ఆటో అక్క | Tamil Nadu Auto Driver Rajeshwari Special Story | Sakshi
Sakshi News home page

ఆటో అక్క

Published Mon, Aug 19 2019 7:28 AM | Last Updated on Mon, Aug 19 2019 7:28 AM

Tamil Nadu Auto Driver Rajeshwari Special Story - Sakshi

రాజేశ్వరి

నేనాటోవాణ్ని... న్యాయమైన రేటువాణ్ని’ అన్నాడు బాషా సినిమాలో రజనీకాంత్‌.‘రాజీ లేని పోరాటం నాది... న్యాయమైన విజయం నాది’ అంటోంది చెన్నై రాజేశ్వరి.రాజీ లేని పోరాటం చేయడం వల్లనే రాజేశ్వరి...రాజీ అక్క అయింది.ఆటో అక్కగా... ఆటో రాజీగా పలువురికి రోల్‌ మోడల్‌గా మారింది.

జీవితంలో అనేక ప్రశ్నలుంటాయి. అడుగడుగునా ఒక ప్రశ్నార్థకం ఎదురవుతూనే ఉంటుంది. ప్రతి ప్రశ్నార్థకానికీ ఓ సమాధానం తప్పకుండా ఉండి తీరుతుంది. అయితే ఆ సమాధానం ఏంటో... ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. సమాధానం కోసం శోధన జరగాలి, అంతకంటే పెద్ద పరిశ్రమ జరగాలి. సమాధానాన్ని వెతికి పట్టుకోగలిగిన వాళ్లకు... విజయం కళ్ల ఎదుట ఆవిష్కారమవుతుంది.

రాత్రి తొమ్మిది గంటలకు చెన్నైలో ఓ ప్రైవేట్‌ కంపెనీ నుంచి ఒక ఆటో బయలుదేరింది. ఆ ఆటో నంబరు TN 01, AE 5608. అడయార్‌లో ఇంటి ముందు ఆటో దిగిన యువతి మీటరు లెక్క చూసి డబ్బిచ్చింది. ఆటో నడుపుతున్న మహిళ చిల్లర తిరిగి ఇస్తూ... ఆటో దిగిన యువతికి తన ఫోన్‌ నంబరు చెప్పింది. ‘‘రాత్రంతా డ్యూటీలోనే ఉంటాను. ఎప్పుడు అవసరమైనా ఫోన్‌ చేయండి. మిమ్మల్ని క్షేమంగా గమ్యం చేరుస్తాను. అయితే ఓ గంట ముందుగా ఫోన్‌ చేస్తే మీరున్న చోటుకి వచ్చి పికప్‌ చేసుకోగలుగుతాను’’ అని కూడా చెప్పింది. ‘‘అంటే ఆఫీస్‌లో లేట్‌ అయినప్పుడు ఫోన్‌ చేస్తే వచ్చి పికప్‌ చేసుకుంటారా’’ అని అడిగిందామె ఆటో మహిళను. అవునన్నట్లు ఆమె తలూపుతూ... మాటల్లో ఉండగానే ఆటో నడుపుతున్న మహిళ ఫోన్‌ మోగింది. ‘‘ఎయిర్‌ పోర్ట్‌ డ్రాపా? మీరెక్కడున్నారు’’ అని అడుగుతూ ఆటో రివర్స్‌ చేసుకుందామె. ఆమె పేరు రాజేశ్వరి. చెన్నై వాసులకు ఆమె ‘ఆటో రాజీ, రాజీ అక్క, ఆటో అక్క’గా పరిచయం.

కోయంబత్తూరు గాయం
రాజేశ్వరిది కేరళలోని పాలక్కాడ్‌. బి.ఎ ఫిలాసఫీ చేసింది. పాలక్కాడ్‌లో బి.ఎ చదువుతున్నప్పుడే ఆమెకి అశోక్‌ పరిచయమయ్యాడు. అశోక్‌ ఆటో నడుపుతాడు. వాళ్ల ప్రేమ పెళ్లి పీటలెక్కింది. ప్రేమ నుంచి పెళ్లి వరకు సమాజం నుంచి ఎదురైన సమస్యలు, పెళ్లి తర్వాత జీవితం చూపించిన కష్టాలను చెప్పడం మొదలుపెడితే రోజంతా చెప్పినా పూర్తి కావు. కానీ వాటిని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరామె. ‘‘మా జీవిత ప్రస్థానాన్ని కోయంబత్తూర్‌లో మొదలుపెట్టాం’’ అని మాత్రమే చెప్తుంటారు. పెళ్లి తర్వాత కోయంబత్తూరులో ఒక ట్రావెల్‌ ఏజెన్సీలో అకౌంటెంట్‌గా ఉద్యోగంలో చేరారు రాజేశ్వరి. ఆమె ఉద్యోగం, అశోక్‌ ఆటో రాబడితో బతుకు బండి గాడిన పడింది అనుకునే లోపే ఊహించని ఉత్పాతం బాంబు పేలుడు రూపంలో ఎదురైంది. కోయంబత్తూరులో 1998, ఫిబ్రవరి 14వ తేదీన... ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ మీటింగ్‌ ఉందా రోజు. అద్వానీని లక్ష్యంగా చేసుకున్న దుండగులు నగరంలో పదకొండు ప్రదేశాల్లో బాంబులు పేల్చారు. మొత్తం పన్నెండు బాంబులు. ఆ పేలుళ్లలో 58 మంది మరణించగా, రెండు వందలకు పైగా అమాయకులు గాయాలపాలయ్యారు. బాంబు పేలుళ్ల కారణంగా గాయాలపాలైన బాధితుల్లో రాజీ దంపతులు కూడా ఉన్నారు. ఆ దుర్ఘటన తర్వాత రాజేశ్వరి దంపతులకు కోయంబత్తూరులో నివసించడం కష్టమైంది. రాజేశ్వరి సోదరుడు చెన్నైలో రైల్వే ఉద్యోగి. అతడి అండతో రాజేశ్వరి కుటుంబం చెన్నైకి చేరింది.

సాధికారత సాధన కార్యక్రమంలో  ప్రసంగిస్తున్న రాజేశ్వరి
చెన్నైలో జీవన పోరాటం
రాజేశ్వరి దంపతులకు కోయంబత్తూరు చేసిన బాంబు గాయాలైతే మానాయి. కానీ చెన్నైలో ఉద్యోగం గగనకుసుమమైంది. ఆమె చేతిలో ఉన్న డిగ్రీ, ఉద్యోగంలో ఉన్న అనుభవం ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇంటర్వ్యూలకు వెళ్లడం, తిరిగి రావడం రొటీన్‌ అయింది. ఇంటర్వ్యూల్లో ఫెయిల్‌ కావడం అంటే జీవితంలో ఫెయిల్‌ కావడమేనా? కాదు, జీవితంలో విజయం సాధించడానికి ఓ దారి ఉండే ఉంటుంది. జీవన ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలదొక్కుకోవాలంటే ఇంటర్వ్యూలో గెలిచి ఉద్యోగం సంపాదించుకోవడం ఒక్కటే కాదు, తనకు తానే ఓ ఉపాధిని వెతుక్కోవాలని కూడా అనుకుంది. ఆమెకు బాగా పరిచయం ఉన్న స్వయం ఉపాధి మార్గం ఆటో నడపడం ఒక్కటే. కోయంబత్తూరులో సరదాగా నేర్చుకున్న డ్రైవింగ్‌తోనే చెన్నైలో జీవించాలి అనుకుందామె. ‘నేను సొంత ఆటో కొనుక్కునే వరకు ఈ ఆటోను పగలు నువ్వు నడుపు, రాత్రి నేను నడుపుతాను’ అన్నదామె భర్త అశోక్‌తో. ఆమె ఈ మాట అన్నది ఇరవై ఏళ్ల కిందట. ఈ మాట అన్నప్పటికి ఆమెకు ఇరవై ఎనిమిదేళ్లు.

నగరాన్ని చదివింది
కోయంబత్తూరులో ఆటో నడపడం... చెన్నైలో ఆటో నడపడం ఒకటి కాదు. చెన్నై ట్రాఫిక్‌ వలయం ఒక ఎత్తయితే, నగరంలో రూట్‌లు తెలుసుకోవడం మరో ఎత్తు. ఇప్పుడున్నట్లు జీపీఎస్‌ ఉన్న రోజులు కావవి. మ్యాప్‌ ఎదురుగా పెట్టుకుని నగరంలో అన్ని ప్రదేశాలనూ తెలుసుకుంది. ఆటోలో తిరుగుతూ దూరాలను తెలుసుకుంది. ఇప్పుడు రాజేశ్వరికి ఒక అడ్రస్‌ చెబితే రూట్‌ మ్యాప్‌ ఆన్‌ చేయాల్సిన అవసరమే లేదు. మ్యాప్‌ ఆమె మైండ్‌లోనే ఉంటుంది. ఆమె రైడ్‌ ముగించుకుని వెళ్తున్నప్పుడు లేదా ఫోన్‌ కాల్‌ అందుకుని పికప్‌ కోసం వెళ్తున్నప్పుడు... రోడ్డు మీద బస్‌ కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలు, ముసలి వాళ్లు కనిపిస్తే వాళ్లను ఆటోలో ఎక్కించుకుంటుంది రాజేశ్వరి. ‘‘హోటళ్లు, రెస్టారెంట్‌లు, షాపింగ్‌ మాల్స్‌లో పని చేసే వాళ్లకు డ్యూటీ తొమ్మిది– పది గంటల వరకు ఉంటుంది. వాళ్లలో ఎక్కువ మందికి అరకొర జీతాలే తప్ప ఆటోల్లో ఇళ్లకు వెళ్లగలిగిన జీతాలుండవు. ఆ టైమ్‌లో రోడ్డు మీద ఎప్పుడో వచ్చే బస్‌ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను ఆ టైమ్‌లో అలా చూసి ఏమీ పట్టనట్లు వెళ్లిపోలేను. అందుకే వాళ్లను ఆటో ఎక్కించుకుని నేను వెళ్లే రూట్‌లో వాళ్లకు అనువైన చోట దించుతాను. అదేమీ పెద్ద సామాజిక సేవ కాదు. నేను చేయగలిగిన చిన్న సహాయం’’ అన్నారామె.

అక్క ఉంది అండగా
ఆడవాళ్ల మీద జరుగుతున్న అత్యాచారాలు చూసిన తర్వాత రాత్రి పూట ఆటో నడపాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు రాజేశ్వరి. ‘‘రాత్రి ఎనిమిది నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తూనే ఉంటాయి. మహిళలు ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మగవాళ్లు నడిపే క్యాబ్‌లు, ఆటోలంటే కొంచెం సందేహిస్తారు. జరుగుతున్న అత్యాచారాలు కూడా అలాగే ఉంటున్నాయి మరి. అందుకే అవకాశం ఉంటే మహిళ నడిపే ఆటోలు, క్యాబ్‌లకే ప్రాధాన్యం ఇస్తారు. నేను మహిళలకు ఆ చాయిస్‌ ఇవ్వగలుగుతున్నాను. అలాగే ఈ సర్వీస్‌ నా జీవితానికి కూడా భరోసానిస్తోంది. రోజుకు 30 ట్రిప్పులు నడుపుతున్నాను. నెలకు ముప్పై నుంచి నలభై వేలు సంపాదిస్తున్నాను. నాకు ఇరవై ఏళ్ల కిందట చెన్నైలో ఏ ప్రైవేట్‌ కంపెనీలోనో ఉద్యోగం దొరికినా, నెలకింత డబ్బుని ఇంటికి తీసుకెళ్లగలిగేదాని కాదు’’ అని మోటివేషనల్‌ క్లాస్‌లలో చెప్తోంది రాజేశ్వరి. ఇప్పటికి 13 కాలేజీల్లో లెక్చర్‌ ఇచ్చారామె. తల్లిదండ్రులు అన్నీ అమర్చి చదివిస్తున్న రోజుల విలువను తెలుసుకోవాలని చెబుతారామె. పరీక్షల్లో మార్కులు తక్కువ రావడం, ఫెయిల్‌ కావడం, లవ్‌ ఫెయిల్‌ కావడం వంటి వాటిని భూతద్దంలో చూసుకుని ఆందోళన చెందడమంత హాస్యాస్పదమైన విషయాలు మరేవీ ఉండవని కూడా విద్యార్థులకు చెబుతారామె. విద్యార్థి దశలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలనే పెద్ద సమస్యలుగా భావించి జీవితాలను అంతం చేసుకోవడం అర్థరహితం అని కూడా విద్యార్థులను హెచ్చరిస్తారు రాజేశ్వరి. కాలేజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్లు సొంత నడక మొదలు పెట్టాల్సిందేనని, జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా ఉండదని కూడా చెప్తుంటారు రాజేశ్వరి.

బతుకు దారి రహదారి కాదు
‘‘నా జీవితంలో లెక్కలేనన్ని ఎగుడుదిగుళ్లు ఎదురయ్యాయి. ఏ దశలోనూ వెనుకడుగు వేయలేదు. చెన్నై రోడ్ల మీద, ఆ ట్రాఫిక్‌లో బండి నడపడానికి మించిన క్లిష్టమైన సమస్య మరేదీ ఉండదు. జీవితంలో వచ్చే కష్టాలన్నీ అంతకంటే చిన్నవే అని కూడా అనిపించింది. ఆటో నడుపుతూ చిన్న చిన్న యాక్సిడెంట్‌లు కూడా చేశాను. యాక్సిడెంట్‌ అవుతుందేమోనని ప్రయాణాన్ని ఆపకూడదు, బండి నడపడమూ ఆపకూడదు. సరిగ్గా అలాగే జీవిత ప్రస్థానంలో ఎన్ని అవాంతారాలెదురైనా ప్రయాణాన్ని కొనసాగించాల్సిందే.

ప్రత్యర్థి కనిపించని యుద్ధరంగం
‘‘జీవితం ఓ యుద్ధరంగం. ప్రత్యర్థి కనిపించని యుద్ధరంగం ఇది. ఈ యుద్ధరంగంలో మనం సైనికులం. పోరాడుతూనే ఉండాలి. పోరాటంలో ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యాన్ని కోల్పోతే కింద పడిపోతాం. ఒకసారి కిందపడితే మళ్లీ లేచి తిరిగి పోరాడడానికి మరింత శక్తియుక్తులు కావాలి. అందుకే మనం కింద పడకుండా ఉండడానికి నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఆ పోరాటం... జీవితంతో పోరాటం, జీవితంలో పోరాటం. విజయాల అంచులకు తీసుకెళ్లే పోరాటం కూడా అదే. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ’’ అని జీవిత విజయ సూత్రాన్ని వివరించారు రాజేశ్వరి. డ్రైవింగ్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోవాలనుకునే అమ్మాయిలకు ఆమె ట్రైనింగ్‌ ఇస్తున్నారు. సమాజంలో ఆడవాళ్ల భద్రత బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఆ భద్రత బాధ్యతను ఆడవాళ్లు కూడా కొంత పంచుకుంటే అనేక అనర్థాలు తలెత్తకుండానే సమసిపోతాయంటారు రాజేశ్వరి. అంతటి బాధ్యతతో ఆలోచించడం వల్లనే ఆమె చెన్నై వాసులకు ‘రాజీ అక్క’ అయ్యారు.– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement