Relangi Venkatramaiah
-
రేలంగి తన సంపాదనంతా ఆమెకే ఇచ్చేవారు..!
రేలంగిని ఆప్యాయంగా రేలంగోడు అంటూ సొంతవానిగా అక్కున చేర్చుకుంటారు. సినిమాలో రేలంగి కనపడితే నవ్వులే నవ్వులు. నడక, మాట తీరు, వస్త్ర ధారణ.. అన్నీ హాస్యమే. తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి. ఆయనే రేలంగి వెంకట్రామయ్య. హాస్యంతో పాటు వీలునామా కూడా విలక్షణమే.. రేలంగి మనవరాలు గాయత్రి, తన తాతను గుర్తు చేసుకుంటూ, అందమైన సంఘటనలెన్నో సాక్షికి వివరించారు. మా ముత్తాత రామస్వామి (రేలంగి తండ్రి) హరికథలు చెప్పేవారు. ఆయనకు తాతయ్య ఏకైక సంతానం. ఆగస్టు 13, 1910న రావులపాడులో పుట్టారు. తాతయ్యకు నాన్న ఏకైక సంతానం. నాన్నను సత్యనారాయణబాబు, రేలంగి బాబు అని పిలిచేవారు. నాన్నగారికి మేం ఇద్దరు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలం. తాతయ్యకు ఆడ పిల్లలంటే చాలా ఇష్టం. బంధువుల పిల్లలతో ఇల్లంతా కళకళలాడుతుండేది. యంగ్మెన్స్ ఆర్టిస్ట్స్ క్లబ్లో తాతయ్య హార్మోనియం నేర్చుకున్నారు. ఆ రోజుల్లోనే తాతయ్య నాటకాలు వేసేవారు. పి. పుల్లయ్య గారితో కలకత్తా వెళ్లి, ఒక సినిమాలో చేశాక, చెన్నైలో ఎన్నో ఇబ్బందులు పడుతూ చిన్నచిన్న వేషాలు వేశాక, గుర్తింపు వచ్చింది. 1950 – 70 మధ్య హీరోలకు దీటుగా పని చేశారు. తాతయ్యను చూడటానికి బస్సులలో వచ్చిన అభిమానులందరికీ భోజనాలు పెట్టి పంపేవారట. నా పేరు పెట్టొద్దు అన్నారు... దానధర్మాల్లో తాతయ్యకు మంచి పేరు. ఎవరైనా చదువుకోవటానికి ఆర్థిక సహాయం కోసం వస్తే, ‘మంచి మార్కులతో పాస్ అయి చూపించాలి’ అనేవారట. 1967లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించే ముందు, ‘రేలంగి వెంకటేశ్వర యూనివర్సిటీ’ అని పేరు పెడతాం, ఐదు లక్షలు విరాళం ఇవ్వమన్నారట. అందుకు తాతయ్య, ‘నా పేరు పెట్టక్కర్లేదు, నాలుగు లక్షలు ఇస్తాను, మా వాళ్లందరికీ చదువు రావాలని మొక్కుకోండి’ అన్నారట. దానధర్మాలలో ‘నాగయ్యగారి తరవాత రేలంగి గారు’ అన్న పేరు సంపాదించుకున్నారు. పిల్లల మీద చాలా ప్రేమ.. దక్షిణాది భాషల చిత్రాల షూటింగ్‌లన్నీ వాహిని స్టూడియోలో జరిగేవి. ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా గార్డెన్స్‌ను తాతయ్య 1956లో కొని, అందులో పంటలు పండించారు. ఆ చోటును∙వాహిని వారికి లీజ్‌కిచ్చారు. ఆ స్థలం తాలూకు వీలునామా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడ, మగ తేడా లేకుండా ఎంతమంది మనవలు పుడితే అంతమంది సమానంగా అనుభవించేలా విల్లు రాయించారు. అప్పటికి నాన్నకి ఇంకా వివాహం అవ్వలేదు. నాన్న జీవించినంత కాలం ఆ ఆస్తిని మనవలకు అమ్మే హక్కు లేకుండా రాయించారు. ఆ వీలునామా ఎన్నటికీ మరచిపోలేని విషయం. తాతయ్యతో చూడలేకపోయాం.. తాతయ్యతో ఎక్కువ సమయం గడపలేక పోయామనే బాధ ఉంది మాకు. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం. మాయాబజార్, పాతాళభైరవి వంటి చిత్రాలు తాతయ్యతో కలిసి చూడలేకపోయాం. ఆయన నటించిన సినిమాలన్నీ టీవీలో చూస్తూ, ఎంజాయ్ చేస్తాం. తాతయ్య 360కి పైగా సినిమాలు చేశారని తరవాత తెలిసింది. సినిమా పరిశ్రమలో ఉండే రాజకీయాలు తాతయ్యకి తెలుసు. అందుకే నాన్నను సినిమాలలోకి వద్దన్నారు. నాన్న ‘బాలానందం’ అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాతయ్య చివరి రోజుల్లో తాడేపల్లిగూడెంలో ఉన్నారు. ఎవరైనా వస్తే ఉండటానికి వీలుగా అక్కడ పోర్షన్స్‌గా కట్టించారు. తాతగారికి మనుషులు కావాలి. నాకు తొమ్మిదేళ్లు వచ్చేసరికే తాతయ్య పోయారు. ఆయన పోయాక కూడా ఆంధ్ర నుంచి తెలుగువారు చెన్నై వచ్చి మా ఇంట్లో ఉండేవారు. మద్రాసు పాండీబజార్లో... తాతయ్య బాగా డబ్బు సంపాదించిన రోజుల్లో, మద్రాసు పాండీ బజారులో థియేటర్ కడదామనుకున్నారు. కాని తాతగారి బంధువులంతా తాడేపల్లిగూడెంలో ఉండటంతో, ‘మన పేరు తెలిసేచోట కడితే, మనల్ని పదికాలాల పాటు గుర్తు చేసుకుంటారు’ అని తాడేపల్లి గూడెంలో 1962లో ‘రేలంగి చిత్ర మందిర్’ కట్టారు. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు థియేటర్ ప్రారంభించారు. అందులో విడుదలైన మొదటి సినిమా లవకుశ. ఇప్పుడు అది బాగా పాతబడిపోవటంతో ‘పద్మశ్రీ వెంకట్రామయ్య మాల్’ గా మారుస్తున్నాం. మనవలంటే ప్రాణం... తాతయ్యకు మనవలంటే మహా ఇష్టం. మాతో చాలా స్నేహంగా ఉండేవారు. నానమ్మతో మా గురించి చెప్పుకుంటూ మురిసి పోయేవారట. మేమంతా మద్రాసులోనే పుట్టి పెరిగాం. తాతయ్య సినిమాలలో బిజీగా ఉండటం వల్ల ఇంటి విషయాలన్నీ నానమ్మ చూసుకునేది. మా బంధువులలో చాలామందికి తాతయ్యే పెళ్లిళ్లు జరిపించారు. తాతగారి డాడ్జ్ కారు నెంబరు ఎంఎస్ఆర్ 1722. అప్పట్లో పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కారు నెంబరుతో పిలిచేవారు. అలా వినటం వల్ల నెంబరు గుర్తుండిపోయింది. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా అందరినీ బయటకు తీసుకువెళ్లేవారు. పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలామందిని తనతో ఢిల్లీ తీసుకువెళ్లారు. ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేవారు. సినిమాలలో బిజీగా ఉండటం వల్ల, మాతో ఎక్కువ సమయం గడపేవారు కాదు. కాని మా బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకున్నారు. షైన్ వేలాంకణి స్కూల్లో చేర్పించారు. అందువల్ల మాకు చదువులో మంచి ఫౌండేషన్ పడింది. – గాయత్రీ దేవి, రేలంగి మనవరాలు అందరూ చక్కగా ఉన్నారు... తాతగారి వైపు బంధువులంతా వృద్ధిలోకి వచ్చారు. తాతగారి దగ్గర పనిచేసిన మేనేజర్, మా నాన్నగారి దగ్గర కూడా చేశారు. అప్పట్లో మేం తాతాజీ సినిమాలు చాలా తక్కువ చూశాం. తాతాజీతో ఒకటిరెండు ప్రివ్యూలకు వెళ్లాం. ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయామని బాధపడతాం. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం. మరచిపోలేని అదృష్టాలు... తాతాజీతో బీచ్‌కి వెళ్లినరోజులు ఇప్పటికీ మరిచిపోలేం. మద్రాసు బీచ్‌లో కారు ఆపుకుని, సముద్రం వరకు నడిచేవాళ్లం. తాతాజీకి ఫోల్డింగ్ చైర్ తీసుకువెళ్లేవాళ్లం. ఆయన అందులో కూర్చునేవారు. చాలాసేపు అక్కడే ఆడుకునేవాళ్లం. మేం ఏం కొనుక్కోవాలన్నా నానమ్మకే చెప్పేవాళ్లం. ఇంటి విషయాలన్నీ నానమ్మకు వదిలేశారు. తాతాజీ సంపాదనంతా నానమ్మకి ఇచ్చేవారు. నానమ్మ తన దగ్గర నగలన్నీ ఎవరికి కావాలంటే వారికి పెట్టేసేది. అందరికీ పెట్టగలిగేంత బంగారం ఉండేది. ఇంట్లో చాలామంది భోజనాలు చేసేవారు. నేను తాతాజీ వాళ్ల అమ్మలా ఉంటానని, నన్ను ‘అమ్మ’ అని పిలిచేవారు. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, అత్తవారిళ్లకు వెళితే ఎలా అని బెంగగా ఉండేవారు. తాతాజీ తన చేతుల మీదుగా ఒక్క మనవరాలికి మాత్రమే కన్యాదానం చేశారు. ఇంకా కొంతకాలం ఉండి ఉంటే, మాకు కూడా చేసేవారేమో. అందరి ఫంక్షన్లు బాగా ఘనంగా చేశారు. అది లోటే మాకు. జకార్తా వెళ్లినప్పుడు వాచ్ తెచ్చారు. స్ట్రాప్స్, బెల్టులు మార్చుకోవచ్చు. ఇప్పుడు పనిచేయకపోయినా, ఆయన గుర్తుగా ఉంచుకున్నాను. మా అక్కను అపురూపంగా చూసేవారు. కారులోనే స్కూల్‌కి వెళ్లేది. అక్క చిన్నప్పటి నుంచి సుకుమారం. ఆ వీలునామాలో ముందుజాగ్రత్త... ‘‘మాది రైతు కుటుంబం కనుక, తాతగారి పొలం ఆడ, మగ తేడా లేకుండా నా కొడుకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ సమానంగా ఇవ్వాలి. వారంతా నా పేరు చెప్పుకుని కడుపు నిండా తినాలి’’ అన్నారట తాతయ్య. అప్పటికి మా నాన్న వయసు పందొమ్మిది సంవత్సరాలు. ఇంకా పెళ్లి కూడా కాలేదు. తాతయ్య పెద్దగా చదువుకోకపోయినా ఎంతో దూరదృష్టితో ఈ పని చేసి ఉంటారనుకుంటాం. మనవలు అమ్మకుండా, డబ్బు పాడవ్వకుండా ఆ రోజుల్లో అంత బిగింపుగా వీలునామా రాశారంటే తాతయ్య నిజంగా చాలా గొప్పవారనిపిస్తుంది. మా కుటుంబం తాతాజీకి మేం ఆరుగురు మనవలం. పెద్దక్కయ్య చాముండేశ్వరీ దేవి, అన్నయ్య తిరుమలబాబు, మూడు నేను గాయత్రీ దేవి, నాలుగు రాజ్యలక్ష్మి, ఐదు శ్రీదేవి (నానమ్మ పేరు, తాతగారు నానమ్మని శ్రీదేవమ్మ అని పిలిచేవారు), ఆరు హేమంత్‌కుమార్. మేమంతా నానమ్మను అమ్మ అనేవాళ్లం. తాతయ్యను తాతాజీ అనేవాళ్లం. మా నాన్నగారు కూడా అలాగే పిలిచేవారు. ఏం కొనాలన్నా వాళ్ల సలహా తీసుకునేవాళ్లం. నాన్నగారు ఆరు సంవత్సరాల క్రితం, అమ్మ రెండు సంవత్సరాల క్రితం పోయారు. తాతాజీ, నానమ్మలే కాకుండా మా అమ్మనాన్నలు కూడా లేకపోవటం మాకు ఎంతో పెద్ద నష్టం అనిపిస్తుంది. 1975లో తాతాజీ కన్నుమూశారు. – గాయత్రీ దేవి, రేలంగి మనవరాలు సంభాషణ: వైజయంతి పురాణపండ -
సార్థక నామధేయుడు
తెరపై కామెడీ జరగనవసరంలేదు. జోకులు పేలనవసరం లేదు.. మనిషి కూడా కనిపించనవసరం లేదు. చందమామ లాంటి గుండ్రటి బట్టతల కనిపిస్తే చాలు. థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు. బ్రహ్మానందమా మజాకా. కేవలం ఆయన నవ్వుల వల్లే విజయాలు సాధించిన సినిమాలు కోకొల్లలు. రేలంగి వెంకట్రామయ్య, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్యల్లాగా దశాబ్దాల తరబడి సినీ హాస్యసామ్రాజ్యాన్ని ఏలిన ఘనత బ్రహ్మానందంది. ప్రస్తుతం ఆయన శకమే నడుస్తోంది. రేలంగి, అల్లు రామలింగయ్య తర్వాత హాస్యనటుల్లో ‘పద్మశ్రీ’ అందుకున్నది బ్రహ్మానందమే. విజయవంతమైన సినిమాల్నే ఎవరూ గుర్తుంచుకోవడం లేదు. కానీ బ్రహ్మానందం పాత్రలు మాత్రం అందరికీ గుర్తుంటాయి. అరగుండు, ఖాన్‌దాదా, నెల్లూరు పెద్దారెడ్డి, శాస్త్రి, చారి, హల్వారాజ్, ప్రణవ్, బాబీ, మెక్‌డోనాల్డ్ మూర్తి, పద్మశ్రీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. నవ్వుల జ్ఞాపకాలు ఎన్నో ఎన్నెన్నో.. ‘బ్రహ్మానందం’ అని ఏ ముహూర్తాన తల్లితండ్రులు నామకరణం చేశారో కానీ.. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులకు బ్రహ్మానందాన్ని అందిస్తున్న సార్థకనామధేయుడు బ్రహ్మానందం. చిన్నవయసులోనే కష్టాలన్నీ అనుభవించేశారాయన. చెప్పులు లేకుండా బడికెళ్లిన రోజులు, అవి కొనమని నాన్నను అడిగితే, ఆయన కొట్టిన దెబ్బలు ఇంకా బ్రహ్మానందంకి గుర్తే. అందుకే విషాదం నుంచి కూడా కామెడీ పుడుతుందంటారాయన. అన్ని రసాల్లోనూ కష్టతరమైనది హాస్యరసం. దాన్ని సమర్థవంతంగా పోషించిన వాడు ఏ రసాన్నయినా సునాయాసంగా పండించగలడు. అందుకే.. బ్రహ్మానందంకి ఎలాంటి రసమైనా.. తృణప్రాయం. ఆయన కామెడీ కింగ్ మాత్రమే కాదు. ట్రాజెడీ కింగ్ కూడా. ‘అమ్మ’, ‘బాబాయ్ హోటల్’, ‘ఆయనకి ఇద్దరు’ చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన విషాదాన్ని తెలిగ్గా మరిచిపోలేం. రవిరాజా పినిశెట్టి డెరైక్ట్ చేసిన ‘ముత్యమంత ముద్దు’ సినిమాలో బ్రహ్మానందంలో ఓ భయంకరమైన విలన్ కనిపిస్తాడు. ముత్యాల సుబ్బయ్య ‘అన్న’లో అయితే... ఆయనలో ఓ విప్లవకారుడు కనిపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలోని కోణాలు చాలా ఉన్నాయి. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని నవ్వులతోనే అధిగమించిన హ్యూమరిస్ట్ బ్రహ్మానందం. పెద్ద హీరోల సినిమా వేడుకలైనా సరే... బ్రహ్మానందం స్టేజ్ మీదకు రాగానే.. సదరు హీరోలతో సమానంగా జనాల్లో స్పందన. దీన్ని బట్టి ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకున్న స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఆయనలో గొప్ప లక్షణం. మూలాల్ని మరిచిపోకుండా, సంప్రదాయానికి దూరం కాకుండా, సంస్కృతిని గౌరవిస్తూ, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ చాలా ప్రశాంతమైన జీవనశైలిలో ముందుకు వెళ్తుంటారాయన. తెరపై కనపడే బ్రహ్మానందం వేరు. ఇంటా బయటా కనిపించే బ్రహ్మానందం వేరు. ఆయన మాటల్లో, వ్యక్తిత్వంలో ఓ గొప్ప ఫిలాసఫీ కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మానందంతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్. సినిమానే కాకుండా ఏ టాపిక్ గురించి అడిగినా పుంఖాను పుంఖాలుగా మాట్లాడగల జ్ఞానం ఆయనలో ఉంది. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరిన బ్రహ్మానందం జీవితం నేటి తరానికి నిజంగా స్ఫూర్తి దాయకమే. సందర్భం బ్రహ్మానందం పుట్టినరోజు -
హాస్య పద్మాలు
అపురూపం ‘నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వలేకపోవడం రోగం’... అనేవారెప్పుడూ జంధ్యాలగారు. నవ్వించడం నటులకి అంత తేలిక కాదు. నవ్వించగలిగిన నటులకి మిగిలిన అన్ని రసాలు అభినయించడం తేలికే! అటువంటి హాస్యాన్ని పండించి మెప్పించిన హాస్యనటులు తెలుగులో ఎందరో! వారంతా ప్రజల గుర్తింపునూ పొందారు. వారిలో కొందరు ప్రభుత్వ గుర్తింపునూ పొందారు! ‘పద్మవిభూషణ్’, ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’. ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను 1954 నుండి భారత ప్రభుత్వం ప్రదానం చేస్తూ వస్తోంది. దక్షిణాదిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందిన తొలి హాస్యనటుడు శ్రీ రేలంగి వెంకట్రామయ్య. ఆ తరువాత కాలంలో అల్లు రామలింగయ్య, బ్రహ్మానందంలు అందుకున్నారు. ఆ రోజుల్లో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ఉన్న స్టార్ కమెడియన్ శ్రీ రేలంగి! 1970లో ఆయన, నాటి రాష్ట్రపతి వి.వి.గిరి నుండి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే యాభై సంవత్సరాల పాటు 1,013 చిత్రాలలో నవ్వించారు శ్రీ అల్లు రామలింగయ్య. ఆయన, 1990లో నాటి భారత రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. హీరో ఎవరైనా సరే... బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్! ఇది ప్రస్తుతం బ్రహ్మానందం స్థాయి! 28 సంవత్సరాల సినీ జీవితంలో అప్పుడే వెయ్యి సినిమాలకు దగ్గరవుతున్న బ్రహ్మానందం ‘పద్మశ్రీ’ బిరుదును 2009లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారం పొందుతోన్న బ్రహ్మానందం అప్పుడు గాని... ఇప్పుడు గాని తెలుగులో ఉన్నంత మంది హాస్యనటులు మరే భాషలోనూ లేరు! అలాగే ముగ్గురు హాస్యనటులు ‘పద్మ’ పురస్కారాలను మరే భాషలోనూ అందుకున్న గుర్తూ లేదు!! హ్యాట్సాఫ్ టూ తెలుగు హాస్యనటులు!!! -నిర్వహణ: సంజయ్ కిషోర్ -
అనంతరం: రేలంగి రాముడు
తండ్రి మాట విని రాముడు రాజ్యాన్ని వదలి అడవులకు పోయాడు. సత్యనారాయణబాబు కూడా రాముడిలా తండ్రి మాటకు విలువిచ్చారు. వద్దు అని ఒక్క మాట అనగానే తనకెంతో ఇష్టమైన నటనకు గుడ్‌బై చెప్పేశారు. అందుకాయన బాధపడరు. కొడుకుగా అది తన ధర్మం అంటారు. అంత మంచి కొడుకును కన్న ఆ తండ్రి... రేలంగి వెంకట్రామయ్య. నవంబర్ 27న రేలంగి వర్థంతి సందర్భంగా ఆయన కొడుకు తన ప్రేమ వచనాలతో తండ్రికి సమర్పించిన నివాళి ఇది... అమ్మానాన్నలకు నేనొక్కడినే. నాకు ఊహ తెలిసేనాటికే నాన్న సినిమాల్లో బిజీగా ఉన్నారు. నేను కూడా నాటకాల్లో నటించాను. మూడుసార్లు ఉత్తమ నటుడిగా మొదటి బహుమతి గెలుచుకున్నాను. సినిమాల్లో కూడా ప్రవేశించాను. నా తొలి సినిమా ‘బాలానందం’. ఆ సినిమాలో హీరోనీ, విలన్నీ నేనే. అయితే, రెండో సినిమాతో నాకో చిత్రమైన సమస్య వచ్చింది. కమెడియన్ కొడుకుని కాబట్టి నాలో కమెడియన్నే చూశారు. నాక్కూడా నగేశ్గారిలాంటి మంచి కమెడియన్ని కాగలననిపించేది. కానీ నాకు జంటగా పెట్టే అమ్మాయిల దగ్గరే వచ్చేది సమస్య. వాళ్లంతా నా వయసు వాళ్లే అయినా నాన్న పక్కన నటిస్తుండేవారు. వాళ్లను నా పక్కన పెట్టడం బాగోదేమో అనిపించేది. దాంతో నాకు సరిపడేవాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. ఈ పరిస్థితి నాన్నకి విసుగు తెప్పించింది. వెంటనే మా ఊరు తాడేపల్లిగూడెంలో ఓ థియేటర్ కట్టించి... సినిమాలొద్దు, దాన్ని చూసుకోమన్నారు. దాంతో బాలానందమే నా మొదటి, చివరి సినిమా అయ్యింది. థియేటర్ని, ఆస్తుల్ని చూసుకోవడమే నా వృత్తి అయ్యింది. నాన్న థియేటర్‌ను మా ఊళ్లోనే నిర్మించడానికి మరో కారణం కూడా ఉంది. మాది కల్లుగీత కార్మికుల కుటుంబం. అప్పట్లో మావాళ్లెవరికీ అంత గౌరవం ఇచ్చేవారు కాదు. దాంతో మా కులస్థుల గౌరవాన్ని పెంచాలని, మమ్మల్నీ అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో నాన్న కావాలని అక్కడే థియేటర్ కట్టారు. ఆయన అనుకున్నది నిజమే అయ్యింది. ఆ తర్వాత మా వాళ్లకు ఆ ఊరిలో గౌరవం పెరిగింది. ఆయన మాట నాకు వేదం... చాలామంది అంటుంటారు, నటన అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, మీ నాన్నగారిని ఒప్పించాల్సింది అని. కానీ నాకా ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే, ఆయన మాట నాకు వేదం. ఆయన ఏం చేసినా ఆలోచించి చేస్తారనే నా నమ్మకం. ఆ నమ్మకమెప్పుడూ వమ్ము కాలేదు. నా పెళ్లి సమయంలో నాన్న చెప్పిన మాటలు నేనెప్పటికీ మర్చిపోను. నాకు కోటీశ్వరుల సంబంధాలు వచ్చాయి. కానీ నాన్న మా మావయ్య కూతుర్ని నాకిచ్చి చేయాలనుకున్నారు. ‘మన పరిస్థితి బాలేనప్పుడే తన కూతుర్ని నీకు చేసుకొమ్మని మావయ్య అడిగాడు, ఇవాళ వాళ్లు చితికిపోయారని, మనం బాగున్నామని వాళ్లను కాదనకూడదు’ అన్నారు. ‘నువ్వు అమ్మాయిని కోరుకుంటున్నావ్, నేను నీకు మంచి భార్యను ఇవ్వాలనుకుంటున్నాను, ఆ రెండిటి మధ్య తేడాని అర్థం చేసుకో’ అన్నారు. నేనర్థం చేసుకున్నాను. అందుకే మౌనంగా నా మరదలి మెడలో తాళి కట్టాను. నాన్న చెప్పింది నిజం... ఆయన నాకు చాలా మంచి భార్యనిచ్చారు. ఎవరి విషయంలోనైనా మంచే ఆలోచించేవారు నాన్న. తన-పర భేదమసలు తెలీదు ఆయనకి. నాన్న చనిపోయాక నేను థియేటర్ని పక్కన పెట్టి, సినీ నిర్మాతగా మారాలనుకున్నాను. అప్పుడు ఏవీఎం శరవణన్‌గారు... ‘మీ నాన్న ఎంతో ఆలోచించి థియేటర్ కట్టి ఇచ్చారు, దాన్ని వదిలేసి వేరేదానికి వెళ్తే ఏదైనా తేడా వచ్చిందనుకో, నీ పిల్లల పరిస్థితి ఏమిటి? ఏదైనా చేస్తే వాళ్లు స్థిరపడిన తర్వాత చెయ్యి’ అన్నారు. అది నిజమే అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడూ థియేటర్ని వదిలిపెట్టాలని అనుకోలేదు. ఇప్పుడు దాన్ని పడగొట్టి, మల్టీప్లెక్స్‌గా మారుస్తున్నాను. నా చిన్న కొడుకు హేమంత్ నటనలో శిక్షణ తీసుకున్నాడు. తనతో ఎప్పటికైనా ఓ సినిమా నిర్మిస్తాను. మిగిలిపోయిన ఆ కలను కూడా నెరవేర్చుకుంటాను! - సంభాషణ: సమీర నేలపూడి -
అపురూపం: విజయం వెనుక...
ఎస్వీ రంగారావు... గుమ్మడి... రేలంగి... స్వర్ణయుగపు టాప్ క్లాస్ క్యారెక్టర్ నటులు వీరు! తెలుగువారు గర్వించే కళామూర్తులు! అంతర్జాతీయ బహుమతులు పొందిన నటుడు ఎస్వీ రంగారావుగారైతే... డాక్టరేట్ గౌరవాన్ని పొందిన సహజ నటుడు శ్రీ గుమ్మడి. అలాగే ‘పద్మశ్రీ’ అందుకున్న తొలి హాస్యనటుడు మన రేలంగి! ఇలా అందరూ అందరే! ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు పెద్దలు. అలా వీరి విజయం వెనుక వీరి శ్రీమతులున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఎన్నెన్నో ఒత్తిడులు ఉంటాయి. ఎంతో బిజీగా ఉంటారు. కుటుంబ బాధ్యతలకు సమయం చిక్కదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రా గగనమే. ఇటువంటి వాతావరణంలో నేర్పుతో, ఓర్పుతో ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు ఉంటే తప్ప, వారు గొప్ప లక్ష్యాలను సాధించలేరు. అలాంటి సతీమణులను పొందారు కాబట్టే నటనకు పర్యాయపదంగా ఎదిగారు ఈ మహానటులు! ఆ కృతజ్ఞతను వివిధ సందర్భాలలో ప్రకటించేవారు కూడా. ఎస్వీ రంగారావుగారు తన మేనమామ కుమార్తె అయిన లీలావతిని వివాహం చేసుకున్నారు (1947). గుమ్మడిగారు లక్ష్మీసరస్వతిని (1944), రేలంగిగారు బుచ్చియమ్మను (1933) పరిణయమాడారు. ఆ ఆదర్శ దంపతుల అపురూప ఛాయాచిత్రాలివి. సినిమా వారి వైవాహిక జీవితాలు ఒడిదుడుకుల మయం... కానీ వీరివి ఆనందమయం! కారణం... ఒకరికొకరుగా జీవించారు... తోడు నీడగా సాగారు... సాటివారికి స్ఫూర్తిగా నిలిచారు! అన్యోన్య దాంపత్యం అంటే ఏమిటో చూపారు... తరువాతి తరానికి జీవితమంటే ఇదని తెలిపారు!!