హాంకాంగ్‌లో అస్థికలను భద్రపరిచే భవనం
ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏదంటే హాంకాంగ్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఒక జత చెప్పుల డబ్బా అంతటి విస్తీర్ణం ఉన్న స్థలం కూడా వేల డాలర్లు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో చూపరుల్ని ఆకట్టుకునే 12 అంతస్తుల అందమైన భవనాన్ని ఈ మధ్య నిర్మించారు. పాలరాతితో, వంపులు తిరిగిన డిజైన్, రూఫ్ గార్డెన్‌తో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా ఫిదా(వశం) అయిపోతారు. అయితే అది నిర్మించింది ధనవంతులు నివసించడం కోసం కాదు. మరణించిన వారి అస్థికలను భద్రపరచడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు.
ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. షాన్ సమ్ టవర్ పేరుతో నిర్మించిన ఈ భవనంలో అస్థికల కలశాన్ని భద్రపరచాలంటే 76,000 డాలర్లు (రూ.63 లక్షలు) చెల్లించాలి. అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత లీజ్ రద్దయిపోతుంది. ఎందుకంటే ఆ భవనంలో 22,000 మంది అస్థికలను మాత్రమే భద్రపరచవచ్చు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది అస్తికలను భద్రపరచడానికి ఫ్యామిలీ ప్యాకేజీ సదుపాయం ఉంది. అందుకయ్యే ఖర్చు 4,40,000 డాలర్లు (రూ.3.64 కోట్లు). షాన్ సమ్ అంటే చైనా భాషలో దయా హృదయం అని అర్థం. ఈ భవనం సంపన్నులకే అందుబాటులో ఉండడం గమనార్హం.
అంతా అత్యాధునికం
కేవలం అస్థికల కోసం ఇంత ఖరీదా? అని ఎవరైనా నోరెళ్లబెట్టొచ్చు. కానీ, అక్కడున్న హంగులు, ఆర్భాటాలు చూస్తే మతి పోవాల్సిందే. తమకెంతో ఇష్టమైన వారిని స్మరించుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ భవనాన్ని నిర్మించారు. పైన అంతా రూప్‌గార్డెన్ ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పెద్ద పెద్ద బాల్కనీలు ఉంటాయి. చైనా సంస్కృతి సంప్రదాయాల్లో శ్మశాన వాటికలు ఎలా ఉంటాయో అలా వంపుల తిరిగిన డిజైన్‌తో భవనం ఉంటుంది.
ఇక లోపల పాలరాతి ఫ్లోరింగ్, ఏసీలు, గాలిలో తేమని తొలగించే వ్యవస్థ కూడా ఉన్నాయి. అస్థికలను భద్రపర్చే చిన్నచిన్న గదుల తలుపులను బంగారు నాణేలతో సౌందర్యభరితం చేశారు. భిన్న సంప్రదాయాలు, ఆచారాలను పాటించే వారి అభిరుచులకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం జరిగింది. పెద్దలకి నివాళులరి్పంచుకోవడానికి ముందస్తుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వారికిష్టమైన ఆహారాన్ని వండి తీసుకువెళ్లి, సంప్రదాయబద్ధంగా నివేదించవచ్చు.
పెద్దలను గౌరవించుకోవడానికి
మనుషుల అస్థికల కోసం ప్రత్యేకంగా అందమైన భవనం కట్టాలన్న ఆలోచన ఏడు పదుల వయసున్న మార్గరెట్ జీ అనే ఒక మహిళా పారిశ్రామికవేత్తకు వచ్చింది. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆమె వయసు మీదపడ్డాక సేవా కార్యక్రమాల బాట పట్టారు. తన పేరు మీదే ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సమాజానికి సేవలందిస్తున్నారు.‘‘మరణించిన పెద్దలకి నివాళులర్పించడానికి చైనా సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. దివికేగిన పెద్దల స్మృతుల్లో గడిపి, వారిని గౌరవిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవనం నిర్మించాం’’ అని
మార్గరెట్ చెప్పారు.
భర్త మరణంతో..
హాంకాంగ్ నగర జనాభా 70 లక్షలపైమాటే. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాస్తవానికి విస్తీర్ణంలో హాంకాంగ్ పెద్దదే. కానీ కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల నివాసయోగ్యమైన ప్రాంతం తక్కువే. అందుకే ఇక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణం ఎక్కువగా ఉంది. ఈ నగరంలో ఒక ఇంటి సగటు విస్తీర్ణం 430 చదరపు అడుగులు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అస్థికల భవన నిర్మాణాన్ని తలపెట్టిన మార్గరెట్ భర్త 2007లో మరణించారు. ఆయన స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడానికి ఆమెకి స్థలం దొరకలేదు.
ఆ సమయంలోనే మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక అపార్ట్‌మెంట్ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు వచి్చంది. అది ఇన్నేళ్లకి సాధ్యమైందని చెబుతున్నారు. ఇక హాంకాంగ్‌లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. ప్రతి అయిదుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారే. ఇక నగరంలో ప్రతి ఏటా దాదాపు 46,000 మంది మరణిస్తున్నారు. వారి అవశేషాలను భద్రపరచడానికి ప్రభుత్వం పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. అయితే అవి సరిపోకపోవడం వల్ల ప్రైవేట్ భవనం నిర్మించాల్సి వచి్చంది. హాంకాంగ్‌లో సంపన్నులు కూడా ఎక్కువే. అలాంటి వారి సౌకర్యార్థం షాన్ సమ్ అందుబాటులోకి వచి్చంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment