ఆ రాతిరంతా జాతరే...
నిద్రలేని రాత్రులు
కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యమే కాదు, మనసూ అల్లకల్లోలమవుతుందని అందరూ అంటారు. అది ఎంతవరకూ నిజమో నాకు తెలీదు. ఎందుకంటే నేను నిద్రలేని రాత్రులు గడిపినా ఏనాడూ నా మనసు గతి తప్పలేదు. నిద్రలేని రాత్రి అనగానే నాకు మొదటగా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను. ఎవరైనా బాగా చదువుతున్నావా అంటే చాలు...
సూపర్‌గా చదివేస్తున్నాను, తప్పకుండా మంచి మార్కులతో పాసవుతాను అని గొప్పగా చెప్పేవాడిని. మా ఇంట్లో వాళ్లకే కాదు, ఊరందరికీ కూడా అదే చెప్పాను. నేనిచ్చిన బిల్డప్‌కి అందరూ నేను నిజంగానే మంచి మార్కులతో పాసైపోతాను అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నేను ఫెయిలయ్యాను. రిజల్ట్ చూసుకోగానే గుండె గుభేల్‌మంది. అందరూ కలిసి ఉతికేస్తారేమోనని భయమేసింది.
దాంతో అప్పటికప్పుడు ఓ ప్లాన్ వేశాను. మా ఇంటి ముందున్న మామిడి చెట్టెక్కి కూచున్నాను. గంటో రెండు గంటలో కాదు. రాత్రంతా చెట్టు మీదే ఉన్నాను. మన సంగతి బాగా తెలుసు కాబట్టి... మావాళ్లు ఎక్కడెక్కడో వెతికి, వాడే వస్తాడ్లే అని వదిలేశారు. దాంతో నాకు ఆ రాతిరంతా జాతరే. తెల్లారే వరకూ చెట్టుమీదే జపం చేశాను. తర్వాత ఇక తప్పదని దిగి ఇంటికెళ్లా.
పాపం పిల్లాడు రాత్రంతా నిద్ర లేకుండా అవస్థ పడ్డాడే అని మావాళ్లేమీ జాలి పడలేదు నా మీద. ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి, వాళ్ల ఎమోషన్ చల్లార్చుకున్నాకే వదిలారు. ఆ సంఘటన, ఆ రాత్రి చెట్టుమీద నేను పడిన పాట్లు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు.
కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఎవరికైనా పోరాటం ఉంటుంది. దాని కారణంగా కొన్ని నిద్ర లేని రాత్రులూ ఉంటాయి. కానీ వాటిలో బాధ ఉండదు. సంతోషమే ఉంటుంది. అవన్నీ మన బతుకు పుస్తకంలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నాకు ఆ సమయంలో గడిపిన రాత్రుల కంటే కృష్ణవంశీతో పని చేసినప్పుడు గడిపిన నిద్రలేని రాత్రులే ఎక్కువ గుర్తు. కృష్ణవంశీతో పని చేయడమంటే మాటలు కాదు. ఆయన సృష్టించే క్యారెక్టర్స్‌ని పండించడం అంత తేలికైన విషయం కాదు. ఆ క్యారెక్టరయి జేషన్ మామూలుగా ఉండదు.
వాటిలో లీనమై చేసేసరికి ఒళ్లు హూనమైపోతుంది. ‘సముద్రం’ సినిమాలో నేను చేసింది చాలా క్లిష్టమైన పాత్ర. చాలా డిఫరెంట్ పాత్ర కూడా. అది చేసేటప్పుడు నేను పడిన కష్టం నాకు మాత్రమే తెలుసు. నిద్రపట్టేది కాదు. ఇరవై నాలుగ్గంటలూ ఆ పాత్ర మీదే ధ్యాస. ఎలా చేయాలి, ఎంత బాగా పండించాలి అన్నదే ఆలోచన. షూటింగ్ పూర్తయ్యాక మాత్రం ఆదమరిచి నిద్రపోయాను. అలసిపోయినందుకు కాదు. అంత గొప్ప పాత్ర చేశానే అన్న తృప్తితో. కృష్ణవంశీతో ఎప్పుడు పని చేసినా ఇలాగే ఉంటుంది పరిస్థితి.
ఇక వ్యక్తిగత జీవితంలో అయితే... నేను స్వతహాగా అనవసర విషయాల జోలికి వెళ్లను. నా పనేంటో నేను చేసుకు పోతాను తప్ప, ఏవీ పట్టించుకోను. కానీ మొదటిసారి పట్టించుకున్నాను. అవే మొన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్. ఎంత పెద్ద విషయానికైనా చలించని నన్ను ఈ ఎన్నికలు చాలా కలవరపెట్టాయి. చాలా డిస్టర్బ్ చేశాయి.
ఎందుకు ఇలాంటి మనుషుల మధ్యకి వచ్చానా, ఎందుకు ఇలాంటి వాళ్లతో పోటీకి నిలబడ్డానా అని నాలో నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఎప్పుడూ నన్ను ఏ విషయంలోనూ ఏమీ అనని, అడ్డుకోని మా ఇంట్లో వాళ్లు కూడా... ‘మీకు అవసరమా ఇవన్నీ’ అన్నారంటే నేనెంతగా మథనపడ్డానో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఎలక్షన్లు చూశాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే పోటీ బాధపెట్టినా, ఫలితాలు సంతోషాన్నే మిగిల్చాయి.
ఇక మిగతా సమస్యలంటారా? అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా పక్కవాళ్ల సమస్యల్ని మన సమస్యల్లా ఫీలైపోయి, వాటిని మీద వేసుకుని, ఎలా పరిష్కరించాలా అని మల్లగుల్లాలు పడిపోయే నాలాంటి వాళ్లకు నిద్రలేని రాత్రులు లేకుండా ఉంటాయా! ఆలోచనలతో కొన్ని... ఆవేదనతో కొన్ని... ఎదురు దెబ్బలు తిన్న బాధతో కొన్ని... ఇలా కొన్ని కొన్ని కలిసి ఎన్నో ఉంటాయి. కానీ వాటి గురించి ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే మరొకరి బాధను పంచుకోవడంలో ఆనందం ఉంటుంది. ఆ సంతోషం ముందు నాకు మరేదీ ఎక్కువ కాదనిపిస్తుంది. అందుకే ఒకరి కోసం నిద్ర లేకుండా గడిపిన ఏ రాత్రీ నన్ను బాధపెట్టదు. బాధను మిగల్చదు.
- సమీర నేలపూడి