ఆ రాత్రులే నన్ను మలిచాయి!
నిద్రలేని రాత్రులు
జె.కె.భారవి సినీ రచయిత
మా రోల్ మోడల్ ఆచార్య ఆత్రేయగారే అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ‘టాప్’ డైలాగ్ రైటర్లు, చంద్రబోస్ లాంటి ‘ఏస్’ లిరిక్ రైటర్లు స్టేట్‌మెంట్లివ్వడం మనకు తెలుసు. అలాంటి మహారచయిత దగ్గర దశాబ్దంపైగా శిష్యరికం చేసిన అదృష్టవంతుణ్ని నేను. ఆత్రేయగారికి ‘రాత్రేయ’ అనే నిక్‌నేమ్ ఉండేది. పాడుతా తీయగా చల్లగా... పసిపాపలా నిదురపో తల్లిగా, నిదురించవె తల్లి...
ఈ వయసు దాటితే నిదురేది మళ్లీ, నిదుర రాని నాకు కలలు కూడా రావె... లాంటి పాటల కావ్యాలన్నీ తను నిదరపోకుండా రాసినవే. తపస్సు అంటే ఏమిటో మా గురువుగారు పాట కోసమో, మాట కోసమో ఆలోచించడం చూస్తే తెలుస్తుంది. రాత్రి తొమ్మిది గంటలకి పద్మాసనం వేసుకొని బెడ్‌మీద కూర్చునేవారాయన. కింద నేను రకరకాల ఆసనాలు మార్చుతూ ఉండేవాడిని.
కట్ చేస్తే... కోడి కూసేది. ‘తెల్లారింది పడుకుందామా సార్’ అనేవాణ్ని నేను. ఓ చిరునవ్వు పువ్వు పూసేది ఆయన పెదాలపై. ఆయన దగ్గర పనిచేసినన్నినాళ్లు దాదాపు నిద్ర అనేది లేకుండా అలాగే గడిచిపోయింది. అసలన్ని రోజులు నిద్రపోకుండా ఎలా ఉండగలిగేవాళ్లమో తెల్సా? ఆ రోజుల్లో ‘డెక్సిడ్రిన్’ అనే టాబ్లెట్స్ దొరికేవి. అవి మా గురువుగారి దగ్గర బోలెడన్ని స్టాక్ ఉండేవి. ఒక్క మాత్ర వేసుకుంటే కళ్లకి క్లిప్పులు పెట్టినట్టు అయిపోయేది. ఇక నిద్ర అనే మాట వస్తే ఒట్టు (ఆ మాత్రలు ఇప్పుడు లేవు, నిషేధించారు).
మా గురువుగారి దయవల్ల ఆ వివరాలన్నీ ఒక్కొక్కటే వంట పడుతూ... క్రమక్రమంగా ‘డెక్సిడ్రిన్’ లేకపోయినా సంకల్ప బలంతో కంటి కునుకు దూరమవుతూ వచ్చింది - అందువల్ల నాకు ఎంత లాభం వచ్చిందంటే... కొన్ని వేల పుస్తకాలు చదివే భాగ్యం. లెక్కలేనన్ని సినిమాలు చూసే అదృష్టం. ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా రాసుకున్న బోలెడన్ని స్క్రిప్టులు. ఎల్‌ఐసీ శ్రీనివాస్, వసంత్ కుమార్ లాంటి నా సాహితీ మిత్రులతో మహారచయిత, మా బ్రదర్ శ్రీ వేదవ్యాసగారితో రోజుల తరబడి కొనసాగించిన చర్చలు. కూడబెట్టుకున్న జ్ఞానం. ఎలా వెలకట్టను వీటికి?
నా జీవితంలో ‘ఇన్ని’ నిద్రలేని రాత్రులున్నా... ‘కొన్ని’ మాత్రం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. మా ఊరు... వరంగల్ జిల్లాలో కోమటిపల్లి అనే చిన్న అందమైన అగ్రహారం. నా రచనా జీవితం అక్కడే ప్రారంభమైంది. వందకు పైగా నాటకాలు రాశాను అక్కడే. అన్నమయ్య స్క్రిప్ట్ కూడా అక్కడే పురుడు పోసుకుంది. అప్పటికి ఎలక్ట్రిసిటీ రాలేదు మా ఊళ్లోకి. లాంతర్ దీపం పెట్టుకుని చకచకా రాసేస్తుండేవాణ్ని. మా అమ్మ గంటకోసారి లేచి ‘ఎంతవరకు అయింది బిడ్డా’ అని అడుగుతూండేది. అయినంతవరకూ చదివి వినిపిస్తుండేవాణ్ని.
అన్నమయ్య కథనం విని తను పులకించిపోయేది. అన్నమయ్య స్క్రిప్ట్‌కి తొలి శ్రోత అయిన మా అమ్మతో పాటు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పెద్దలూ చాలామంది ఉన్నారు మా ఊళ్లో. ఐతే అది సినిమాగా రావడానికి చాలా ఏళ్లు పట్టింది. ఎందరెందరో ప్రముఖులు అన్నమయ్య తీయడానికి నడుం బిగించారు. ప్రముఖ హాస్యనటులు పద్మనాభం నిర్మించాలని ప్రయత్నించారు, కుదర్లేదు. సి.ఎస్.రావు దర్శకత్వంలో సముద్రాల కంబైన్స్‌వారు మొదలుపెట్టారు.
బాలమురళీకృష్ణగారి సంగీత దర్శకత్వంలో 18 పాటలు రికార్డ్ చేశాక ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఆచార్య ఆత్రేయగారు దర్శకత్వం చేయడానికి సంకల్పించారు. శ్రీకాంత్‌గారు నిర్మాతగా, కె.వి.మహదేవన్‌గారి నేతృత్వంలో 20 పాటలు కంపోజింగ్ అయ్యాయి. కొన్ని రికార్డ్ కూడా చేశారు. అదీ ఆగిపోయింది. చివరాఖరికి నా మిత్రుడు జొన్నవిత్తుల ద్వారా దర్శకేంద్రుడికి అన్నమయ్య కబురు అందింది. ఆయనకు నచ్చింది. నిర్మించడానికి దొరస్వామిరాజుగారు ముందుకు వచ్చారు. నాగార్జున కథ విన్న వెంటనే ఓకే అన్నారు. కీరవాణి సంగీత దర్శకత్వం, విన్సెంట్‌గారి ఛాయాగ్రహణం, వేంకటేశ్వరుడిగా సుమన్ హుందాతనం... అన్నమయ్యకు వన్నెలు దిద్దాయి. చిత్రం విడుదలైంది. అఖండ విజయం చేకూరింది.
కానీ ఆ సినిమాను చూడకుండానే మా అమ్మ వెళ్లిపోయింది! ఆ వెలితి తెలీకుండా ఆదుకుంది నా మరో తల్లి ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి. అన్నమయ్య రచయిత నా కొడుకు అంటూ ఆమె గర్వంగా చూస్తుంటే... ఆ కళ్లల్లో నన్ను కన్న అమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ కంటిలో ఒక అమ్మ... ఈ కంటిలో ఒక అమ్మ... హృదయంలో సరస్వతమ్మ... ఇక నిద్రతో ఏం పని చెప్పండి!
- సమీర నేలపూడి