పాటను సీరియస్‌గా తీసుకుంది అప్పుడే! | will take serious to sing a song from that time only | Sakshi
Sakshi News home page

పాటను సీరియస్‌గా తీసుకుంది అప్పుడే!

Published Sun, Sep 7 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

పాటను సీరియస్‌గా తీసుకుంది అప్పుడే!

పాటను సీరియస్‌గా తీసుకుంది అప్పుడే!

సంభాషణం: అందమైన స్వరం దేవుడిచ్చిన వరం అంటారు. ఆ వరం పర్ణికకు దక్కింది. బాడీగార్డ్, తెలుగమ్మాయి, నిప్పు, గ్రీకువీరుడు, దేనికైనా రెడీ తదితర చిత్రాల్లో తన పాటతో శ్రోతల మనసులను దోచుకుందామె. పెదవులపై చిరునవ్వును ఎప్పుడూ చెరగనివ్వని ఈ గాయనీమణి తన కెరీర్ గురించి చెబుతోన్న కబుర్లు...
 
 మావారి పేరు నిఖిలేశ్వర్... మెరైన్ ఇంజినీర్. నాకెప్పుడూ ఒక భయం ఉండేది... నన్ను అర్థం చేసుకోనివాడు భర్తగా వస్తే ఏంటి పరిస్థితి అని. కానీ అదృష్టం కొద్దీ చాలా మంచి వ్యక్తి దొరికారు. మా ఇంట్లోవాళ్లు, మా అన్నయ్య నన్ను ఎంత ప్రోత్సహించేవారో, అంతకంటే ఎక్కువగా ప్రోత్సహిస్తారు మావారు. అలాంటి జీవిత భాగస్వామి ఉంటే ఏదైనా సాధించగలం! ఎంతైనా ఎదగగలం!
 
కెరీర్ ఎలా ఉంది?
 బాగుంది. ఇటీవలే ‘రభస’ చిత్రంలో పాడాను. మరికొన్నిటికి పాడుతున్నాను.
 -    ఇప్పటివరకూ ఎన్ని పాటలు పాడారు?
 తెలుగు, తమిళం, హిందీ, భోజ్‌పురి, లంబాడీ భాషల్లో కలిపి నలభై వరకూ పాడాను.
 -    మీలో ఓ గాయని ఉందని ఎప్పుడు తెలిసింది?
 మా నాన్నమ్మ లక్ష్మీసుబ్రహ్మణ్యం కర్ణాటక సంగీత విద్వాంసురాలు. దాంతో మూడో తరగతిలోనే ఆవిడ దగ్గర స్వర సాధన మొదలుపెట్టాను. అయితే సరదాగానే నేర్చుకున్నాను తప్ప సింగర్ అయిపోవాలన్న లక్ష్యంతో కాదు. కానీ పదో తరగతిలో రామాచారి గారి దగ్గర చేరాక నా ఆలోచనలు మారిపోయాయి. ఆయన శిష్యులు కొందరు సినిమాల్లో ట్రాకులవీ పాడటం చూసి నాకూ అలా పాడాలన్న కోరిక కలిగింది. దాంతో పాటని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను.
 -    తొలిసారి గుర్తింపు ఎప్పుడు వచ్చింది?
 ‘జీ సరిగమప’లో పాల్గొనే అవకాశం వచ్చింది. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక సూపర్ సింగర్స్ తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.
 -    యాంకరింగ్ కూడా చేసినట్టున్నారు?
 అవును. అనుకోకుండా యాంకరింగ్ అవకాశాలు వచ్చాయి. అన్నీ పాటలకు సంబంధించిన కార్యక్రమాలే కావడంతో ఒప్పుకునేదాన్ని. చాలా షోలు చేశాను. అయితే సింగర్‌ని కావాలన్న అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తున్నానేమోనని భయమేసి యాంకరింగ్‌కి కామా పెట్టాను.
 -    టాలెంట్ షోల పుణ్యమా అని కోకొల్లలుగా సింగర్లు వస్తున్నారు. ఇలాంటప్పుడు సరిపడినన్ని అవకాశాలు వస్తాయంటారా?
 ఎందుకు రావు! శ్రీకృష్ణ, గీతామాధురి, దీపు, రేవంత్, నేను.... మా అందరికీ అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎంతమంది వచ్చినా అవకాశాలు ఇవ్వగలదు మన ఇండస్ట్రీ. లేదంటే నేనివాళ ఇక్కడ ఉండేదాన్నే కాదు.
 -    కానీ బాలు, చిత్రల మాదిరిగా సింగిల్ కార్డులు పడే చాన్స్ లేదు కదా?
 కావచ్చు. కానీ అవకాశాలైతే ఉన్నాయి కదా! సినిమాకి ఒక్క పాట పాడినా కెరీర్‌కు వచ్చే ఢోకా ఏమీ ఉండదు. అందరికీ చాన్సులు రావాలి. అందరూ బాగుండాలి.
 -    అవకాశాలు మిస్సై బాధపడిన సందర్భాలు ఉన్నాయా?
 మొదట్లో నేను పాడిన కొన్ని పాటల్ని చివరి నిమిషంలో తీసేసేవారు. బాగా పాడానే, ఎందుకిలా చేశారు అని బాధపడేదాన్ని. అయితే దానికి వాళ్ల కారణాలు వాళ్లకుంటాయి. అప్పట్లో ఇన్‌లే కార్డు మీద పడే పేరుకి వాల్యూ ఎక్కువ ఉండేది. ఓ పెద్ద సింగరో లేక ముంబై సింగరో పాడితే క్రేజ్ ఏర్పడుతుందని అనుకునేవారు. దాంతో అలా జరిగేది. ఇప్పుడలా లేదు. బయటి వాళ్లకు చాన్స్ ఇచ్చినా, తెలుగువాళ్లతో కూడా బాగానే పాడిస్తున్నారు.
 
     బలంగా ఉన్న కోరిక...?
 ఏ సింగర్‌కైనా తప్పక ఉండే కోరిక... ఇళయరాజా గారి దగ్గర పాడాలని. అయితే అంతకంటే ముందు ఆయన్ని చూడాలని ఉంది. రెండు మూడుసార్లు కలిసే అవకాశం వచ్చినా వేరే షోలు ఉండటం వల్ల మిస్ అయ్యాను. అప్పట్నుంచీ ఆ వెలితి అలానే ఉండిపోయింది.
 
 భవిష్యత్ ప్రణాళికలు?
 నాలెడ్జబుల్ గాయనిగా పేరు తెచ్చుకోవాలి. అంతకంటే ముఖ్యంగా మంచి మనిషి అనిపించుకోవాలి. ఎదగాలంటే టాలెంట్ ఒక్కటీ చాలదు. మంచి ప్రవర్తన కూడా ఉండాలి. నా వరకూ నేను ఎప్పుడూ నా ప్రవర్తనను కనిపెట్టుకుని ఉంటాను. దేవుడి దయ వల్ల ఎప్పుడూ ఏ రిమార్కూ తెచ్చుకోలేదు. అది చాలు నాకు.
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement