నిజాలు దేవుడికెరుక: ఎలా ఉన్నవారు అలా శిలలైపోయారు!
అది 1599వ సంవత్సరం. ఇటలీలోని క్యాంపీనియాకి దగ్గర్లో ఉన్న ఒక అతి పెద్ద రాతి ప్రదేశంలో ఓ ముప్ఫైమంది కూలీలు తవ్వకాలు జరుపుతున్నారు. సర్నో నది నీటిని మళ్లించేందుకు గాను భూగర్భంలో ఓ కాలువను తవ్వుతున్నారు. ‘‘కానివ్వండి కానివ్వండి. మూడు రోజుల్లో పని ముగించాలి. ఇంత నెమ్మదిగా చేస్తే ఎలా?’’... పనివాళ్లని తొందర పెడుతున్నాడు కాంట్రాక్టర్ ఆల్బెట్రో. ‘‘చేస్తూనే ఉన్నాం కదరా, కంగారు పెడతాడెందుకు?’’... విసుక్కున్నాడు ఎన్జో. ‘‘ఎప్పుడూ అంతే కదరా... పట్టించుకోకు’’ అన్నాడు నెవియో.
‘‘ఆ... ఆ... నువ్వు కూడా ఎప్పుడూ ఇంతే. ఎవరేమన్నా పట్టించుకోవద్దం టావ్’’... అంటూనే గునపాన్ని ఎత్తి భూమిలో దిగేశాడు ఎన్జో. ఒక్కసారిగా ఠంగ్‌మన్న శబ్దం వినిపించింది. ‘‘ ఇక్కడ ఏదో ఉందిరా. గునపం దిగట్లేదు. ఒకవేళ ఏదైనా నిధిగానీ ఉందేమో’’ ఆశగా అన్నాడు.‘‘మన ముఖాలకి నిధులు కూడా దొరుకుతాయా... ఏ రాయో అడ్డుపడి ఉంటుంది, గట్టిగా దించు గునపం.’’
పాంపేయ్ పట్టణాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. కానీ తొలగించలేనంతగా దుమ్ము పేరుకునిపోవటం చేత ఆ ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. దాంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి సందర్శనీయ స్థలంగా మార్చారు. అవశేషాలన్నింటినీ మ్యూజియంలో పెట్టారు. ద లాస్ట్ డేస్ ఆఫ్ పాంపేయ్, షాడోస్ ఇన్ బ్రాంజ్ వంటి పుస్తకాలు, పలు సినిమాలు, డాక్యుమెంటరీలు పాంపేయ్ విషాదాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చాయి. అయితే అవన్నీ వారి వారి ఊహలకు అనుగుణంగా ఉంటాయి!
నెవియో మాటలకి ఓసారి నిట్టూర్చి మళ్లీ ప్రయత్నించాడు ఎన్జో. ఊహూ... గునపం లోనికి పోవడం లేదు. కాంట్రాక్టర్‌ని పిలిచి విషయం చెప్పాడు.‘‘ఇదో పెద్ద విషయమా? ఇదంతా రాతినేల కదా... ఏ బండరాయో ఉండి ఉంటుంది. తవ్వి తీసి పారేసేదానికి ఇంత హడావుడి చేయాలా’’... విసుక్కుంటూ మరో ఇద్దరిని పిలిచాడు కాంట్రాక్టర్. అందరూ కలిసి అడ్డును తొలగించాలని ప్రయత్నించారు. అది తొలగలేదు కానీ దాని చుట్టు పక్కల పది అడుగుల మేర నేల బీటలు తీసి కుంగిపోవడం మొదలైంది. అందరి గుండెలూ ఝల్లుమన్నాయి. గునపాలు వదిలేసి దూరంగా పరుగెత్తారు.వాళ్లు చూస్తూండగానే నేల కుంగిపోయి అక్కడో పెద్ద గుంత ఏర్పడింది. కాంట్రాక్టర్ ధైర్యం చేసి గోతి దగ్గరకు వెళ్లాడు. లోపల ఏముందోనని తొంగి చూశాడు. మరుక్షణం అతడి గుండె దడదడలాడింది. ‘‘అందరూ త్వరగా రండి’’... అరిచినట్టే అన్నాడు. పనివాళ్లంతా బిలబిలమంటూ వచ్చి గోతి చుట్టూ చేరారు. లోపలకు చూసిన వారి ఒళ్లు జలదరించింది.
ఒకటి కాదు, రెండు కాదు... కనీసం పదిహేను అస్థిపంజరాలైనా ఉండి ఉంటాయక్కడ. కొన్నయితే మట్టిలో కూరుకుపోయి అక్కడక్కడా తెలతెల్లగా కనిపిస్తున్నాయి. అన్ని అస్థిపంజరాలు అక్కడికెలా వచ్చాయో అంతు పట్టలేదు. వెంటనే అధికారులకు విషయం తెలియజేశారు. వాళ్లు వచ్చి అస్థిపంజరాలను బయటకు తీస్తుండగా ఆ చుట్టూ ఉన్న మట్టిదిమ్మలన్నీ ఫెళఫెళా విరిగిపోవడం మొదలైంది. అడుగేస్తే నేల కుంగిపోతోంది. దాంతో ఆ నేలలో ఏదో మర్మం దాగివుందనిపించింది. వెంటనే అక్కడి నేల మొత్తాన్నీ తవ్వడం మొదలుపెట్టారు. కొన్ని గంటల తర్వాత అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి వారి వెన్నుపూసలోంచి వణుకు పుట్టుకొచ్చింది.
దాదాపు పాతిక అడుగుల లోతుకు తవ్విన తర్వాత... అక్కడో పెద్ద ప్రపంచమే కనిపించింది. అదేదో పట్టణంలా ఉంది. పైకప్పు లేని మొండి గోడలు, సగం కూలిన ఇళ్లు ఉన్నాయి. అయితే అందరినీ షాక్‌కి గురి చేసిన విషయం ఒకటుంది. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా శవాలు ఉన్నాయి. రాళ్లలా బిగుసుకుపోయి, బూడిద రంగులో కనిపిస్తున్నాయి. పడుకుని, కూర్చుని, పరిగెడుతున్నట్టు... రకరకాల భంగిమల్లో ఉన్నాయవి. మొదట అవి సిమెంటు బొమ్మలో, రాతి బొమ్మలో అయివుంటాయనుకున్నారు. కానీ పరిశీలించగా తెలిసింది మానవ దేహాలని!
అందరి బుర్రలూ తిరిగిపోయాయి. ఇక్కడో పట్టణం ఉండేదా? ఇలా ఎలా కప్పడిపోయింది? మనుషులంతా ఇలా గుంపులుగా ఎందుకు చనిపోయారు? యుద్ధం లాంటిదేమైనా జరిగిందా? అదే జరిగితే ఇలా రకరకాల భంగిమల్లో ఎలా ఉంటారు? ఉన్నవారు ఉన్నట్టుగా చనిపోయారంటే అసలేం జరిగివుంటుంది?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు అధికారులు. కనుక్కున్నారు కూడా. వారు చెప్పిన విషయాలు విన్న తర్వాత యావత్ ప్రపంచం కదలిపోయింది. గుండెల్ని పిండేసే ఆ నిజ సంఘటనను చాన్నాళ్లు తలచుకుని తలచుకుని కుమిలిపోయింది.
క్రీ.శ. 79. ఆగస్టు 24 సాయంత్రం....
పనులకు వెళ్లినవాళ్లంతా ఇళ్లకు తిరిగొస్తున్నారు. ఇల్లాళ్లంతా భోజనాలు సిద్ధం చేయడంలో మునిగిపోయారు. పిల్లలు వీధుల్లో ఆటలాడుతున్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఆ ముందు రోజు చేసుకున్న అగ్నిదేవుడి పండుగ గురించి ఆనందంగా చర్చించుకుంటున్నారు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. మామూలుగా అయితే ఆ సమయానికి వాతావరణం చల్లబడుతుంది. కానీ ఈ రోజు ఏదో తేడా. ఉక్కబోస్తోంది. వేడి మెల్లమెల్లగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకిలా ఉందా అని ఆలోచిస్తుండగానే పెద్ద శబ్దం! వంద అణు బాంబులు ఒక్కసారి పేలినట్టు... వెయ్యి ఉరుములు ఒక్కసారి ఉరిమినట్టు! ఆ శబ్దం.... జరగనున్న ఘోర విధ్వంసానికి ప్రారంభం. పాంపేయ్ అంతానికి ముహూర్తం.
అందరూ ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందా అని భయంగా ముఖాలు చూసుకున్నారు. ఏం జరిగిందో అంచనా వేసే ప్రయత్నం చేశారు. అంతలోనే దట్టమైన పొగ పట్టణంలోకి చొరబడింది. అందరినీ చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది. దుమ్ము వేగంగా ఎగిరొచ్చి పడుతోంది. అప్పుడర్థమయ్యింది వారికి ఏం జరిగిందో. ‘‘అగ్నిపర్వతం బద్దలైనట్టుంది’’ అన్నాడో వ్యక్తి భయంగా.
అవును. అదే జరిగింది. పాంపేయ్ పట్టణానికి కాస్త దూరంలో ఉన్న వెసువియస్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. దాని నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. లావా శరవేగంగా పర్వతం మీది నుంచి జారిపడుతోంది. పట్టణాన్ని తాకాలని పరుగులు తీస్తోంది. దుమ్ము, ధూళి ఎగసి పట్టణమంతా పరుచు కుంటున్నాయి. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే... ఇప్పుడేం చేద్దాం అని పట్టణవాసులు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే జరగరాని విధ్వంసం జరిగిపోయింది. లావా సునామీలా పాంపేయ్‌ని చుట్టేసింది. కొందరు భయంతో మూలల్లో దాగారు. కొందరు వాటి కిందా వీటి కిందా దూరి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరి ప్రయత్నాలూ ఫలించలేదు. లావా వారిని ముంచేసింది. క్షణాల్లో శిలల్లా మార్చేసింది. కొద్ది నిమిషాల్లోనే పాంపేయ్ నగరం నిప్పుల కుంపటిలా మారింది. అయితే లావా సృష్టించిన విధ్వంసంతో కథ ముగిసిపోలేదు. లావాను మించిన దుమ్ము, ధూళి పట్టణాన్ని ముంచెత్తింది. రెండు రోజుల పాటు అలా వచ్చి పడుతూనే ఉంది. దాదాపు ఇరవై అయిదు అడుగుల మేర పేరుకుపోయింది. దాని కింద పాంపేయ్ పట్టణం సమాధి అయ్యింది. ఈ ప్రపంచం నుంచి, ప్రపంచ పటం నుంచి మాయమైపోయింది.
ఇదంతా పరిశోధకుల ఊహ! అగ్నిపర్వతం బద్దలవడం వల్లే పాంపేయ్ సర్వనాశనమయ్యింది, దాని నుంచి వెలువడిన దుమ్ము కిందే పట్టణం సమాధి అయ్యింది అనేది వాస్తవం. అయితే ఇంత దారుణంగా ఎలా జరిగింది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సాక్ష్యం చెప్పేందుకు ఏ ఒక్కరూ మిగల్లేదు. దాంతో పరిశోధనల్లో అవగతమైన విషయాలను బట్టి ఇలా జరిగివుంటుంది అని నిపుణులు అంచనా వేశారంతే. నిజానికి వెసువియస్ అగ్నిపర్వతం బద్దలైన విషయం పాంపేయ్‌కు కాస్త దూరంలో ఉన్న కొన్ని పట్టణాల వారికి తెలిసింది కానీ... పర్వతానికి అతి దగ్గరగా ఉన్న పాంపేయ్ పట్టణం ధ్వంసమై పోయిందన్న విషయం చాలాకాలం వరకూ ఎవరికీ తెలియలేదు. ఎందుకంటే... పర్వతం చల్లబడేవరకూ ఆ చుట్టుపక్కలకు ఎవ్వరూ పోలేదు. కొన్నాళ్ల తర్వాత వెళ్లిచూసిన వారికి పాంపేయ్ కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక పట్టణం మాయం ఎలా అయ్యిందో అర్థమూ కాలేదు. కొన్నాళ్లు దాని గురించి చర్చించుకున్నారు. మెల్లగా మర్చిపోయారు. దాంతో పాంపేయ్ గురించి తర్వాతి తరాల వారికి తెలియకుండా పోయింది.
1599లో తవ్వకాల్లో బయటపడిన తర్వాతే పాంపేయ్ అనే ఒక పట్టణం ఉండేదన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే అందరినీ కలచివేసిన విషయం ఏమిటంటే... శవాలు పడివున్న తీరు. ఎలా ఉన్నవాళ్లు అలా శిలలైపోయారు. పడుకున్నవాళ్లు పడుకున్నట్టే ఉన్నారు. నడుస్తున్నవాళ్లు నడుస్తున్నట్టే ఉన్నారు. భయంతో ముడుచుకుని కూచుని, మోకాళ్ల మీద తల పెట్టుకుని ఉన్న ఓ మహిళ శిలాజాన్ని చూసినప్పుడు పరిశోధకులకు సైతం కళ్లు చెమర్చాయి. తల్లి పక్కలో ఒత్తిగిలి పడుకుని ఉన్న చిన్నారి, వేడిమిని తాళలేక మెలికలు తిరిగిపోతూ మరణించిన కుక్క, నిద్ర పోవడానికి ఒరుగుతూ ఒరుగుతూ ప్రాణాలు విడిచిన వ్యక్తి, పరుగు పెడుతూ శిల అయిపోయిన పిల్లాడు... చూసినవాళ్ల గుండెలు కరిగి నీరయ్యాయి. చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఆ ఘోరకలి ఇది. సిరి సంపదలతో, సంతోష సౌభాగ్యాలతో విలసిల్లిన పాంపేయ్ కథ... ఓ కన్నీటి గాథగా, విషాదభరిత జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోయింది!
- సమీర నేలపూడి