మణిరత్నం ఇంట్లో కార్ల్ మార్క్స్
అనంతరం: ప్రతి కొడుకూ తన తండ్రిని హీరోగా భావిస్తాడు. ఆయన అడుగుల్లో అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆయన మార్గంలో తానూ పయనించాలనుకుంటాడు. కానీ నందన్ అలా అనుకోలేదు. తండ్రి దేశం గర్వించదగ్గ దర్శకుడు. అయినా కూడా సినిమావైపు కన్నెత్తి చూడలేదు నందన్. పోనీ తల్లిలా మేకప్ వేసుకున్నాడా అంటే అదీ లేదు. తనదైన మార్గం ఎంచుకున్నాడు. తనకు నచ్చిన పంథాలో సాగిపోవాలని అనుకుంటున్నాడు. తను నమ్మిదాన్నే ఆచరిస్తానంటున్నాడు. ఇంతకీ సుహాసిని, మణిరత్నంల కొడుకు నందన్ ఏ దారిలో ఉన్నాడు?
సినిమా తప్ప మరో మాటే వినిపించని కుటుంబంలో పుట్టినా, ఆ మూడక్షరాలూ నందన్‌ని ప్రభావితం చేయలేకపోయాయి. జాతీయ అవార్డుల్ని అలవోకగా తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకునే తల్లి లాలనలో పెరిగాడు. దర్శకుడు అనగానే అందరి మనసుల్లోనూ మెదిలేంత ప్రతిభావంతుడైన తండ్రి చేయి పట్టుకుని ఎదిగాడు. అయినా వారి ప్రభావం నందన్ మీద లేదు. వారి దగ్గర నడక నేర్చుకున్నాడే తప్ప, వారు వెళ్లిన దారిలో నడవాలనుకోలేదు. వాళ్లున్న రంగాన్ని గౌరవించాడే తప్ప, అటు వెళ్లిపోవాలని ఆశించలేదు. అలా అనుకుని ఉంటే... నందన్ గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు.
వయసును మించిన మేధస్సు...
రంగుల ప్రపంచం మధ్యలో పెరిగిన నందన్‌ని ఆ రంగుల కంటే అక్షరాలు ఎక్కువ ఆకర్షించాయి. అందుకే సినిమాలు చూస్తూ కాక, పుస్తకాలు చదువుతూ పెరిగాడు. పుస్తకం కనిపిస్తే పూర్తిగా చదివేదాకా నిద్రపోయేవాడు కాదు. పసితనపు ఛాయలు పోకముందే మార్క్సిజాన్ని అవగాహన చేసుకున్నాడు. యుక్త వయసు వచ్చేనాటికి లెనినిజాన్ని ఔపోసన పట్టాడు. పదిహేడేళ్లు వచ్చేప్పటికి మార్కిస్ట్-లెనినిస్టు ఐడియాలజీని ఒంటబట్టించుకుని, ‘ద కాంటూర్స్ ఆఫ్ లెనినిజం’ పేరుతో ఇరవయ్యేడు పేజీల పాంప్లెట్‌ను రూపొందించాడు. ‘తత్వ శాస్త్రానికి, రాజకీయ సంస్కరణ, ఆచరణలకు అతి మెరుగైన, సర్వకాల రూపమే మార్క్సిజం’ అంటూ ఓ అనుభవ జ్ఞుడైన ప్రొఫెసర్‌లా లోతుగా ఉన్న అతడి భావాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అప్పుడే తొలిసారి అతడు మణిరత్నం కొడుకుగా కాక, ఓ జీనియస్‌గా, అభ్యుదయ భావాలు కల యువకుడిగా ప్రపంచానికి పరిచమయ్యాడు.
ఊహించని అడుగు...
చిన్న వయసులోనే ఎవరూ ఊహించని అడుగులు వేశాడు నందన్. ఎప్పుడైతే సీపీఐ(ఎం) తరుఫున వాలంటీరుగా పనిచేయడం మొదలెట్టాడో... అప్పుడే అతడి మనసు రాజకీయాల వైపు లాగుతోందని అర్థమైంది తల్లిదండ్రులకి. వాళ్లెప్పుడూ కొడుకుని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనుకోలేదు. అతడేం చేసినా తోడుగా నిలవాలనుకున్నారు. ‘నందన్‌కి పాలిటిక్స్ అంటే ఇష్టం. తన ఇష్టాన్ని గౌరవించడం మాకిష్టం. అందుకే తన నిర్ణయాన్ని మేం ప్రోత్సహించాం’ అన్నారందుకే సుహాసిని ఓ ఇంటర్వ్యూలో.
కానీ సుహాసినికి చిన్నాన్న, నందన్‌కి చినతాత అయిన నటుడు కమల్ హాసన్... నందన్ సినిమా రంగం వైపు రావాలని ఆశిస్తున్నారు. తనని ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో కలిసి పనిచేసే విధంగా ప్రోత్సహించారని, నందన్ కూడా అందుకు అంగీకరించాడని తెలుస్తోంది. అయితే రాజకీయాల మీద మనసు ఉన్న నందన్, సినిమా రంగంవైపు వెళ్లగలడా! పెద్దవాళ్ల మాటను కాదనలేక వెళ్లినా మనసు లేని చోట ఇమడగలడా! అతడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు... వేచి చూడాల్సిందే!
- సమీర నేలపూడి