత్తుల వరకూ రక్తం గడ్డ కట్టేసిందన్నారు డాక్టర్లు. కాపాడటం కష్టమంటూ పెదవి విరిచేశారు. అప్పటికి సమయం సాయంత్రం ఆరయ్యింది. ‘మీరు ఇంటికి వెళ్లిపోండి. మీ భార్యకి ఏదైనా అయితే మీకు ఉదయం ఆరు గంటల లోపు ఫోన్ వస్తుంది. ఫోన్ రాలేదంటే అప్పుడు హోప్స్ పెట్టుకోవచ్చు’ అని చెప్పారు. సినిమా వాళ్లు తమ ఫోన్ ఎప్పుడూ మోగుతూ ఉండాలని కోరుకుంటారు. ఏ దర్శకుడో ఫోన్ చేసి అవకాశం ఇస్తున్నాను అని చెప్తాడేమోనని. కానీ ఆ రాత్రి నేను నా ఫోన్ మోగకూడదని కోరుకున్నాను. ఆ రాత్రి ఒక్కొక్క నిమిషం ఒక్కో సంవత్సరంలాగా గడిచింది. సాధారణంగా సినిమా వాళ్లంతా తమ ఫోన్ ఎప్పుడూ మోగుతూ ఉండాలని కోరుకుంటారు. ఏ దర్శకుడో ఫోన్ చేసి అవకాశం ఇస్తున్నానని చెబుతాడేమోనని. కానీ ఆ రోజు మాత్రం నేను ఫోన్ రాకూడదని కోరుకున్నాను. దేవుళ్లందరికీ మొక్కాను. రాత్రంతా కన్నీళ్లతో గడిపాను. తెల్లారింది. ఆరు దాటినా ఫోన్ రాకపోవడంతో హాస్పిటల్‌కి పరుగెత్తాను. అప్పటికి ఫరవాలేదు, కానీ ప్రమాదం పొంచే ఉందన్నారు. తనకొక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎక్కువ డోస్ ఇస్తే ప్రాణం పోతుంది. తక్కువ ఇస్తే క్లాట్స్ కరగకపోవచ్చు. కానీ రిస్క్ తీసుకోలే రు కాబట్టి తక్కువ డోసే ఇచ్చారు. డాక్టర్ల చలవ, దేవుడి దయ... నా లత బతికింది. కానీ తనకిక ఏం కాదు అన్న శుభవార్త నా చెవిన పడటానికి పది రోజులు పట్టింది. తర్వాత కూడా ఆరు నెలలు నరకమే. లత పొట్టని ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ కోసి సర్జరీ చేశారు. నూట యాభైకి పైగా కుట్లు పడ్డాయి. కదలటానికి వీల్లేదు. ఏమాత్రం కదిలినా కుట్లు విడిపోతాయని భయం. పడుకునే ఉంటే వీపంతా పుండ్లు పడతాయని భయం. ఆరు నెలల పాటు తను, తననలా చూస్తూ నేను చిత్రవధ అనుభవించాం. ఏదేమైతేనేం... చివరకు నా భార్య కోలుకుంది. నేను పోతానని తెలిసినా అంత టెన్షన్ పడేవాణ్ని కాదు. నేనే ప్రపంచంగా బతికే అమాయకురాలు నా భార్య. తననా పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. నా బెస్ట్ ఫ్రెండ్‌ని కోల్పోతానేమోనని అల్లాడిపోయాను. అదృష్టంకొద్దీ ఆ పరిస్థితి రాలేదు. కానీ ఆ రాత్రిని మాత్రం నేనింతవరకూ మర్చిపోలేదు. - సమీర నేలపూడి -
ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు: వెంకయ్య
ఓ వ్యక్తి కారణంగా కేంద్ర మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఈ విషయాన్ని చెప్పింది కూడా వాళ్లూ వీళ్లూ కారు. స్వయానా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మోదీ తాను నిద్రపోవట్లేదని, తమనూ నిద్రపోనివ్వడం లేదని చెప్పారు. ఆయన తెల్లవారుజామునే నిద్ర లేస్తారని, ఇక అప్పటి నుంచి తమకు కూడా నిద్ర ఉండట్లేదని అన్నారు. అయినా దాన్ని కూడా తాము ఆస్వాదిస్తున్నామని, ప్రజల కోసం, సామాన్యుల జీవనాన్ని మెరుగు పరిచేందుకు పని చేయడం జీవితంలో అన్నింటికంటే చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు కావాలంటే ఐదేళ్లు పడుతుందని కొంతమంది మంత్రులు అంటే.. ప్రధాని మాత్రం ఒక్క ఏడాదిలోనే పూర్తి చేయాలని గట్టిగా నిర్దేశించారన్నారు. ఇప్పటికి కేవలం 7 వారాల్లోనే దాదాపు 7 కోట్ల మంది జనధన యోజన కింద ఖాతాలు పొందారని వెంకయ్యనాయుడు చెప్పారు.