దెయ్యాల వంతెన | Devils bridge is allocated in Indiana state, US | Sakshi
Sakshi News home page

దెయ్యాల వంతెన

Published Sun, Jul 20 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

దెయ్యాల వంతెన

దెయ్యాల వంతెన

నిజాలు దేవుడికెరుక: అమెరికాలోని ఇండియానా రాష్ట్రం... రాత్రి పన్నెండు గంటలు కొట్టడానికి గడియారాలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నెల కావడంతో దట్టంగా మంచు కురుస్తోంది. కౌంటీ రోడ్ 635 మీద తెల్లని కారు దూసుకుపోతోంది. అర్ధరాత్రి కావస్తుండటంతో నిర్మానుష్యంగా ఉంది. దాంతో ప్రమాదమేమీ ఉండదని అంతకంతకూ స్పీడు పెంచుతున్నాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న జాక్సన్.
 
 ఓ సమయంలో ఎవన్ బ్రిడ్జి కారణంగా కౌంటీ రోడ్ 635 మూతపడే పరిస్థితి వచ్చింది. ఎవ్వరూ అటువైపు పోయేవారు కాదు. పగలు గుండె చిక్కబట్టుకుని తిరిగినా, సాయంత్రం అయ్యేసరికి అక్కడ పిట్ట కూడా కనిపించేది కాదు. దాంతో కొందరు అక్కడ నిజంగా దెయ్యాలున్నాయా అంటూ పరిశోధనకు దిగారు. కొందరు తీసిన వీడియోల్లో అస్పష్టమైన ఆకారాలు, అరుపులు, రోదనలు కనిపించడంతో ఉన్నాయని నిర్ధారించుకున్నారు. అయితే అవన్నీ పుకార్లని, నమ్మవద్దని అధికారులు పదే పదే వివరించారు. చాలామంది వాళ్ల మాటల్ని నమ్మారు. మిగతావాళ్లు దెయ్యాల్ని నమ్మారు. ఇప్పటికీ ఎవన్ బ్రిడ్జి అలానే ఉంది. దాని గురించిన భయం కూడా చాలామంది మనసుల్లో ఇంకా మిగిలేవుంది.
 
 ‘‘స్టాపిట్ జాక్... ఎందుకా స్పీడు, నాకు భయమేస్తోంది’’... అరిచినట్టే అంది పక్క సీట్లో కూర్చున్న బ్యూలా.
 ‘‘ఓహ్ డియర్... చలి రాత్రిలో, అదీ నువ్వు పక్కనుండగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్తుంటే ఈ మాత్రం హుషారుండదూ, బీ రొమాంటిక్’’ అన్నాడు కన్ను గీటుతూ.
 ‘‘ఏడ్చినట్టుంది నీ రొమాన్స్. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే రొమాంటిక్‌గా ఉంటుంది కానీ, ఇలా వెళ్తే టెన్షన్‌గా ఉంటుంది’’ అంది కళ్లు విప్పార్చి.
 ఫక్కున నవ్వాడు జాక్. ‘‘మరీ ఇంత పిరికిదానివేంటి బ్యూలా నువ్వు! రేపు నన్ను పెళ్లి చేసుకుంటే ఇలాంటి సాహస యాత్రలు చాలానే చేయాల్సి ఉంటుంది మరి’’ అన్నాడు ఏడిపించడానికన్నట్టు.
 ‘‘అలా అయితే చచ్చినా చేసుకోను. ఇంకా మాట్లాడితే అసలు కారు డ్రైవింగే రానివాణ్ని చూసి చేసుకుంటాను. నువ్వు అన్నీ నీకిష్టమైనవే చేస్తావు తప్ప నా ఇష్టాయిష్టాలను ఎప్పుడూ పట్టించుకోవు’’... మూతి తిప్పింది. ఆమె అలక చూసి చప్పున బ్రేక్ వేశాడు జాక్. కాస్త దగ్గరగా జరిగి ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
 
 ‘‘ఏదీ... నా కళ్లలోకి చూసి చెప్పు. నన్ను కాకుండా వేరేవాడిని చేసుకోగలవా నువ్వు’’ అన్నాడు ప్రేమగా. ఆమె కరిగిపోయింది. సిగ్గుతో కళ్లు వాల్చేసింది. తల అడ్డంగా తిప్పి అతడి గుండెల మీద వాలిపోయింది. ఆమెని గట్టిగా గుండెకు అదుముకున్నాడు జాక్. అంతలో సన్నగా ఏడుపు వినిపించింది. ‘‘ఛ... ఏడుస్తున్నావా... నేనేదో సరదాకి అలా చేశాను. నీకిష్టం లేని పని నేనెందుకు చేస్తాను! మెల్లగానే డ్రైవ్ చేస్తాను. నీ ఇష్టాయిష్టాలనే నావి గా చేసుకుంటాను. నీ కళ్లలోంచి నీళ్లు వస్తే తట్టుకోలేను’’ అంటూ ఆమె ముఖాన్ని పైకి లేపిన జాక్ ఆశ్చర్యపోయాడు. బ్యూలా ఏడవడం లేదు. ఆమె కళ్లలో నీళ్లు లేవు. ముఖం ప్రసన్నంగా ఉంది. చిరునవ్వుతో పెదవులు విచ్చుకుని ఉన్నాయి. ‘‘నువ్వు ఏడవడం లేదా?’’
 నవ్వింది బ్యూలా. ‘‘నా నవ్వు నీకు ఏడుపులాగా వినిపిస్తోందా’’ అంది అతడి చెవి మెలేస్తూ. జాక్ అరవలేదు. నవ్వనూ లేదు. చుట్టూ చూశాడు. చెవులు రిక్కించాడు. ఏడుపు ఇంకా వినిపిస్తోంది. ‘‘బ్యూలా... సరిగ్గా విను. ఎవరిదో ఏడుపు వినిపిస్తోంది.’’
 బ్యూలా కూడా చెవులు రిక్కించింది. సన్నగా ఏడుపు వినిపిస్తోంది. ‘‘నిజమే జాక్... ఆడమనిషి ఏడుపు. యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందేమో’’ అంది కంగారుగా.
 ఆమె అలా అనడంతోనే గబగబా కారు దిగాడు. రోడ్డుకు ఆ పక్క, ఈ పక్క చూశాడు. ఎవ్వరూ లేరు. ఎదురుగా ఓ రోడ్ కమ్ రైలు బ్రిడ్జి కనిపించింది. అక్కడంతా చీకటిగా ఉంది. ‘‘అక్కడెవరైనా ఉన్నారేమో బ్యూలా’’ అన్నాడు అటే చూస్తూ. ఇద్దరూ అటువైపు నడిచారు. బ్రిడ్జి దగ్గరకు వెళ్లేసరికి ఓ మహిళ రోడ్డు పక్కన కూర్చుని కనిపించింది. జుట్టు విరబోసుకుని ఉంది. బాగా గాయపడినట్టుగా అనిపిస్తోంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ‘‘ఏమైంది?’’ అన్నాడు జాక్ ఆతృతగా. చేయి ఎత్తి ముందుకు చూపించింది. అటువైపు చూసిన జాక్, బ్యూలాలకు రక్తపు మడుగులో పడివున్న ఓ చిన్నపిల్లాడు కనిపించాడు.  
 ‘‘నా బాబు... నా బాబు’’ అంటూ ఏడుస్తోందామె. జాక్, బ్యూలాలు కదిలిపోయారు. ‘‘కంగారు పడకు, హాస్పిటల్‌కి వెళ్దాం’’ అంది బ్యూలా. ‘‘ఇక్కడే ఉండు,  కారు తీసుకొస్తాం’’ అంటూ కదిలాడు జాక్. ఇద్దరూ గబగబా కారు దగ్గరకు పరుగెత్తారు. ఎక్కి స్టార్ట్ చేసి బ్రిడ్జి దగ్గరకు వచ్చారు. కారు దిగి, ‘‘రామ్మా... హాస్పిటల్‌కి వెళ్దాం’’ అంటూ వెళ్లబోయిన జాక్ కాళ్లకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఉన్నచోటనే ఉండిపోయాడు. ‘‘ఏరి బ్యూలా వాళ్లు?’’ అన్నాడు ఆయోమయంగా.
 అటువైపు చూసిన బ్యూలా ఉలిక్కిపడింది. అక్కడా మహిళ లేదు. పిల్లాడు కూడా లేదు. రక్తపు మడుగు లేదు. అసలక్కడ ఇంతకుముందు ఉన్న యాక్సిడెంట్ గురుతులేమీ లేవు. భయంతో జాక్ చేతిని గట్టిగా పట్టుకుంది బ్యూలా. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు జాక్.
 అంతలో... మళ్లీ ఏడుపు. గట్టిగా... బాధగా... మనసులను కదిలించేలా... అదే ఏడుపు.  
 ‘‘నాకు భయంగా ఉంది జాక్... పద వెళ్లిపోదాం’’ అంది బ్యూలా వణికిపోతూ. ‘‘పద’’ అంటూ ఆమెను తీసుకుని వెళ్లి కారులో కూర్చోబెట్టాడు. తాను కూడా కారెక్కి స్టార్ట్ చేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పీడందుకున్నాడు. క్షణాల్లో వారి కారు దూసుకుపోయింది.
 బ్యూలా, జాక్‌లకే కాదు. ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్లే చాలామందికి ఆ ఏడుపు వినిపిస్తుంది. ఎంతోమందికి ఆ స్త్రీ కనిపిస్తుంది. కన్నీళ్లతో అందరినీ తన దగ్గరకు రప్పించుకుంటుంది. కన్నుమూసి తెరిచేలోగా మాయమై భయపెడుతుంది. అసలెవరామె? ఎందుకలా ఏడుస్తుంది? అంతలోనే ఎక్కడికి వెళ్లిపోతోంది?
    
 ఇండియానాలోని ఎవన్ పట్టణంలో ఉండటం వల్ల ఆ బ్రిడ్జిని అందరూ ఎవన్ బ్రిడ్జి అంటారు. 1906లో దీన్ని నిర్మించారు. కట్టిన కొన్ని రోజులకే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి విని అమెరికా మొత్తం హడలిపోయింది. ఎవన్ బ్రిడ్జి కింది నుంచి ఇతరత్రా వాహనాలు వెళ్తాయి. పైనుంచి రైళ్లు పోతాయి.  అయితే సరిగ్గా అక్కడికి వచ్చేసరికి రైళ్ల స్పీడు తగ్గిపోయేది. బ్రిడ్జి దాటగానే మళ్లీ దానంతటదే స్పీడు పెరిగేది. అంతేకాదు... ఆ బ్రిడ్జి దగ్గరకు రాగానే ఓ మహిళ ఏడుపు వినిపించేది. హృదయ విదారకంగా ఉండే ఆ ఏడుపు చాలా భయపెట్టేది. అయితే మనిషి మాత్రం కనిపించేది కాదు. కానీ... కింద రోడ్డుమీద వెళ్లే వాహనదారులకు మాత్రం చాలాసార్లు గాయాలపాలైన ఓ మహిళ కనిపించేది. ఆమెతో పాటు ఓ పసిబిడ్డ కూడా ఉండేవాడు. ఇట్టే కనిపించి అట్టే మాయమయ్యేవారు వాళ్లు. మొదట మనుషులని అనుకున్నా, ఆ తర్వాత తెలిసేది దెయ్యాలని. వాళ్లతో పాటు ఓ ఇద్దరు మగవాళ్లు కూడా కనిపిస్తుండేవారు. దాంతో కొన్నాళ్లకే ఆ బ్రిడ్జి దగ్గర దెయ్యాలున్నాయన్న వార్త అంతటా పాకింది. అక్కడికి వెళ్లడానికే అందరూ భయపడే పరిస్థితి మొదలైంది. ఏంటా అని ఆరా తీస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి.
 
