నయవంచన | The Murder of Clare Wood | Sakshi
Sakshi News home page

నయవంచన

Published Sun, Dec 7 2014 1:52 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM

నయవంచన - Sakshi

నయవంచన

నమ్మకంతో ప్రేమిస్తారు. ఆ నమ్మకంతోనే జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడతారు. కానీ ఒక్కసారి కూడా ఆలోచించరు... ఆ వ్యక్తి నమ్మదగినవాడేనా అని! చాలామంది అమ్మాయిలు చేసే తప్పే ఇది. క్లేర్ ఉడ్ కూడా ఈ తప్పే చేసింది. ఫలితంగా జీవితాన్నే కోల్పోయింది. తనే లోకంగా బతుకుతోన్న తండ్రికి కన్నీటిని మిగిల్చి వెళ్లిపోయింది!
 

 ‘‘డాడ్... ఇతను జార్జ్. నేను తనని ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను... ఈ మాటలు అంటున్నప్పుడు నా చిట్టితల్లి క్లేర్ కళ్లలో మెరుపులు కనిపించాయి నాకు. సిగ్గుతో తన చెంపలు కందిపోయాయి. నావైపు సూటిగా చూడలేక నేల చూపులు చూడసాగింది.
 నేను జార్జ్‌వైపు చూశాను. పలకరింపుగా నవ్వాడు. చప్పున నా చేయి అందుకుని షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకోగానీ... అతని స్పర్శ, చూపు, నవ్వు... ఏదీ నాకు నచ్చలేదు.

అలా అనలేకపోయాను. కనీసం నా అయిష్టాన్ని ముఖ కవళికల ద్వారా కూడా వ్యక్తం చేయలేకపోయాను. ఎందుకంటే... ఎదురుగా నా కూతురు ఉంది. నేను కాదనను అన్న నమ్మకం కనిపిస్తోంది తనలో. అందుకే ధైర్యం చేయలేకపోయాను. ఎక్కువగా ఆలోచించకుండా ‘నీ ఇష్టం బేబీ’ అనేశాను. తను సంతోషంతో గంతులు వేసింది. ‘చూశావా జార్జ్... నేను చెప్పానుగా మా డాడీ గురించి.

నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు’ అంది సంబరపడిపోతూ. జార్జ్ నవ్వాడు. అప్పుడు కూడా ఆ నవ్వులో స్వచ్ఛత కనిపించలేదు నాకు. జైలర్‌గా పని చేసిన అనుభవం ఎక్కడో నన్ను హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది. కానీ క్లేర్ మీద ఉన్న ప్రేమ నా విచక్షణను జయించింది. అలా జరగకుండా ఉండివుంటే... ఈ రోజు నా క్లేర్ నా దగ్గర ఉండివుండేది.’’
‘‘నిజమే. ఆరోజే మీరు జాగ్రత్తపడివుంటే మీ కూతుర్ని కాపాడుకునేవారు.’’రిపోర్టర్ అన్న మాటకు కళ్ల నిండా నీళ్లు వచ్చేశాయి మైఖేల్‌కి. మాట్లాడలేకపోయాడు. మనసు గతంలోకి పరుగెత్తింది. జరిగిన దారుణం మదిలో మెదిలింది.

2009, ఫిబ్రవరి 2...
స్టడీ రూమ్‌లో ఉన్న ఫోన్ రింగవుతోంది. వంటగదిలో కాఫీ కలుపుకోవడంలో మునిగిపోయిన మైఖేల్, వడివడిగా స్టడీరూమ్‌కి వెళ్లాడు. ఫోన్ తీసి హలో అన్నాడు. అవతలి వ్యక్తి చెప్పింది వినగానే అతడి ముఖం మ్లానమయ్యింది. చేతిలోని కప్పు జారి నేలమీద పడి భళ్లున బద్దలయ్యింది. దాని సంగతి పట్టించుకోలేదు. గబగబా తయారయ్యాడు. పర్స్ తీసి జేబులో పట్టుకుని, ఇల్లు తాళం వేసి బయలుదేరాడు. అరగంట తిరిగేసరికల్లా తన కూతురు క్లేర్ ఇంటి దగ్గర ఉన్నాడు.
 
ఇంటి ముందు కారు దిగుతూనే అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయాడు మైఖేల్. బోలెడంతమంది జనం గుమిగూడి ఉన్నారు. క్లేర్ ఇంటివైపు చూస్తూ ఏదో చర్చించుకుంటున్నారు. మైఖేల్ మనసు ఏదో కీడు శంకించింది. ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి వెంటనే మీ అమ్మాయి ఇంటికి రండి అన్నాడు తప్ప ఏం జరిగిందో చెప్పలేదు. కానీ ఇక్కడి పరిస్థితి చూస్తుంటే ఏదో జరిగినట్టే ఉంది.
 
అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లాడు మైఖేల్. లోపలికి అడుగు పెడుతుంటే కాలిన వాసన గుప్పుమంది. కడుపులో దేవినట్టయ్యింది. ఖర్చీఫ్ తీసి ముక్కుకు అడ్డు పెట్టుకున్నాడు. రెండు అడుగులు ముందు వేశాడో లేదో ఇన్‌స్పెక్టర్ ఎదురొచ్చాడు. ‘‘మైఖేల్ బ్రౌన్ అంటే మీరేనా?’’ అన్నాడు మైఖేల్‌ని పైనుంచి కిందకు పరికిస్తూ.
 
అవునన్నట్టు తలూపాడు మైఖేల్. ఏం జరిగింది అని అడిగేలోపు ఇన్‌స్పెక్టరే అన్నాడు... ‘‘సారీ మిస్టర్ మైఖేల్. మీ అమ్మాయి క్లేర్ చనిపోయింది. ఎవరో హత్య చేశారు. మీకు ఫోన్ చేసింది నేనే. ఫోన్లో చెబితే తట్టుకోలేరని చెప్పలేదు.’’ హతాశుడయ్యాడు మైఖేల్. ఇన్‌స్పెక్టర్ ఇంకా ఏదేదో చెబుతున్నాడు. కానీ అతడి చెవులను అవి చేరడం లేదు. మౌనంగా నడుచుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ... మంచం మీద... నల్లగా... కాలిపోయి... గుర్తు పట్టలేనట్టుగా ఉంది క్లేర్ మృతదేహం. దాన్ని చూస్తూనే ‘బేబీ’ అంటూ కుప్పకూలిపోయాడు.

   
 రెండు రోజుల తర్వాత... ‘‘ఎలా ఉన్నారు మైఖేల్?’’
 ఇన్‌స్పెక్టర్ అడిగిన ప్రశ్నకు బాగున్నాను అన్నట్టు తలాడించాడు మైఖేల్. ‘‘నన్నెందుకు రమ్మన్నారు?’’ అన్నాడు నిర్లిప్తంగా.
 ‘‘జార్జ్ ఆపిల్‌టన్ ఆత్మహత్య చేసుకున్నాడు’’
 ‘‘ఆత్మహత్య చేసుకున్నాడా?’’ అన్నాడు నమ్మలేనట్టుగా.
 ‘‘అవును. ఓ బార్‌లో అతని మృతదేహం దొరికింది.’’
 ‘‘నో. నా కూతురిని ఘోరంగా చంపిన ఆ నీచుడు అంత సులభంగా చచ్చిపోవడానికి వీల్లేదు’’ అంటూ వెక్కివెక్కి ఏడుస్తోన్న మైఖేల్‌ని ఎలా ఓదార్చాలో తెలియలేదు ఇన్‌స్పెక్టర్‌కి. నిట్టూర్చి అన్నాడు.. ‘‘కంట్రోల్ యువర్‌సెల్ఫ్ మిస్టర్ మైఖేల్.

మేము తనని అరెస్ట్ చేయాలని అనుకున్నాం. కానీ అంతలోనే ఇలా జరిగింది.’’అంతవరకూ ఏడ్చినవాడు, ఒక్కసారిగా వెర్రిగా నవ్వాడు మైఖేల్. ‘‘నా కూతుర్ని వాడు చిత్రహింసలు పెట్టాడు. తను ఎన్నిసార్లు కంప్లయింట్లు ఇచ్చిందో, ఎన్నిసార్లు తనని కాపాడమని మీ కాళ్లా వేళ్లా పడిందో ఈ రెండు రోజుల్లో నాకు తెలిసింది. మీరు నా కూతుర్ని నాకు కాకుండా చేశారు.

ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి’’ అనేసి ఆవేశంగా వెళ్లిపోతోన్న మైఖేల్ వైపు బిత్తరపోయి చూస్తూండిపోయాడు ఇన్‌స్పెక్టర్.అంతకంటే ఏం చేస్తాడు? తప్పు తనదే. క్లేర్ బాధను ఒక్కసారైనా అర్థం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆమె ప్రాణం పోయేదీ కాదు.
 క్లేర్‌కి ఇంటర్నెట్ ద్వారా పరిచయమయ్యాడు జార్జ్. ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. అతడిని తన తండ్రికి పరిచయం చేసింది క్లేర్. నిజానికతడికి జార్జ్ నచ్చలేదు. కానీ ఆ విషయం చెప్పలేక పోయాడు. అప్పటికే భార్యను, కొడుకును ప్రమాదవశాత్తూ పోగొట్టుకుని ఉన్నాడు.

దాంతో ఉన్న కూతురినైనా సంతోషంగా ఉంచాలనుకున్నాడు. సరే అన్నాడు. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది క్లేర్. కొన్నాళ్లు సంతోషంగా గడిపి అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ సంవత్సరం తిరిగే సరికల్లా జార్జ్ నిజస్వరూపం తెలిసి వచ్చిందామెకి. తనలాగే మరో ముగ్గురు అమ్మాయిలతో ఇంటర్నెట్ ద్వారానే ప్రేమాయణం నడుపుతున్నాడని తెలిసి షాకయ్యింది. ఇదేంటని నిలదీసింది. అతడు లెక్క చేయలేదు. దాంతో మనసు విరిగి, అతడికి దూరమైపోయింది.
 
అది జార్జ్ తట్టుకోలేకపోయాడు. క్లేర్‌ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఎంత రహస్యంగా బతుకుదామన్నా ఆమె జాడ కనుక్కునేవాడు. ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మాటలు, చేతలతో హింసించేవాడు. తలుపు తీయకపోతే బద్దలు కొట్టేవాడు. తనతో మళ్లీ కలవమని పోరు పెట్టేవాడు. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించేవాడు. అది తట్టుకోలేక పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది క్లేర్.

వాళ్లు కొన్నిసార్లు జార్జ్‌ని అరెస్ట్ చేశారు. కానీ అతడు సాయంత్రానికల్లా బెయిల్ తీసుకుని బయటికొచ్చేసేవాడు. మరికొన్నిసార్లు పోలీసులే లెక్కలేనట్టుగా ఉండేవారు. తనకు ప్రాణహాని ఉందని క్లేర్ మొత్తుకున్నా వాళ్లు ఆమెకి సెక్యూరిటీ ఇచ్చిన పాపాన పోలేదు. దాంతో ఘోరం జరిగిపోయింది. ఎప్పటిలాగే క్లేర్ ఇంటి మీద దాడి చేసిన జార్జ్... ఆమెను హింసించి, అత్యాచారం చేసి చంపేశాడు. ఆపైన పెట్రోలు పోసి కాల్చేశాడు.
 
జరిగిన విషయాలన్నీ కూతురి డైరీ చూసినప్పుడు తెలిశాయి మైఖేల్‌కి. ‘నాన్నను బాధపెట్టడం ఇష్టం లేక తనకేమీ చెప్పడం లేదు’ అని రాసుకున్న మాటలు చదివి అల్లాడిపోయాడు. తన  బిడ్డ పడిన నరకయాతన తలచుకుని కుమిలిపోయాడు. కూతురిని కాపాడుకోలేకపోయానే అని విలవిల్లాడాడు. అంతకంటే అతడిని బాధించిన విషయం మరొకటుంది.

జార్జ్‌కి నేరచరిత్ర ఉందని, అంతకుముందే ఓ అమ్మాయిని ప్రేమలోకి దించాడని, ఆమెకి తన నిజస్వరూపం తెలిసిపోవడంతో కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాడని, ఆ కేసులో అరెస్టయ్యి ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నాడని తెలిసింది. జార్జ్ గురించి ముందే ఎంక్వయిరీ చేసివుంటే ఇలా జరిగివుండేది కాదు అనిపించింది. తన కూతురు కంప్లయింట్ ఇచ్చినప్పుడయినా అతడి గురించి విచారించని పోలీసుల మీద కోపం ముంచు కొచ్చింది. వెంటనే కోర్టులో పిటిషన్ వేశాడు. తన కూతురి చావుకి పోలీసులే కారణమని ఆరోపించాడు. అతడి నవ్వుకు కారణం అప్పుడు అర్థం అయింది ఇన్‌స్పెక్టర్‌కి.
 
మైఖేల్ పిటిషన్ పెద్ద సంచ లనమే సృష్టించింది. బ్రిటన్ ప్రభుత్వాన్ని కదిలించింది. ఆడపిల్లల సంరక్షణ కోసం ‘క్లేర్ వుడ్’ పేరుతోనే ఓ చట్టం రూపొందింది. దీని ప్రకారం ఏ ఆడపిల్ల అయినా ఒక వ్యక్తితో అనుబంధం ఏర్పరచుకునే ముందు, పోలీసుల దగ్గరకు వెళ్లి, ఆ వ్యక్తి పూర్తి వివరాలు కావాలని అడగ వచ్చు. పోలీసులు నో చెప్పడానికి వీల్లేదు. వారం తిరిగేసరికల్లా ఆ వ్యక్తి గురించి విచారణ చేసి, నేర చరిత్ర ఉందేమో తిరగదోడి, పూర్తి వివరాలను సదరు అమ్మాయికి తెలియజెయ్యాలి.
 
క్లేర్ మాదిరిగా మరే అమ్మాయీ పోలీసుల నిర్లక్ష్యానికి బలి అవ్వకూడదనే ఈ చట్టాన్ని తెచ్చారు. కూతురి ప్రాణాలను కాపాడుకోలేకపోయినా, తన కూతురులాంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను కాపాడేందుకు మైఖేల్ పడిన తపనకు, చేసిన పోరాటానికి ఫలితమిది. అయితే దీనికి గర్వపడటం లేదు మైఖేల్. కూతురి ఫొటోను చూసినప్పుడల్లా తనను కాపాడుకోలేకపోయానన్న అపరాధ భావంతో కుమిలిపోతున్నాడు. బహుశా ఆ బాధ ఎప్పటికీ తీరకపోవచ్చు. ఎంతయినా కన్నతండ్రి కదా!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement