మారదామనే అనుకున్నాను కానీ... | Sameera Nelapudi chit chat with vinay mohan(chanti) | Sakshi
Sakshi News home page

మారదామనే అనుకున్నాను కానీ...

Published Sun, Dec 14 2014 9:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

మారదామనే అనుకున్నాను కానీ...

మారదామనే అనుకున్నాను కానీ...

సన్నని గొంతుతో, విచిత్రమైన డైలాగ్ డెలివరీతో అందరినీ హాయిగా నవ్వించేస్తాడు చంటి. అయితే ఆ కామెడీ అంతా తెర వరకే పరిమితం. తెర వెనుక అతడి మాటల్లో ఆవేశం ఉప్పొంగుతుంది. ఆవేదన కదలాడుతుంది. తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే చంటిలో ఉన్న మరో కోణమిది...


కళారంగంవైపు ఎలా వచ్చారు?

నా అసలు పేరు వినయ్ మోహన్. మాది హైదరాబాద్. చిన్నప్పట్నుంచీ కళల పట్ల మక్కువ ఎక్కువ. కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలు... ముందుండేవాణ్ని. ముందుండి నడిపించేవాణ్ని. ఏడో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ యాన్యువల్ డేకి నటి ఊహ అతిథిగా వచ్చారు. ఆవిడ స్టేజి మీదికి వచ్చేవరకూ అందరూ నేను చెప్పినట్టే విన్నారు. కానీ ఊహ స్టేజి ఎక్కగానే నన్ను పట్టించుకోవడమే మానేశారు. అప్పుడర్థమైంది... స్టేజిమీదికి వెళ్లేవారికి ఉండే గౌరవం ఏమిటో. నేనూ స్టేజి ఎక్కాలి, అందరి దృష్టీ నామీదే ఉండాలి. అలా జరగాలంటే ఊహగారిలాగా నేను కూడా సినిమాల్లోకి వెళ్లాలి అనుకున్నాను. అప్పుడు మొదలైంది తపన!
     
వెంటనే ప్రయత్నాలు మొదలెట్టారా?
అనుకోగానే అన్నీ చేసెయ్యలేం కదా! చదువుకుంటూనే మిమిక్రీ ప్రోగ్రాములు చేస్తుండేవాడిని. కానీ డిగ్రీకి వచ్చాక ఇక చదువు ఎక్కదని అర్థమైపోయింది. అందుకే ఫుల్‌స్టాప్ పెట్టేశాను. రకరకాల పనులు చేసి చివరకు ఓ గెస్ట్ హౌస్‌కి మేనేజర్‌గా చేరాను. అక్కడికి ఓసారి కొందరు వచ్చారు. వాళ్ల మాటల ద్వారా హైదరాబాద్‌లో రేడియో మిర్చిని ప్రారంభించబోతున్నారని తెలిసింది. నాకూ అవకాశమివ్వమని అడిగాను. ఆడిషన్లూ అయ్యీ అయ్యాక... యతిరాతి భూపాల్‌గారని, రచయిత... ఆయన ‘చంటి-బంటి’ షోలో చంటిగా నన్ను ఎంపిక చేశారు.
     
ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు?
అదీ భూపాల్‌గారి చలవే. తాను రచన చేసిన ‘జల్లు’ అనే సినిమాలో నాకో చాన్స్ ఇప్పించారాయన. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత ‘భీమిలి కబడ్డీ జట్టు’లో చాన్స్ వచ్చింది. అది హిట్ అవడంతో నా గురించి అందరికీ తెలిసింది.
     
కానీ తక్కువ సినిమాలే చేసినట్టున్నారు?
అవును. అవకాశాలు రావట్లేదు. ఒకప్పుడు అదృష్టం ఉంటే వచ్చేవి. తర్వాత లాటరీ కొట్టినట్టు అనుకోకుండా వచ్చేవి. ఇప్పుడు పరిచయాలు ఉంటే వస్తున్నాయి.

టీవీ షోల వల్ల నేను పాపులరయ్యాను.కాస్త డబ్బులు సంపాదించుకున్నాను. కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల చెడూ జరుగుతుంది. ఎంతోమంది నటీనటులు వచ్చేస్తున్నారు. స్టేజి ఎక్కిన ప్రతి ఒక్కరూ గొప్ప నటులమే అనుకుంటున్నారు. ఆప్షన్స్ ఎక్కు వైనప్పుడు ఆఫర్ చేసేవాడు కూడా కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఎవడు తక్కువకొస్తే వాడినే తీసుకుంటాడు. దానివల్ల నిజంగా ప్రతిభ ఉన్నవాళ్లు నష్టపోతున్నారు.
     
అంటే మీకు పెద్దగా పరిచయాలు లేవా?
ఉన్నా నాలాంటి వాడికి అవకాశాలు తక్కువే వస్తాయి. ఎందుకంటే నేను చాలా ముక్కుసూటి మనిషిని. తేడా ఉన్నా, తప్పు జరిగినా ముఖమ్మీదే మాట్లాడతాను. అది ఎవరికీ నచ్చదు. మాట్లాడినప్పుడు సూపర్ అంటారు. తర్వాత పక్కకు వెళ్లి నా గురించి చెడుగా మాట్లాడతారు. నాలాంటి వాడు ఇండస్ట్రీకి నచ్చడు.
     
అది తెలిసీ ఎందుకలా ఉండటం?
నేనూ మారదామనుకున్నాను. కానీ మారితే అవకాశాలు వస్తాయని గ్యారంటీ ఉందా? లేనప్పుడు నేను చేసేది కరెక్ట్ అని తెలిసీ ఎందుకు నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి? అవకాశాల కోసం భజనలు చేయడం, కాకా పట్టడం నేను చేయలేను.
   
ఒకరి అవకాశాలు మరొకరికి వెళ్లడం కూడా జరుగుతుందా?
జరుగుతుందనే అనిపిస్తుంటుంది. ఓ పాత్ర ఆఫర్ చేస్తారు. రెమ్యునరేషన్, డేట్లు అన్నీ మాట్లాడేసుకున్న తర్వాత కిక్కురుమనరు. ఆరాతీస్తే ఆ పాత్ర మరెవరో చేస్తున్నారని తెలుస్తుంది. దానికి వంద కారణాలు ఉండొచ్చు. నా కంటే తక్కువ రెమ్యురేషన్‌కి అతడు దొరికి ఉండొచ్చు, నాకంటే బాగా తెలిసినవాడై ఉండొచ్చు. కారణం ఏదైనా నాకు మాత్రం బాధే కదా!
     
చాలా ఆవేదనతో ఉన్నట్టున్నారు...?
ఆవేదన ఉండదా?! నేను నా సీనియర్లను గౌరవిస్తాను. కానీ నా జూనియర్లు నన్ను గౌరవించరు. ఎందుకంటే నా చేతిలో చాన్సుల్లేవు కాబట్టి. చాలాసార్లు అనిపిస్తుంది వెళ్లిపోదామని. కానీ నటనంటే పిచ్చి.. అందుకే వెళ్లలేకపోతున్నాను.
     
ఇంతకీ మీకు పెళ్లయ్యిందా?
ఇంకా లేదు. నేను చాలా పెద్దవాడినని అనుకుంటారంతా. కానీ నా వయసు ముప్ఫై దాటలేదు. ఆ విషయం చెప్పినా నమ్మరెందుకో. దానికితోడు కమెడియన్ అంటే అందరికీ కామెడీనే. ఓ అమ్మాయి దగ్గరకు వెళ్లి ‘మీరు నాకు చాలా నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది’ అన్నాను. ‘మీరు భలే కామెడీ చేస్తారండీ’ అంది. మేము నవ్వినా, ఏడ్చినా, ప్రేమించినా కామెడీయే అనుకుంటే ఏం చేస్తాం!
     
అయితే అమ్మాయి దొరకలేదన్నమాట...
సినిమా వాళ్లకు పిల్ల దొరకడం అంటే ఎవరెస్ట్ ఎక్కినట్టే. సినిమా టిక్కెట్లు కావలిస్తే మమ్మల్ని అడుగుతారు. తమకూ కాస్త క్రేజ్ పెరుగుతుందని పబ్బులకీ ఫంక్షన్లకీ తీసుకెళ్తారు. వాళ్ల పనులకి మేం కావాలి. కానీ వాళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రం మేం పనికి రాం. సినిమావాళ్లు తాగుతారు, తిరుగుతారు అంటూ చిట్టా వినిపిస్తారు. ఇంకెలా దొరుకుతుంది పిల్ల! చూద్దాం. పైవాడు ఎవర్నో రాసిపెట్టి ఉంటాడు కదా... ఆమె ఎదురుపడినప్పుడు చేసుకుంటా!
సంభాషణ: సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement