నిజాలు దేవుడికెరుక: క్రైమ్ & మిస్టరీ | No evidence in Meredith Kercher mystery | Sakshi
Sakshi News home page

నిజాలు దేవుడికెరుక: క్రైమ్ & మిస్టరీ

Published Sun, Jan 19 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

నిజాలు దేవుడికెరుక: క్రైమ్ & మిస్టరీ

నిజాలు దేవుడికెరుక: క్రైమ్ & మిస్టరీ

నిజం నిజంగా నిప్పులాంటిదే. అది బయటకు వస్తే కొన్ని జీవితాలను కాల్చేస్తుంది. అయితే... మెరిడీత్ కర్చర్ హత్యకు సంబంధించిన నిజాలు మాత్రం... బయటకు రాక కొన్ని జీవితాలను కాల్చేస్తున్నాయి. కొన్ని గుండెల్ని మండిస్తున్నాయి. కొందరి బతుకుల్ని ప్రశ్నార్థంగా మార్చేశాయి. అసలెవరీ మెరిడీత్ కర్చర్? ఆమెనెవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? ఇవన్నీ ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలే!
 
 నవంబర్ 2, 2007... పెరూజియా, ఇటలీ  ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. చలికాలం కావడంతో ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. రోడ్ల మీద అక్కడక్కడా తెల్లని మంచుముద్దలు కనిపిస్తున్నాయి. ఎముకల్ని కొరికేసేలా చల్లటి గాలి రివ్వున వీస్తోంది.
 రోడ్డు పక్కన, విసిరేసినట్టుగా ఉన్న ఆ ఇంటిముందు ఓ యువతి, యువకుడు తచ్చాడుతున్నారు. వారి చూపులు పదే పదే రోడ్డువైపు ప్రసరిస్తున్నాయి. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. అటూ ఇటూ పచార్లు చేస్తూ, మధ్య మధ్యన ఆగి ఏదో మాట్లాడుకుంటున్నారు.
 ఓ పది నిమిషాల తరువాత వాయువేగంతో వచ్చి ఆగింది పోలీసు జీపు. బిలబిలమంటూ ఐదారుగురు పోలీసులు దిగారు. వారిని చూస్తూనే ఈ ఇద్దరూ అలర్ట్ అయ్యారు.  ‘‘ఎక్కడ?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ మరో మాట లేకుండా. ‘‘లోపల’’ అందామె ఇంటివైపు చూపిస్తూ. పోలీసులు లోనికి పరుగుతీశారు. ఈ ఇద్దరూ వారిని అనుసరించారు.


 ఇంటిలోకి అడుగు పెట్టగానే వెగటు వాసన గుప్పుమంది. యేళ్ల అనుభవం ఉన్న పోలీసులకు అది రక్తపు వాసన అని కనిపెట్టడానికి పెద్ద సమయం పట్టలేదు. హాలంతా పరికించి చూశారు. ప్రధాన ద్వారానికి దగ్గరలో ఓ చోట తెల్లని గచ్చుమీద ఎర్రటి రక్తపు మరక కనిపించింది. దాన్ని చూస్తూనే నుదురు చిట్లించాడు ఇన్‌స్పెక్టర్. ఇల్లంతా పరిశీలించమన్నట్టుగా సబార్డినేట్స్‌కి సైగ చేశాడు.  ఆ ఇంట్లో నాలుగు గదులున్నాయి. మూడు గదులను పరిశీలించారు పోలీసులు. అనుమానించాల్సినవేమీ కనిపించలేదు. అయితే నాలుగో గది మాత్రం తాళం వేసి ఉంది. దాని తలుపు మీద, గొళ్లెం మీద రక్తపు మరకలు ఉన్నాయి. అసలు రహస్యం అక్కడే దాగి ఉందని అర్థమైంది పోలీసులకు. వెంటనే తలుపులు బద్దలు కొట్టారు.


 లోపల... నేలమీద... ఆకుపచ్చ రంగు బొంతలో చుట్టివుంది ఓ అమ్మాయి శవం. బొంతను తొలగించి చూసిన పోలీసులు నివ్వెరపోయారు. ఒంటి మీద దుస్తులు లేవు. కత్తితో పలుమార్లు పొడవడంతో మెడ దాదాపు తెగిపోయింది. గాయాలతో ఒళ్లు ఛిద్రమైపోయింది. దేహం నుంచి రక్తం కారి కారి బొంతను తడిపేసింది. అందులో చోటు చాలక నేల మీదకు కూడా పాకింది. ఎంతో అనుభవమున్న పోలీసులు కూడా ముఖాలు తిప్పుకోకుండా ఉండలేకపోయారు ఆ దృశ్యం చూసి.


 యువతీ యవకులిద్దరూ భయంతో నోళ్లు తెరచుకుని కొయ్యబొమ్మల్లా చూస్తూండిపోయారు. అంతలో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు పరుగు పరుగున వచ్చారు. వారిలో ఒకమ్మాయి అక్కడి దృశ్యాన్ని చూస్తూనే కెవ్వున కేకపెట్టింది. రెండో అమ్మాయి ‘‘మెరిడీత్‌కి ఏమయ్యింది’’ అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. యువకులిద్దరూ వాళ్లను బయటకు తీసుకెళ్లారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టమ్‌కి పంపించి, ఆధారాలను సేకరించే పనిలో మునిగిపోయారు.
    
 అరగంట తర్వాత....
 లోపల పని పూర్తి చేసి, బయట వరండాలో ఉన్నవారి దగ్గరకు వచ్చాడు ఇన్‌స్పెక్టర్. ‘‘చూస్తుంటే హత్య రాత్రే జరిగినట్టు తెలుస్తోంది. అంతకుముందు అత్యాచారం కూడా జరిగిందని మా అనుమానం. తను మీకేమవుతుంది?’’... అడిగాడు. కాస్త తేరుకున్న ఒకమ్మాయి స్పందించింది. ‘‘మేమిద్దరం తన రూమ్మేట్స్‌మి సార్. నిన్న సాయంత్రం మా బాయ్‌ఫ్రెండ్స్‌తో పాటు డేట్‌కి వెళ్లాం. ఈ రోజు సాయంత్రం రావాల్సి ఉంది. కానీ అమండా ఫోన్ చేసి ఇంట్లో రక్తం ఉందని చెప్పింది. మేం కంగారుపడి వెంటనే మెరిడీత్‌కి ఫోన్ చేశాం. తను లిఫ్ట్ చేయలేదు. దాంతో కంగారుపడి వచ్చేశాం. తీరా వచ్చాక ఇలా...’’ భోరుమంది ఆ అమ్మాయి.  ‘‘నాకు ఫోన్ చేసింది కూడా అమండాయే. తనకీ మీకూ ఏంటి సంబంధం?’’  
 
 ‘‘తను కూడా మా రూమ్మేటే సార్. మేమిద్దరం, అమండా, మెరిడీత్ నాలుగు గదుల్లో ఉంటాం’’ అందా అమ్మాయి. అప్పుడు గమనించాడు ఇన్‌స్పెక్టర్... అమండా అక్కడ లేదని. ఆమెతో పాటు ఉన్న యువకుడు కూడా కనిపించలేదు. దాంతో చుట్టూ చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడతడు. దూరంగా ఓ చెట్టుకింద నిలబడి ఉన్నారు అమండా, ఆమె బాయ్‌ఫ్రెండ్ రఫెలై సొలేసిటో. నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో వారు చేస్తోన్న పని చూసి అతడి పోలీసు బుర్రలో రకరకాల సందేహాలు తలెత్తాయి. అవి ఈ కేసును  ముందుకు నడిపిస్తాయని ఆ క్షణం అతడు కూడా అనుకోలేదు.
 
    
 ‘‘మెరిడీత్ కర్చర్‌ని ఎందుకు చంపారు?’’ అని ప్రశ్నిస్తే చాలా నిర్లక్ష్యంగా స్పందించింది అమండా. ‘‘అసలు రాత్రి నేను ఇంట్లోనే లేను. నైటంతా నా బాయ్‌ఫ్రెండ్ రూమ్‌లో గడిపాను. పొద్దున్న స్నానం చేద్దామని రూమ్‌కి వెళ్తే, తలుపు తీసేవుంది. అప్పుడే ఎవరో బయటకు వెళ్లి ఉంటారనుకున్నా. బాత్రూములోను, హాల్లోను రక్తం కనిపించింది. అడుగుదామంటే ఎవరూ లేరు. అందుకే వెళ్లి నా బాయ్‌ఫ్రెండ్‌తో విషయం చెప్పాను. ఇద్దరం కలిసి మా రూమ్మేట్స్‌కి ఫోన్ చేస్తే వెంటనే మీకు ఇన్‌ఫామ్ చేయమన్నారు, చేశాను. అంతకుమించి నాకేమీ తెలియదు’’ అని చెప్పింది. అమండా చెప్పిన ఈ ఒక్క సమాధానం వెయ్యి సందేహాలు రప్పించింది పోలీసులకి. రూమ్మేట్స్ ముందు రోజు పిక్నిక్‌కి వెళ్లిపోయారని తెలుసు. అయినా తలుపు తీసివుంటే అనుమానం రాలేదు. రూమ్‌లో ఉండాల్సిన మెరిడీత్ గదికి తాళం పెట్టివున్నా, ఇంట్లో రక్తం కనిపించినా సందేహం కలగలేదు. తీరిగ్గా వెళ్లి బాయ్‌ఫ్రెండ్‌కి చెప్పింది. రూమ్మేట్స్ చేయమంటే తప్ప పోలీసులకు ఫోన్ చేయాలన్న ఆలోచనే రాలేదు.
 
 మెరిడీత్ కర్చర్ చాలా మంచి అమ్మాయని, ఆమెని చూసి అమండా జెలస్ ఫీలయ్యేదని రూమ్మేట్స్, ఫ్రెండ్‌‌స చెప్పారు.  విచ్చలవిడిగా ఉండే అమండాని మెరిడీత్ హెచ్చరించేదని, అందుకే ద్వేషం పెంచుకుందని, ఆమే మెరిడీత్‌ని చంపించి ఉంటుందని అందరూ అంటున్నారు. డీఎన్‌ఏ రిపోర్‌‌ట్స కూడా ఉన్నాయి. పైగా అమండా అన్నీ పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చింది. అయినా కోర్టు వారిని ఎందుకు వదిలేసిందన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.
 
 ఇవన్నీ విన్నాక పోలీసులు ఓ అభిప్రాయానికి వచ్చారు. వెంటనే సోలేసిటో ఫ్లాట్‌ని తనిఖీ చేశారు. అతడి గదిలో అమ్మాయిల మీద జరిగే అరాచకాల గురించిన పుస్తకాలు ఉన్నాయి. ఓ పుస్తకంలో ఉన్న ఫొటో చూసి ఉలిక్కిపడ్డారు పోలీసులు. మెరిడీత్ మృతదేహం ఎలా, ఏ పరిస్థితుల్లో ఉందో అలానే ఉందా ఫొటో. వంటగదిలో ఉన్న కూరలు తరిగే కత్తికి రక్తపు మరకలున్నాయి. వాటి గురించి అడిగితే... రాత్రి చేపల్ని కోసేటప్పుడు అంటిన రక్తమంటూ తడుముకోకుండా చెప్పింది అమండా. కానీ డీఎన్‌ఏ పరీక్ష చేస్తే ఆ రక్తం సొలేసిటో, అమండాలదని తేలింది. దాంతో ఇద్దరి చేతులకూ బేడీలు పడ్డాయి.
 
    
 ఇటలీలో చదువుకోవడానికి వచ్చిన ఓ బ్రిటన్ యువతిని, అదే మాదిరి చదువుకోవడానికి వచ్చిన మరో అమెరికన్ యువతి చంపేసిందన్న వార్త యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. అయితే పోస్టుమార్టం రిపోర్టు... ఈ కథను మరో మలుపు తిప్పింది. మెరిడీత్ హత్యలో అమండా, సొలేసిటో కాకుండా, మూడో వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అతడే మెరిడీత్‌పై అత్యాచారం చేశాడు. అతడెవరో చెప్పమని అమండాను నిలదీస్తే... రూడీ గ్వాయ్‌డా  పేరు బయటికొచ్చింది. తాను రాత్రి ఇంటికి వెళ్లేసరికి ఇంటి బయట రూడీ కనిపించాడని, అతడు తమకు పరిచయస్తుడే కావడంతో లోనికి తీసుకెళ్లానని, తర్వాత రూడీయే మెరిడీత్‌ని చంపేశాడని కొత్త కథ చెప్పింది.
 
 ముందే ఎందుకు చెప్పలేదంటే కన్‌ఫ్యూజ్ అయ్యానంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. సొలేసిటో అయితే తనకసలు సంబంధమే లేదన్నాడు. రూడీని అరెస్ట్ చేసి నిలదీస్తే... మెరిడీతే తనను ఇంట్లోకి ఆహ్వానించిందని, ఇద్దరూ శారీరకంగా కలిశారని, తర్వాత తాను బాత్రూమ్‌కి వెళ్లి బయటకు వచ్చేసరికి ఎవరో వ్యక్తి మెరిడీత్‌ని చంపి పారిపోతున్నాడని అన్నాడు. అయితే గట్టిగా అడిగేసరికి అత్యాచారం చేశాను కానీ చంపలేదని అన్నాడు. దాంతో కోర్టు అతడికి పదమూడేళ్ల జైలు శిక్ష విధించింది.  అయితే అమండా, సొలేసిటోలు మాత్రం నిజంమంగీకరించలేదు. అయినా డీఎన్‌ఏ రిపోర్టులను బట్టి, హత్య జరిగినప్పుడు వాళ్లు అక్కడే ఉన్నారని నిర్ధారించిన కోర్టు అమండాకి 26, సొలేసిటోకి 25 యేళ్ల శిక్ష విధించింది.
 
 వాళ్లు పైకోర్టుకు వెళ్లారు. దాంతో సరైన ఆధారాలు లేవంటూ అమండాను, సొలేసిటోను నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. దాంతో అమండా అమెరికాకు వెళ్లిపోయింది. ఓ పబ్లిషింగ్ కంపెనీతో కలిసి తన జైలు జీవితం గురించి ఓ పుస్తకాన్ని వెలువరించింది. కానీ మెరిడీత్ ఫ్యామిలీ అభ్యర్థనను మన్నించిన ఇటలీ సుప్రీంకోర్టు కింది కోర్టు తీర్పును తప్పుబట్టింది. ఆధారాలు కోర్టుకి సమర్పించలేనంత మాత్రాన వారిని దోషులు కాదనడం కరెక్ట్ కాదని తేల్చింది. దాంతో కేసు మళ్లీ తెరిచారు. అమండా దోషా నిర్దోషా అన్నది ఈ యేడు తేలవచ్చేమో!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement