మహిళే మొదట వ్యాక్సిన్‌కి చేయూత | Womens leadership in the COVID-19 response In The World | Sakshi
Sakshi News home page

మహిళే మొదట వ్యాక్సిన్‌కి చేయూత

Published Sat, Jan 2 2021 2:12 AM | Last Updated on Sat, Jan 2 2021 4:35 AM

Womens leadership in the COVID-19 response In The World - Sakshi

షీ జెంగ్లీ.. కరోనాను కనిపెట్టిన మహిళ. శైలజ.. కరోనా నుంచి అలెర్ట్‌ చేసిన మహిళ. జెన్నిఫర్‌.. వ్యాక్సిన్‌కు ప్రయోగమైన మహిళ. కరోనా మొదలు నుంచి.. తుదికి చేరుతున్న ప్రతి దశలోనూ మహిళ! ఇప్పుడు ప్రతి దేశంలోనూ.. వ్యాక్సిన్‌కి చేయూత అవుతున్నదీ మహిళే!

రెండువేల పందొమ్మిది డిసెంబరులో కోవిడ్‌–19 వస్తే, రెండువేల ఇరవై డిసెంబర్‌కి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వచ్చింది. వ్యాక్సిన్‌ రావడం అంటే మానవాళి పునర్జన్మించడమే. ఆ జన్మకు తొలి పొత్తిలి పట్టిన మహిళ మార్గరెట్‌ కీనన్‌! 90 ఏళ్ల బ్రిటిష్‌ బామ్మ గారు ఆమె. బ్రిటన్‌లోనే కాదు, ప్రపంచంలోనే తొలిసారి వ్యాక్సిన్‌కి చెయ్యి పట్టిన తొలి మహిళ మార్గరెట్‌. అందరికన్నా ముందు టీకా వేయించుకుని డిసెంబర్‌ తొలివారంలోనే లోకానికి నూతన çసంవత్సరాన్ని తీసుకొచ్చారు మార్గరెట్‌.

ఆ తర్వాత మిగతా దేశాల్లోనూ వ్యాక్సిన్‌లు సిద్ధమయ్యాయి. యు.ఎస్‌., స్విట్లర్జాండ్, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, రష్యా దేశాలు తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌ను తమ పౌరులకు ఇచ్చాయి. ఈ దేశాలన్నిటిలోనూ తొలి వ్యాక్సిన్‌ షాట్‌ను తీసుకున్నది మహిళలే కావడం యావత్‌ ప్రపంచం మహిళలకు తలవొంచి నమస్కరించవలసిన మరొక సందర్భం. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ను కనిపెట్టే తొలి రోజుల్లో ప్రయోగాలు జరిగిందీ మహిళల మీదే, కనిపెట్టాక ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నదీ మహిళలే. టీకాను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించింది మహిళావని. అందుకే వారికి నమస్కరించాలి.   

మార్గరెట్‌ : బ్రిటన్‌
మార్గరెట్‌ కీనన్‌ తీసుకున్నది ఫైజర్‌–బయోన్‌టెక్‌ వ్యాక్సిన్‌. తన తొంభయ్యవ పుట్టినరోజుకు వారం ముందు ఆమె వ్యాక్సిన్‌కు నిస్సంకోచంగా భుజమిచ్చారు. ప్రపంచ ప్రజలకు అభయం ఇవ్వడమే అది. మధ్య ఇంగ్లండ్‌లోని కోవెంట్రీ నగరంలో ఉంటారు ఆమె. బంగారు ఆభరణాల దుకాణంలో కొన్నేళ్ల క్రితం వరకు సహాయకురాలుగా పని చేశారు. కూతురు. కొడుకు. నలుగురు మనవలు, మనవరాళ్లు. నిన్న కొత్త సంవత్సరాన్ని పిల్లలతో, తన స్నేహితులతో సంతోషంగా గడిపారు. డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ తొలి షాట్‌ తీసుకున్న 21 రోజుల తర్వాత గత వారం రెండో ‘బూస్టర్‌ జాబ్‌’ చేయించుకున్నారు మార్గరెట్‌.


శాండ్రా : ఆమెరికా
ఆమెరికా తన తొలి వ్యాక్సిన్‌ని శాండ్రా శారా లిండ్సేకు ఇచ్చింది. శాండ్రా క్రిటికల్‌ కేర్‌ నర్సు. జమైకా–అమెరికా సంతతి యువతి. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న ‘లాంగ్‌ ఐలాండ్‌ జెవిష్‌ మెడికల్‌ సెంటర్‌’లో వైద్య సేవికగా పని చేశారు. కొత్త వ్యాక్సిన్‌ అంటే అందర్లో భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టడానికే శాండ్రా ముందుకొచ్చి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆమె తీసుకున్నదీ ఫైజర్‌ వ్యాక్సిన్‌నే.


పేరు తెలియనివ్వని మహిళ : స్విట్జర్లాండ్‌
ఫొటోలో మీరు చూస్తున్నది పేరు తెలియనివ్వని ఆ మహిళనే. వయసు 90 ఏళ్లు. స్విట్జర్లాండ్‌లో వ్యాక్సిన్‌ వేయించుకున్న తొలి సిటిజెన్‌. స్విస్‌ మిలిటరీ దాదాపుగా పది లక్షల డోస్‌లను దేశమంతటా పంపిణీ చేసింది. ఆ డోస్‌లు మొదట లాసెర్న్, అప్పెన్‌జెల్‌ ఇన్నర్‌ రోడ్స్‌ ప్రాంతాలకు సరఫరా అయ్యాయి. ఆ ప్రాంతంలోని నర్సింగ్, కేర్‌ హోమ్‌లో ఉండేవారికి వ్యాక్సిన్‌ వేసేందుకు వెళ్లిన వైద్య కార్యకర్తలకు ఈ పేరు తెలియనివ్వని మహిళ చిరునవ్వుతో ఎదురెళ్లి మరీ చెయ్యిపట్టారు.


ఎడిత్‌ క్వాయ్‌జెల్లా : జర్మనీ
ఎడిత్‌ వయసు 101 ఏళ్లు. ఆరోగ్యంగా ఉన్నారు. జర్మనీలో అందరికన్నా ముందుగా ఆమే ఉత్సాహంగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు! అదీ ఫైజర్‌ వాళ్లదే. బెర్లిన్‌లోని వృద్ధుల ఆరోగ్య సంరక్షణాలయంలో ఉంటున్నారు ఎడిత్‌. డిసెంబర్‌ 26 అందులోని నలభై మంది వ్యాక్సిన్‌కు ముందుకొస్తే వారందరికన్నా ముందు వేయించుకున్నది ఎడిత్తే. శాక్సోనీ అన్‌హాల్ట్‌లోని హార్జ్‌ పర్వత ప్రాంత సమీపంలో ఉన్న హల్బెర్ట్‌స్టాడ్‌ ఆమె జన్మస్థలం. పది లక్షలకు పైగా వాక్సిన్‌ డోస్‌లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జర్మనీ ప్రభుత్వం వ్యాక్సిన్‌ వేయించడంలో మొదట వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తోంది.


గున్‌–బ్రిట్‌ జాన్సన్‌: స్వీడన్‌
స్వీడన్‌లో తొలి డోస్‌ అందుకున్నవారు గున్‌ బ్రిట్‌. ఆమె వయసు 91 ఏళ్లు. రాజధాని స్టాక్‌హోమ్‌కి, గోథెన్‌బర్గ్‌ నగరానికి మధ్య ఉండే ఎమ్జోల్బీ పట్టణంలోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటారు బ్రిట్‌. ‘‘నాక్కాస్త గొప్పగానే ఉంది. మానవ ప్రయత్నాల మీద నాకసలు సందేహమే రాదు. చక్కగా వ్యాక్సిన్‌ వేయించుకున్నాను కనుక చక్కగా పనిచేస్తుంది’’ అంటున్నారు. అధికారులు ఆమెకు వ్యాక్సిన్‌ వేసిన తర్వాత చెప్పారట.. స్వీడన్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ మొదట తనకే వేసినట్లు! ‘‘ఆశ్చర్యపోయాను’ అని నవ్వుతున్నారు. ఇప్పుడామె తన మనవళ్లు, ముని మనవళ్లను కరోనా బెరుకు లేకుండా కలుసుకో గలుతున్నారట. 2021 జూన్‌ నాటికి దేశంలోని వృద్ధులందరికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే సంకల్ప బలంతో ఉంది స్వీడన్‌ ప్రభుత్వం.

 

మ్యారిసెట్‌: ఫ్రాన్స్‌
పారిస్‌ శివార్లలోని సెవ్రాన్‌ పట్టణంలో ఉన్న రీనీ–మారెట్‌ ఆసుపత్రిలో తొలి వ్యాక్సిన్‌ను 78 ఏళ్ల మ్యారిసెట్‌ తీసుకున్నారు. ‘‘నేను కదిలిపోయాను తెలుసా..!’ అని ఉద్వేగంతో అంటున్నారు మ్యారిసెట్‌. ఫ్రాన్స్‌లో మొదట సెవ్రాన్, డిజాన్‌ ప్రాంతాలలో వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం మొదలైంది. అందరిలో మొదట మ్యారిసెట్‌కే వ్యాక్సిన్‌ అందింది. అందుకే ఆమెకంత భావోద్వేగం. ఈ ప్రారంభ వేడుకను (వేడుకే గా మరి) ట్వీట్‌ చేస్తూ.. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మక్రాన్‌ ‘వైరస్‌ను ఎదుర్కొడానికి మనకు అందివచ్చిన కొత్త ఆయుధం.. వ్యాక్సిన్‌’ అని సంతోషం వ్యక్తం చేశారు.


యానీ లించ్‌: ఐర్లాండ్‌
ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌ కార్యక్రమం 79 ఏళ్ల యానీ లించ్‌తో మొదలైంది. పదిమంది మనవల బామ్మగారు యానీ. కరోనా భయంతో ఇన్నాళ్లూ ఆమె వారికి ఎక్కడ అంటిస్తానోనని దూరంగా ఉన్నారు. సెయింట్‌ జేమ్స్‌ ఆసుపత్రిలో తన కుటుంబ సభ్యులు వెంట రాగా సంబరంగా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు యానీ. ‘‘ఐర్లండ్‌లో తొలి డోస్‌ను వేయించుకున్న వ్యక్తిగా నా పేరు చరిత్రలో నిలిచిపోతుందంటే సంతోషమే కదా..’’ అంటున్నారు. వాస్తవానికి ఆమె తన మనవల్ని దగ్గరకు తీసుకోవడం కోసమే వ్యాక్సిన్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారట.


రష్యాలో తొలి వ్యాక్సిన్‌ పుతిన్‌ కుమార్తె వేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఏ కుమార్తో వెల్లడి కాలేదు. పుతిన్‌కి ఎకతెరీనా పుతీనా, మారియా పుతీనా అనే కుమార్తెలు ఉన్నారు. ప్రయోగాల దశలో కూడా పుతిన్‌ కుమార్తె వాక్సిన్‌ పని తీరు తెలుసుకోవడం కోసం సహకరించారని అన్నారు కానీ ఇద్దరిలో ఎవరన్నది నేటికీ బయటికి పొక్కలేదు. వేయించుకున్నవారికి కొంచెం జ్వరం వచ్చిందనైతే మాత్రం పుతిన్‌ మాటల్లోనే తెలిసింది.                         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement