సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికా లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అకాడమీ అవార్డ్స్ వేడుకలను హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాల్గవ సారి హోస్ట్ చేయనున్నారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారతీయులకు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. తాజాగా ఈ ఈవెంట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.
భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలతో వీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది అవార్డులకు కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఓపెన్‌హైమర్, బార్బీ, మాస్ట్రో, పూర్ థింగ్స్, అమెరికన్ ఫిక్షన్ వంటి లాంటి పోటీ పడుతున్నాయి.
ఇండియా నుంచి పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’
ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే.
గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment