
లండన్: అట్లాంటిక్ సముద్ర ద్వీప దేశం ఐస్‌లాండ్‌లో మరోసారి అగ్ని పర్వతం బద్దలైంది. రెక్జానెక్ ద్వీపకల్పంలోని గ్రిండావిక్ పట్టణ సమీపంలోని అగ్ని పర్వతం నుంచి భారీగా లావా, పొగలు చిమ్ముతుండటంతో మంగళవారం అధికారులు అక్కడున్న 40 నివాసాలను ఖాళీ చేయించారు.
ఐస్‌లాండ్‌లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా ఉన్న బ్లూ లగూన్ జియోథర్మల్ స్పాను మూసివేశారు. దాదాపు 800 ఏళ్ల పాటు నిద్రాణంగా ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా లావా పెల్లుబకడంతో గతేడాదే ఇక్కడున్న వారందరినీ వేరే చోటుకు తరలించారు.
ఉదయం 6.30 గంటలకు లావా ప్రవాహం మొదలై గ్రిండావిక్‌కు ఉత్తరంగా ఏర్పాటు చేసిన రక్షణ బారియర్‌ను దాటుకుని 500 మీటర్ల పొడవున ప్రవహిస్తోందని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర అట్లాంటిక్‌లోని అగ్ని పర్వతాలకు కేంద్రమైన ప్రాంతంలో ఐస్‌లాండ్ ఉంది. 2010లో ఇక్కడి అగ్ని పర్వతం విస్ఫోటంతో భారీగా వాతావరణంలోకి వెదజల్లిన బూడిద మేఘాలు కొన్ని నెలలపాటు అట్లాంటిక్ మీదుగా విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగించాయి.