కూలీల డబ్బులు ‘నొక్కిందెవరు’? | Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme | Sakshi
Sakshi News home page

కూలీల డబ్బులు ‘నొక్కిందెవరు’?

Published Sat, Jan 10 2015 3:46 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM

కూలీల డబ్బులు ‘నొక్కిందెవరు’? - Sakshi

కూలీల డబ్బులు ‘నొక్కిందెవరు’?

కందుకూరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు సంబంధించిన నిధుల స్వాహాపై విచారణ మొదలైంది. ఈ పథకం కింద పనిచేసిన కూలీలకు డబ్బులు చెల్లించే క్రమంలో భారీగా అవకతవకలు జరిగాయి. దాదాపు 11వేల మంది కూలీలకు చెల్లించాల్సిన రూ.2కోట్లు డ్వామా అధికారులు యాక్సిస్ బ్యాంకుకు విడుదల చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం కూలీలకు పంపిణీ చేయలేదు.

దీంతో ఆగ్రహించిన కూలీలు పలుమార్లు డ్వామా అధికారులను నిలదీయడం, మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. దీనికి స్పందించిన అధికారులు అవకతవకలపై విచారణ జరిపారు. డబ్బుల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు ఉపక్రమించారు.
 
ఇలా దారితప్పాయి..
2012-13 ఆర్థిక సంవత్సరం చివ రలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి కూలీ డబ్బులను గ్రామీణాభివృద్ధి శాఖ నేరుగా యాక్సిస్ బ్యాంకుకు విడుదల చేసింది. ఈ నిధులను అప్పటి సర్వీస్ ప్రొవైడర్ ఫినో సంస్థకు విడుదల చేయగా.. అందులో దాదాపు 11వేల మంది కూలీలకు ఇవ్వాల్సిన రూ.2కోట్లు అట్టిపెట్టుకున్నాయి. ఆ నిధులు గతేడాది జూన్ నాటికి కూడా కూలీలకు చెల్లించలేదు.

అదేవిధంగా చెల్లింపుల ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్నం దున సర్వీస్ ప్రొవైడర్ ఫినో సంస్థను బాధ్యతల నుంచి తొలగిస్తూ కొత్తగా మణిపాల్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. దీంతో కూలీలకు చెల్లించాల్సిన నిధుల్లో అవకతవకలు బయటపడ్డాయి. అయితే కూలీలకు ఇవ్వని నిధులు ఏమయ్యాయనే కోణంలో అధికారులు ఆరాతీశారు. దీంతో నిధులు దారితప్పినట్లు గుర్తించిన డ్వామా అధికారులు పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. ఈనేపథ్యంలో కూలీడబ్బులు అందక జిల్లావ్యాప్తంగా 11వేల మంది ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
 
విచారణ షురూ..
డ్వామా అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీ సులు దర్యాప్తునకు ఉపక్రమించారు. ఈ క్రమంలో శుక్రవారం సీసీఎస్ ఏసీపీ జోగయ్య బృందం కందుకూరు, యా చారం మండలాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించింది. అనంతరం ఉపాధిహామీ కార్యాలయాల్లో సైతం విచారణ జరిపింది. కూలీలతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంది. ఈ సందర్భంగా ఏసీపీ జోగయ్య మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు అందాల్సిన సొమ్ము పంపిణీ చేయకుండా యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది దారిమళ్లించినట్లు పేర్కొన్నారు.

నిరుపేదలకు చెందాల్సిన డబ్బు స్వాహా చేయడంలో యాక్సిస్ బ్యాంక్ అధికారి సంగీత, సీనియర్ మేనేజర్ పీయూష్ హస్తం ఉందన్నారు. వారిద్దరితోపాటు ఫినో సంస్థకు చెందిన బిష్వజిత్‌సిన్హా, మణిపాల్ సంస్థకు చెందిన అనుపమ్‌గుప్తాపై ఐపీసీ 403, 405, 420 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అన్ని మండలాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement