శ్రీకారాలు- శ్రీమిరియాలు
ఊరికిపేరు: ఎమ్వీయల్ ప్రయాణించినంత మేర పరిమళాలు వెదజల్లారు. చెరగని ముద్రలు వేశారు. ఎమ్వీయల్ మంచి రచయిత, వేదిక మీద గొప్పవక్త, విడిగా మంచిమాటకారి, వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడు. రాతలోనూ, సభలోనూ ప్రతిసారీ ఎత్తుగడలో ఒక కొత్తదనం ఉండేది. మొదటి వాక్యంలోనే ఆసక్తిని పుట్టించి పాఠకుల్ని శ్రోతల్ని తనవెంట తిప్పేవారు.
ఒక కాలేజి వార్షికోత్సవ సభలో గుమ్మడి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడుతున్నారు. ‘‘గుమ్మడి ఒక నటుడూ - చెడుగుడు ఒక ఆటా’’ అన్న ఎత్తుగడతో ప్రారంభించి గుమ్మడి నటనా వైదుష్యం గురించి చెప్పారు. అభినయంలో, వాచకంలో గుమ్మడి ప్రత్యేకతలేమిటో సోదాహరించారు. గ్రామీణ క్రీడ చెడుగుడు ఆటలోని వొడుపుని వివరించారు. గుమ్మడి నటనా వైభవాన్ని, చెడుగుడు ఆటలోని గ్రామీణ సౌందర్యాన్ని సమాంతరంగా కొంతదూరం నడిపించారు. ఎలా ముక్తాయిస్తారోననే జిజ్ఞాస శ్రోతల్లో కలిగించారు. చివరకు, ‘‘గుమ్మడే నటుడు - చెడుగుడే ఆట’’ అంటూ ముగించారు. ఎమ్వీయల్ మిడిల్డ్రాప్ కాకుండా ఉంటే తెలుగునాట మరెంతో సందడి చేసేవారు. నూజివీడు ఊరుకి పేరు తెచ్చారు.
రుక్కాయ్ రుక్కులు
శ్రీశ్రీ నవకవితకు 1939లో కృష్ణాపత్రికలో జరుక్శాస్త్రి పేరడీ రాసి ప్రచురించారు. అవతలి గీతం ఎంత ప్రసిద్ధమైంది అయితే ఈ అనుకరణ కూడా అంతగా ప్రతిధ్వనిస్తుంది. మాగాయీ కందిపచ్చడీ ఆవకాయి పెసరప్పడమూ తెగిపోయిన పాతచెప్పులూ పిచ్చాడి ప్రేలాపం, కోపం వైజాగులో కారాకిల్లీ సామానోయ్ సరదా పాటకు - ఇలా సాగుతుంది పేరడీ. జలసూత్రం సమకాలికులు శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి ముద్దుగా ‘‘రుక్కాయ్’’ అని పిలిచేవారు. మనం సాహిత్యంలో హాస్యాన్ని పట్టుకోగలిగాం కాని ప్రముఖుల జీవితాల్లో హాస్యాన్ని ఎక్కువభాగం దక్కించుకోలేకపోయాం. ప్రసార మాధ్యమాలు అంతగా లేని రోజుల్లో ఏ సభల్లోనో సమావేశాల్లోనో ఇష్టాగోష్ఠిలోనో పుట్టిన చతురోక్తులను పదిలపరచుకోలేక పోయాం. హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు అనుస్టుప్ ఛందంలో సంస్కృతాంధ్రాలు మిళితం చేసి తన సహజ శైలిలో చెప్పిన శ్లోకం ఇది -
శ్లో॥ఆషాఢ శుద్ధ సప్తమ్యాం వచ్చునే వృద్ధగౌతమీ
అధవా తప్పిజారినామ్ అష్టమ్యామ్ యిహ తప్పదూ.
గోదావరి తీరవాసులకు ఏటా గోదావరి పై నుంచి రావడం ఒక గొప్ప సందర్భం, సందడి. ఆషాఢ శుద్ధ, సప్తమికి వచ్చిందా సరే, లేదంటే అష్టమికి ఇహ తప్పదని శ్లోకార్థం.
పిల్లి కోరిక
శ్రీ సత్యసాయి అపార్ట్మెంట్స్లో పుట్టి పెరిగిన ఒక పిల్లి ఉన్నట్టుండి మెట్లకింద ఘోరతపస్సుకి కూర్చుంది. నిజానికి ముందే ఘోరతపస్సు అవదు. కూర్చున్నాక, కాలం గడిచాక, ఢక్కా ముక్కీలు తిన్నాక అది ఘోరంగా మారుతుంది. పిల్లి తపస్సు నిశ్శబ్దంగా సాగుతోంది. అక్కడి పాతిక ముప్ఫైకాపరాల చెత్తాచెదారం, ఖాళీ పాలకవర్లు పిల్లిచుట్టూ పేరుకుపోయాయి. ఒక అర్ధరాత్రి సమయాన శివుడు ప్రత్యక్షమయ్యాడు. ‘‘మార్జాలమా ఏమి నీ కోరిక’’ అన్నాడు. పిల్లి మాట్లాడలేదు. ఎంత గద్దించినా, గర్జించినా ఉలుకూ పలుకూ లేదు.
శివుడాగ్రహించి, త్రిశూలంతో తుక్కులోంచి బయటకు లాగాడు. అప్పుడు పిల్లి యావత్ వృత్తాంతము గ్రహించినదై ‘‘స్వామీ నన్ను అనుగ్రహించు. నా పేరు మార్జాలమని నాకు తెలియక...’’ అని ప్రాధేయపడింది. ‘‘సరే ఏడు’’ అన్నాడు శివుడు. ‘‘స్వామీ! వచ్చే జన్మలో నన్ను కుక్కగా పుట్టించు దేవరా. అది కూడా నూటఇరవై అపార్ట్మెంట్ టామీ కంటే బెత్తెడు ఎత్తు, జానెడు పొడవు ఎగస్ట్రాగా ఉండాలి...’’ అంటూ శిరసు వంచింది. శివుడు తథాస్తు అంటూ కైలాసానికి వెళ్లిపోయాడు.
నీతి: సమస్యని బట్టి కోరికలు పుడతాయి. జీవితవృక్షం కొసను పూచిన పువ్వే నవ్వు.
- ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
- శ్రీరమణ
పంచాంగ శ్రవణం
మారాలి. మునుపటిలాగా రాజపూజ్యం, అవమానం లాంటివి కాకుండా మారుతున్న కాలానికి తగినట్టు నవీకరించాలి. కరెంటు వాడకం, పెట్రోఉత్పత్తుల వాడకం ఎంతవుంటుందో ఆయా రాశులవారికి చెప్పాలి. వాడకం చాలా ఎక్కువవుంటే జాతకం చాలా బావున్నట్టు. ఆదాయమన్నా భారీగా ఉండాలి లేదా బిల్లులు చెల్లించే వారు వేరుగానైనా ఉండాలి - ఏదైనా జాతకులే. అలాగే విమాన ప్రయాణం ఏ స్థాయి, కారు, రైలు ప్రయాణాలు ఏ స్థాయిలో ఉంటాయో చెబితే జాతకం కొంతవరకు తెలిసిపోతుంది.
లౌక్యం ప్రధానం
కొందరికి లౌక్యం తెలియదు. వారెంతటి తపస్సంపన్నులైనా జీవితంలో రాణించలేరు. ఒక భక్తుడు భద్రాచలం మీద తపస్సుకి కూర్చున్నాడు. రాముడు ప్రత్యక్షమయ్యాడు. భక్తుడు రాముణ్ణి గుర్తించి, ‘‘రామా! నీలమేఘశ్యామా’’ అంటూ మోకరిల్లాడు. ‘‘నిజబలంబును ప్రదర్శింపక, చెట్టుచాటునించి వాలిని మట్టుపెట్టిన పరంధామా!’’ అని సంబోధించాడు. రాముడికి ఈ భక్తుడితో మొదట్నించీ ఎదురుదెబ్బలే తగుల్తున్నాయి. ‘‘పండుముసలి శబరి ఎంగిలి పండు ఆరగించిన భక్తసులభా’’ అన్నాడు. ‘‘కపివరులతో సేతువు నిర్మింపజేసిన మహానుభావా!’’ అనే సరికి రాముడు ఇకచాలని సైగ చేశాడు. శ్రీమద్రామాయణంలో నేచేసిన బృహత్కార్యములు ఎన్నోవుండగా, నీకివే తట్టినవా - లౌక్యమే తెలియని మానవాధమా అంటూ రాముడు విసవిసా వెళ్లిపోయాడు. పురుషోత్తములు సత్యాలను స్వీకరించలేరని భక్తుడికి అర్థమైంది.
పెన్ డ్రాప్స్
- ఇది వసంతం. కొత్త చిగుళ్లు తొడుగుతాయి. ముఖ్యంగా కవి కుమారులు కొత్తగా చిగురిస్తారు.
- కొండల్లో కోనల్లో కోయిలలు విజృంభించి పాడతాయి. కవికోకిలలు ఉగాది వేదికల మీద గళాలు విప్పుతాయి. నిర్వాహకులు శాలువాలు కప్పుతారు. ఒక్కోసారి లెక్కలు తప్పుతాయి.
- ఇప్పుడే అందిన ఎస్ఎమ్ఎస్ ఈ వసంతం తుళ్లూరులో. అక్కడ రూపాయలు చిగురిస్తున్నాయి.