అపురూపం: విజయం వెనుక...
ఎస్వీ రంగారావు... గుమ్మడి... రేలంగి...
స్వర్ణయుగపు టాప్ క్లాస్ క్యారెక్టర్ నటులు వీరు!
తెలుగువారు గర్వించే కళామూర్తులు!
అంతర్జాతీయ బహుమతులు పొందిన నటుడు ఎస్వీ రంగారావుగారైతే...
డాక్టరేట్ గౌరవాన్ని పొందిన సహజ నటుడు శ్రీ గుమ్మడి.
అలాగే ‘పద్మశ్రీ’ అందుకున్న
తొలి హాస్యనటుడు మన రేలంగి!
ఇలా అందరూ అందరే!
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు పెద్దలు. అలా వీరి విజయం వెనుక వీరి శ్రీమతులున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఎన్నెన్నో ఒత్తిడులు ఉంటాయి. ఎంతో బిజీగా ఉంటారు. కుటుంబ బాధ్యతలకు సమయం చిక్కదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రా గగనమే. ఇటువంటి వాతావరణంలో నేర్పుతో, ఓర్పుతో ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు ఉంటే తప్ప, వారు గొప్ప లక్ష్యాలను సాధించలేరు. అలాంటి సతీమణులను పొందారు కాబట్టే నటనకు పర్యాయపదంగా ఎదిగారు ఈ మహానటులు! ఆ కృతజ్ఞతను వివిధ సందర్భాలలో ప్రకటించేవారు కూడా.
ఎస్వీ రంగారావుగారు తన మేనమామ కుమార్తె అయిన లీలావతిని వివాహం చేసుకున్నారు (1947). గుమ్మడిగారు లక్ష్మీసరస్వతిని (1944), రేలంగిగారు బుచ్చియమ్మను (1933) పరిణయమాడారు. ఆ ఆదర్శ దంపతుల అపురూప ఛాయాచిత్రాలివి.
సినిమా వారి వైవాహిక జీవితాలు ఒడిదుడుకుల మయం... కానీ వీరివి ఆనందమయం!
కారణం... ఒకరికొకరుగా జీవించారు...
తోడు నీడగా సాగారు...
సాటివారికి స్ఫూర్తిగా నిలిచారు!
అన్యోన్య దాంపత్యం అంటే ఏమిటో చూపారు...
తరువాతి తరానికి జీవితమంటే ఇదని తెలిపారు!!