జీవితం ప్రతి దశలోనూ ఒక అడ్డంకిని సృష్టిస్తుంది. ఆ అడ్డంకిని ఎదుర్కొనే విధానంలోనే విజయమో, అపజయమో ప్రాప్తిస్తుంది. విజయాన్ని సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది మూడు పదుల వయసున్న సంతోషి దేవ్ జీవన పోరాటం. హర్యానా వాసి సంతోషి దేవ్ ఒడిశాలోని కొయిడా మైనింగ్ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే వోల్వో ట్రక్కు నడుపుతోంది. ఈ రంగంలో పురుషులదే ప్రధాన పాత్ర. మరి సంతోషి మైనింగ్‌లో ట్రక్కు డ్రైవర్‌గా ఎలా నియమితురాలైంది?! ముందు ఆమె జీవనం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి.
మలుపు తిప్పిన గృహహింస...
పదహారేళ్ల వయసులో సంతోషి దేవ్‌ని ఒడిశాలోని హడిబంగా పంచాయతీ, బాదముని గ్రామంలోని ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఆ వివాహం ఆమె జీవితాన్ని భయంకరమైన మలుపు తిప్పింది. నిత్యం వరకట్న వేధింపులు, గృహహింసతో బాధాకరంగా రోజులు గడిచేవి. కన్నీటితోనే తన పరిస్థితులను తట్టుకుంటూ కొన్నాళ్లు గడిపింది. అందుకు కారణం తల్లిదండ్రులకు తొమ్మిదిమంది సంతానంలో తను ఆరవ బిడ్డ.
ఎంతటి కష్టాన్నైనా సహనంతో సర్దుకుపొమ్మని పుట్టింటి నుంచి సలహాలు. కొన్నాళ్లు భరించినా, కఠినమైన ఆ పరిస్థితులకు తల వంచడానికి నిరాకరించి, పోరాడాలనే నిర్ణయించుకుంది. తిరిగి పుట్టింటికి వచ్చింది. కానీ, అక్కున చేర్చుకోవాల్సిన కన్నవారి నుంచి అవమానాల్ని ఎదుర్కొంది. అధైర్యపడకుండా, తన సొంత మార్గాన్ని ఎంచుకోవాలనుకుంది. స్కూల్ వయసులోనే డ్రాపౌట్ స్టూడెంట్. తెలిసినవారి ద్వారా స్పిన్నింగ్ మిల్లులో పని చేయడానికి జీవనోపాధి కోసం తమిళనాడుకు వలస వచ్చింది.
కుదిపేసిన పరిస్థితుల నుంచి...
భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందింది. 2021లో క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్్సపోర్ట్ (సిఆర్‌యుటి) నిర్వహిస్తున్న సిటీ బస్ సర్వీస్ అయిన ‘మో’ బస్‌కు డ్రైవర్‌గా నియమితురాలైంది. ఒడిశాలో ఒంటరి మహిళా బస్సు డ్రైవర్‌గా మహిళా సాధికారతని చాటింది. అయితే ఆశ్చర్యకరంగా, ఆమె విజయగాథ అక్కడి నుంచి తొలగింపుతో ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ‘తొలి మహిళా బస్సు డ్రైవర్ కావడంతో స్థానిక మీడియా నన్ను హైలైట్ చేసింది.
ఒక నెల తరువాత, అధికారులు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. నా తప్పు ఏమిటో అర్థం కాలేదు. కానీ, మళ్ళీ జీవితం నన్ను పరీక్షించిందని అర్ధమైంది. దీంతో బతకడానికి మళ్లీ ఆటో రిక్షా డ్రైవింగ్‌కు వచ్చేశాను’ అని తన జీవిత ప్రస్థానాన్ని వివరించింది సంతోషి. ఆరు నెలల క్రితం ఓ మైనింగ్ కంపెనీ సంతోషి పట్టుదల, ధైర్యాన్ని గుర్తించింది. వోల్వో ట్రక్కును నడపడానికి ఆఫర్ చేసింది. ‘ఏ కల కూడా సాధించలేనంత పెద్దది కాదు. ఆరు నెలల నుంచి నెలకు రూ.22,000 జీతం పొందుతున్నాను’ అని గర్వంగా చెబుతోంది ఈ పోరాట యోధురాలు.
జీవనోపాధిని వెతుక్కుంటూ...
‘‘మా అత్తింటిని విడిచిపెట్టిన నాటికే గర్భవతిని. కొన్ని రోజులకు తమిళనాడులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడే 2012లో కూతురు పుట్టింది. మూడేళ్లు నా తోటి వారి సాయం తీసుకుంటూ, కూతురిని పెంచాను. ఆమెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రతి పైసా పొదుపు చేశాను. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు చెన్నైలో ఆటో రిక్షా నడుపుతున్న ఓ మహిళను చూశాను.
‘ఆమెలా డ్రైవింగ్ చేయలేనా?‘ అని ఆలోచించాను. నా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు మొత్తం, చిన్న రుణంతో ఆటో రిక్షా కొనుక్కుని ఒడిశాలోని కియోంజర్‌కి వచ్చేశాను. నా కూతురుకి మంచి భవిష్యత్తును అందించడానికి ఆమెను హాస్టల్ వసతి ఉన్న స్కూల్లో చేర్పించాను. ఒడిశాలోని అనేక మంది ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకున్నాను’ అని వివరించే సంతోషి ఆశయాలు అక్కడితో ఆగలేదు.
Comments
Please login to add a commentAdd a comment