సాక్షి, అమరావతి: మోసాలు, వేధింపులకు పాల్పడే లోన్‌యాప్ కంపెనీలు, వాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా విధి విధానాలను రూపొందించినట్లు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని లోన్‌యాప్‌ల డెవలపర్లు, వాటితో ఒప్పందం చేసుకునే గూగుల్ ప్లే స్టోర్స్, యాప్ స్టోర్స్ వంటి కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లుగా ఉండే టెలికాం కంపెనీలు, యాప్‌ల ఖాతాలను నిర్వహించే బ్యాంకులపైన కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
డీజీపీ శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే పోలీసు శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయిలో బ్యాంకు అధికారులతో సమావేశమై కొత్త విధివిధానాలను వివరించిందని తెలిపారు. విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న నకిలీ లోన్ యాప్ ముఠాలు ఇక్కడ ఏజంట్లను నియమించుకుని మోసాలకు పాల్పడుతున్నాయన్నారు. అందుకోసం ఎక్కడో ఉన్నవారి పేరున మన రాష్ట్రంలో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. అటువంటి ఖాతాలను నిశితంగా పరిశీలించాలని, ఒక్కసారిగా భారీగా నగదు జమ అయ్యే ఖాతాలను వెంటనే జప్తు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే
బ్యాంకులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో మోసాలకు పాల్పడే లోన్ యాప్ కంపెనీలపై ఇప్పటికే 75 కేసులు నమోదు చేసి, 71 మందిని అరెస్టు చేశామని, బ్యాంకు ఖాతాల్లోని రూ.10.50 కోట్లు జప్తు చేశామని వెల్లడించారు. మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించిన 230 కంపెనీల్లో 170 కంపెనీలను బ్లాక్ చేయించామని చెప్పారు. చైనా తదితర దేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడే వారిపై చర్యల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇంటర్‌పోల్ వంటి సంస్థల సహకారం తీసుకుంటామన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లోన్‌యాప్ మోసాలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని చెప్పారు. మోసాలు, వేధింపులు ఎదుర్కొనే వారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణం సహకరిస్తారని చెప్పారు. బెదిరింపులు, ఫొటో మార్ఫింగులకు భయపడి ఆత్మహత్య యత్నాలు వంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
లంచగొండి సీఐ, ఎస్సై అరెస్ట్
హత్య కేసులో నిందితుల జాబితాలో పేర్లు చేర్చకుండా ఉండేందుకు లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో కృష్ణా జిల్లా పమిడిముక్కల సీఐగా చేసిన ఎం.ముక్తేశ్వరరావు, తోట్లవల్లూరు ఎస్సైగా చేసిన వై.అర్జున్‌లను శుక్రవారం అరెస్టు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వారిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.
డీజీపీ తెలిపిన ప్రకారం ఈ కేసు వివరాలు
తోట్లవల్లూరుకు చెందిన గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, మిథునలను పోలీసులు ఈ ఏడాది జులై 26న అరెస్టు చేశారు. ఈ కేసులో శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు సీఐ ముక్తేశ్వరరావు రూ.15 లక్షలు, ఎస్సై అర్జున్ రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి బంధువు జొన్నల నరేంద్రరెడ్డి ద్వారా వ్యవహారం నడిపారు. శ్రీకాంత్ రెడ్డి తల్లిదండ్రులు నరేంద్రరెడ్డికి రూ.19.36 లక్షలు ఇచ్చారు.
ఇందులో నుంచి నరేంద్రరెడ్డి సీఐ ముక్తేశ్వరరావుకు రూ.12.50 లక్షలు, ఎస్సై అర్జున్‌కు రూ.1.50 లక్షలు ఇచ్చారు. ఈ విషయం శ్రీకాంత్‌రెడ్డి బంధువు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి తెలిసింది. పోలీసుల పేరు చెప్పి నరేంద్రరెడ్డి ఎక్కువ తీసుకున్నారని ఆయన శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో నరేంద్రరెడ్డి ఆగ్రహించి శ్రీనివాసరెడ్డిని హత్య చేశాడు. ఈ కేసులో ఆత్కూరు పోలీసులు నరేంద్రరెడ్డిని విచారించడంతో సీఐ, ఎస్సైల అవినీతి కూడా బయటపడింది. దాంతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సీఐ, ఎస్సైపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. వారు లంచం తీసుకున్నట్టుగా విచారణలో వెల్లడైంది. దాంతో వారిద్దరినీ అరెస్టు చేశామని, విధుల నుంచి తొలగిస్తామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment