అలీ తమ్ముడిగా ఇండస్ట్రీకి రాలేదు! | chit chat with ali brother khayum | Sakshi
Sakshi News home page

అలీ తమ్ముడిగా ఇండస్ట్రీకి రాలేదు!

Published Sun, Nov 23 2014 9:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

అలీ తమ్ముడిగా ఇండస్ట్రీకి రాలేదు!

అలీ తమ్ముడిగా ఇండస్ట్రీకి రాలేదు!

కోలముఖం, నవ్వితే బుగ్గన పడే సొట్ట, హుషారైన కదలికలు... చూడగానే ఆకర్షిస్తాడు ఖయ్యూం. కమెడియన్‌గా, కామెడీ విలన్‌గా అతడు చేసే పాత్రలు కూడా అంతే ఆకట్టుకుంటాయి. ప్రముఖ నటుడు అలీకి తమ్ముడే అయినా, తనకు తానుగా ఓ ఇమేజ్ సృష్టించుకోవడానికి తపనపడే ఖయ్యూం... తన గురించి, తన నట ప్రయాణం గురించి చెప్పిన విశేషాలు...
 

అన్నయ్యను చూసి నటుడవ్వాలనుకున్నారా?
అంతే కదా మరి! చిన్నప్పట్నుంచీ నటనంటే చాలా ఇష్టం. అన్నయ్యేమో నన్ను పైలట్‌ని చేయాలనుకున్నాడు. కానీ నా మనసు మాత్రం ఇటువైపే లాగింది.
     
అలీ తమ్ముడిగా సులభంగానే పరిశ్రమలో ఎంటరయ్యారా?
 లేదు. చాలామంది అనుకుంటారు... వాళ్ల అన్నయ్య ఉన్నాడు కదా, ఈజీగా వచ్చేసి ఉంటాడు అని. కానీ నేను తొలిసారిగా ‘స్వాతికిరణం’లో బాలనటుడిగా ఎంపికైనప్పుడు అలీ తమ్ముడినన్న విషయం ఆ దర్శకుడు, నిర్మాతకి కూడా తెలియదు. ఎవరో బయటి వ్యక్తిగానే ఆడిషన్‌కి వెళ్లాను. సెలెక్ట్ అయ్యాను.
     
ఎందుకని? అన్నయ్యని సహాయం అడగలేదా?
 లేదు. అడిగినా చేయడు. ఎవరి ప్రతిభని వాళ్లే నిరూపించుకోవాలి అన్నది అన్నయ్య పాలసీ. తన భావాలు ఎంత బలమైనవో తెలుసు కాబట్టే నేను తన సహాయం కోరలేదు. నాకు నేనుగా ప్రయత్నాలు చేశాను. అవకాశాలు సాధించాను. ఇప్పటి వరకూ వంద సినిమాలు చేశాను. వాటిలో ఒక్కటీ నాకు అన్నయ్య వల్ల రాలేదు.
     
అయితే మీకు అన్నయ్య సపోర్ట్ లేదన్నమాట...?
అలా అనడం లేదు. రికమెండ్ చేయడు తప్ప తన అండ, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటాయి. ఎవరైనా ఇటుకలు మోస్తే, సిమెంటు వేసి ఇల్లు కట్టేసుకుందాం అని ఆలోచిస్తాం మనం. కానీ... ఇల్లు కట్టుకోవాలంటే నీ ఇటుకలు కూడా నువ్వే మోసుకోవాలి అనే తత్వం అన్నయ్యది. అంతే. సినిమాల విషయంలో మాత్రమే అలా. వ్యక్తిగత జీవితంలో అయితే అన్నీ తానే అయి చేస్తాడు. నాకు సినిమాలు చూడటమంటే ఇష్టమని నాకోసం ఇంట్లోనే హోమ్ థియేటర్ ఏర్పాటు చేశాడు. ఇంట్లో ప్రతి ఒక్కరి విషయంలోనూ ఎంతో బాధ్యతగా ఉంటాడు. సలహాలిస్తాడు. ముందుకు నడిపిస్తాడు. గొప్ప ఫ్యామిలీ పర్సన్ తను!
     
మీలో అన్నయ్య పోలికలు ఎక్కువే. అది మీకు ప్లస్సా? మైనస్సా?
రెండూను. అన్నయ్య పోలికలతో ఉండటం వల్ల ఎక్కడికెళ్లినా నేను తన తమ్ముడినని గుర్తు పట్టేస్తారు. తన మీద ఉన్న ఇష్టాన్ని, గౌరవాన్ని నా పట్ల కూడా ప్రదర్శిస్తారు. అందుకు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే నటుడిగా అదే నాకు మైనస్. అన్నయ్య అన్ని రకాల పాత్రలూ చేసినా కమెడియన్‌గానే స్థిరపడ్డాడు. దానివల్లో , అన్నయ్య పోలికల వల్లో నాకు కూడా కామెడీ పాత్రలే ఆఫర్ చేస్తుంటారు. కమెడియన్ తమ్ముడు కమెడియనే అవ్వాలని లేదు కదా! నాకు అన్ని పాత్రలూ చేయాలనుంది, చేయగలను!
     
డెరెక్షన్ కోర్సు కూడా చేసినట్టున్నారు?
అవును. కావాలనే మధ్యలో గ్యాప్ తీసుకుని ముంబై వెళ్లాను. అక్కడ రెండేళ్లపాటు (2005-06) డెరైక్షన్ కోర్సు చేశాను. డెరైక్టర్ అవ్వాలనేం కాదు. ఓ నటుడిగా అన్ని విభాగాల మీద అవగాహన ఉంటే బాగుంటుందనిపించింది. అందుకే చేశాను.
     
సినిమాలు కాకుండా ఇంకేమైనా...?
ఒకప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. అండర్ 14 క్రికెట్ ప్లేయర్‌ని నేను. ఇప్పుడైతే ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఉంది. ఫ్రీ టైమ్ దొరికితే బిజినెస్‌మీదే దృష్టి పెడుతుంటాను.
     
మీరు చాలా మంచి ఫ్రెండ్ అని ఇండస్ట్రీలో చాలామంది అంటారు?

నేను మంచి ఫ్రెండ్‌నో కాదో గానీ... నాకు మాత్రం పరిశ్రమలో అందరూ ఫ్రెండ్సే. అల్లరి నరేశ్ అయితే ప్రాణమిత్రుడు. గొప్ప స్నేహితుడికి నిర్వచనం తను. ఫ్రెండ్స్ కదా అని ఎప్పుడూ అతి చొరవ తీసుకోడు. ఎంతో గౌరవిస్తాడు. అన్నీ చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు. ప్రతి ఒక్కరికీ అలాంటి ఫ్రెండ్ ఉండి తీరాలి.
     
ఫ్రెండ్ సరే... గాళ్‌ఫ్రెండ్ సంగతి...?
చాలామంది గాళ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. స్నేహం విషయంలో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఒకే దృష్టితో చూస్తాను నేను. (నవ్వుతూ) మీరు వేరే ఉద్దేశంతో అడిగితే మాత్రం అలాంటి వాళ్లెవరూ లేరు.
     
అయితే ఎవరినీ ప్రేమించలేదా?

కాలేజీ రోజుల్లో ప్రేమించాను. ఫెయిలయ్యాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అప్పుడే నిర్ణయించుకున్నాను... మళ్లీ ప్రేమ జోలికి పోకూడదని. అందుకే నా పెళ్లి బాధ్యతను అమ్మానాన్నలకు అప్పగించాను. నాకు తగిన అమ్మాయిని వాళ్లే చూసి చేస్తారు. అప్పుడు ఆమెను ప్రేమిస్తా!                            
- సమీర నేలపూడి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement