పట్టాదారు పుస్తకాలకు మంగళం
టైటిల్ డీడ్స్ కూడా రద్దు
ప్రజల సెంటిమెంట్‌పై బాబు దెబ్బ
చెదిరిపోనున్న ఎన్టీఆర్ తెచ్చిన పాసుపుస్తకాలు
‘మీభూమి’ పోర్టల్ వివరాల ఆధారంగానే రుణాలు
రెవెన్యూ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రైతులు తమ సర్వ హక్కుగా భావించే పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్‌లను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వీటిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు వాటిని రద్దు చేస్తున్నారు. ఈ విషయాన్ని ‘పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు’ శీర్షికతో 2015 మే 31నే ‘సాక్షి’ కథనం ప్రచురించింది. తాజాగా సోమవారం రెవెన్యూ అధికారులతో సమావేశమైన చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో రైతులకు సెంటిమెంట్‌పై దెబ్బపడినట్లయింది.వీటిస్థానంలో ‘మీభూమి’ పోర్టల్‌లో భూములు, యాజమాన్య హక్కుల వివరాలు పొందుపరుస్తారని, వాటి ఆధారంగానే బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సమీక్షలో చంద్రబాబు చెప్పారు. భవిష్యత్‌లో ఆదాయ, నివాస, జనన ధ్రువీకరణ పత్రాలన్నిటినీ ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు.
మూడు కేటగిరీలుగా విభజన
రేషన్ కార్డులను మూడు కేటగిరీలుగా చేయాలని సీఎం సూచించారు. ఇందులో బీపీఎల్ (బిలో పావర్టీ లైన్), ఏపీఎల్ (అబౌ పావర్టీ లైన్), ట్యాక్స్ పేయర్స్ కేటగిరీలుగా ఆదాయ వర్గాల విభజన చేస్తారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి, ఆ తర్వాతే నిర్ణయించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో త్వరలో సోషియో ఎకనమిక్ డేటా నమోదు కార్యక్రమం జరగనుందని, దీని ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడానికి వీలవుతుందన్నారు.
ఉద్యోగులకు ట్యాబ్‌లు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ట్యాబ్‌లెట్‌లు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు. వీఆర్‌ఓలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పంచాయితీ కార్యదర్శులు, వ్యవసాయాధికారులు, హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు తదితరులకు ట్యాబ్‌లు అందజేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అనుమతి లేని భూముల్లో ఇల్లు నిర్మించుకున్న పేదవర్గాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. రెవెన్యూ సర్వే అకాడమీ ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరుతో పాటు, కొత్తగా 82 మంది కంప్యూటర్ ఆపరేటర్ల నియామకానికి సీఎం అంగీకరించారు. ల్యాండ్ సర్వే కోసం రూ.20 కోట్లతో ఎలక్ట్రానిక్ టోటల్ సిస్టం మెషీన్లను కొనుగోలు చేసి, డిజిటల్ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి, సీసీఎల్‌ఏ అనిల్‌కుమార్ పునీటా, ఐటీ అడ్వైజర్ జె.సత్యనారాయణ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ, ఐటీ కార్యదర్శి శ్రీధర్, రిజిస్ట్రేషన్స్ ఐజీ వెంకటరామిరెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ స్టార్టప్ మ్యాప్‌లో విశాఖ..
కొచ్చి స్టార్టప్ విలేజి చైర్మన్‌తో భేటీలో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: సిలికాన్ వ్యాలీ తరహాలో 18 నెలల్లో విశాఖ నగరాన్ని గ్లోబల్ స్టార్టప్ మ్యాప్‌లో పెట్టాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబుతో కొచ్చి స్టార్టప్ విలేజి చైర్మన్ సంజయ్ విజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులలో కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి పెంచి, విశాఖను స్టార్టప్ విలేజీగా మార్చడంలో చేపట్టాల్సిన ప్రణాళికలపై ఇరువురూ చర్చించారు.
నేటి నుంచి పారిస్‌లో ఏపీ బృందం
సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగే ఎయిర్ షోకు రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు హాజరు కానున్నారు. ఆయన వెంట రాష్ర్ట పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొననున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకూ జరగనున్న ఈ షోలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా పాల్గొంటారు. ఈ బృందం టౌలోస్‌లోని ఎయిర్‌బస్ తయారీ కర్మాగారాన్ని సందర్శించనుంది. కేబినెట్ భేటీ రేపటికి వాయిదా :రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారానికి వాయిదాపడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మంగళవారం మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది.
చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా
స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ అభ్యర్థులను గెలిపించేందుకు విదేశీ పర్యటనను సైతం వాయిదా వేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆయన దక్షిణ కొరియా, హాంకాంగ్, జపాన్ దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. వచ్చే నెల 3వ తేదీన స్థానిక ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలున్నాయి. దీనితోనే విదేశీ పర్యటను వచ్చే నెల 6 లేదా 7వ తేదీకి వాయిదా వేసుకున్నారని సమాచారం.