Family package
-
అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా!
ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏదంటే హాంకాంగ్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఒక జత చెప్పుల డబ్బా అంతటి విస్తీర్ణం ఉన్న స్థలం కూడా వేల డాలర్లు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో చూపరుల్ని ఆకట్టుకునే 12 అంతస్తుల అందమైన భవనాన్ని ఈ మధ్య నిర్మించారు. పాలరాతితో, వంపులు తిరిగిన డిజైన్, రూఫ్ గార్డెన్తో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా ఫిదా(వశం) అయిపోతారు. అయితే అది నిర్మించింది ధనవంతులు నివసించడం కోసం కాదు. మరణించిన వారి అస్థికలను భద్రపరచడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. షాన్ సమ్ టవర్ పేరుతో నిర్మించిన ఈ భవనంలో అస్థికల కలశాన్ని భద్రపరచాలంటే 76,000 డాలర్లు (రూ.63 లక్షలు) చెల్లించాలి. అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత లీజ్ రద్దయిపోతుంది. ఎందుకంటే ఆ భవనంలో 22,000 మంది అస్థికలను మాత్రమే భద్రపరచవచ్చు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది అస్తికలను భద్రపరచడానికి ఫ్యామిలీ ప్యాకేజీ సదుపాయం ఉంది. అందుకయ్యే ఖర్చు 4,40,000 డాలర్లు (రూ.3.64 కోట్లు). షాన్ సమ్ అంటే చైనా భాషలో దయా హృదయం అని అర్థం. ఈ భవనం సంపన్నులకే అందుబాటులో ఉండడం గమనార్హం. అంతా అత్యాధునికం కేవలం అస్థికల కోసం ఇంత ఖరీదా? అని ఎవరైనా నోరెళ్లబెట్టొచ్చు. కానీ, అక్కడున్న హంగులు, ఆర్భాటాలు చూస్తే మతి పోవాల్సిందే. తమకెంతో ఇష్టమైన వారిని స్మరించుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ భవనాన్ని నిర్మించారు. పైన అంతా రూప్గార్డెన్ ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పెద్ద పెద్ద బాల్కనీలు ఉంటాయి. చైనా సంస్కృతి సంప్రదాయాల్లో శ్మశాన వాటికలు ఎలా ఉంటాయో అలా వంపుల తిరిగిన డిజైన్‌తో భవనం ఉంటుంది. ఇక లోపల పాలరాతి ఫ్లోరింగ్, ఏసీలు, గాలిలో తేమని తొలగించే వ్యవస్థ కూడా ఉన్నాయి. అస్థికలను భద్రపర్చే చిన్నచిన్న గదుల తలుపులను బంగారు నాణేలతో సౌందర్యభరితం చేశారు. భిన్న సంప్రదాయాలు, ఆచారాలను పాటించే వారి అభిరుచులకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం జరిగింది. పెద్దలకి నివాళులరి్పంచుకోవడానికి ముందస్తుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వారికిష్టమైన ఆహారాన్ని వండి తీసుకువెళ్లి, సంప్రదాయబద్ధంగా నివేదించవచ్చు. పెద్దలను గౌరవించుకోవడానికి మనుషుల అస్థికల కోసం ప్రత్యేకంగా అందమైన భవనం కట్టాలన్న ఆలోచన ఏడు పదుల వయసున్న మార్గరెట్ జీ అనే ఒక మహిళా పారిశ్రామికవేత్తకు వచ్చింది. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆమె వయసు మీదపడ్డాక సేవా కార్యక్రమాల బాట పట్టారు. తన పేరు మీదే ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సమాజానికి సేవలందిస్తున్నారు.‘‘మరణించిన పెద్దలకి నివాళులర్పించడానికి చైనా సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. దివికేగిన పెద్దల స్మృతుల్లో గడిపి, వారిని గౌరవిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవనం నిర్మించాం’’ అని మార్గరెట్ చెప్పారు. భర్త మరణంతో.. హాంకాంగ్ నగర జనాభా 70 లక్షలపైమాటే. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాస్తవానికి విస్తీర్ణంలో హాంకాంగ్ పెద్దదే. కానీ కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల నివాసయోగ్యమైన ప్రాంతం తక్కువే. అందుకే ఇక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణం ఎక్కువగా ఉంది. ఈ నగరంలో ఒక ఇంటి సగటు విస్తీర్ణం 430 చదరపు అడుగులు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అస్థికల భవన నిర్మాణాన్ని తలపెట్టిన మార్గరెట్ భర్త 2007లో మరణించారు. ఆయన స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడానికి ఆమెకి స్థలం దొరకలేదు. ఆ సమయంలోనే మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు వచి్చంది. అది ఇన్నేళ్లకి సాధ్యమైందని చెబుతున్నారు. ఇక హాంకాంగ్‌లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. ప్రతి అయిదుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారే. ఇక నగరంలో ప్రతి ఏటా దాదాపు 46,000 మంది మరణిస్తున్నారు. వారి అవశేషాలను భద్రపరచడానికి ప్రభుత్వం పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. అయితే అవి సరిపోకపోవడం వల్ల ప్రైవేట్ భవనం నిర్మించాల్సి వచి్చంది. హాంకాంగ్‌లో సంపన్నులు కూడా ఎక్కువే. అలాంటి వారి సౌకర్యార్థం షాన్ సమ్ అందుబాటులోకి వచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యామిలీ ప్యాక్!
జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే. పార్టీలు వేరైనా.. ప్రాధాన్యతలు అవే. ప్రతి పార్టీ వారసత్వ రాజకీయాలకే మొగ్గు చూపుతోంది. అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపులో పలుకుబడి గల రాజకీయ కుటుంబాలకు అగ్రతాంబూలం ఇస్తున్నాయి. జిల్లాలో వారసత్వ పాలన కొత్తేమీ కాకున్నా ఇటీవలి కాలంలో జోరందుకున్నాయి. అన్నదమ్ములు.. తండ్రీకొడుకులు, బాబాయ్ అబ్బాయ్.. ఇలా ఎవరికి వారు టికెట్ల కోసం అధిష్టానాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక భూమిక పోషిస్తున్న తాజా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మరోసారి పార్టీలో తన ప్రాబల్యాన్ని చాటుకున్నారు. ఈసారి ఎన్నికల్లో సోదరుడు నరేందర్‌రెడ్డికి కొడంగల్ టికెట్టును దక్కించుకోవడం ద్వారా పలుకుబడిని ప్రదర్శించారు. సతీమణి సునీతను జిల్లాపరిషత్ చైర్‌పర్సన్‌గా.. నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించిన మహేందర్.. తాజాగా నరేందర్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారు చేయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. కొడంగల్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి అధికార పార్టీకి కొరకరానికొయ్యగా మారిన నేపథ్యంలో ఆయన ఓటమే లక్ష్యంగా నరేందర్‌ను టీఆర్ఎస్ అధిష్టానం బరిలో దించింది. అదేసమయంలో గెలిపించే బాధ్యతను మహేందర్‌రెడ్డిపై పెట్టింది. తల్లీ..కొడుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ఈసారి శాసనసభ బరిలో దిగాలని నిర్ణయించారు. మహేశ్వరం నుంచి తల్లి, రాజేంద్రనగర్ నుంచి పుత్రుడు పోటీ చేసే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీచేయాలని భావించిన సబితకు కుమారుడి రూపంలో చుక్కెదురైంది. కుటుంబానికి ఒకే సీటుఇవ్వాలనే ఏఐసీసీ ఆంక్షల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీగా కార్తీక్ రాజకీయ అరంగేట్రానికి తలూపిన సబిత.. శాసనసభ సీటును త్యాగం చేశారు. ఈసారి మాత్రం ఇరువురు పోటీచేయడానికే మొగ్గు చూపుతున్నారు. పాత షరతులు తెరమీదకు వస్తే తప్ప ఇద్దరూ పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. గౌడ్ల దౌడ్! టీడీపీ సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ కుటుంబం కూడా రెండు టికెట్లను ఆశిస్తోంది. దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్ ఉప్పల్ నుంచి పోటీచేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కాంగ్రెస్‌తో దాదాపుగా పొత్తు కుదురుతుందని భావిస్తున్న తరుణంలో ఆయన పోటీ తథ్యంగా కనిపిస్తోంది. దేవేందర్‌గౌడ్ మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్‌కు పోటీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున సబిత బరిలో దిగుతున్నందున ఆయన పోటీ.. సీట్ల సర్దుబాటుపై ఆధారపడి ఉంది. బాబాయ్..అబ్బాయ్! చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్న జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ తన సొదరుడి కుమారుడు వీరేశ్‌ను కుత్బుల్లాపూర్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై ఇటీవల అమరావతి వెళ్లిన ఆయన అక్కడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో కూడా చర్చలు జరిపారు. పొత్తు పొడిస్తే టీడీపీ ఈ సీటును కోరే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ముందే పసిగట్టిన కాసాని.. తన కుమారుడి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. మర్రి కుటుంబం కూడా.. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి మరోసారి సనత్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కుమారుడు ఆదిత్య మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ జనసమితి (టీజేఎస్)లో చేరారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ సీటును ఆశించి భంగపడ్డ ఆదిత్య ఈ సారి తప్పనిసరిగా శాసనసభకు పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. తాండూరు నుంచి బరిలో దిగే అంశాన్ని పరిశీలిస్తున్నారు. టీజేఎస్ మహాకూటమిలో భాగస్వామిగా మారడం.. ఈ స్థానం నుంచి తన తాత, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రాతినిథ్యం వహించినందున తాండూరును ఎంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొడుకుకు ప్రేమతో... పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి తన కుమారుడు మహేశ్‌రెడ్డి కోసం ఈసారి పొటీ నుంచి తప్పుకున్నారు. వయోభారం, ఆనారోగ్యం కారణంగా పుత్రుడు మహేశ్‌కు టీఆర్ఎస్ సీటు ఇప్పించుకోగలిగారు. మరోవైపు మల్రెడ్డి సోదరులు మరోసారి టికెట్ల వేట సాగిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఇబ్రహీంపట్నంతో పాటు ఎల్బీనగర్ లేదా మహేశ్వరం నుంచి పోటీచేసేందుకు హస్తినలో లాబీయింగ్ నెరుపుతున్నారు. -
అచ్చిరాకుంటే.. అంతే...
ఆలూ ఉన్నంతవరకూ లాలూ ఉంటాడని చెప్పుకునే ఈయనకు ఈ మధ్య కష్టాలు ఫ్యామిలీ ప్యాకేజీలాగా ఒకదానివెంట ఒకటి చుట్టుముట్టాయి. దాణా స్కామ్‌లో జైలుకు వెళ్లడం.. రాజకీయంగా కష్టాలు, నష్టాలు ఇలా అన్నీ ఒకేసారి మీద పడ్డాయి. ఇంతకీ లాలూప్రసాద్కు ఇన్ని ఇక్కట్లెందుకు వచ్చాయో తెలుసా? స్విమ్మింగ్ పూల్ వల్ల! అవును. స్విమ్మింగ్ పూల్ వల్లే.. ఆ విషయాన్ని ఆయనకు నమ్మకస్తుడైన వాస్తు నిపుణుడు చెప్పాడు. స్విమ్మింగ్ పూల్ ప్రస్తుతం ఉన్నచోటు సరైనది కాదని చెప్పడంతో పాట్నాలోని తన బంగ్లాలో భార్య రబ్రీదేవి ఛాత్ పూజ కోసం ఎంతో ఇష్టంగా కట్టించిన ఈతకొలనును ఇలా మట్టితో పూడ్పించేశారు. అంతేకాదు.. కష్టాలన్నీ పోయి.. కాలం కలిసొచ్చేలా చేయడానికి.. బంగ్లాలోని ఈశాన్య దిశలో మరో కొత్త ఈతకొలనును త్వరలోనే నిర్మించనున్నారు.