 ఎవన్ బ్రిడ్జి నిర్మించేటప్పుడు ఓ ఐరిష్ కార్మికుడు కాలు జారి రాళ్లమీద పడి చనిపోయాడు. అతడిని ఆ బ్రిడ్జికి ఉన్న నాలుగు స్తంభాల్లో ఒకదానిలో పెట్టి సిమెంటు చేసేశారు. అయితే ఓ చెయ్యి కాస్త బయటకు వచ్చింది. దాంతో దాన్ని నరికేసి నిర్మాణాన్ని పూర్తి చేశారట. అది భరించలేని అతడి ఆత్మ దెయ్యమై సంచరిస్తోందని కొందరు  అన్నారు. మరో కథనం ప్రకారం... ఓ కార్మికుడు పని చేస్త్తూ పైనుంచి కింద పడిపోయాడట. నేరుగా సిమెంటు టబ్బులో పడటంతో ఎవరూ చూడలేదట. దాంతో ఊపిరాడక అందులోనే ప్రాణాలు విడిచాడట. అతడి ఆత్మ కూడా అక్కడే తిరుగుతోందట.
 
 అయితే ఎక్కువగా చెప్పేది, అందరూ నమ్మేది మరో కథ ఉంది. ఓ మహిళ తన బిడ్డతోపాటు రైలు పట్టాల పక్కనే నడుస్తోందట. సరిగ్గా బ్రిడ్జిని దాటుతుండగా రైలు కూత వినిపించింది. దాంతో ఆమె కంగారుగా బ్రిడ్జిని దాటేయాలని ప్రయత్నించింది. అంతలో కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. తీసుకునేలోపు రైలు వచ్చి గుద్దేసింది. చేతిలోని బిడ్డ ఎగిరి కింద రోడ్డు మీద పడి మరణించింది. ఆ మహిళ తీవ్ర గాయాలపాలయ్యింది. అప్పటికైతే బతికి బట్టకట్టింది గానీ... బిడ్డ మీద బెంగతో మంచం పట్టి నెల రోజులు తిరక్కుండా చనిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రతిరోజూ అర్ధరాత్రి అయ్యేసరికి తన బిడ్డ చనిపోయిన బ్రిడ్జి దగ్గరకు వచ్చి భయానకంగా ఏడుస్తూ ఉంటుందని, తన బిడ్డతో సహా కనిపిస్తుందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మరో విషయం ఏమిటంటే... ఈ బ్రిడ్జి నుంచి ఒక్కోసారి నీటి చుక్కలు కారుతూ ఉంటాయి. అవి ఆమె కన్నీళ్లేనని అందరూ అంటూ ఉంటారు.
 
 ఇదంతా నిజమేనా అంటే...  సమాధానం శూన్యం. కొందరు నిజమంటారు. కొందరు పుకార్లంటారు. భయపడేవాళ్లు కొందరున్నారు. కొట్టిపారేసేవాళ్లు కొందరున్నారు. కొందరు ఒక దెయ్యమే ఉందంటారు. కొందరు రెండు మూడు ఉన్నాయంటారు. ఎవరేమన్నా కానీ... ఆ బ్రిడ్జి దగ్గరకు వెళ్లడానికి మాత్రం చాలామంది జడుస్తూనే ఉంటారు. నిప్పు లేనిదే పొగ రానప్పుడు... ఏమీ లేకుండానే ఆ బ్రిడ్జికి హాంటెడ్ బ్రిడ్జ్ అన్న పేరు ఎలా వస్తుంది? ఈ లోకంలో దెయ్యం ఉనికి ఎప్పుడూ ప్రశ్నార్థకమే కాబట్టి... ఎవన్ బ్రిడ్జి ప్రేతాత్మ కథ కూడా ప్రశ్నార్థకమే!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement