పసివాడి శాపం | Pearson eager to see Leicester resolve | Sakshi
Sakshi News home page

పసివాడి శాపం

Published Sun, Dec 28 2014 1:01 AM | Last Updated on Wed, Sep 5 2018 9:51 PM

పసివాడి శాపం - Sakshi

పసివాడి శాపం

నిజాలు దేవుడికెరుక
జూన్ 6, 1985... బ్రిటన్. ‘‘త్వరగా పోనియ్. ఇప్పటికే ఆలస్యమైంది’’... తొందరపెడుతున్నాడు పీర్సన్.
 అతడలా అనడంతో మరింత వేగం పెంచాడు డ్రైవర్. మరో పది నిమిషాల్లో డెర్బీలోని ఓ ఇంటికి చేరుకున్నారు.
 ‘‘ఓ మై గాడ్... త్వరగా పని మొదలు పెట్టండి’’ అని అరుస్తూ వ్యాన్‌లోంచి కిందికి దూకాడు పీర్సన్. అందరూ చకచకా బండి దిగారు. పొడవాటి ట్యూబులను చేతుల్లోకి తీసుకుని నీళ్లు చిమ్మడం మొదలు పెట్టారు. ఎంతో అందంగా ఉందా ఇల్లు. ఏం జరిగిందో ఏమో కానీ... మంటల్లో చిక్కుకుంది. ఆ విషయం తెలియగానే తన టీమ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు ఫైర్ స్టేషన్ ఇన్‌చార్జి పీర్సన్. వాళ్లంతా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు కానీ... మంటలు ఓ పట్టాన అదుపులోకి రావడం లేదు.
 
‘‘చాలా పెద్ద యాక్సిడెంట్ సర్’’ అన్నాడు ఫైర్‌మేన్ జాన్.
 ‘‘అవును. దాదాపు అన్నీ నాశనమైపోయి ఉంటాయి. మనుషులెవరికీ ఏం కాకుండా ఉంటే చాలు’’ అన్నాడు పీర్సన్.
 కాసేపటికి మంటలు చల్లారాయి. మాస్కులు తగిలించుకుని అందరూ లోపలికి నడిచారు.
 అదృష్టంకొద్దీ లోపల మనుషులెవరూ లేరు. కానీ ఇల్లు ధ్వంసమైపోయింది. అన్నీ మాడి మసైపోయాయి.
 ‘‘అనుకున్నట్టే అయ్యింది జాన్. ఏ ఒక్కటీ మిగల్లేదు’’ అన్నాడు పీర్సన్ పరిశీలిస్తూ.
 ‘‘అవును సర్’’ అంటూ ఎందుకో గోడవైపు చూసిన జాన్ అవాక్కయిపోయాడు. గోడకు ఓ చిన్నపిల్లాడి పెయింటింగ్ వేళ్లాడుతోంది. ఆ పిల్లాడు చాలా జాలిగా ఉన్నాడు. ఏడుస్తున్నాడు. చెక్కిళ్ల మీదుగా కన్నీళ్లు జాలువారుతున్నాయి. చక్కని రంగులతో, ఎంతో అందంగా ఉంది ఆ చిత్రం చూడ్డానికి.
 మెల్లగా దాని దగ్గరకు వెళ్లాడు జాన్. చిత్రాన్ని చేతితో తాకాడు. అంతే... ఉలిక్కిపడ్డాడు. ‘‘సార్... ఓసారిలా రండి... త్వరగా’’ అంటూ కేక పెట్టాడు. అతడి అరుపు వింటూనే అటువైపు పరుగు తీశాడు పీర్సన్. ‘‘ఏంటి జాన్... ఏం జరిగింది’’ అన్నాడు కంగారుగా.
 
జాన్ కళ్లు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ‘‘ఇటు చూడండి సర్’’ అంటూ పెయింటింగ్ వైపు చూపించాడు. దాన్ని చూస్తూనే విస్తుపోయాడు పీర్సన్.
‘‘ఏంటిది జాన్... ఇదెలా సాధ్యం? ఇల్లు మొత్తం బుగ్గైపోయింది. కానీ ఈ పెయింటింగ్ మాత్రం చెక్కు చెదరలేదు. దాని వెనక ఉన్న గోడ కూడా మసిబారిపోయింది. ఇది మాత్రం ఇలా ఎలా ఉంది?’’... తన అనుమానాలన్నింటినీ ప్రశ్నలుగా సంధించాడు పీర్సన్.
 ‘‘అంతకంటే విచిత్రం ఇంకొకటుంది సర్. ఇంత ఘోరమైన మంటల మధ్య ఉన్నా, ఈ పెయింటింగ్‌కున్న ఫ్రేమ్ కనీసం వేడి కూడా ఎక్కలేదు.’’
 జాన్ అలా అనగానే ఫ్రేమును తాకి చూశాడు పీర్సన్. చల్లగా తగిలింది చేతికి. మరోసారి విస్తుపోయాడు. కాసేపటికి విస్మయం నుంచి తేరుకుని, ఆ చిత్రాన్ని తీసుకుని స్టేషన్‌కి బయలుదేరారు ఇద్దరూ.
    
ఆ రోజు సాయంత్రం...
‘‘అబ్బ.. ఎంత బాగుందో పెయింటింగ్. బుజ్జిగాడు ఎంత ముద్దుగా ఉన్నాడో’’... భర్త తీసుకొచ్చిన చిత్రాన్ని చూస్తూనే సంబరపడిపోయింది పీర్సన్ భార్య మిలిండా.
 ‘‘కదా... నీకు నచ్చుతుందనే తెచ్చాను’’ అన్నాడు పీర్సన్.
 మిలిండా ఆ చిత్రాన్ని హాల్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గోడ కు తగిలించింది. చూసుకుని మురిసిపోయింది.
    
వారం రోజుల తర్వాత...
ఫైర్ స్టేషన్‌లో పీర్సన్ పనిలో తలమునకలై ఉండగా ఫోన్ రింగయ్యింది. ‘‘పనిలో ఉన్నప్పుడే ఫోన్లు వస్తుంటాయి. ఇంకెవరి కొంప తగులబడిందో ఏమో’’ అనుకుంటూ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. అవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే అతడి ముఖం మ్లానమయ్యింది. చేస్తున్న పని వదిలేసి టీమ్‌ని తీసుకుని పరుగుదీశాడు. వాళ్లు వెళ్లేసరికి పీర్సన్ ఇల్లు తగులబడుతోంది.
 ‘‘దేవుడా... ఇలా ఎలా జరిగింది? మిలిండా లోపలే ఉండివుంటుంది... మిలిండా’’... పీర్సన్ అరుపులతో పరిసరాలు దద్దరిల్లాయి. సిబ్బంది మంటల్ని అదుపు చేయగానే  లోపలకు పరుగెత్తాడు పీర్సన్. లోపల... హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న మిలిండా, ఉన్నది ఉన్నట్టుగా కాలిపోయింది. ఆమెనలా చూస్తూనే భోరుమన్నాడు పీర్సన్.
 
‘‘ఊరుకోండి సర్. అసలు ఇది ఎలా జరిగిందంటారు? మేడమ్ కూర్చున్న విధానాన్ని బట్టి ఆవిడ టీవీ చూస్తున్నట్టు అనిపిస్తోంది. కనీసం వంట చేసేటప్పుడు ప్రమాదం జరిగిందనుకోవడానికి లేదు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్‌లాంటిదేమైనా అయ్యిందేమో’’... ప్రమాదానికి కారణాలను అంచనా వేసే పనిలో పడ్డాడు జాన్. కానీ పీర్సన్ అవేమీ వినే పరిస్థితుల్లో లేడు. బూడిదశిల్పంలా ఉన్న భార్యవైపే చూస్తూ కూర్చున్నాడు. ఉన్నట్టుండి అతడి కళ్లు... ఎదురుగా ఉన్న గోడమీద పడ్డాయి. ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఆ పిల్లాడి పెయింటింగ్ అలానే ఉంది. చుట్టూ ఉన్న మిగతా పెయింటింగులు, ఫొటోలన్నీ కాలిపోయాయి. కానీ అది మాత్రం అలానే ఉంది.

 ‘‘జాన్... ఇలారా’’
 ఇన్‌చార్జి అరుపు వింటూ అక్కడికి వచ్చిన జాన్ పిల్లాడి చిత్రాన్ని చూసి భయంతో వణికాడు. ‘‘ఏంటి సార్ ఈ విచిత్రం? నాకెందుకో ఆ పెయింటింగువల్లే ఇదంతా జరిగిందని అనిపిస్తోంది. దాన్ని వెంటనే ఎక్కడైనా పారేయండి సర్’’ అన్నాడు కంగారుగా.
 నువ్వు చెప్పేది కరెక్టే అన్నట్టు తలూపాడు పీర్సన్. వెంటనే దాన్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో పారేశాడు. శని వదిలిందనుకున్నాడు. కానీ ఆ చిత్రం తనకి మరోసారి ఎదురవుతుందని అతడు ఊహించలేదు.
    
 నెల రోజుల తర్వాత...
 పీర్సన్ ఇంటికి రెండు వీధుల అవతల ఉన్న ఓ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ పీర్సన్ బృందానికి మళ్లీ ఆ పిల్లాడి పెయింటింగ్ కనిపించింది. మాడి మసైపోయిన వస్తువుల మధ్య, అందంగా, ఎంతో కళగా కనిపించింది. అది ఎక్కడిదని ఇంటి యజమానిని అడిగాడు పీర్సన్. రోడ్డుమీద వెళ్తూ అనుకోకుండా ఓ చెత్తబుట్ట వైపు చూస్తే, అందులో కనిపించిందని, అంత అందమైన చిత్రాన్ని అలా పారేయడం ఇష్టం లేక తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. దాన్ని ఇంటికి తెచ్చిన  వారం రోజులకే ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు.
 
పీర్సన్‌కి విషయం అర్థమైంది. కచ్చితంగా ఆ చిత్రం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని అతడికి అర్థమైంది. దాన్ని ఎక్కడైనా పారేయమని ఆ వ్యక్తికి చెప్పాడు. అతడు దాన్ని తీసుకెళ్లి, ఓ నిర్మానుష్య ప్రదేశంలో పారేశాడు. అయినా కథ ముగిసిపోలేదు. మళ్లీ మళ్లీ పునరావృతమవుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల పాటు బ్రిటన్‌లో ఈ ‘క్రయింగ్ బాయ్’ పెయింటింగ్ కల్లోలాన్ని సృష్టించింది. ఆగ్ని ప్రమాదాలు జరిగిన చాలా ఇళ్లలో అగ్నిమాపక సిబ్బందికి ఈ చిత్రం కనిపించేది. అది కూడా చెక్కు చెదరకుండా. దాంతో ఆ చిత్రంలో ఏదో మర్మముందని, ఆ పిల్లాడు శపించడం వల్లే ఇలా జరుగుతోందనే వార్త బ్రిటన్ అంతటా షికార్లు చేయడం మొదలుపెట్టింది. అది నిజమా? ఆ పిల్లాడు నిజంగా ఉన్నాడా? అతడు శపించడం వల్లే ఇవన్నీ జరిగాయా?
 
అమిడియో మరణించాక కొందరు డాన్ బానిల్లో చిత్రం గురించిన వాస్తవాలను బయటకు లాగేందుకు ప్రయత్నిం చారు. అమిడియో తన చిత్రాన్ని గీస్తున్నంతసేపూ డాన్ బానిల్లో ఏడుస్తూనే ఉన్నాడట. ఆ ఏడుపు చూసి కదిలిపోయిన అమిడియో... డాన్‌ని దత్తత తీసుకున్నాడట. డాన్‌ని ఇంటికి తీసుకొచ్చిన కొద్ది రోజులకే అమిడియో ఆర్ట్ స్టూడియో మంటల్లో చిక్కుకుందట. అక్కడే ఆడుకుంటోన్న డాన్ ఆ మంటల్లో చిక్కుకుని మరణించాడని, అతడి ఆత్మ ఆ పెయింటింగ్‌ని ఆవహించిందన్నది ఓ కథనం. ఇంకో కథనం ప్రకారం... అమిడియో అనాథ పిల్లల చిత్రాలు గీసి వచ్చేసిన తర్వాత అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం జరిగి, పిల్లలందరూ చనిపోయారు. దయ్యమైన డాన్ బానిల్లో తన చిత్రాన్ని ఆవహించాడు. అందుకే ఆ చిత్రాన్ని తీసుకెళ్లిన ప్రతి చోటకూ తనూ వెళ్లేవాడు. ఆ ఇంటిని శపించేవాడు. అందువల్లనే అన్ని ఇళ్లూ కాలిపోయాయి. ఇవన్నీ ఎవరెవరో చెప్పిన కథనాలు. ఇవి నిజాలో ఊహలో కూడా ఎవరికీ తెలియదు. అందుకే దేన్నీ నమ్మలేని పరిస్థితి.
 
    
ద క్రయింగ్ బాయ్... ఈ చిత్రాన్ని గీసింది బ్రూనో అమిడియో అనే ఇటాలియన్ చిత్రకారుడు. నిజానికి అతడు దాదాపు 65 ‘క్రయింగ్ బాయ్స్’ చిత్రాలను వేశాడు. అవన్నీ కలిసి దాదాపు యాభై వేల కాపీలు అమ్ముడయ్యాయి. ఇంగ్లండ్‌లోని చాలా ఇళ్లలో గోడలను అలంకరించాయి. అయితే 64 చిత్రాల వల్ల ఏ సమస్యా రాలేదు. కానీ డాన్ బానిల్లో అనే పిల్లాడి చిత్రం మాత్రం చిత్రాలు చేసింది. దానిని ఎవరు ఇంట్లో పెట్టుకున్నా వారి ఇల్లు తగులబడిపోయేది. కానీ ఆ చిత్రానికి సెగ కూడా తాకేది కాదు.

 మొదట ఈ సంగతి ఎవరూ గమనించకపోయినా... ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రతి ఇంట్లోనూ ఆ పిల్లాడి పెయింటింగ్ కనిపించేసరికి ఈ ప్రమాదాలకీ ఆ చిత్రానికీ కచ్చితంగా సంబంధం ఉందనిపించింది. ఈ విషయం గురించి పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. దాంతో అందరూ తమ దగ్గర ఉన్న క్రయింగ్‌బాయ్ చిత్రాన్ని తీసుకెళ్లి పారేశారు. ఆ చిత్రం గురించిన కథనాలను పత్రికల్లో చదివాక, ఆ ప్రతులను సైతం తగులబెట్టేసేవారు. అంతగా ఆ పెయింటింగ్ అంటే భయం పట్టుకుంది. చాలామంది ఈ విషయాన్ని చిత్రకారుడు అమిడియో దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అతడీ విషయాన్ని అంగీకరించేవాడు కాదు. ఆ పిల్లాడు ఎవరో, అతగాడి కథ ఏమిటో చెప్పమంటే చెప్పేవాడు కాదు. 1981లో తాను చనిపోయేవరకూ కూడా బానిల్లో గురించిన నిజాన్ని అమిడియో బయట పెట్టలేదు. దాంతో ‘క్రయింగ్‌బాయ్’ పెయింటింగ్ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement