ఉత్తమ చిత్రం గ్రీన్‌బుక్‌ | Green Book wins best picture at Oscars | Sakshi
Sakshi News home page

ఉత్తమ చిత్రం గ్రీన్‌బుక్‌

Published Tue, Feb 26 2019 3:44 AM | Last Updated on Tue, Feb 26 2019 5:30 AM

Green Book wins best picture at Oscars - Sakshi

బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డుతో గయ్‌ నటివ్‌ దంపతులు, బెస్ట్‌ డైరెక్టర్, బెస్ట్‌ ఫారెన్‌ ఫిల్మ్, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ అవార్డులతో కారన్‌

లాస్‌ ఏంజిలస్‌: 2019 ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డును ‘గ్రీన్‌బుక్‌’ దక్కించుకుంది. శ్వేత,నల్ల జాతీయుల మధ్య స్నేహబంధానికి దర్పణంగా నిలిచే ఒక వ్యక్తి జీవిత చరిత్రే గ్రీన్‌బుక్‌ చిత్రం. రోమా చిత్ర దర్శకుడు అల్ఫాన్సో కారన్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించగా, ద ఫేవరెట్‌ సినిమాలో నటించిన ఒలివియా కామన్‌ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. బొహెయిమెన్‌ రాప్సోడీ చిత్రంలో అస్థాన విద్వాంసుడు ఫ్రెడీ మెర్క్యురీ పాత్రలో నటించిన రామి మలేక్‌ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు.

ఆదివారం సాయంత్రం లాస్‌ ఏంజిలస్‌లో అట్టహాసంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. వ్యాఖ్యాత లేకుండా ఈ ఉత్సవం జరగడం విశేషం. 1989 తర్వాత వ్యాఖ్యాత లేకుండా ఆస్కార్‌ అవార్డుల ఉత్సవం జరగడం ఇది రెండో సారి. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఘటనపై ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’పేరుతో తీసిన డాక్యుమెంటరీ ఆస్కార్‌ అవార్డు పొందింది. ఒక నల్లజాతి విద్యాంసుడు అతని దగ్గర కారు డ్రైవరుగా పనిచేసే శ్వేత జాతీయుడి మధ్య సంబంధమే ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఎంపికయిన గ్రీన్‌ బుక్‌ కథాంశం.

గ్రీన్‌బుక్‌ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు(మహేర్షల అలీ), ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే అవార్డులు కూడా లభించాయి. ఉత్తమ నటి రేసులో ముందున్న గ్లెన్‌ క్లోజ్‌(ద వైఫ్‌)ను పక్కకు నెట్టి ద ఫేవరెట్‌ చిత్రంలో నటించిన కాల్మన్‌ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కాల్మన్‌ నిగ్రహం కల రాణి అన్నెగా నటించారు.  ఈ సారి అవార్డులు వేర్వేరు సినిమాలకు వచ్చాయి. బొహెమియన్‌ రాప్సోడీ చిత్రానికి ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్, ఉత్తమ మిక్సింగ్‌ అవార్డులు సహా మొత్తం నాలుగు అవార్డులు లభించాయి.

కారన్‌కు ఒకే ఏడాది 4 నామినేషన్లు
రోమా సినిమా ఉత్తమ చిత్రం అవార్డును పొగొట్టుకున్నా ఇతర కేటగిరీలో ఉత్తమ పురస్కారాలు అందుకుంది. చిత్ర దర్శకుడు కారన్‌ ఉత్తమ దర్శకుడి అవార్డు పొందారు. విదేశీ భాషా చిత్రం కేటగిరీ, సినిమాటోగ్రఫీ కేటగిరీలో కూడా ఈయన ప్రతిభకు పురస్కారాలు లభించాయి. ఒకే సంవత్సరంలో నాలుగు నామినేషన్లు పొందిన మొట్టమొదటి వ్యక్తి కారన్‌.

భారతీయ ఫ్రెడ్డీ
భారతీయ మూలాలున్న వ్యక్తికి సంబంధించిన పాత్ర పోషించిన నటుడికి కూడా 91వ ఆస్కార్‌ అవార్డుల్లో ఓ పురస్కారం దక్కింది. బొహెమియన్‌ రాప్సోడీ చిత్రంలో ఫ్రెడ్డీ మెర్కూరీ పాత్రలో నటించినందుకు ఉత్తమ నటుడి అవార్డుకు రామి మలేక్‌ ఎంపికయ్యారు. ఆ చిత్రం ఫ్రెడ్డీ మెర్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కిందే. ఇంతకీ ఈ ఫ్రెడ్డీ మెర్క్యూరీ ఎవరని అనుకుంటున్నారా? ఈయన తన చిన్న తనాన్ని మహారాష్ట్రంలోని పంచగని పట్టణంలో గడిపారు. అక్కడే పాఠశాల విద్యనభ్యసించారు. సంగీత రంగంలో కూడా ప్రవేశించారు.

టాంజానియాలోని జంజీబర్‌లో పార్సీ కుటుంబంలో 1946లో మెర్క్యూరీ జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. పంచగనిలోని సెయింట్‌ పీటర్స్‌ స్కూల్‌లో మెర్యూరీ చదువుకుంటూనే హెక్టిక్స్‌ అనే రాక్‌బ్యాండ్‌లోనూ అలరించాడు. శాస్త్రీయ సంగీత పాఠాలు నేర్పాలని ఆ స్కూల్లోని గురువులు ప్రయత్నించినా మెర్క్యూరీ ర్యాప్‌ మ్యూజిక్‌ పైనే ఆసక్తి చూపాడు. తర్వాత 1960ల్లో ఆయన తన తల్లిదండ్రులతో కలిసి బ్రిటన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement