అందుకే పెళ్లి చేసుకోలేదు!
సంభాషణం: అమాయకమైన ఇల్లాలిగా భర్తను విసిగించినా... ఉదాత్తమైన తల్లి పాత్రలో కన్నీళ్లు తెప్పించినా... కమెడియన్‌గా కడుపుబ్బ నవ్వించినా... ఏం చేసినా ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తారు రజిత. హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది సినిమాలు చేసిన ఆమె... తన నట ప్రయాణం గురించి, తన అనుభవాల గురించి ఇలా పంచుకున్నారు.
మీ కెరీర్‌కి పునాది ఎలా పడింది?
మాది కాకినాడ. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే పెంచి పెద్ద చేసింది. అమ్మ చెల్లెళ్లు కృష్ణవేణి, రాగిణి... ఇద్దరూ నటీమణులే. పదిహేనేళ్లున్నప్పుడు ఓసారి వేసవి సెలవుల్లో మద్రాస్ వెళ్లాను పిన్ని దగ్గరికి. షూటింగ్ చూడ్డానికి వెళ్తే పరుచూరి గోపాలకృష్ణ చూసి నటిస్తావా అనడిగారు. నటించను, చదువుకోవాలి అని చెప్పాను. కానీ ఆయన పట్టుబట్టి, దర్శకుడు రాఘవేంద్రరావుగారితో చెప్పి, ‘అగ్నిపుత్రుడు’లో ఏఎన్నార్‌గారి కూతురి పాత్ర చేయించారు. తర్వాత నేను మళ్లీ చదువులో పడిపోయాను. కానీ వరుసగా అవకాశాలు వస్తుండటంతో, ఎందుకు వదులుకోవాలి అనిపించింది. అందుకే ఇంటర్‌తో చదువు ఆపేసి, సినిమా రంగంవైపు వచ్చేశాను.
హీరోయిన్‌గానూ చేసినట్టున్నారు...?
అవును. ఒరియా, మలయాళం, తమిళ భాషల్లో చేశాను. కానీ పరాయి భాషలో చేస్తే ఎవరికి తెలుస్తుంది, మన భాషలో చేస్తే మనవాళ్లు గుర్తుపడతారు కదా అనిపించింది. అందుకే అక్కడ హీరోయిన్ పాత్రలు వదులుకుని, ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడటానికి సిద్ధపడ్డాను.
పేరు తెచ్చిన పాత్రలు...?
‘పెళ్లికానుక’లో పాత్ర నాకు చాలా ఇష్టం. దానికి నంది అవార్డును కూడా అందుకున్నాను. ‘మల్లీశ్వరి’లో భరణిగారిని విసిగించే అమాయక భార్య పాత్ర, కొత్త బంగారులోకం, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లోని పాత్రలు బాగా పేరు తెచ్చాయి.
చేయకుండా ఉండాల్సింది అనుకునే పాత్ర ఏదైనా ఉందా?
‘కబడ్డీ కబడ్డీ’లో చేసింది. కొత్త దర్శకులైతే తప్ప నేను నా పాత్ర గురించి అడగను. నాకెలాంటివి ఇవ్వాలో వారికి తెలుసులే అనుకుంటాను. ఆ సినిమాకీ అదే చేశాను. తీరా షూటింగుకు వెళ్లాక నా పాత్ర అసభ్యంగా ఉంది. చేయలేనని అన్నాను. అయితే ఔట్‌డోర్ షూటింగ్, అప్పటికప్పుడు ఆర్టిస్టును మార్చలేని పరిస్థితి. అందుకే చేయక తప్పలేదు. కాకపోతే నాకోసం కాస్త మార్చారులెండి. ‘నవ్వుతూ బ్రతకాలిరా’లో చేసింది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే!
కోవై సరళకు బ్రహ్మానందంలాగా రజితకెవరు తగిన జోడీ?
ఆహుతీప్రసాద్‌గారితో నా జోడీ బాగుంటుందని చాలామంది అంటుంటారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. అన్నీ బాగా పండాయి.
నటిగా మీలో మైనస్‌లున్నాయా?
నా హైట్. కమెడియన్లకు జోడీగా చేసినప్పుడు ఫర్లేదు కానీ హీరోయిన్లకు తల్లిగా చేసినప్పుడు మాత్రం, వాళ్ల పక్కన చాలా పొట్టిగా కనిపిస్తుంటాను. అలాంటప్పుడు ఇంకాస్త హైట్ ఉంటే బాగుణ్ననిపిస్తుంది.
డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా?
రమాప్రభగారు ఓ సినిమాలో రెండు జడలు వేసుకుని అమాయకంగా నటించారు. అలాంటిదొకటి చేయాలనిపిస్తుంది. అయితే ఆ అవకాశం దొరకడం కష్టమే. ఎందుకంటే, మన పరిశ్రమలో మగవారితో చేయించినంత కామెడీ, ఆడవాళ్లతో చేయించడం లేదు.
ఎందుకంటారు?
చాలా కారణాలున్నాయి. మేల్ కమెడియన్లు ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంది. దాంతో వాళ్లకోసం రకరకాల పాత్రలు పుట్టిస్తున్నారు. కానీ మాకు ఆ అవకాశమే ఉండటం లేదు. తల్లి అంటే ఇలానే ఉండాలి, వదిన ఇలానే ఉండాలి అని ఫిక్స్ చేసేస్తారు. దాంతో మాకు ఓ పరిధి మేరకే నటించే చాన్స్ ఉంటుంది. దానికి తోడు ఒకప్పటిలాగా ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ ఉండటం లేదు కాబట్టి పాత్రలు తక్కువే ఉంటున్నాయి. ఉన్నవాటికి కూడా ఏ ముంబై నుంచో, చెన్నై నుంచో, బెంగళూరు నుంచో ఆర్టిస్టుల్ని తీసుకొస్తారు. ఈ మధ్య అయితే హీరోలకు తల్లిగా, వదినగా చేయడానికి ఒకనాటి హీరోయిన్లను పెడుతున్నారు. అవి కూడా మాకు ఇవ్వకపోతే మేము ఏమైపోవాలి?
మీ పిన్ని రాగిణిలాగా సీరియల్స్ కోసం ప్రయత్నించలేదా మీరు?
లేదు. మంచి పాత్ర అని ‘అపరంజి’లో మాత్రం నటించాను. ఆ తర్వాత వీలు కాలేదు. కానీ సమయం వచ్చినప్పుడు నటించడానికి నాకే అభ్యంతరమూ లేదు.
మీ వ్యక్తిగతం జీవితం గురించి..?
చెప్పుకోదగ్గ ప్రత్యేకతలేమీ లేవు. నాకు మొదట్నుంచీ ఆథ్యాత్మిక ధోరణి ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మకుమారిగా ఉండిపోయాను. షూటింగ్ లేకపోతే ఆధ్యాత్మిక చింతనలోనే ఎక్కువ గడుపుతాను. పార్టీలకవీ వెళ్లను. నా ఫ్రెండ్స్ ప్రగతి, సన, సురేఖావాణిలతో ఎప్పుడైనా సరదాగా గడుపుతాను. అంతే!
- సమీర నేలపూడి