అనంతరం: రేలంగి రాముడు | Relangi Satyanarayana Babu tributes to Relangi Venkatramaiah | Sakshi
Sakshi News home page

అనంతరం: రేలంగి రాముడు

Published Sun, Nov 24 2013 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

అనంతరం: రేలంగి రాముడు

అనంతరం: రేలంగి రాముడు

తండ్రి మాట విని రాముడు రాజ్యాన్ని వదలి అడవులకు పోయాడు. సత్యనారాయణబాబు కూడా రాముడిలా తండ్రి మాటకు విలువిచ్చారు. వద్దు అని ఒక్క మాట అనగానే తనకెంతో ఇష్టమైన నటనకు గుడ్‌బై చెప్పేశారు. అందుకాయన బాధపడరు. కొడుకుగా  అది తన ధర్మం అంటారు. అంత మంచి కొడుకును కన్న ఆ తండ్రి... రేలంగి వెంకట్రామయ్య. నవంబర్ 27న రేలంగి వర్థంతి సందర్భంగా ఆయన కొడుకు  తన ప్రేమ వచనాలతో తండ్రికి సమర్పించిన నివాళి ఇది...
 
 అమ్మానాన్నలకు నేనొక్కడినే. నాకు ఊహ తెలిసేనాటికే నాన్న సినిమాల్లో బిజీగా ఉన్నారు. నేను కూడా నాటకాల్లో నటించాను. మూడుసార్లు ఉత్తమ నటుడిగా మొదటి బహుమతి గెలుచుకున్నాను. సినిమాల్లో కూడా ప్రవేశించాను. నా తొలి సినిమా ‘బాలానందం’. ఆ సినిమాలో హీరోనీ, విలన్‌నీ  నేనే. అయితే, రెండో సినిమాతో నాకో చిత్రమైన సమస్య వచ్చింది. కమెడియన్ కొడుకుని కాబట్టి నాలో కమెడియన్‌నే చూశారు. నాక్కూడా నగేశ్‌గారిలాంటి మంచి కమెడియన్‌ని కాగలననిపించేది.
 
  కానీ నాకు జంటగా పెట్టే అమ్మాయిల దగ్గరే వచ్చేది సమస్య. వాళ్లంతా నా వయసు వాళ్లే అయినా నాన్న పక్కన నటిస్తుండేవారు. వాళ్లను నా పక్కన పెట్టడం బాగోదేమో అనిపించేది. దాంతో నాకు సరిపడేవాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. ఈ పరిస్థితి నాన్నకి విసుగు తెప్పించింది. వెంటనే మా ఊరు తాడేపల్లిగూడెంలో ఓ థియేటర్ కట్టించి... సినిమాలొద్దు, దాన్ని చూసుకోమన్నారు. దాంతో బాలానందమే నా మొదటి, చివరి సినిమా అయ్యింది. థియేటర్‌ని, ఆస్తుల్ని చూసుకోవడమే నా వృత్తి అయ్యింది.
 
 
 నాన్న థియేటర్‌ను మా ఊళ్లోనే నిర్మించడానికి మరో కారణం కూడా ఉంది. మాది కల్లుగీత కార్మికుల కుటుంబం. అప్పట్లో మావాళ్లెవరికీ అంత గౌరవం ఇచ్చేవారు కాదు. దాంతో మా కులస్థుల గౌరవాన్ని పెంచాలని, మమ్మల్నీ అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో నాన్న కావాలని అక్కడే థియేటర్ కట్టారు. ఆయన అనుకున్నది నిజమే అయ్యింది. ఆ తర్వాత మా వాళ్లకు ఆ ఊరిలో గౌరవం పెరిగింది.
 
 ఆయన మాట నాకు వేదం...
 చాలామంది అంటుంటారు, నటన అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, మీ నాన్నగారిని ఒప్పించాల్సింది అని. కానీ నాకా ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే, ఆయన మాట నాకు వేదం. ఆయన ఏం చేసినా ఆలోచించి చేస్తారనే నా నమ్మకం. ఆ నమ్మకమెప్పుడూ వమ్ము కాలేదు. నా పెళ్లి సమయంలో నాన్న చెప్పిన మాటలు నేనెప్పటికీ మర్చిపోను. నాకు కోటీశ్వరుల సంబంధాలు వచ్చాయి. కానీ నాన్న మా మావయ్య కూతుర్ని నాకిచ్చి చేయాలనుకున్నారు.
 
  ‘మన పరిస్థితి బాలేనప్పుడే తన కూతుర్ని నీకు చేసుకొమ్మని మావయ్య అడిగాడు, ఇవాళ వాళ్లు చితికిపోయారని, మనం బాగున్నామని వాళ్లను కాదనకూడదు’ అన్నారు. ‘నువ్వు అమ్మాయిని కోరుకుంటున్నావ్, నేను నీకు మంచి భార్యను ఇవ్వాలనుకుంటున్నాను, ఆ రెండిటి మధ్య తేడాని అర్థం చేసుకో’ అన్నారు. నేనర్థం చేసుకున్నాను. అందుకే మౌనంగా నా మరదలి మెడలో తాళి కట్టాను. నాన్న చెప్పింది నిజం... ఆయన నాకు చాలా మంచి భార్యనిచ్చారు. ఎవరి విషయంలోనైనా మంచే ఆలోచించేవారు నాన్న. తన-పర భేదమసలు తెలీదు ఆయనకి.
 
 నాన్న చనిపోయాక నేను  థియేటర్‌ని పక్కన పెట్టి, సినీ నిర్మాతగా మారాలనుకున్నాను. అప్పుడు ఏవీఎం శరవణన్‌గారు... ‘మీ నాన్న ఎంతో ఆలోచించి థియేటర్ కట్టి ఇచ్చారు, దాన్ని వదిలేసి వేరేదానికి వెళ్తే ఏదైనా తేడా వచ్చిందనుకో, నీ పిల్లల పరిస్థితి ఏమిటి?  ఏదైనా చేస్తే వాళ్లు స్థిరపడిన తర్వాత చెయ్యి’ అన్నారు. అది నిజమే అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడూ థియేటర్‌ని వదిలిపెట్టాలని అనుకోలేదు. ఇప్పుడు దాన్ని పడగొట్టి, మల్టీప్లెక్స్‌గా మారుస్తున్నాను. నా చిన్న కొడుకు హేమంత్ నటనలో శిక్షణ తీసుకున్నాడు. తనతో ఎప్పటికైనా ఓ సినిమా నిర్మిస్తాను. మిగిలిపోయిన ఆ కలను కూడా నెరవేర్చుకుంటాను!
 - సంభాషణ: సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement