అవునూ.. నాదే తప్పు, క్షమించండి: కృష్ణవంశీ | Krishna Vamsi Apologized Actress Charmi Role In Sri Anjaneyam | Sakshi
Sakshi News home page

అవునూ.. నాదే తప్పు, క్షమించండి: కృష్ణవంశీ

Published Tue, Feb 4 2025 10:46 AM | Last Updated on Tue, Feb 4 2025 11:10 AM

Krishna Vamsi Apologized Actress Charmi Role In Sri Anjaneyam

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన  శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam) 2004 జూలై 24 విడుదలైంది. సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చిన ఈ మూవీ  ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో హనుమంతుడిగా ప్రముఖ నటుడు అర్జున్‌, హనుమాన్‌ భక్తుడి పాత్రలో అంజిగా నితిన్‌ మెప్పించారు. అయితే, హీరోయిన్‌ ఛార్మి(Charmy Kaur) పాత్ర ఈ సినిమాలో బాగాలేదని, అందుకే ప్రేక్షకులు తిప్పికొట్టారని పలు వాదనలు భారీగానే వచ్చాయి. హీరోయిన్‌ పాత్ర లేకపోయింటే ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయి ఉండేదని అప్పట్లోనే  చాలామంది కామెంట్లు చేశారు. ఈ సినిమాలో మాంత్రికుడిగా నటించిన పృథ్వీరాజ్‌ కూడా కొద్దిరోజుల క్రితం  ఓ ఇంటర్వ్యూలో అదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.

 (ఇదీ చదవండి: వీడియోలు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య)

శ్రీ ఆంజనేయం లాంటి భక్తి సినిమాలో ఛార్మిని అలా ఎందుకు చూపించారు అంటూ కృష్ణవంశీని ఒక నెటిజన్‌ ప్రశ్నించారు. అందుకు ఆయన కూడా రిప్లై ఇచ్చారు. 'తప్పేనండి.. క్షమించండి.. తీరని సమయాలు, తీరని చర్యలు, తీరని పనులు..' అని  ఆ తప్పలను ఎప్పటికీ సరిచేయలేమని ఆయన అన్నారు. ఎక్స్‌ పేజీలో ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఛార్మి గ్లామర్ డోస్ శృతిమించిందని, ఆమె పాత్ర సినిమాను పూర్తిగా తప్పుదోవ పట్టించిందని  కృష్ణవంశీపై ఆ సమయంలో బాగానే ట్రోల్ చేశారు. అప్పుడు కూడా తనదే తప్పు అని హుందాగా ఒప్పుకున్న కృష్ణవంశీ ఇప్పుడు మరోసారి క్షమించమని నెటిజన్లను కోరారు.

1995లో తొలి సినిమా గులాబితో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు కృష్ణవంశీ.. ఆ తర్వాత     నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం,మురారి,ఖడ్గం వంటి టాప్‌ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఖడ్గం వంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత సోషియో ఫాంటసీ కథతో శ్రీ ఆంజనేయం విడుదల కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా బాగున్నప్పటికీ ఛార్మి పాత్ర పెద్ద మైనస్‌గా మారింది. దీంతో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. సుమారు 20 ఏళ్లుగా ఒక మంచి హిట్‌ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. 2023లో చివరిగా రంగమార్తాండ చిత్రాన్ని ఆయన విడుదల చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement