
తొలి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే.. చాలామంది మొదటి జీతంతో అమ్మానాన్నకు ఏదైనా గిఫ్ట్ ఇస్తుంటారు. లేదంటే వారికోసమే ఏదైనా వస్తువు, దుస్తులు కొనుక్కుంటారు. అదీ కాదంటే భద్రంగా దాచిపెట్టుకుంటారు. తాజాగా హీరో నాని (Nani) తన తొలి సంపాదన గురించి ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చాడు. నాని మాట్లాడుతూ.. నా మొదటి జీతం రూ.2,500. క్లాప్ అసిస్టెంట్‌గా పని చేసినందుకుగానూ రెండున్నర వేలు ఇచ్చేవారు. కాకపోతే అది డబ్బు రూపంలో కాకుండా చెక్ ఇచ్చారు.
చెక్ బౌన్స్..
అయితే ఆ నిర్మాణ సంస్థ ఏదో కారణాల వల్ల వేరే బ్యాంకుకు మారిపోయింది. అప్పటికే అందరూ చెక్‌లో రాసిన మొత్తాన్ని బ్యాంకులో వేసుకున్నారు. నేను మాత్రం చెక్ చూపించుకుంటూ తిరిగాను. 20 రోజుల తర్వాత డబ్బులు డ్రా చేద్దామంటే చెక్ బౌన్స్ అయింది. తర్వాత వెళ్లి అడగడం ఇష్టం లేక దాన్నలాగే దాచుకున్నాను. ఆ డబ్బులు నాకు రాకపోయినా మంచి జ్ఞాపకంగా ఉండిపోయింది.
తొలి పారితోషికం..
రెండో సినిమా అల్లరి బుల్లోడుకు (అసిస్టెంట్ డైరెక్టర్‌గా) మొదటి నెల రూ.4000 పారితోషికం ఇచ్చారు. చెక్ మాత్రం వద్దని చెప్తే వంద రూపాయల నోట్లు ఇచ్చారు. ఆ నోట్ల కట్టను జేబులో పెట్టుకుని నేనే హైదరాబాద్ కింగ్ అన్నట్లుగా తిరిగాను. నా ఫ్రెండ్స్‌ను బయటకు తీసుకెళ్లాను. దానితోపాటు తర్వాతి మూడు నెలల జీతం దాచిపెట్టి అమ్మానాన్నకు ఉంగరాలు చేయించాను అని చెప్పుకొచ్చాడు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం
నాని.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ మొదలుపెట్టాడు. రాధా గోపాలం, అల్లరి బుల్లోడు, అస్త్రం, ఢీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారాడు. స్నేమితుడా, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, జెంటిల్‌మన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న.. ఇలా అనేక సినిమాలు చేశాడు.
నెక్స్ట్ ఏంటి?
చివరగా సరిపోదా శనివారం సినిమాతో అలరించాడు. ప్రస్తుతం హిట్ 3 మూవీ చేస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా యాక్ట్ చేసింది. మరోవైపు నాని.. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ద ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు.
చదవండి: ఆపరేషన్ అనంతరం వెకేషన్‌లో యాంకర్ రష్మీ.. దేవుడింతేనేమో!