హాస్య పద్మాలు
అపురూపం
‘నవ్వడం యోగం
నవ్వించడం భోగం
నవ్వలేకపోవడం రోగం’... అనేవారెప్పుడూ జంధ్యాలగారు.
నవ్వించడం నటులకి అంత తేలిక కాదు.
నవ్వించగలిగిన నటులకి మిగిలిన అన్ని రసాలు అభినయించడం తేలికే!
అటువంటి హాస్యాన్ని పండించి మెప్పించిన
హాస్యనటులు తెలుగులో ఎందరో!
వారంతా ప్రజల గుర్తింపునూ పొందారు.
వారిలో కొందరు ప్రభుత్వ గుర్తింపునూ పొందారు!
‘పద్మవిభూషణ్’, ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’.
ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను 1954 నుండి భారత ప్రభుత్వం ప్రదానం చేస్తూ వస్తోంది.
దక్షిణాదిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందిన తొలి హాస్యనటుడు శ్రీ రేలంగి వెంకట్రామయ్య. ఆ తరువాత కాలంలో అల్లు రామలింగయ్య, బ్రహ్మానందంలు అందుకున్నారు.
ఆ రోజుల్లో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ఉన్న స్టార్ కమెడియన్ శ్రీ రేలంగి! 1970లో ఆయన, నాటి రాష్ట్రపతి వి.వి.గిరి నుండి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని స్వీకరించారు.
అలాగే యాభై సంవత్సరాల పాటు 1,013 చిత్రాలలో నవ్వించారు శ్రీ అల్లు రామలింగయ్య. ఆయన, 1990లో నాటి భారత రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు.
హీరో ఎవరైనా సరే... బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్! ఇది ప్రస్తుతం బ్రహ్మానందం స్థాయి! 28 సంవత్సరాల సినీ జీవితంలో అప్పుడే వెయ్యి సినిమాలకు దగ్గరవుతున్న బ్రహ్మానందం ‘పద్మశ్రీ’ బిరుదును 2009లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు.
ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారం పొందుతోన్న బ్రహ్మానందం
అప్పుడు గాని... ఇప్పుడు గాని
తెలుగులో ఉన్నంత మంది హాస్యనటులు మరే భాషలోనూ లేరు! అలాగే ముగ్గురు హాస్యనటులు ‘పద్మ’ పురస్కారాలను మరే భాషలోనూ అందుకున్న గుర్తూ లేదు!!
హ్యాట్సాఫ్ టూ తెలుగు హాస్యనటులు!!!
-నిర్వహణ: సంజయ్ కిషోర్