న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌ల్లోని తమ కార్యాలయాలకు వచ్చి నోటీసులు జారీ చేయడంపై ట్విట్టర్ స్పందించింది. అది ఒకరకంగా తమను బెదిరించే చర్య అని భావిస్తున్నట్లు పేర్కొంది. తమ ఉద్యోగుల గురించి, భావ వ్యక్తీకరణకు ఎదురయ్యే ముప్పు గురించి ఆందోళన చెందుతున్నామంది. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తూ విపక్షం సర్క్యులేట్ చేసినట్లు భావిస్తున్న డాక్యుమెంట్‌ను విమర్శిస్తూ.. అధికార బీజేపీ నేతలు చేసిన ట్వీట్లకు ట్విట్టర్ ఇటీవల ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ ట్యాగ్‌ను తగిలించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ కార్యాలయాలకు వెళ్లి సంస్థ బారత విభాగం ఎండీకి నోటీసులు జారీ చేశారు. దీనిపై గురువారం ట్విట్టర్ అధికారికంగా స్పందించింది.
పారదర్శకతతో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భారత్ తమకు అత్యంత ప్రధానమైన మార్కెట్ అని, భారత్‌లో అమల్లో ఉన్న చట్టాలను గౌరవిస్తామని పేర్కొంది. అయితే, స్వేచ్చాయుత ప్రజాభిప్రాయానికి భంగం కలిగించే నిబంధనలను మార్చాలని కోరుతామని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనల్లోని కీలకమైన మౌలిక అంశాలపై, సంస్థ ఉద్యోగుల కార్యకలాపాలను అడ్డుకునే పోలీసుల బెదిరింపు చర్యలపై తమతో పాటు, భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోందని పేర్కొంది. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతాయని ట్విట్టర్ పేర్కొంది. ప్రజాప్రయోజన పరిరక్షణ కోసం ప్రజా ప్రతినిధులు, పరిశ్రమ వర్గాలు, పౌరసమాజం కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందని సూచించింది. అభ్యంతరకర పోస్ట్‌లకు తమ కంప్లయన్స్ ఆఫీసర్‌ను బాధ్యుడిని చేసి, క్రిమినల్ చర్యలకు అవకాశం కల్పించడాన్ని ట్విట్టర్ తప్పుబట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ, వినియోగదారుల సమాచారాన్ని గంపగుత్తగా కోరడం కూడా తమకు ఆమోదనీయం కాదని పేర్కొంది. ఇవి స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపింది.
నిరాధార ఆరోపణలు
పోలీసులు తమ కార్యాలయాలకు రావడం బెదిరింపు చర్య అన్న ట్విట్టర్ ఆరోపణలను కేంద్రం ఖండించింది. అవి నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. అవి భారత్ ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించింది. ట్విట్టర్ లేదా, మరే ఇతర సోషల్‌మీడియాకు చెందిన ప్రతినిధులకు కానీ భారత్ సురక్షిత దేశమని స్పష్టం చేసింది. వారి భద్రతకు, వ్యక్తిగత రక్షణకు ఎలాంటి ప్రమాదం కలగబోదని కేంద్ర ఐటీ శాఖ గురువారం తెలిపింది. చర్యలు, ఉద్దేశపూర్వక సమర్ధనలతో భారత చట్ట వ్యవస్థను తక్కువ చేయాలని ట్విట్టర్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment