మల్టీ టాలెంట్
‘అపర్ణ మేడం పాఠం ఒక్కసారి వింటే ప్రతి చెట్టు, ప్రతి పువ్వుతో స్నేహం చేయాలనిపిస్తుంది’
‘అపర్ణ స్వరపరిచిన పాటలు వింటే అద్భుతం అనిపిస్తుంది’
‘అపర్ణ వినిపించే వీణ స్వరాలు అపురూపం’
‘అపర్ణ రాసిన పుస్తకాలు శాస్త్రీయ విషయాలను సైతం చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి’... ఇలాంటి కామెంట్స్
అపర్ణ గురించి తరచుగా వినిపిస్తుంటాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే డా. అపర్ణ బుజర్ బారువా బహుముఖ ప్రజ్ఞాశాలి. విశ్రాంత జీవితానికి కొత్త అర్థం ఇచ్చిన ప్రతిభావంతురాలు. కోల్‌కతాలో జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె తీసిన ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్‌రూప్’ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకుంది...
సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే అస్సాంలోని తేజ్‌పూర్‌లో పుట్టిపెరిగింది అపర్ణ. గువహటిలోని కాటన్ కాలేజీలో బాటనీ లెక్చరర్‌గా తన ఉద్యోగప్రస్థానాన్ని 1969లో ప్రారంభించిన అపర్ణ ఒకవైపు విద్యార్థులకు బాటనీ పాఠాలు బోధిస్తూనే మరోవైపు విద్యార్థిగా మ్యూజిక్ కాలేజీలో చేరి సంగీత పాఠాలు నేర్చుకునేది. సంగీత విద్యాపీuŠ‡ నుంచి సితార్‌లో విశారద్ డిగ్రీ పొందింది.
ఎంతోమంది కవుల పాటలకు స్వరాలు సమకూర్చింది. ఆ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమై ఆదరణ పొందాయి. వందపాటలకు పైగా స్వరాలు అందించిన అపర్ణ ఏఐఆర్ గువహటి ఫస్ట్ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అరుదైన ఘనతను దక్కించుకుంది.
2003లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ హోదాలో పదవీ విరమణ చేసిన అపర్ణ ‘ఇది విశ్రాంతి సమయం’ అనుకోలేదు. ‘ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చాలా సమయం దొరికింది’ అనుకుంది. తన సాంస్కృతిక మూలాలను వెదుక్కుంటూ వెళ్లింది. కొత్త సంగీత ధోరణులను అధ్యయనం చేసింది. సంస్కృతి, సాహిత్యం, శాస్త్రీయ రంగాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రాసింది.
గువహటిలోని గీతానగర్‌లో తన భర్త నాగేంద్రనాథ్ బుజర్ బారువా పేరు మీద చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసింది.
కాలంతో పాటు నడుస్తూ షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీయడం నేర్చుకుంది.
26 నిమిషాల నిడివి ఉన్న ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్‌రూప్’ డాక్యుమెంటరీ అపర్ణకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. ‘దూలియ సంస్కృతి గత, వర్తమానాలకు అద్దం పట్టేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించాను. దూలియా లాంటి ప్రత్యేక సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ.
దూలియ అనేది పురాతన కళారూపం. దూలియ సంస్కృతి వైభవం గాయకుల పాటల్లో, ఆటల్లో, తోలుబొమ్మలాటలో కనిపిస్తుంది. గానం, నటన, హాస్యప్రదర్శన, డప్పులు వాయించడం... ఎన్నో కళల సమాహారంగా దూలియ సంస్కృతి ఉండేది. ఈ పురాతన కళారూపం గురించి ఊరూవాడా తిరిగి లోతైన పరిశోధన చేసింది అపర్ణ. తాను తెలుసుకున్న విషయాలకు డాక్యుమెంటరీ రూపాన్ని ఇచ్చింది. దూలియ సంస్కృతికి తన జీవితాన్ని అంకితం చేసిన డ్రమ్మర్, నటుడు మోహన్ చంద్ బర్మన్ కృషిని ఈ డాక్యుమెంటరీ హైలెట్ చేస్తుంది.
దూలియ సంస్కృతిపై అపర్ణకు ఆసక్తి, అనురక్తి ఎలా పెరిగింది అనే విషయానికి వస్తే....
కొన్ని సంవత్సరాల క్రితం గువహటిలోని గీతానగర్ రాస్ ఫెస్టివల్‌లో కామ్‌రూపియా ప్రదర్శనను ప్రారంభించడానికి అపర్ణను ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ ప్రదర్శను చూసి అపర్ణ మంత్రముగ్ధురాలైంది. ఈ ఆనందం ఒక కోణం అయితే కళాకారుల ఆర్థిక కష్టాలు తెలుసుకొని బాధ పడడం మరో కోణం. ఇక ఆరోజు నుంచి కామ్‌రూప్ కళాకారుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని తపించి పోయింది. ఈ గొప్ప కళారూపాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తే, సహాయం చేసే ద్వారాలు తెరుచుకుంటాయని నిర్ణయించుకొని తన నిర్మాణ, దర్శకత్వంలో
డాక్యుమెంటరీ ప్రారంభించింది.
ఏ లక్ష్యంతో అయితే ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి అపర్ణ పూనుకుందో అది నెరవేరే సమయం వేగవంతం అయింది. దూలియ సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ పురాతన కళారూపాన్ని తమ భుజాల మీద మోస్తున్న అరుదైన కళాకారులకు సహాయం అందడమే ఇక తరువాయి. ఏ పని మొదలుపెట్టినా ‘అంతా మంచే జరుగుతుంది’ అనుకోవడం అపర్ణ సెంటిమెంట్. కళాకారులకు సహాయం అందే విషయంలో కూడా ఆమె సెంటిమెంట్ నెరవేరాలని ఆశిద్దాం.
నా వయసు జస్ట్ 78 ప్లస్
బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకోవడానికి వేదికపైకి వచ్చినప్పుడు యాంకర్ నన్ను ఆశ్చర్యంగా చూసి ‘మీ వయసు ఎంత?’ అని అడిగారు. 78 ప్లస్ అని చెప్పగానే ‘మీరు నిజంగా ఈ తరానికి స్ఫూర్తి’ అన్నారు. ఇది విని ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లను కూడా నాకు వచ్చిన అపురూపమైన అవార్డ్‌గానే భావిస్తున్నాను. మొదటి డాక్యుమెంటరీకే నాకు పెద్ద పేరు రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
– డా.అపర్ణ బుజర్ బారువా
Comments
Please login to add a commentAdd a comment